ఎన్ని వేల కోట్లకో?

BCCI Media Rights: Members in dark as CoA decides on e-auction  - Sakshi

భారత్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌ల ప్రసార హక్కుల వేలం మార్చి 27న 

ముంబై: ఆరు నెలల క్రితమే భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐపీఎల్‌ ప్రత్యక్ష ప్రసార హక్కులను వేల కోట్లకు అమ్ముకుంది. ఇప్పుడు మరో వేలానికి, వేల కోట్ల ఆర్జనకు బోర్డు సిద్ధమైంది. క్రికెట్‌కు అమితాదరణ ఉన్న దేశానికి సంబంధించిన మ్యాచ్‌ల ప్రసార హక్కులను కట్టబెట్టేందుకు ఇటు బోర్డు, దక్కించుకునేందుకు అటు ప్రసారకర్తలు సిద్ధమయ్యారు. ఇందుకోసం వచ్చే నెల 27న ‘ఈ–వేలం’ ప్రక్రియను నిర్వహించనుంది. ఈ సారి దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్‌లను కలిపి వేలాన్ని నిర్వహిస్తుంది. ప్రస్తుతం ‘స్టార్‌’ నెట్‌వర్క్‌తో ఉన్న ఒప్పందం గడువు వచ్చే నెల 31తో ముగియనుంది. 2012లో నిర్వహించిన అంతర్జాతీయ మ్యాచ్‌ల ప్రసార హక్కులను అప్పట్లో రూ. 3851 కోట్ల మొత్తానికి ‘స్టార్‌’ చేజిక్కించుకుంది.

ఇప్పుడు ఐదేళ్ల కాలానికి అంటే ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి 2023 మార్చి 31 వరకు ప్రసార హక్కుల్ని కట్టబెట్టనుంది. ఆరు నెలల క్రితం ఐపీఎల్‌ మ్యాచ్‌ల ప్రసార హక్కులనూ రూ. 16, 347 కోట్లకు ‘స్టార్‌’ నెట్‌వర్కే దక్కించుకుంది. అంటే సుమారు మ్యాచ్‌కు రూ. 55 కోట్లు అన్నమాట. ఇక అంతర్జాతీయ మ్యాచ్‌ అంటే మరింత ఆసక్తి నెలకొంటుంది. దీంతో ఒక్కో మ్యాచ్‌కు 60 కోట్లపైమాటే ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆసక్తిగల ప్రసార సంస్థలు మార్చి 5వ తేదీలోపు రూ. 6.5 లక్షలు చెల్లించి టెండరు దరఖాస్తును పొందాలి. ఆ  నెల 27వ తేదీలోపు టెండర్లు దాఖలు చేయాలి. అదేరోజు ఈ–వేలం ద్వారా ప్రసార హక్కులు కట్టబెడతారు. బీసీసీఐకి, సుప్రీంకోర్టు నియమించిన పాలక కమిటీ (సీఓఏ)కి మధ్య విబేధాలు మళ్లీ బహిర్గతమయ్యాయి. తమకు మాట మాత్రమైన చెప్పకుండానే సీఓఏ తీసుకుంటున్న కీలక నిర్ణయాలపై బీసీసీఐ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top