కాటుక డిబ్బీ

Special story on funday - Sakshi

‘‘త్వరగా పదండ్రా.. రాహుకాలం వచ్చేస్తుంది మళ్ళా! ఒరేయ్‌ రాఘవా.. ఆ చలివిడి బిందెలూ, అరటిగెలలూ సర్దిచ్చావా? మొత్తం పదహారు సామాన్లు. ఏవీ మర్చిపోకూ. వేళ దాటుతోందిరా..’’ కంగారుగా అరుస్తోంది పుష్పత్త. ‘‘అబ్బా.. అక్కా! అన్నీ పెట్టేశానే.. ముందు నువు ఎదుర్రా పోయీ.. అందరూ ఎక్కి కూర్చున్నారు. మనం ఎక్కడమే తరువాయి’’ అంటున్నాడు రాఘవ. కన్నీళ్లాగట్లేదు శ్రీజకి. పుష్పత్త ఎదురొస్తోంది. ‘‘నువు కార్‌ స్టార్ట్‌ చెయ్యవోయ్‌ శీనూ’’ అంటున్నాడు రాఘవ. ‘‘ఎవరూ ఏడవట్లేదేంటీ?! అప్పగింతలంటే ఏడుస్తారుగా! హ్మ్‌.. మొదలెట్టండీ..’’ నవ్వుతూ అంటోంది వారిజ. వారిజ శ్రీజ చెల్లెలు. అప్పగింతలప్పుడు పెళ్లికూతురు బంధువులంతా వెక్కి వెక్కి ఏడుస్తారని తన నమ్మకం! కానీ ఇక్కడి వాతావరణం అలా లేదు. 

ఎందుకనో! కారు బయల్దేరింది. పుష్పత్త ఎదురొస్తూ కారులో శ్రీజ పక్కన కూచుంది. శ్రీజ కళ్లు ఎర్రబడి వున్నాయ్‌. అత్త కారెక్కగానే ఆమె ఒళ్ళో తల పెట్టేసింది. శ్రీజ తల నిమురుతూ ‘‘పెద్దోడా! ఏడవకూడదు. పక్కన మీ ఆయన ఉన్నాడు చూడు. నువ్వలా ఏడిస్తే అతనేమనుకుంటాడూ?’’ అని నెమ్మదిగా శ్రీజ చెవిలో అంటోంది పుష్పత్త. ఎందుకో ఆమె మాట్లాడుతున్నప్పుడు గొంతు వణుకుతోందనిపిస్తుంది. ‘‘ఒరేయ్‌ రాఘవా! మనం విశాఖపట్నం వెళ్ళేప్పటికి ఎంతటైమవ్వుద్దిరా?’’ అనడిగింది. 

‘‘సాయంకాలం ఆరులోపే చేరిపోతాంలేవే!’’ అన్నాడు రాఘవ. ‘‘కానీ ఎవరూ ఏడవట్లేదు ఎందుకో! నేను అత్తారింటికి, అదీ ఎక్కడో వున్న వైజాగ్‌ పోతుంటే ఒక్కరూ ఏడవరే?! అసలు నామీద ప్రేమేలేదు మీకు!’’ అంటూ బుంగమూతి పెట్టుక్కూచుంది శ్రీజ. ఉన్నట్టుండి తన కుడిచేతిని మెల్లిగా ఎవరో తట్టినట్లనిపించింది! హర్ష. శ్రీజ చేతిని మొహమాటంగా పట్టుకుంటున్నాడు. హర్ష, రాఘవ ఒకే ఆఫీస్‌లో పనిచేస్తారు. శ్రీజకు రాఘవ ఎన్నోసార్లు హర్ష గురించి మంచిగా చెప్పడం, శ్రీజకు అతను మంచి భర్త కాగలడని నమ్మకం కలగడం వల్లే పెళ్లికి ఒప్పుకుంది. 

