ఇంగ్లండ్‌కు దెబ్బ మీద దెబ్బ

Ashes Series England Bowler Olly Stone Ruled Out For Two Weeks - Sakshi

లండన్‌: తొలిసారి వన్డే ప్రపంచకప్‌ గెలిచి రెట్టింపు ఉత్సాహంతో యాషెస్‌ సిరీస్‌లో అడుగుపెట్టిన ఇంగ్లండ్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి.  ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో చిత్తుచిత్తుగా ఓడిపోయిన ఇంగ్లండ్‌ జట్టు ఆగస్టు 14నుంచి ప్రారంభం కాబోయే రెండు టెస్టుకు సన్నద్దం అవుతోంది. అయితే ఇప్పటికే రెండో టెస్టుకు ఇంగ్లండ్‌ ప్రధాన ఆయుధం జేమ్స్‌ అండర్సన్‌ దూరమవగా.. తాజాగా మరో పేస్‌ బౌలర్‌ ఒల్లీ స్టోన్‌ గాయపడ్డాడు. బుధవారం ప్రాక్టీస్‌లో గాయపడిన స్టోన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించగా అతడికి రెండు వారాల విశ్రాంతి కావాలని వైద్యులు సూచించారు. అయితే మరోసారి స్కానింగ్‌ చేశాక రెండో టెస్టుకు అందుబాటులో ఉండేది లేనిది తెలుస్తుందని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది. స్టోన్స్‌కు మెరుగైన చికిత్స నడుస్తుందని రెండో టెస్టుకు అతడు అందుబాటులో ఉంటాడని ఈసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది. 

ఇక ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో స్టోన్‌ అరంగేట్రం చేశాడు. మూడు వికెట్లతో రాణించాడు. దీంతో అతడిని ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌కు ఇంగ్లండ్‌ సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇక తొలి టెస్టులో పట్టుమని ఐదు ఓవర్లు కూడా వేయకుండానే కండరాలు పట్టేయడంతో అండర్సన్‌ మైదానాన్ని వీడాడు. అనంతరం స్కానింగ్‌లో అతడికి విశ్రాంతి అవసరమని వైద్యులు తెలపడంతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఇక వీరిద్దరూ రెండో టెస్టుకు అందుబాటులో లేకుంటే ఇంగ్లండ్‌ బౌలింగ్‌ మరింత బలహీనపడుతుంది. తొలి టెస్టులో బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగంలో ఘోరంగా విఫలమైన ఇంగ్లండ్‌ 251 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసింది. కాగా నిషేధం తర్వాత ఆడుతున్న ఆసీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు బాది జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top