‘కెప్టెన్‌గా అశ్విన్‌ సక్సెస్‌కు అతనే కారణం’

Ashwin Has Shades of MS Dhoni in His Captaincy, Aaron Finch - Sakshi

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తాజా సీజన్‌లో కింగ్స్‌ పంజాబ్‌ చక్కటి విజయాలను సాధిస్తోంది. ఈ సీజన్‌ ఆరంభంలో పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కింగ్స్‌ పంజాబ్‌ ఇప్పటివరకూ తొమ్మిది మ్యాచ్‌లు ఆడి ఆరు విజయాలను అందుకుంది. అయితే ఈ విజయాలకు కారణం సారథి రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆటగాళ్లతో మమేకం అయ్యే తీరే కారణమని అంటున్నాడు సహచర ఆటగాడు అరోన్‌ ఫించ్‌. కాగా, అశ్విన్‌ కెప్టెన్సీలో సీఎస్‌కే సారథి ధోని లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని ఫించ్‌ అభిప్రాయపడ్డాడు.

‘అశ్విన్‌కు గతంలో కెప్టెన్సీ అనుభవం పెద్దగా లేదు. కానీ కెప్టెన్‌గా అతడు రాణిస్తున్నాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందే అశ్విన్ ఆటగాళ్లతో మాట్లాడతాడు. చీఫ్‌ కోచ్‌ బ్రాడ్ హాగ్‌తో కలిసి అశ్విన్ సన్నద్ధమయ్యే విధానం బాగుంటుంది. ధోనితో కలిసి చాలా ఏళ్లపాటు పని చేసిన అశ్విన్ అదే తరహాలో కూల్‌గా ఉండటం అలవర్చుకున్నాడు. ధోని మాదిరిగా అశ్విన్ ప్రశాంతంగా గొప్ప నిర్ణయాలు తీసుకుంటాడు. ఓవరాల్‌గా చూస్తే అశ్విన్‌ సక్సెస్‌కు ఎంఎస్‌ ధోనినే కారణం అనేది నా అభిప్రాయం’ అని ఫించ్‌ పేర్కొన్నాడు.

ఈ ఏడాది చెన్నై సూపర్‌ కింగ్స్‌ అశ్విన్‌ను వదిలి వేయడంతో అతన్ని కింగ్స్‌ పంజాబ్‌ కొనుగోలు చేసింది. అదే సమయంలో అశ్విన్‌కు కెప్టెన్‌గా నియమిస్తూ కింగ్స్‌ పంజాబ్‌ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అశ్విన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.  కానీ ఇప్పుడు అదే అశ్విన్ తనదైన వ్యూహాలతో పంజాబ్‌కు విజయాలు అందిస్తున్నాడు. దీంతో కింగ్స్‌ సహ యజమాని ప్రీతి జింతా, మెంటార్‌ వీరేంద్ర సెహ్వాగ్‌లు ఖుషీ ఖుషీగా ఉన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top