అసలు పెళ్లి చేసుకోవడం, ఒక ఉద్యోగం, ఒక ఇల్లు, సంసారం, ఇద్దరు పిల్లలు, స్కూళ్లు, జ్వరాలు, బాధలు, బాధ్యతలూ... ఇవేవీ శ్రీజకు ఇష్టం లేదు. జీవితాన్ని ఒక చట్రంలో బంధించుకోవడం ఇష్టంలేదు. శ్రీజ శైలి వేరు. ఆడపిల్ల అంటే ఇలాగే ఉండాలని ఎవరైనా అంటే ఆమెకు నచ్చదు. తనకు నచ్చినట్లు, తన పరిధుల్లో తానుంటానంటుంది. శుక్రవారం తలంటుకోవడం, శనివారం ఒంటిపూట ఉపవాసాలూ నచ్చవ్‌. ఒక్కరోజు బ్రాహ్మణత్వానికి వ్యతిరేకి.

 కళ్లకు కాటుక, చేతికి గాజులూ, తల్లో పూలు లాంటి అలంకారాలకు ఆమడదూరం! అసలు చెవులక్కూడా ఆభరణాలు పెట్టుకోవడం నచ్చదు! కాళ్లకు పట్టీలు, గోరింటాకు చేతులూ.. ఇంకెందుగ్గానీ.. ఇవ్వేవీ శ్రీజకు ఇష్టముండనే ఉండవ్‌! ‘మనిషి అందం అలంకారంలో ఉండదు. మనసు బట్టి ఉంటుంది’ అనేది శ్రీజ నమ్మకం. ‘‘అది నిజమే కావొచ్చు గానీ, కనీసం ఆడపిల్లకుండాల్సిన లక్షణాలు కొన్ని కూడా నీకు లేవు!’’ అని పుష్పత్త మాత్రం పదేపదే దెప్పుతుంది. ‘‘నీకు కొడుకుల్లేరు కదే! నన్నే కొడుకనుకో, వాడికిలాగే అలంకారాలూ గట్రా చేసి పంపుతావేంటే అత్తా!’’ అని ఆటపట్టించింది. 

‘‘మగాడికీ, ఆడదానికీ తేడా లేదంటే? అలంకారం లేనమ్మాయి అడవిలో మద్దిచెట్టు లెక్క! ఇప్పుడు చూడూ ఈ పెళ్లికూతురి ముస్తాబులో ఎంతందంగా ఉన్నావో! అచ్చం లకీ‡్ష్మదేవి లాగా!’’‘ఇదిగో అత్తా పక్కన మా ఆయనున్నారు కాబట్టీ సరిపోయింది. లేకుంటేనా..!’’ సున్నితంగా బెదిరిస్తూ నవ్వుతోంది శ్రీజ. ‘‘అలాగలాగే, వెళ్ళు అత్తారింటికెళ్తే నువ్వే దారిన పడతావ్‌. ఇదిగో హర్షా.. ఈ శ్రీజుగాడ్ని నువ్వే దారిలో పెట్టుకోవాలి. అసలే నువ్వు తల్లి లేని పిల్లాడివి. ఇదింక నిన్ను ఆడించేస్తుంది. కాస్త చూసుకోవయ్యా..’’ అంటూ శ్రీజ తల నిమురుతోంది పుష్పత్త. 

‘‘ఎంత నీకు కొడుకు వరసైతే మాత్రం అప్పుడే పార్టీ మార్చేస్తావా అత్తా! అన్యాయం కదూ.. పో.. ఇలా ఐతే నేనింక నీ దగ్గరకు రాను, వైజాగ్‌లోనే ఉండిపోతా’’ అంటూ హర్ష భుజంపై తల వాల్చింది శ్రీజ. ‘‘మంచిదే లేవే, అలాగే ఉండిపో.. అంతకంటేనా!’’ అంటూ అంతలోనే వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ, ‘‘అబ్బాయ్‌ శీనూ! కార్‌ జాగ్రత్తగా తోలు’’ అంటూ కళ్లు మూసుకుని నిద్రపోడానికి ప్రయత్నిస్తోంది పుష్పత్త. సాయంకాలం ఆరింటికల్లా విశాఖపట్నం చేరుకోవడం, శ్రీజని హర్ష ఇంట్లో అప్పగించి, రెండ్రోజుల తర్వాత పుష్పత్త గుడివాడ వెళ్లిపోవడం, హర్ష బంధువులు కూడా వెళ్లిపోవడం జరిగింది. 

