జెడ్పీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి కోసం కాంగ్రెస్‌ వెతుకులాట

ZPTC And MPTC Elections Second Phase Nominations - Sakshi

స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ సంకట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో ప్రస్తుతం ఆ పార్టీకి జెడ్పీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి దొరకడం లేదు. నువ్వంటే.. నువ్వు పోటీచెయ్‌ అని ఒకరి పేర్లు ఒకరు చెప్పుకుంటున్నారే తప్ప.. అభ్యర్థి ఎవరన్నదానిపై పార్టీ నేతలు స్పష్టత ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో బలీయ శక్తిగా ఎదిగిన అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని తట్టుకుని నిలబడగలిగే అభ్యర్థి కోసం కాంగ్రెస్‌ పార్టీ వేయి కళ్లతో అన్వేషిస్తోంది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా: అసెంబ్లీ ఎన్నికల తర్వాత డీలాపడిన కాంగ్రెస్‌.. నాయకుల వలసలతో మరింత కుదేలైంది. ఇప్పుడు పరిషత్‌ ఎన్నికలు ఆ పార్టీకి పెద్ద సవాల్‌గా మారాయి. జెడ్పీటీసీగా గెలవడం ఒక ఎత్తు.. క్యాంపు రాజకీయాలను సాగించడం మరొక ఎత్తు. ఈ రెండింటిలో సఫలమైతేనే కాంగ్రెస్‌కు జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవి. మరి ఈ రెండు అంత సులువా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జెడ్పీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి జెడ్పీటీసీగా గెలుపొందినా జిల్లాలో క్షేత్రస్థాయి నుంచి పటిష్టంగా ఉన్న టీఆర్‌ఎస్‌ను ఢీకొనిక్యాంపు రాజకీయం చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉండటం టీఆర్‌ఎస్‌కు భారీగా కలిసివచ్చే అవకాశం.

తమ నియోజకవర్గం పరిధిలోని ప్రతి జెడ్పీటీసీ స్థానాన్ని గెలిపించుకునే బాధ్యతను ఎమ్మెల్యేలు దగ్గరుండి మరీ నిర్వర్తిస్తున్నారు. మరి కాంగ్రెస్‌లో ఈ పరిస్థితి లేదు. ఇదే విషయాన్ని కాంగ్రెస్‌ నాయకులు గమనించి మిన్నకుండిపోతున్నారు. క్యాంపు రాజకీయాలు పూర్తిగా డబ్బుతో ముడిపడిన అంశం కావడంతో పెద్దగా సాహసం చేయడం లేదు. ఒకవేళ పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసినా ఫలితం తారుమారైతే తమ పరిస్థితి ఏంటని కొందరు ఆశావహ అభ్యర్థులు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యవసానాలన్నింటినీ బేరీజు వేసుకుంటున్న నేతలు చైర్‌పర్సన్‌ రేసులో నిలబడటం లేదని సమాచారం.
 
రెండు విడతలపైనే ఆశలు.. 
ఇప్పటికే తొలి దశ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసిపోయింది. మొదటి విడతగా ఎన్నికలు జరిగే ఏడు జెడ్పీటీసీలకు 26 మంది అభ్యర్థులు కాంగ్రెస్‌ తరఫున నామినేషన్లు దాఖలు చేసినా.. ఆ జాబితాలో జెడ్పీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి లేడని పార్టీ నేతలు చెబుతున్నారు. మరో రెండు విడతల్లో జరిగే జెడ్పీటీసీలపైనే ఆ పార్టీ గట్టి నమ్మకం పెట్టుకుంది. 
గత అనుభవంతో..

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చివరి సారిగా జరిగిన స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టే పైచేయి సాధించింది. మొత్తం 33 జెడ్పీటీసీల్లో 17 స్థానాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకున్నా.. జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవిని దక్కించుకోవడంలో విఫలమైంది. క్యాంపు రాజకీయాలు చేయలేని కారణంగానే ఆ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ కంటే తక్కువ స్థానాల్లో గెలిచిన టీఆర్‌ఎస్‌.. ఇతర పార్టీల తరఫున గెలిచిన జెడ్పీటీసీలను తమ వైపు తిప్పుకోవడంలో సఫలమైంది. ఫలితంగా జెడ్పీ పీఠాన్ని గులాబీ దళం చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇదే సీన్‌ పునరావృతమైతే పరిస్థితి ఏమిటని కాంగ్రెస్‌ నేతలు ఆలోచనలో పడ్డారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top