జ‘హీరో’బాద్‌?

Zaheerabad Constituency Review on Lok Sabha Election - Sakshi

హోరాహోరీ తలపడుతున్న టీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌

అసెంబ్లీ సెగ్మెంట్లలో ‘కారు’దే దూకుడు

కేసీఆర్, రాహుల్‌ సభలతో రెండు పార్టీల్లోనూ జోష్‌

జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఆసక్తికర పోరు జరుగుతోంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నువ్వా? నేనా? అన్నట్టు పోటీ పడుతున్నాయి. ఇక్కడ అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ అధిక అసెంబ్లీ స్థానాల్లో పాగా వేయడం, కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఒక్క ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌ గూటికే చేరారు. ఇక, కాంగ్రెస్‌ నుంచి బరిలో ఉన్న మదన్‌మోహన్‌రావు తొలి నుంచీ గట్టిపోటీ ఇస్తున్నారు. ఆయనకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు షబ్బీర్‌అలీ, దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, సురేష్‌ షెట్కార్‌ అండదండలు బలాన్నిస్తున్నాయి. అయితే క్షేత్రస్థాయి ప్రచారంలో వెనుకబడటం, మూడు, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్యాడర్‌ పని చేయకపోవడంతో ఆయన నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. బీజేపీ నుంచి పోటీలో ఉన్న బాణాల లక్ష్మారెడ్డి ప్రధాని మోదీ ఛరి ష్మాను నమ్ముకున్నారు. ఎల్లారెడ్డి, కామారెడ్డి మినహా ఎక్కడా ఆ పార్టీకి తగిన క్యాడర్‌ లేదు.

మూడు లక్షల మెజారిటీ..ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాను. హామీ ఇవ్వని పనులెన్నిటినో కూడా చేశాను. జాతీయ రహదారుల అభివృద్ధి, పాసుపోర్టు సేవా కేంద్రం, రూర్బన్‌ పథకం వంటివి నియోజకవర్గానికి తెచ్చాను. రోడ్ల మెరుగుకు భారీగా నిధులు సాధించాను. సీఎం కేసీఆర్‌ దేశంలో ఎక్కడా లేని పథకాలను అమలు చేసి ఇంటింటికీ ఆత్మబంధువయ్యారు. జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు అభిమానం చూపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అందించిన ప్రజలు ఎంపీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌నే గెలిపిస్తారు. నాకు మూడు లక్షల మెజారిటీ వస్తుందన్న నమ్మకం ఉంది.    – బీబీ పాటిల్, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి

‘ఏటా రూ.72 వేలు’ గెలిపిస్తుంది
జహీరాబాద్‌ సిట్టింగ్‌ ఎంపీ బీబీ పాటిల్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఆయన ఎన్నడూ ప్రజలకు అందుబాటులో లేరు. కనీసం తెలుగు మాట్లాడడం కూడా రాదన్న అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. సింగూరు నీటిని అక్రమంగా తరలించినా నోరు మెదపలేదు. దీంతో సింగూరుపై ఆధారపడ్డ రైతాంగానికి అన్యాయం జరిగింది. తాగడానికీ నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. రాహుల్‌గాంధీ ప్రకటించిన ఏడాదికి రూ.72 వేల సాయం. రూ.2 లక్షల రుణమాఫీ ప్రకటనపై సామాన్య ప్రజలు, రైతుల నుంచి మంచి స్పందన ఉంది. ఇదే నా విజయానికి నాంది కానుంది. నేను పదవిలో లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉన్నా. జాబ్‌మేళాలు నిర్వహించి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించాను. ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గంలోని యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించే పూచీ నాదేనని చెబుతుంటే అందరూ ప్రశంసిస్తున్నారు. కచ్చితంగా నన్ను ఎంపీగా గెలిపిస్తారు.– కె.మదన్‌మోహన్‌రావు, కాంగ్రెస్‌ అభ్యర్థి

