పదిలో యాభై!

Vision Problems of School Age Children - Sakshi

చిన్న వయసులోనే దృష్టిలోపం 

పది శాతం మంది విద్యార్థులు సతమతం 

డీబీసీఎస్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ ద్వారా వెల్లడి 

పౌష్టికాహార లోపమే ప్రధాన కారణమంటున్న వైద్యనిపుణులు 

నివారణ చర్యలు తీసుకోకపోతే చూపు పోయే ప్రమాదం 

చిన్నవయసులోనే విద్యార్థులకు దృష్టిలోపం శాపంగా మారుతోంది. కళ్లజోడు లేనిదే అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. మీటరు దూరంలో ఉన్న వస్తువును చూడాలన్నా అద్దాలపై ఆధార పడాల్సి వస్తుండడం.. దృష్టిలోపం తీవ్రతను తెలియజేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో 8 నుంచి 10 శాతం మంది విద్యార్థులు ఇదే సమస్యతో సతమతమవుతున్నారు.

సాక్షి, రంగారెడ్డి జిల్లా: జాతీయ, రాష్ట్ర అంధత్వ నియంత్రణ సొసైటీలు సంయుక్తంగా ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం  జిల్లా అంధత్వ నియంత్రణ సొసైటీ (డీబీసీఎస్‌)ని ఏర్పాటు చేశారు. విద్యార్థుల్లో దృష్టి లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే వారికి కళ్లజోళ్లు అందజేస్తారు. అవసరమైతే శస్త్ర చికిత్సలు సైతం నిర్వహిస్తారు. ఈ విద్యా సంతవ్సరంలో ప్రభుత్వ జెడ్పీ, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్, ఆశ్రమ, మైనారిటీ స్కూళ్లలో విద్యార్థులను స్క్రీనింగ్‌ చేశారు. జులై నుంచి డిసెంబర్‌ వరకు మొత్తం 240 పాఠశాలల్లో 68,777 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 5,995 మంది విద్యార్థులు కంటిచూపు లోపంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వీరందరికీ ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. మరో 44 మందిలో దృష్టిలోపం అధికంగా ఉండడంతో ఆస్పత్రులకు రిఫర్‌ చేశారు.  

ప్రధాన కారణాలివే.. 
చిన్నవయసులోనే దృష్టిలోపం రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని కంటి వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అత్యధికంగా జన్యుపరంగా దృష్టిలోపం సంక్రమిస్తుండగా.. మరికొందరిలో తగిన పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోకపోవడం వల్ల కంటిచూపు మందగిస్తోందని వెల్లడిస్తున్నారు. ఇటీవలి కాలంలో టచ్‌ స్క్రీన్లు కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. మొబైల్స్‌ (సెల్‌ఫోన్లు)తో విద్యార్థులు అధిక సమయం గడుపుతున్నారు. సర దా, కాలక్షేపం కోసం వాటిని వినియోగిస్తుండడం వల్ల కళ్లు ఒత్తిడికి గురై చూపు తీవ్రత తగ్గుతోంది. టీవీలు, ట్యాబ్‌ల వల్ల ఇవే పరిస్థితులు ఎదురవుతున్నాయి. చీకటి గదుల్లో చదవడమూ కొంత కారణమవుతోంది.   

నివారణ మార్గాలివే.. 
కంప్యూటర్, టీవీలకు దూరంగా ఉంచాలి. అవసరమనుకుంటే తప్ప వాటిని వినియోగించకూడదు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు కంటి భద్రత కోసం హెల్మెట్, కూలింగ్‌ గ్లాసులు ధరిస్తే మేలు. సూర్యుడిని నేరుగా చూడటం వల్ల కళ్లు దెబ్బ తినే ప్రమాదం ఉంది. ఈ విషయం లో పిల్లలకు అవగాహన కల్పిం చాలి. బయటికి వెళ్లివచ్చిన ప్రతి సారి కళ్లను నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. డయాబెటిక్‌ పేషంట్లు ప్రతి ఆరుమాసాలకు ఒకసారి విధిగా కంటి పరీక్షలు చేయించుకోవాలి.

పౌష్టికాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి 
ప్రస్తుతం ప్రతి వంద మంది విద్యార్థులోపది మంది తప్పనిసరిగా దృష్టిలోపంతో బాధపడుతున్నారు. సరైన సమయంలో గుర్తించి తగిన చర్యలు తీసుకుంటే తిరిగి సాధారణ చూపు పొందవచ్చు. అయితే నిర్లక్ష్యం చేస్తే చూపు మరింత మందగిస్తుంది. వెలుతురు అధికంగా ఉండే చోట విద్యార్థు లు చదువుకునేలా తల్లిదండ్రులు చూడాలి. చాలా బడుల్లో చీకటి తరగతి గదులే ఉంటున్నాయి. అటువంటి వాటిలో సరిపడా వెలుతురు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. పుట్టిన ఆరు మాసాల తర్వాత పిల్లలకు విధిగా విటమిన్‌ ‘ఎ’ సిరఫ్‌ తాగించాలి. ఇచ్చే ఆహారంలో ఎక్కువ శాతం పాలు, పండ్లు, గుడ్లు, ఆకుకూరలు ఉండేలా చూడాలి. –
 డాక్టర్‌ మాన్‌సింగ్, ప్రోగ్రాం కోఆర్డినేటర్, జిల్లా అంధత్వ నియంత్రణ సొసైటీ  

Read latest Rangareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top