కూతురు

Special story on funday - Sakshi

దేవుళ్లకు పేర్లేమిటో అనిపిస్తుంది ఒక్కోసారి! ‘దేవుడు’ అంటే సరిపోదా? అతను, ఇతను ఆ చీకట్లో కొద్దిసేపటిగా నడుస్తున్నారు. వాళ్లిద్దరే నడుస్తున్నారు. అతనికొక పేరుంది. ఇతనికొక పేరుంది. కానీ ఇక్కడ.. వాళ్ల పేర్లు అవసరం లేదు. ఇది కథ అయితే కథ నడవడం కోసం పేర్లు అవసరమే. కానీ ఇది కథ కాదు, ఈ కథ నడవనూ అవసరం లేదు. వాళ్లిద్దరూ నడుస్తున్నారు. అది చాలు.  ఇద్దరికీ కొద్దికాలంగా పరిచయం. ఉదయం ఇంటి నుంచి వెళ్తున్నప్పుడో, రాత్రి పొద్దు పోయాక ఇంటికి వస్తున్నప్పుడో ఒకరికొకరు కనిపిస్తే కనిపిస్తారు. కనిపించినప్పుడు ముందు అతను ఇతన్ని చూస్తే ఎంత దూరంలో ఉన్నా గట్టిగా ‘ఓయ్‌’ అని పిలుస్తాడు. ముందు ఇతను కనుక అతన్ని చూస్తే.. పెద్దగా ‘సార్‌’ అని పిలుస్తాడు. అలా ఇద్దరూ కలుసుకుంటారు. కలిసి నడుచుకుంటూ వెళ్తారు. మాట్లాడుకుంటూ నడుస్తారు. అలా నడుస్తూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒకరివైపు ఒకరు చూసుకోరు. ఆ చీకటి దారిలో (కలుసుకున్నది రాత్రైతే) దారికి ఒక పక్కగా నడుస్తారు. ఎదురుగానో, వెనుక నుంచో అప్పుడొకటీ ఇప్పుడొకటీగా వచ్చే వాహనాలు మరీ వేగంగా ఉన్నప్పుడు మాత్రం అతను ఇతన్ని తన పక్కకి లాక్కుంటాడు. ‘జాగ్రత్త’ అంటాడు. ‘పర్లేదు సార్‌’ అని ఇతను అంటాడు. అప్పుడు కూడా ఒకర్నొకరు చూసుకోరు.

అతను ‘ఓయ్‌’ అనడం కమాండింగ్‌గా ఉంటుంది. నడక కూడా కవాతు చేస్తున్నట్లే ఉంటుంది. వేగంగా నడుస్తాడు. ఆ వేగాన్ని ఇతడు ఎప్పుడూ అందుకోలేడు. ఇతను అందుకోలేకపోతున్నాడు కదా అని అతనూ ఎప్పుడూ తన వేగాన్ని తగ్గించుకోడు. నడక మాత్రం కలిసే!అతను ఇతనికన్నా కొద్దిగా పెద్దవాడు. ఎత్తుగా, దృఢంగా ఉంటాడు. అతనే ఎక్కువగా మాట్లాడుతుంటాడు. మాట్లాడ్డం కాదు, చెబుతుంటాడు. ఏదో ఒకటి! అది బాగుంటుంది ఇతనికి. ఇతనికి వినడం ఇష్టం. అందుకు బాగుంటుందేమో.ఇతను అతని భుజాల దగ్గరికి వస్తాడు. బాగా వదులు చొక్కా, టైట్‌ ప్యాంటు వేసుకుంటాడు.  కాళ్లకు ఒంటిపొర లెదర్‌ చెప్పులు ఉంటాయి. కాస్త ఒంగి నడుస్తాడు. ‘స్ట్రెయిట్‌గా నడువ్‌’ అని ఫట్‌మని కొన్నిసార్లు వీపు మీద కొడతాడు అతను ఇతన్ని. ‘మీ స్పీడ్‌ అందుకోలేక ఒంగిపోతున్నాను సార్‌’ అంటాడు ఇతను ఇంకొంచెం ఒంగి. మళ్లీ ఫట్‌మని కొట్టబోతాడు అతను. ‘నత్తతో కలిసి నడిచినా, నువ్వు ఒంగే నడుస్తావ్‌’ అంటాడు. 

ఆ రోజు కూడా ముందు అతనే ఇతన్ని పిలిచాడు ‘ఓయ్‌’ అని. ఇద్దరూ కలుసుకున్నారు. ఇద్దరూ కలిసి నడుస్తున్నారు. చాలాసార్లు మొదట అతనే ఇతన్ని చూస్తాడు. ‘ఓయ్‌’ అని పిలిచాక, కలుసుకున్నాక, మొదట అతనే మాట్లాడ్డం మొదలుపెడతాడు. కానీ ఆ రోజు మాట్లాడలేదు! అతను మాట్లాడకపోవడం ఇతనికి వెలితిగా ఉంది. అతను బాగా చిక్కిపోయి ఉండడం కూడా ఇతను గమనించాడు. కొంచెంసేపు మౌనంగా నడిచాక ఇతనే అడిగాడు.. ‘‘కనిపించడం లేదేంటసార్‌’’ అని. అతనేం సమాధానం చెప్పలేదు. చెప్పకపోవడం మాత్రమే కాదు, సంబంధం లేని మాట ఒకటి అన్నాడు. ‘‘నా కూతురంటే నాకు ప్రాణం’’. చప్పున ఇతను అతన్ని చూశాడు. మాట్లాడుతున్నప్పుడు మొదటిసారి ఇతను అతని వైపు చూశాడు. తాకి వెళ్లిన ఏ దూరపు కాంతికో అతని కళ్లలో తడి తళుక్కుమంది. ‘‘ఏమైంది సార్‌’’ అని అతని చెయ్యి పట్టుకున్నాడు ఇతను. మొదటిసారి ఇతను అతని చెయ్యి పట్టుకున్నాడు!