శ్రీజ, హర్ష మంచి స్నేహితుల్లా ఉంటున్నారా ఇంట్లో. హర్షకి అమ్మా నాన్నా లేరు. ఆర్నెల్ల క్రితం వరకూ విజయవాడలో రాఘవ పనిచేస్తున్న ఆఫీసులోనే ఉద్యోగం చేసేవాడు. ఇప్పుడు ట్రాన్స్‌ఫర్‌ మీద వైజాగ్‌ వచ్చేశాడు. ఒకసారి ఆడిటోరియంలో ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో శ్రీజని చూశాడు హర్ష. ఆమె స్వతంత్ర భావాలూ, చురుకుదనం అతనికి బాగా నచ్చాయి. పైగా రాఘవగారంటే వల్లమాలిన అభిమానమేమో.. అతని కూతురని తెలియగానే ఇంకా ఆమె తనకు బాగా దగ్గరదన్న భావన కలిగిందతనికి.

 మనసులో మాట రాఘవకి చెప్పడం, రాఘవక్కూడా ఆ ఆలోచన ఉండటంతో సంతోషంగా ఒప్పుకోవడం, హర్ష గురించి అప్పటికే చాలాసార్లు రాఘవ చెప్పడం, అతను కూడా తనలాగా పుస్తక ప్రేమికుడనీ, మంచివాడని వినడం.. పెళ్లికి ఒప్పుకోవడం, పెళ్ళైపోవడం, అన్నీ కలలాగా జరిగిపోయాయ్‌!  ‘ఈ పెళ్లిళ్లెప్పుడూ ఇంతే! అంతా కలలాగ ఐపోతాయ్‌!’ అనుకుంది శ్రీజ. పొద్దున్నే ఇద్దరూ నిద్ర లేవడం, వ్యాయామాలు చేస్కుని, కాఫీ తాగి, కబుర్లు చెప్పుకుంటూ వంట చేసుకోవడం, ఆఫీసుకెళ్లడం, మళ్లీ కబుర్లు.. అచ్చం Ü్నహితుల్లానే! ‘‘పెళ్లైన కొత్తలో భర్తలందరూ అలాగే చూస్కుంటారు. క్రమంగా పెత్తనాలు చేస్తూ వాళ్ల దారిలోకి తెచ్చుకుంటారు’’ నిధి మాటలు గుర్తొచ్చాయ్‌ శ్రీజకి. ‘సమస్యే లేదు.

 హర్ష అలాంటివాడు కాడు.’ అనుకుంటూ అద్దంలో చూస్కుంటోంది. వెనుక నుంచి హర్ష వచ్చాడు. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ‘‘ఇలా రా ఇలా రా’’ అంటూ శ్రీజ చెయ్యి పట్టుకుని బెడ్రూంకి తీసుకెళ్లాడు. పాత బీరువా తీసి, వాళ్లమ్మ చీరల మధ్య దాచుకున్న కాటుకడిబ్బీ తీసి చూపించాడు. ‘‘ఇదిగో.. ఇవన్నీ అమ్మ జ్ఞాపకాలు. అమ్మ గుర్తొచ్చినప్పుడు ఈ డిబ్బీ తీసి చూసుకునేవాణ్ని! నా భార్యకు దీన్ని కానుకగా ఇచ్చి కాటుక పెట్టుకొమ్మని చెప్పాలి అనుకున్నా. హేయ్‌ సారీ.. నిన్నలా బలవంతపెట్టన్లే. నీకు అలంకారాలు నచ్చవ్‌గా! ఫీల్‌ ఫ్రీ..’’ అంటూ కాటుకడిబ్బీ మళ్లీ చీరలమధ్య పెట్టేసి బీరువా మూసి, ‘‘మరి నేను ఆఫీస్‌కి వెళ్ళనా? బై!’’ అంటూ వెళ్లిపోయాడు. 

