హైదరాబాద్‌ 271 ఆలౌట్‌

Andhra 207 for 3 in reply to Hyderabad's 271 - Sakshi

సాక్షి, విజయనగరం: పసలేని హైదరాబాద్‌ బౌలింగ్‌పై ఆంధ్ర బ్యాట్స్‌మెన్‌ పైచేయి సాధించారు. రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో ఆంధ్ర భారీస్కోరుపై కన్నేసింది. రెండో రోజు ఆటలో ముందుగా 226/7 ఓవర్‌నైట్‌ స్కోరుతో సోమవారం ఆటకొనసాగించిన హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 90.3 ఓవర్లలో 271 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆట మొదలైన కాసేపటికే మొదట సీవీ మిలింద్‌ (6), తర్వాత ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మన్‌ సాయిరామ్‌ (23)లను శశికాంత్‌ తన వరుస ఓవర్లలో పెవిలియన్‌ చేర్చాడు. 241 పరుగులకే 9 వికెట్లను కోల్పోగా... ఆఖరి స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన మెహదీహసన్‌ (16 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కాసేపు బ్యాట్‌ ఝులిపించాడు. అజయ్‌దేవ్‌ గౌడ్‌ (0 నాటౌట్‌)తో కలిసి వేగంగా పరుగులు జతచేశాడు. ఇద్దరు పదో వికెట్‌కు 3.2 ఓవర్లలో 30 పరుగులు జోడించారు. 271 పరుగుల వద్ద మెహదీహసన్‌ను పృథ్వీరాజ్‌ ఔట్‌ చేయడంతో హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. శశికాంత్‌ 5 వికెట్లు తీయగా, పృథ్వీరాజ్‌కు 3 వికెట్లు దక్కాయి.

రాణించిన జ్ఞానేశ్వర్‌...

అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన ఆంధ్ర ఆట నిలిచే సమయానికి తొలిఇన్నింగ్స్‌లో 76 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. ఆంధ్రకు ఓపెనర్లు జ్ఞానేశ్వర్‌ (122 బంతుల్లో 65; 12 ఫోర్లు), ప్రశాంత్‌ (63 బంతుల్లో 32; 5 ఫోర్లు) మంచి ఆరంభాన్నిచ్చారు. ఇద్దరూ  హైదరాబాద్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు. తొలివికెట్‌కు 58 పరుగులు జతచేశాక ప్రశాంత్‌ను రవితేజ పెవిలియన్‌ చేర్చాడు. తర్వాత వచ్చిన సాయికృష్ణ (139 బంతుల్లో 38; 3 ఫోర్లు) నింపాదిగా ఆడటంతో హైదరాబాద్‌ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. సాయికృష్ణ అండతో జ్ఞానేశ్వర్‌ అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. జట్టు స్కోరు 100 పరుగులకు చేరింది. మరో వికెట్‌ కోసం ఎంతగానో శ్రమించిన హైదరాబాద్‌కు అజయ్‌దేవ్‌ కాస్త ఉపశమనమిచ్చాడు. 120 స్కోరు వద్ద అజయ్‌ బౌలింగ్‌లో రవితేజకు క్యాచ్‌ ఇచ్చి జ్ఞానేశ్వర్‌ నిష్క్రమించాడు. ఆ తర్వాత జట్టు స్కోరు పెంచే బాధ్యతను రికీభుయ్‌ (90 బంతుల్లో 49 బ్యాటింగ్, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) తీసుకున్నాడు. సాయికృష్ణతో కలిసి మూడో వికెట్‌కు 46 పరుగులు జోడించిన రికీభుయ్‌... అనంతరం శ్రీకర్‌ భరత్‌ (46 బంతుల్లో 14 బ్యాటింగ్, 2 ఫోర్లు)తో కలిసి అభేద్యమైన నాలుగో వికెట్‌కు 41 పరుగులు జతచేశాడు. మిలింద్, అజయ్‌దేవ్, రవితేజలకు తలా ఒక వికెట్‌ దక్కింది.

స్కోరు వివరాలు

హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌: తన్మయ్‌ (బి) పృథ్వీరాజ్‌ 44; తిలక్‌వర్మ (బి) శశికాంత్‌ 5; అక్షత్‌రెడ్డి  (సి) భరత్‌ (బి) శశికాంత్‌ 57; సందీప్‌ (బి) గిరినాథ్‌ 33; హిమాలయ్‌ (సి) అయ్యప్ప (బి) శశికాంత్‌ 59; రవితేజ (సి) అశ్విన్‌ (బి) పృథ్వీరాజ్‌ 1; చైతన్య (బి) గిరినాథ్‌ 6; సాయిరామ్‌ (సి)సాయికృష్ణ (బి) శశికాంత్‌ 23; మిలింద్‌ (బి) శశికాంత్‌ 6; అజయ్‌దేవ్‌ నాటౌట్‌ 0; మెహదీహసన్‌ (సి) గిరినాథ్‌ (బి) పృథ్వీరాజ్‌ 25;       ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (90.3 ఓవర్లలో ఆలౌట్‌) 271.
వికెట్ల పతనం: 1–12, 2–73, 3–145, 4–145, 5–146, 6–182, 7–226, 8–240, 9–241, 10–271.

బౌలింగ్‌: అయ్యప్ప 19–2–64–0, శశికాంత్‌ 24–6–64–5, పృథ్వీరాజ్‌ 24.3–9–72–3, గిరినాథ్‌ 6–2–7–2, షోయబ్‌ 16–1–52–0, సాయికృష్ణ 1–0–8–0.
ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌: జ్ఞానేశ్వర్‌ (సి) రవితేజ (బి) అజయ్‌దేవ్‌ 65; ప్రశాంత్‌ (సి) తన్మయ్‌ (బి) రవితేజ 32; సాయికృష్ణ (సి) సందీప్‌ (బి) మిలింద్‌ 38; రికీభుయ్‌ బ్యాటింగ్‌ 49, భరత్‌ బ్యాటింగ్‌ 14; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (76 ఓవర్లలో 3 వికెట్లకు) 207.

వికెట్ల పతనం: 1–58, 2–120, 3–166.  
బౌలింగ్‌: మిలింద్‌ 20–3–46–1, అజయ్‌ దేవ్‌ గౌడ్‌ 12–2–29–1, రవితేజ 14–5–35–1, మెహదీ హసన్‌ 21–9–47–0, సాయిరామ్‌ 7–0–35–0, సందీప్‌ 2–0–11–0.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top