కడప గడపలో వైఎస్సార్‌

YSRCP Winning story in 2014 Elections YSR Kadapa Constituency  - Sakshi

2014లో 9 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం

అదే ఖాతాలో రెండు పార్లమెంటు స్థానాలు

ఉన్నత విద్య, వైద్యం, సాగునీటి రంగాలకు ప్రాణం పోసిన మహానేత వైఎస్సార్‌

వర్గ విభేదాలు, ప్రజా వ్యతిరేకతతో అధికారపార్టీ సతమతం

రాజంపేట పార్లమెంటుకు ఇంకా ఖరారు కాని టీడీపీ అభ్యర్థి

రెండువందల ఏళ్ల పైబడిన చరిత్ర... కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి నడయాడిన ప్రాంతం.. తిరుమల తొలిగడపగా గుర్తింపు పొందిన దేవుని కడప.. జాతీయ స్థాయి గుర్తింపు దక్కిన పెద్దదర్గా.. అపార, అరుదైన ఖనిజ సంపదల నిలయం.. ఇన్ని ప్రత్యేకతలున్న ప్రాంతం వైఎస్సార్‌ జిల్లా. జిల్లాలో 2 లోక్‌సభ స్థానాలు, 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2014లో రాజంపేట అసెంబ్లీ స్థానం మినహా మిగిలిన స్థానాలన్నింటిలో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. జమ్మలమడుగు, బద్వేల్‌ ఎమ్మెల్యేలు సి.ఆదినారాయణరెడ్డి, టి.జయరాములు ఇద్దరూ  వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొంది టీడీపీలోకి  ఫిరాయించారు. జిల్లాలోని కడప, బద్వేల్, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20,56,660 మంది ఓటర్లు నాయకుల భవితవ్యాన్ని తేల్చనున్నారు.  ఎన్నికలు సమీపిస్తున్నా రాజంపేట లోక్‌సభ స్థానానికి అధికార పార్టీకి అభ్యర్థి కొరత వేధిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ ఉనికి కాపాడిన రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సైతం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఐదేళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు అనేక సార్లు జిల్లాలో పర్యటించారు. హామీల జాబితా పెరగడం తప్ప అమలులో చిత్తశుద్ధి లోపించింది. ఉర్దూ యూనివర్సిటి ఏర్పాటు చేయలేదు. జిల్లా పట్ల చంద్రబాబు సర్కార్‌ వివక్ష చూపిందని జిల్లావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బద్వేల్‌, మండలాలు : బద్వేల్, గోపవరం, అట్లూరు, బి.కోడూరు, కలశపాడు, పోరుమామిళ్ల, కాశినాయన
2014లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా జయరాములు పోటీచేసి టీడీపీ అభ్యర్థి ఎన్‌డీ విజయజ్యోతిపై 10,079 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అనంతరం అధికారం కోసం ఎమ్మెల్యే టీడీపీలో చేరారు. అయితే ఇప్పుడు టీడీపీ జయరాములుకు టికెట్‌ కేటాయించలేదు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ తరుపున డాక్టర్‌ కె. వెంకటసుబ్బయ్య ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి సహకారంతో రెండేళ్లుగా ప్రజల మధ్యే వివిధ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. టీడీపీ తన అభ్యర్థిని ఖరారు చేయలేదు. వైఎస్సార్‌ హయాంలో 16టీఎంసీల నీరు బ్రహ్మసాగర్‌లో నిల్వ చేసి, చెరువులన్నీ నింపి ఆయకట్టుకు నీరిచ్చారు. టీడీపీ సర్కార్‌లో తాగునీటి అవసరాలు కూడా తీర్చలేని దుస్థితి నెలకొంది.