ఇతనికి అతని గురించి కొంత తెలుసు. అతనే ఆ కొంతను ఇతనికి చెప్పాడు. చెప్పాలని చెప్పలేదు. నడుస్తూ ఉన్నప్పుడు మాటల్లో చెప్పాడు. అతనికి ఒకే ఒక్క కూతురు. బీటెక్‌ చేస్తోంది. భర్త, భార్య, కూతురు.. ఇంట్లో ఆ ముగ్గురే ఉంటారు. కూతురే అతని లోకం. కూతురే అతని సంతోషం. కూతురే అతని ఊపిరి. అతనికి కూతురు పుట్టినట్టు ఉండదు. అతనే కూతురికి పుట్టినట్లు ఉంటాడు. నా తల్లి.. నా తల్లి అంటుంటాడు. అంతవరకు ఇతనికి తెలుసు. ‘‘ఏమైంది సార్‌? మీ అమ్మాయి బాగుందా?’’ అడిగాడు.‘‘బాగుంది. పెళ్లయింది. నెలైంది. మంచి సంబంధం. మంచివాడు. మంచి జీతం. మంచి కూటుంబం.’’‘‘మరేమైంది సార్‌?’’ అన్నాడు ఇతన‘‘ఏం కాలేదు’’ అన్నాడు అతను. ‘‘ఎందుకని మీరు అలా ఉన్నారు?’’ అన్నాడు ఇతను.‘‘ఏం లేదు’’ అన్నాడు అతను. 

మళ్లీ మౌనపు నడక. 
వాహనం ఒకటి ఇతనికి బాగా దగ్గరగా రయ్యిన వెళ్లిపోయింది. ఎప్పటిలా అతను ‘జాగ్రత్త’ అని ఇతన్ని దగ్గరికి లాక్కోలేదు. ఎప్పటిలా అతను వేగంగా కూడా నడవడం లేదు. మరికొంచెం దూరం నడిస్తే మెయిన్‌ రోడ్డు మీద నుంచి కుడివైపుకు అతను వెళ్లే దారి వస్తుంది. తర్వాత కొంతదూరం నడిస్తే ఎడమవైపుకు ఇతను వెళ్లే దారి వస్తుంది. మధ్యలో కూడలి వస్తుంది. ‘‘నా కూతుర్ని చూడకుండా ఉండలేకపోతున్నాను. అన్నం కూడా తినబుద్ధి కావడం లేదు..’’ అకస్మాత్తుగా అన్నాడు అతను. ‘‘తను సంతోషంగానే ఉంది కదా సార్‌’’ అన్నాడు ఇతను. ‘‘ఉంది’’ అన్నాడు అతను. 

‘‘మరేంటి సార్‌’’ అన్నాడు ఇతను. ‘‘ఇన్ని రోజులు తను లేకుండా ఎప్పుడూ లేను. ఎప్పుడూ లేను..’’ అనుకుంటూ.. కుడివైపు దారిలోకి మెల్లిగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు అతను. వెళ్లేటప్పుడు ఎప్పటì లా.. ‘ఓయ్‌ పోతున్నా..’ అని కూడా అనలేదు! ఇతను కాసేపు అక్కడే నిలబడిపోయి, తిరిగి నడవడం మొదలుపెట్టాడు.రెండు నిముషాల తర్వాత కూడలి వచ్చింది. కూడలిని దాటుకుని వెళ్లబోతూ ఒక్క క్షణం ఆగాడు ఇతను. కూడలి మధ్యలో.. పేర్చిన రాళ్ల మధ్య నిలబెట్టిన వెదురు కర్రకు.. బ్లాక్‌ అండ్‌ వైట్‌ జిరాక్స్‌ ఫొటో అంటించిన అట్టముక్క ఉంది. మసక వెలుతురులో దగ్గరకు వెళ్లి ఆ ఫొటోలో ఉంది ఎవరా అని చూశాడు. 

అతన !!
ఫొటోలో ఉన్నది అతనే!ఫొటో కింద పేరు రాసి ఉంది. డేట్‌ వేసి ఉంది. ఆ డేట్‌.. ఆ రోజుదే!అచేతనుడయ్యాడు ఇతను. అతని పేరేమిటో చూద్దాం అనుకున్నాడు. చూడకుండానే ముందుకు వెళ్లిపోయాడు. దేవుళ్లకు పేర్లేమిటో.. ‘దేవుడు’ అంటే సరిపోదా అని అనిపించినట్లే.. అతనిలాంటివాళ్లను చూసినప్పుడు అనిపిస్తుంది... మనుషులకు పేర్లేమిటో ‘మనిషి’ అంటే సరిపోదా! అని. 

Read latest Specials News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top