మోదీ గెలిపిస్తారు..
దేశ ప్రధానిగా నరేంద్రమోదీ అందించిన సుపరిపాలన, భద్రత ప్రజల్లో అపారమైన నమ్మకాన్ని కలిగించింది. ఎక్కడికి వెళ్లినా మోదీ గురించే ప్రజలు చర్చిస్తున్నారు. దేశ ప్రధానిగా గతంలో ఎవరూ పొందలేనంత ప్రజాభిమానాన్ని మోదీ సంపాదించుకున్నారు. అవినీతి రహిత పాలన అందించడం ద్వారా మోదీ యావత్‌ దేశ ప్రజల నమ్మకాన్ని పొందారు. ఆయనపై ప్రజలకు ఉన్న నమ్మకమే నన్ను గెలిపిస్తుంది. తెలంగాణలో మెజారిటీ ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోబోతోంది. జహీరాబాద్‌ లోక్‌సభ ప్రజలు ఎక్కడికి వెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారు. తప్పకుండా విజయం సాధిస్తాను.– బాణాల లక్ష్మారెడ్డి, బీజేపీ అభ్యర్థి

సిట్టింగ్‌ ఎంపీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాటిల్‌ ఇక్కడ గెలుపు తనదేననే ధీమాతో ఉన్నారు. జహీరాబాద్‌ లోక్‌సభ పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో హోంమంత్రి మహమూద్‌ అలీ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మైనారిటీ వర్గ ప్రజలతో ప్రత్యేకంగా భేటీ అయి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మైనారిటీ వర్గాల ఓట్లలో టీఆర్‌ఎస్‌తో పాటు కొంత శాతం మేర కాంగ్రెస్‌కు పడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. బోధన్‌–బీదర్‌ రైల్వేలైన్‌ పెండింగ్‌లోనే ఉంది. దీనితో పాటు లెదర్‌ పార్కును సాధిస్తామని, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నియోజకవర్గానికి నీళ్లు తీసుకొస్తామని ఎంపీ అభ్యర్థి పాటిల్‌ హామీనిస్తున్నారు. కాగా, జాతీయ స్థాయి రాజకీయాలు, ప్రధానిని నిర్ణయించే ఎన్నికలు కావడంతో టీఆర్‌ఎస్‌కు బదులు జాతీయ పార్టీలుగా తమకు అవకాశం ఉంటుందని కె.మదన్‌మోహన్‌రావు (కాంగ్రెస్‌), బాణాల లక్ష్మారెడ్డి (బీజేపీ) ఆశాభావంతో ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు పెద్దగా తేడా ఉండదని టీఆర్‌ఎస్‌ శ్రేణులు అంటుండగా, వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులు అధికార పార్టీపై సానుకూలంగా ఉన్నారు. 20–25 ఏళ్ల యువత మాత్రం జాతీయ స్థాయిలో ప్రభావితం చేసే కాంగ్రెస్, బీజేపీలకే మద్దతునిస్తామని అంటున్నారు.

పటిష్టంగా టీఆర్‌ఎస్‌..
ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్‌ పార్టీ యంత్రాంగం బలంగా ఉంది. ఈ లోక్‌సభ స్థానంలోని అన్ని సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్‌ శ్రేణుల ప్రచారం సాగుతోంది. ఇటీవల అల్లాదుర్గంలో సీఎం కేసీఆర్‌ నిర్వహించిన ఎన్నికల బహిరంగసభ కేడర్‌లో నూతనోత్తేజాన్ని నింపింది. ఈ సభకు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి పెద్దసంఖ్యలో కార్యకర్తలు, ప్రజలను సమీకరించారు. ముఖ్యంగా జహీరాబాద్‌ చుట్టుపక్కల నుంచి మైనారిటీలు హాజరయ్యారు. రోడ్‌షోలు, బహిరంగసభలతో ఇక్కడ టీఆర్‌ఎస్‌ ఊపు మీదుంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. జహీరాబాద్‌లో రాహుల్‌గాంధీ బహిరంగసభతో పార్టీ శ్రేణుల్లో కదలిక వచ్చింది. ప్రచారం విషయంలో బీజేపీ కొంత వెనకబడినా.. పుంజుకునే ప్రయత్నం చేస్తోంది.

