జింక పిల్లకు చనుబాలు ఇచ్చిన మహిళ

Jodhpur Bishnoi Woman Breastfeeds Baby Deer - Sakshi

ప్రకృతితో మమేకమై జీవించే బిష్ణోయి తెగ గురించి పర్యావరణ ప్రేమికులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకానొకనాడు చెట్ల కోసం ప్రాణాలను అర్పించిన బిష్ణోయిలు నేటికీ ప్రకృతిలోని ప్రతీ జీవితో తమ ఆత్మీయ అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. జంతువులను సైతం కన్నబిడ్డల్లా సాకుతూ మానవతను చాటుకుంటున్నారు. రెండేళ్ల క్రితం జింక పిల్లకు పాలు పట్టిన ఓ బిష్ణోయి మహిళ ఫొటో తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తప్పిపోయి వాళ్లింటికి వచ్చిందో ఏమోగానీ జింక పిల్ల ఆకలిని గుర్తించిన సదరు మహిళ... దానిని కన్నబిడ్డలా ఒళ్లో పడుకోబెట్టుకుని తన చనుబాలు తాగించింది. మాతృత్వపు వరానికి అసలైన అర్థం చెబుతూ అమ్మ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.

అద్భుతమైన ఫొటో..
‘జోధ్‌పూర్‌లోని బిష్ణోయి తెగ జంతువుల పట్ల ఎంతటి ఉదారతను కలిగి ఉంటుందో తెలుస్తోంది కదా. ఇవి వాళ్ల కన్నబిడ్డల కంటే తక్కువేమీ కావు. ఓ మహిళ పాలు పట్టిస్తోంది. 1730లో రాజును ఎదురించి మరీ 363 చెట్ల ప్రాణాలు నిలిపినది వీరే’ అంటూ ప్రవీణ్‌ కశ్వాన్‌ అనే అటవీ శాఖ అధికారి మహిళ ఫొటోతో సహా ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ క్రమంలో చిప్కో ఉద్యమకారులైన బిష్ణోయిలు మరోసారి చర్చనీయాంశమయ్యారు. ఇక అద్భుతమైన ఈ ఫొటోపై ప్రకృతి ప్రేమికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘చాలా అందమైన ఫొటో. ఆమె చాలా గొప్ప తల్లి. ఆమెకు శిరస్సు వహించి వందనాలు తెలపాలి. మాతృత్వానికి నిజమైన అర్థం చెప్పారు’ అంటూ సదరు మహిళపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

చిప్కో ఉద్యమం
క్రీస్తు శకం 1730 లో జోధ్‌పూర్ రాజు అభయ్‌ సింగ్ ఓ పెద్ద నిర్మాణం నిమిత్తం బికనీర్‌కు సమీపంలో ఉన్న బిష్ణోయి ప్రాంతంలో ఖేజరీ చెట్లను నరికి తీసుకురమ్మని తన సైనికులను ఆదేశించాడు. అయితే ఖేజరీ చెట్టును దైవ సమానంగా భావించే బిష్ణోయి తెగ ప్రజలను ఈ వార్త ఎంతగానో కలచివేసింది. ఈ క్రమంలో అమృతాదేవి అనే గృహిణి పిల్లలతో సహా అక్కడికి చేరుకుని చెట్ల నరికివేతను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో వారంతా చెట్లను హత్తుకొని నిల్చున్నారు. ఈ విషయం ఊరంతా పాకడంతో మరో 363 మంది ఆమెకు తోడయ్యారు. చెట్లను కౌగిలించుకుని తమ నిరసన తెలియజేశారు. అయినప్పటికీ రాజు మనుషులు చెట్లను నరికేశారు. ఈ ఘటనలో రెండు వందల మందికి పైగా బిష్ణోయిలు ప్రాణాలు కోల్పోయారు. మానవాళి మనుగడకు ఎంతో ముఖ్యమైన చెట్లను కాపాడేందుకు వీరు చేసిన ‘పర్యావరణ ఉద్యమానికే చిప్కో ఉద్యమం’ అని పేరు. ఇక గురు జాంబేశ్వర్ స్థాపించిన బిష్ణోయి మతాన్ని అనుసరించే బిష్ణోయిలు ఆయనను విష్ణు అవతారంగా భావిస్తారు. వీరికి ఆయన 29 నియమాలు పెట్టాడు. వీటిలో చెట్లు, పశుపక్ష్యాదులను కాపాడటం అతి ముఖ్యమైన నియమం.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top