మోడల్‌ ప్రాజెక్టుగా ‘డబుల్‌ బెడ్రూం’

Model project 'double bedroom' - Sakshi

ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌

అన్ని సౌకర్యాలు కల్పించండి

నిర్వాసితులను ఆదుకుంటామని హామీ

సిరిసిల్ల టౌన్‌: దేశంలోనే మోడల్‌ ప్రాజెక్టుగా డబుల్‌ బెడ్రూం ఇళ్ల సముదాయాన్ని తీర్చిదిద్దాలని మంత్రి కె.తారక రామారావు అన్నారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయన పర్యటించారు. జిల్లా కేంద్రంతోపాటు తంగళ్లపల్లి మండలం మండెపల్లి, ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట మండలాల్లోని అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. మండెపల్లి శివారులో రూ.76 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 1,260 డబుల్‌ బెడ్రూం ఇళ్లను, ఇంటిగ్రేటెడ్‌ డ్రైవింగ్‌ స్కూల్, ఐటీఐ కళాశాల పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ డబుల్‌ బెడ్రూం ఇళ్ల సముదాయంలో ఇంటర్నల్‌ డ్రైనేజీ, దేవాలయం, పార్క్, ఓపెన్‌ జిమ్, ఆటస్థలం, బ్యాంకు, ఏటీఎం సదుపాయాలు సమకూర్చాలని ఆదేశించారు. జూన్‌ 2లోపు అభివృద్ధి పనులన్నీ పూర్తిచేస్తే సీఎం కేసీఆర్‌ను జిల్లాకు ఆహ్వానించి.. ఆయన చేతులమీదుగా గృహ ప్రవేశాలు చేద్దామని సూచించారు. కోనరావుపేట మండలం మల్కపేట, ధర్మారంలో జరుగుతున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తొమ్మిదో ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తున్న సొరంగం పనులు, రిజర్వాయర్, కట్ట పనులను పరిశీలించారు.

ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామని, కుటుంబాల్లో అర్హులైన వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. డబుల్‌ బెడ్రూం పథకంలో నిర్వాసితులకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. తమకు పరిహారం రాలేదని, హామీలు అమలు కాలేదని పనులను మాత్రం ఆపడానికి ప్రయత్నించొద్దని కోరారు. ప్రాజెక్ట్‌ పూర్తయితే ఈ ప్రాంతవాసులందరికీ సాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందన్నారు.  

మోడల్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రారంభం..
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మోడల్‌ పోలీస్టేషన్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పోలీస్‌శాఖను పటిష్టం చేసి, నేరాలను నియంత్రించిందని చెప్పారు. రాష్ట్రంలోని పోలీస్టేషన్లను ఆధునీకరించి ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చూస్తామన్నారు. కేటీఆర్‌ వెంట పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావ్, కలెక్టర్‌ కృష్ణ్ణభాస్కర్, ఎస్పీ విశ్వజిత్‌ కంపాటి, సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ సామల పావని తదితరులు ఉన్నారు.  

Read latest Rajanna News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top