లోక్‌సభ పరిధిలో బలాబలాలిలా..
జహీరాబాద్‌: కూలిన కాంగ్రెస్‌ కంచుకోట

కొన్ని దశాబ్దాలుగా కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభ కాస్తా క్రమంగా తగ్గిపోతోంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇక్కడ టీఆర్‌ఎస్‌ జోరు పెంచింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 80 శాతానికి పైగా సర్పంచ్‌ స్థానాలను టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు గెలుచుకున్నారు. మైనారిటీల ఓట్లు 60 వేలు, లింగాయత్‌ల ఓట్లు 20 వేల వరకు ఉన్నాయి. వీటిలో అధిక శాతం ఓట్లు తమకే పడతాయన్న నమ్మకంతో టీఆర్‌ఎస్‌ ఉంది. మేనిఫెస్టోలో ప్రకటించిన కనీస ఆదాయ పథకం, లోక్‌సభ ఎన్నికలు కాబట్టి ముస్లిం ఓట్లు తమకే పడతాయని కాంగ్రెస్‌ పార్టీ ఆశిస్తోంది. రాహుల్‌గాంధీ సభ విజయం తో కాంగ్రెస్‌లో కొంత ఆశలు పెరిగాయి. పట్టణ ప్రాంతాలు, మేజర్‌ గ్రామాల్లో బీజేపీకి కొంత అనుకూలత కనిపిస్తోంది.

అందోల్‌: రెండు పార్టీల హల్‌చల్‌
అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానంలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ (కాంగ్రెస్‌) నుంచి గట్టి పోటీ ఎదురుకావడంతో టీఆర్‌ఎస్‌ మెజారిటీ దాదాపు 16 వేలకే పరిమితమైంది. లోక్‌సభ ఎన్నికల్లో ఈ మెజారిటీని పెంచుకోవాలనే పట్టుదలతో టీఆర్‌ఎస్‌ నాయకులున్నారు. తాజాగా కాంగ్రెస్‌ నుంచి పలువురు సర్పంచ్‌లు, రేగోడు, వట్‌పల్లి మండలాల్లో రాజనర్సింహ అనుచరులుగా ఉన్న కొందరు మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు టీఆర్‌ఎస్‌లో చేరారు. జోగిపేట హెడ్‌క్వార్టర్‌లో, మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ కొంత బలహీనంగా ఉంది. పాత తరం నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఇటీవలే టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో పి.శివశేఖర్‌ (న్యాయవాది) చేరికతో బలోపేతమైంది. రాయికోడ్‌ మండలంలో జడ్పీటీసీ అంజయ్య, ఇతర నేతల అండతో పార్టీ బలంగానే ఉంది. మునిపల్లి మండలంలోనూ కాంగ్రెస్‌ పరిస్థితి పర్వాలేదు. రాయికోడ్‌ మండలంలో కొంత మేర హిందూ భావజాలం పనిచేస్తుందనే నమ్మకంతో బీజేపీ ఉంది.