శ్రీజకు అలంకారాలు నచ్చవ్‌. పెళ్లయింది కాబట్టి మెళ్లో తాళి. కాళ్లకు మెట్టెలు. చేతికో రెండు గాజులు. అంతే! ఆ మెట్టెలు కూడా ఇంకా సన్నగా రింగుల్లా చేయించుకోవాలి అనుకుంటూ కాళ్లకేసి చూస్తూ అత్తగారి ఫొటో గుర్తు తెచ్చుకుంది. ‘ఎంత కళగా ఉన్నారూ..’ ఎన్నిమార్లనుకుందో ఆ మాట! ఆరోజంతా అత్తగారి ధ్యాసే. ఆ కాటుకడిబ్బీ ఊసే! పెళ్లై నాలుగు ¯ð లలైంది. ఇప్పటివరకూ హర్ష తనకి ఎన్నో గిఫ్టులిచ్చాడు. చీర, గాజులూ, హాండ్‌ బ్యాగూ, పెర్ఫ్యూమూ. శ్రీజకి ఇట్లాంటివి అంత నచ్చవ్‌. గిఫ్టులిచ్చే సంస్కృతి అసలే నచ్చదు. కానీ  భర్త నొచ్చుకోకూడదని తీస్కునేది. రేపు హర్ష పుట్టినరోజు.     

‘ఏదైనా గిఫ్టు ఎక్స్‌పెక్ట్‌చేస్తాడేమో! ఏమిచ్చేదీ?!’ ఆలోచిస్తూ అల్మారాలు తుడుస్తోంది. ‘హ్మ్‌! గిఫ్ట్‌ దొరికింది.’ పొద్దున్నే లేచి యథాతథంగా తయారయి, టిఫిన్‌ చేసి, ఆఫీస్‌కు బయల్దేరుతున్నాడు హర్ష. అర్ధరాత్రి పన్నెండు గంటలకు శ్రీజ నిద్రలేపి హ్యాపీ బర్త్‌ డే చెప్తుందేమోనని ఆశపడి నిద్రపోకుండా పుస్తకం చదివాడేమో.. కళ్లు మండుతున్నాయ్‌ అతనికి. శ్రీజ మాత్రం చక్కగా నిద్రపోయింది. ‘‘హర్షా.. సాయంత్రం కళావాణి ఆడిటోరియంకి వెళ్దాం. ఈరోజు శాస్త్రి గారి పుస్తకం..’’ ‘‘ఆ.. గుర్తుంది. త్వరగా వస్తాలే, వెళ్దాం..’’ శ్రీజ మాటలను మధ్యలోనే ఆపేస్తూ బదులిచ్చాడు హర్ష. ‘మరీ ఇంత కఠినంగా ఉందేంటీ పిల్ల! కనీసం హ్యాపీ బర్త్‌ డే కూడా చెప్పదేం!’ అనుకుంటూ బయల్దేరాడు. 

