అఫ్గానిస్తాన్‌దే టి20 సిరీస్‌

Afghanistan win T20 series - Sakshi

రెండో మ్యాచ్‌లోనూ బంగ్లాదేశ్‌ చిత్తు  

డెహ్రాడూన్‌: అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌లో మరో చిరస్మరణీయ విజయం. అంతర్జాతీయ స్థాయిలో తమకంటే ఎంతో సీనియర్‌ అయిన బంగ్లాదేశ్‌ను మళ్లీ చిత్తు చేసిన ఆ జట్టు 2–0తో టి20 సిరీస్‌ను గెలుచుకుంది. మంగళవారం ఇక్కడి రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగిన రెండో టి20లో అఫ్గానిస్తాన్‌  6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేయగా, అనంతరం అఫ్గాన్‌ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 135 పరుగులు సాధించింది.  

టాస్‌ గెలిచిన బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ను అఫ్గాన్‌ స్పిన్నర్లు దెబ్బ తీశారు. సంచలన బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ (4/12) అద్భుత ప్రదర్శన ప్రదర్శన ముందు ఆ జట్టు నిలవలేకపోయింది. తమీమ్‌ ఇక్బాల్‌ (48 బంతుల్లో 43; 5 ఫోర్లు) మినహా మిగతావారంతా విఫలం కావడంతో ఆ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఒక దశలో 15 ఓవర్లు ముగిసేసరికి బంగ్లా 4 వికెట్లకు 101 పరుగులు చేసింది. అయితే 16వ ఓవర్లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రషీద్‌ మూడు వికెట్లతో చెలరేగాడు. షకీబ్‌ (3), తమీమ్, మొసద్దిక్‌ (0)లను అతను అవుట్‌ చేశాడు. నబీ (2/19), ముజీబ్‌ (0/15) కూడా రాణించారు. అనంతరం సమీయుల్లా షెన్వారి (41 బంతుల్లో 49; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), మొహమ్మద్‌ నబీ (15 బంతుల్లో 31 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాటింగ్‌తో మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే అఫ్గాన్‌ లక్ష్యాన్ని చేరింది. చివరి 2 ఓవర్లలో విజయానికి 20 పరుగులు కావాల్సి ఉండగా... 19వ ఓవర్లో నబీ 2 ఫోర్లు, 2 సిక్సర్లు బాది ముగించాడు. జింబాబ్వేను మినహాయిస్తే అఫ్గానిస్తాన్‌ మరో జట్టుపై ద్వైపాక్షిక సిరీస్‌ గెలుచుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇరు జట్ల మధ్య చివరి టి20 గురువారం జరుగుతుంది.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top