నారాయణఖేడ్‌: ‘కారు’దే దౌడ్‌
ఇక్కడ టీఆర్‌ఎస్‌ సంస్థాగతంగా బలంగా ఉంది, కాం గ్రెస్‌ బలం కూడా కొంచెం అటూఇటూగా బాగానే ఉంది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే భూపాలరెడ్డికి  59 వేల ఓట్ల మెజారిటీ రాగా, లోక్‌సభ ఎన్నికల్లో ఆ స్థాయిలో మెజారిటీ వచ్చే అవకాశాల్లేవని స్థానిక నాయకులంటున్నారు. ఈ నియోజకవర్గ అభివృద్ధిపై ఎంపీ పాటిల్‌ శ్రద్ధ పెట్టలేదనే విమర్శలున్నాయి. ఎమ్మెల్యేతో ఎంపీకి సత్సంబం ధాలు లేకపోవడం వల్ల ఆ ప్రభావం మెజా రిటీపై పడొచ్చునని చెబుతున్నారు. కాం గ్రెస్‌ ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించి భంగపడ్డ పటోళ్ల సంజీవరెడ్డి బీజేపీలో చేరి.. మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరారు. మాజీ ఎంపీ సురేష్‌ షెట్కార్, సంజీవరెడ్డి వర్గాలు.. మదన్‌మోహన్‌కు మద్దతుగా పనిచేస్తున్నాయి. పెన్షన్లు, రైతుబంధు ఇతర సంక్షేమ పథకా లు టీఆర్‌ఎస్‌పై ఓటర్ల అనుకూల త పెంచేందు కు దోహదపడనున్నాయి. ఇక్కడ బీజేపీకి కేడర్‌ లేదు. తాగు, సాగునీటి సమస్యలు ఇక్కడ ప్రభావం చూపే అంశాలు.

ఎల్లారెడ్డి: అటా? ఇటా?
ఇక్కడ కాంగ్రెస్‌–టీఆర్‌ఎస్‌ మధ్య పోరు నువ్వా నేనా అన్నట్టుంది. ఈ నియోజకవర్గంపై మాజీ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డికి గట్టి పట్టుంది. జహీరాబాద్‌ లోక్‌సభలోని ఏడు సెగ్మెంట్లలో ఒక్క ఎల్లారెడ్డిలోనే కాంగ్రెస్‌ అభ్యర్థి సురేందర్‌ గెలుపొందారు. అయితే, గెలిచాక టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించడంపై స్థానికంగా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు పార్టీ మారినంత మాత్రాన టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా కాంగ్రెస్‌ మద్దతుదారుల ఓట్లు పడే అవకాశాల్లేవని అంటున్నారు. నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ప్రస్తుతం మంచినీటి సమస్య ఎదురవుతోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి మదన్‌మోహన్‌రావు ఈ నియోజకవర్గానికి చెందిన వారే.

జుక్కల్‌: టీఆర్‌ఎస్‌ జోర్దార్‌
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బీబీ పాటిల్‌ ఈ నియోజకవర్గంలోని మద్నూరు మండలం సిర్పూరు గ్రామానికి చెందిన వారు. తెలుగు కంటే కన్నడ, మరాఠీ మాట్లాడే వారు ఎక్కువున్నారు. ఈ ఓట్లు టీఆర్‌ఎస్‌కే పడతాయని స్థానికులు చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తల ప్రచారం జోరుగా సాగుతోంది. అసెంబీ ఎన్నికల్లో వచ్చిన 35 వేలకు మించి మెజారిటీ సాధించాలనే పట్టుదలతో కేడర్‌ ఉంది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే కీలకంగా వ్యవహరిస్తున్నారు. 18 వేల వరకు ఉన్న లింగాయత్‌ల ఓట్లు ఆ సామాజిక వర్గానికే చెందిన పాటిల్‌కే పడే అవకాశాలున్నాయి. కాంగ్రెస్‌లో నియోజకవర్గ స్థాయి నాయకత్వం పటిష్టంగా లేదు.  