సాయంత్రం ఐదవుతోంది. హర్ష తొందరగా పని ముగించుకుని ఇంటికి బయల్దేరాడు. శ్రీజని కళావాణి ఆడిటోరియంకు తీసుకెళ్ళాలి. అక్కడి కార్యక్రమం అయింతర్వాత బీచ్‌. ఆ తర్వాత రెస్టారెంట్‌లో డిన్నర్‌. తర్వాత వైజాగ్‌ అంతా ఓ రైడ్‌. ‘‘శ్రీజా! రెడీనా? బయల్దేరుదామా?’’ అంటూ లోపలికి రాగానే ఎదురుగా శ్రీజ. అమ్మ చీరలో! జుట్టు తక్కువ గానీ.. లేకుంటే అమ్మలాగా జడ వేస్కునేదేనేమో! దగ్గరకొచ్చాక తన కళ్లు చూస్తూనే ఆశ్చర్యపోయాడు! కాటుక పెట్టుకుంది! ‘ఈ నాలుగు నెలల్లో శ్రీజ కాటుక పెట్టుకోవడం ఇదే చూడటం. ఎంతందంగా ఉందీ! పెళ్లిలో కూడా ఇలా అనిపించలేదు! బహుశా అమ్మ చీర కట్టుకోవడం వల్లా?!’ ‘‘హేయ్‌... లుకింగ్‌ సో బ్యూటిఫుల్‌’’ అంటూ కృతజ్ఞతా పూర్వకంగా చూసేడు శ్రీజవైపు. 

‘‘వెళ్దామా? కళావాణికీ?’’ అడిగింది. ‘‘హ్మ్‌.. సరే! ఓ కాఫీ ప్లీజ్‌’’ అన్నాడు హర్ష. ఇద్దరూ కాఫీ తాగుతూ కాసేపు మౌనంగా కూర్చున్నారు. హర్షకి శ్రీజ చాలా కొత్తగా, చాలా అందంగా కనిపిస్తోంది. అలా ఆమెను చూస్తూనే కూర్చున్నాడు. ‘‘బయల్దేరుదామా శ్రీవారూ!’’ అంటూ లేచింది శ్రీజ. ఇద్దరూ బయటకొచ్చి డోర్‌ లాక్‌ చేయబోతుండగా.. ‘‘హర్షా.. ఇటు తిరుగూ..’’ అంది. ‘హా..’ అని ఇటు చూస్తుండగా, తన కళ్లకున్న కాటుకను వేలితో తీసి, హర్ష పాపిట్లో చుక్క పెట్టింది శ్రీజ. అదే స్పర్శ! అమ్మ లాగా! హర్ష ఒక్క క్షణం స్థాణువైపోయాడు. మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఏం చెప్పాలీ!? థాంక్స్‌.. ఐలవ్యూ.. సో స్వీట్‌.. ఊహూ.. నోటితో ఏం చెప్పలేకపోయాడు! శ్రీజ నవ్వుతూ చూస్తోంది. ‘‘మా అత్తగారి కాటుకడిబ్బీ. నిన్నడక్కుండా తీస్కున్నా హర్షా..’’ అంటూ నవ్వుతోంది శ్రీజ. 

ఎవరు చెప్పారు? పుట్టినరోజు హ్యాపీ బర్త్‌డే చెప్పడం, ప్రేమొస్తే ఐలవ్యూ చెప్పడం.. ఇవే ప్రేమను వ్యక్తపరిచే మార్గాలని! శ్రీజని చూస్తుంటే అమ్మని చూసినట్లే ఉంది హర్షకు! ఎంత హాయైన భావనిదీ! హర్ష మనసు గాల్లో తేలుతోంది. అంతలోనే భయం! ‘శ్రీజకి ఇలాంటివి నచ్చవు. నాకోసమే ఇలా.. బహుశా.. ఈ ఒక్కరోజేనేమో! సర్లే, తన స్వతంత్రతకి అడ్డు చెప్పనని మాటిచ్చి పెళ్లి చేసుకున్నా కదా! తప్పు.. తన నుంచి ఏమీ ఆశించకూడదు’ అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం.. ‘‘శ్రీజా! ఆఫీస్‌కి వెళ్ళిరానా?’’ అని హర్ష అనగానే..‘‘ఒక్క నిముషం.’’ అంటూ చేతిలోని కాటుకడిబ్బీ పక్కన పెడుతూ అతనికి దగ్గరగా వెళ్లింది శ్రీజ.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top