బాబు వచ్చాడు.. జాబు పోయిందన్నా!

people sharing their sorrowsto ys jagan - Sakshi

నెల్లూరు(సెంట్రల్‌): ‘అన్నా.. మేము ఉదయగిరి నియోజకవర్గంలో ఉపాధిహామీ ఫీల్డు అసిస్టెంట్లుగా పనిచేసేవాళ్లం.. అకారణంగా మమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగించారు’ అని తూర్పుగుడ్లదొనకు చెందిన వాసిపల్లి మదన్‌మోహన్‌రెడ్డి మంగళవారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించాడు. 2007 నుంచి ఫీల్టు అసిస్టెంటుగా పనిచేస్తున్నామని, తాము వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి సపోర్ట్‌ చేస్తున్నామనే సాకుతో తమను ఉద్యోగం నుంచి తొలగించారని వాపోయాడు. ఎన్నికల సమయంలో ‘బాబు వస్తే జాబు..’ అని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత  ఉన్న జాబులను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. స్పందించిన జగన్‌మోహన్‌రెడ్డి మన ప్రభుత్వం వస్తే తప్పకుండా న్యాయం చేస్తామని ఆయనకు ధైర్యం చెప్పారు.

రుణాలు మాఫీ కాలేదయ్యా!
రైతులకు సంబంధించి రుణాలు మాఫీ కాలేదని కలిగిరి మండలం పోలంపాడుకు చెందిన రైతు కల్లూరి చంద్రమౌళి మంగళవారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట గోడు వెళ్లబోసుకున్నాడు. ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా తమ గ్రామానికి వచ్చిన జననేత వైఎస్‌ జగన్‌ను కలిసి రుణమాఫీలో చంద్రబాబు చేసిన మోసం గురించి వివరించారు. 2011–12లో కలిగిరిలోని ఎస్‌బీఐలో అనేకమంది రైతులు బంగారం తాకట్టుపెట్టి, పంట రుణాలకు సంబంధించి లోన్లు తీసుకున్నారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత రుణమాఫీకి సంబంధించి మండలంలోని వివిధ బ్యాంకుల పరిధిలోని సుమారు ఐదు వేలమంది రైతులకు రుణమాఫీ వర్తించలేదని పేర్కొన్నారు. బ్యాంక్‌ అధికారులు డాక్యుమెంటేషన్‌ సమయంలో వ్యవసాయ రుణాలు అనే అంశాన్ని తొలగించి నాన్‌ అగ్రికల్చర్‌ కింద రుణాలు తీసుకుంటున్నట్లు సెల్ఫ్‌ డిక్లరేషన్‌గా నమోదుచేశారన్నారు. దీంతో రుణమాఫీకి అర్హత కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. స్పందించిన వైఎస్‌ జగన్‌ ఈ అంశంపై తమవంతుగా రైతులకు న్యాయంచేసే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.

Read latest SPSR Nellore News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top