బాన్స్‌వాడ: పోటాపోటీ
స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సెగ్మెంట్లో టీఆర్‌ఎస్‌ బలంగా ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నిక ల్లో వచ్చిన 17 వేల మెజారిటీని మించి ఈ ఎన్నికల్లో సాధించాలనే పట్టుదలతో టీఆర్‌ఎస్‌ నాయకులున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. ఇక్కడ బాలరాజు అన్నీ తానై నడిపిస్తున్నారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి విద్యాభ్యాసం ఈ నియోజకవర్గ పరిధిలోని మోస్రాలోనే సాగింది. ఆ పాఠశాలలో చదివిన విద్యార్థులు అధికంగా ఇక్కడ ఉండటం తో వారంతా ఆయనకు అనుకూలంగా పనిచేస్తున్నారు.  ఈ నియోజకవర్గంలో బీజేపీకి పెద్దగా పట్టు, కేడర్‌ లేదు.

కామారెడ్డి: మూడు పార్టీలకూ మొగ్గు
ఈ సెగ్మెంట్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీకి మిశ్రమ ఫలితాలు వచ్చే సూచనలున్నాయి. పట్టణ ప్రాంతంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ తర్వాత బీజేపీ వైపు కొంత మొగ్గు కనిపిస్తోంది. వివిధ పథకాల లబ్ధిదారులు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ ప్రభావం కొంత తగ్గినట్టుగా చెబుతున్నా మైనారిటీల ఓట్లు కాంగ్రెస్‌కే అధిక శాతం పడే అవకాశాలున్నాయని అంటున్నారు. బీజేపీకి సైతం ఇక్కడ కొంత సానుకూల పరిస్థితులున్నాయి.

ఆలోచించి నిర్ణయం..
ఎమ్మెల్యే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేసినం. మా తండాకు రోడ్డు సౌకర్యం కూడా లేదు. ఇప్పుడే మంచినీళ్ల సమస్య తీవ్రమైంది. ఇంకా కొన్ని సమస్యలున్నాయి. ఎన్నికలపుడు మాటలు చెబుతున్నరు కాని ఆ తర్వాత వాటిని నిలబెట్టుకుంటలేదు. రుణమాఫీ ఒకే దఫా చేస్తే బాగుంటది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడేందుకు వీలుగా లోక్‌సభ ఎన్నికల్లో మా ఓటు ఎవరికి వేయాలన్న దానిపై నిర్ణయిస్తం.
– డి.శివరాం, రైతు, వెంకంపల్లి తండా

ఎన్నికలా? అవునా?.
వచ్చే గురువారం లోక్‌సభ ఎన్నికలున్నాయని మీరు చెప్పే దాకా తెలియదు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేసినం. అయితే లోక్‌సభ ఎన్నికల గురించి ఎవరూ చెప్పలేదు. ఏదో కొంత పొలం కౌలుకు తీసుకుని బతుకుతున్నం. మా ఆయనకు పింఛను వస్తాంది. లోక్‌సభ ఎన్నికల్ల ఎవరికి ఓటేయాలన్నది ఇంకా సొంఛాయించాలే.– వడ్డెరు నర్సవ్వ, మహ్మద్‌నగర్‌

మా కోసం ఏదైనా..
మాలాంటి మెకానిక్‌లకు నైపుణ్యాలు మెరుగుపరిచి సొంత కాళ్లపై నిలబడేలా ప్రోత్సాహకాలు అందించాలి. మైనారిటీల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ మరిన్ని చర్యలు తీసుకోవాలి. సూటిగా ప్రయోజనం కలిగించే స్వయం ఉపాధి, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి. – జహంగీర్, కారు మెకానిక్, ఎల్లారెడ్డి టౌన్‌

లోక్‌సభ ఓటర్లు
పురుషులు   7,37,479
మహిళలు    7,60,456
ఇతరులు      61
మొత్తం ఓటర్లు 14,97,996

2014 లోక్‌సభ ఎన్నికల్లోవచ్చిన ఓట్లు
5,08,661 బీబీ పాటిల్‌(టీఆర్‌ఎస్‌)
3,64,030సురేష్‌ షెట్కార్‌(కాంగ్రెస్‌)
1,57,497 మదన్‌మోహన్‌రావు (టీడీపీ)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top