రాజీనామాలకు కట్టుబడి ఉన్నాం

yv subba reddy about resignations - Sakshi

వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

కొత్త పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నాలు

ఒంటరిగా పోటీ చేసే సత్తా బాబుకు లేదు

సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంట్‌ సమావేశాల చివరి రోజున తాము చేసిన రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. స్పీకర్‌ ఫార్మాట్‌లోనే రాజీనామా పత్రాలు ఇచ్చామని, వాటిపై మరో మాటలేదని తేల్చి చెప్పారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర జూన్‌ 11న తూర్పు గోదావరి జిల్లాలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి గురువారం రాజమహేంద్రవరంలో పార్టీ నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లోక్‌సభ స్పీకర్‌ నుంచి తమకు కబురొచ్చిందని, ఈ నెల 29న ఢిల్లీకి వెళ్లి స్పీకర్‌ను కలుస్తామని చెప్పారు. రాజీనామాలపై తాము వెనక్కి తగ్గబోమని పేర్కొన్నారు. తమ రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్‌ను కోరుతామన్నారు. రాజీనామాలు ఆమోదించకపోయినా తాము వచ్చే శీతాకాల పార్లమెంట్‌ సమావేశాలకు హాజరు కాబోమని వెల్లడించారు. నాలుగేళ్లలో దేశంలో ఏ పార్టీ కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టలేదని, తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం 13 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టామని గుర్తు చేశారు.

టీడీపీ గోబెల్స్‌ ప్రచారం
బీజేపీతో వైఎస్సార్‌సీపీ పొత్తుపెట్టుకుంటోందంటూ అధికార టీడీపీ గోబెల్స్‌ ప్రచారం చేస్తోందని వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామన్నారు. ప్రజల మద్దతుతో 25 ఎంపీ సీట్లు గెలుచుకుని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో అప్పుడు నిర్ణయిస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.

చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఏనాడూ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లలేదని, ఇకపైనా ఆయనకు ఒంటరిగా వెళ్లే సత్తా లేదని సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేతలు ధర్మాన ప్రసాదరావు, కురసాల కన్నబాబు, కొయ్యే మోషేన్‌రాజు, పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top