ద్రవిడ్‌, జహీర్‌లకు కుంబ్లే పరిస్థితే..

ద్రవిడ్‌, జహీర్‌లకు కుంబ్లే పరిస్థితే..

ముంబై: భారత క్రికెట్‌ మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే తరహాలోనే బీసీసీఐ ద్రవిడ్‌, జహీర్‌లను ఘోరంగా అవమానిస్తోందని సీఓఏ మాజీ సభ్యుడు రామ చంద్రగుహా ఆగ్రహాం వ్యక్తం చేశాడు. రామచంద్ర గుహా గత జూన్‌లో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన పరిపాలక కమిటీ (సీఓఏ) అభ్యర్థిత్వానికి రాజీనామ చేశారు. డ్రామను తలపిస్తూ సాగిన భారత్‌ హెడ్‌ కోచ్‌ ఎంపికను రామచంద్రగుహా తప్పుబట్టాడు. కుంబ్లే, ద్రవిడ్‌, జహీర్‌ గొప్ప ఆటగాళ్లని, ఎన్నోవిజయాలు అందించారని వారిని అవమానాలకు గురిచేయవద్దని పేర్కొన్నారు. సచిన్‌, గంగూలీ, లక్ష్మణ్ నేతృత్వంలోని క్రికెట్‌ సలహా కమిటీ(సీఏసీ) రవిశాస్త్రీ హెడ్‌ కోచ్‌గా, ద్రవిడ్‌, జహీర్‌ను విదేశీ పర్యటనలకు బౌలింగ్‌, బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌లుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. 

 

పరిపాలక కమిటీ (సీఓఏ) హెడ్‌ కోచ్‌గా రవిశాస్త్రి ఎంపికపైనే ఆమోద ముద్ర వేసింది. అయితే బౌలింగ్‌ కోచ్‌ జహీర్‌ ఖాన్, బ్యాటింగ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ల నియామకంపై కమిటీ ఏ నిర్ణయమూ తీసుకోలేదు. జట్టు సహాయక సిబ్బందిని ఈనెల 22న రవిశాస్త్రిని సంప్రదించాకే నియమించే అవకాశం ఉంది. అయితే బోర్డు చెబుతున్నట్టుగా విదేశీ పర్యటనలోనైనా జహీర్, ద్రవిడ్‌ జట్టుతో పాటు ఉంటారా? అనే విషయంలో కమిటీ స్పష్టతనివ్వడం లేదు. ఈ విషయంపై స్పందించిన రామచంద్ర గుహా కోచ్‌ ఎంపికలో రాజకీయలు చేయడం బాధించిందని, కుంబ్లేకు ఎదురైన పరిస్థితే ద్రవిడ్‌, జహీర్‌కు ఎదురవుతుందని వరుస ట్వీట్లు పోస్టు చేశాడు. గతంలో కూడా రామచంద్ర గుహా బీసీసీఐని ఉద్దేశించి తన రాజీనామాలో ప్రశ్నించారు. క్రికెటర్లు కోచ్‌, కామెంటేటర్ల ఎంపికలో భాగస్వామ్యులవుతున్నారని హార్షబోగ్లేను తప్పించడంలో కోహ్లీ పాత్రను గుర్తు చేశారు.

 
Back to Top