రాజంపేట, మండలాలు :  రాజంపేట, నందలూరు, ఒంటిమిట్ట, సిద్దవటం, వీరబల్లె, సుండుపల్లె
2014లో టీడీపీ అభ్యర్థిగా మేడా మల్లికార్జునరెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆకేపాటిపై 11,614 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈసారి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మేడా పోటీ చేస్తున్నారు. ఆయనకు ఆకేపాటి సహకారం అందిస్తున్నారు. ఇద్దరు  ప్రధాన నాయకులు ఒక్కటి కావడంతో టీడీపీ  రైల్వేకోడూరుకు చెందిన చెంగల్‌రాయుడును తెరపైకి తెచ్చింది.

కడప
2014లో ఎస్‌బీ అంజాద్‌బాషా వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి దుర్గాప్రసాద్‌పై 45,205 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వైఎస్సార్‌ హయాంలో కడప అపార అభివృద్ధి సాధించింది. కాగా, ఇప్పటికీ టీడీపీ అభ్యర్థిని ఫైనల్‌ చేయలేకపోతోంది. ఈసారి అమీర్‌బాబును రంగ ప్రవేశం చేయించనున్నారు.
రైల్వేకోడూరు
మండలాలు :  ఓబులవారిపల్లె, పుల్లంపేట, చిట్వేల్, పెనగలూరు
2014లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా కొరముట్ల శ్రీనివాసులు టీడీపీ అభ్యర్థి ఓ.సుబ్బరామయ్యపై విజయం సాధించారు. టీడీపీ ఒకసారి పోటీలో దింపిన వ్యక్తిని రెండోసారి పోటీలో ఉంచడం లేదు. ఈక్రమంలో ఈసారి నరసింహప్రసాద్‌ను రంగంలోకి దింపనుంది. ఎమ్మెల్యే కొరముట్ల వేల మంది కార్యకర్తలను పేర్లు పెట్టి పిలవగలిగే అభిమానం సంపాదించుకున్నారు. బైరటీస్‌ను నమ్ముకొని నెలకొల్పిన చిన్న పరిశ్రమలను టీడీపీ సర్కార్‌ దెబ్బతీయడంతో 50వేల మంది ఉపాధి కోల్పోయారు.

ఈ సమస్యపై కొరముట్ల అనేక పోరాటాలు చేశారు.
రాయచోటి మండలాలు :  లక్కిరెడ్డిపల్లె, రామాపురం, గాలివీడు,     రాయచోటి, సంబేపల్లె, చిన్నమండెం
2014లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా గడికోట శ్రీకాంత్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి రమేష్‌రెడ్డిపై 34,782 ఓట్ల్ల మెజార్టీతో గెలిచారు. నియోజకవర్గంలో ముస్లింలు అధికసంఖ్యలో ఉన్నారు. ప్రజలు తాగునీటి ఇక్కట్లను చవిచూస్తున్నా సర్కార్‌ పెడచెవిన పెడుతోంది. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ఎమ్మెల్యే గడికోట వారి సమస్యలు తీరుస్తున్నారు. శ్రీనివాసాపురం రిజర్వాయర్‌ నుంచి కుప్పంకు నీరు తరలించడంలో బాబుకు ఉన్న శ్రద్ధ రాయచోటిపై లేదని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.

పులివెందుల మండలాలు :  పులివెందుల, లింగాల, సింహాద్రిపురం,  తొండూరు, వేముల, వేంపల్లె, చక్రాయపేట
2014లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ 75,243 మెజార్టీతో టీడీపీ అభ్యర్థి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డిపై ఘన విజయం సాధించారు. పులివెందుల వైఎస్‌ కుటుంబానికి కంచుకోట. 1978 నుంచి 2014వరకూ ఆ కుటుంబానికే ప్రజలు పట్టం కట్టారు. మరోమారు విజయం కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.

కమలాపురం మండలాలు :  కమలాపురం, వల్లూరు, చెన్నూరు, పెండ్లిమర్రి, వీరపునాయునిపల్లె, చింతకొమ్మదిన్నె
2014లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి  రవీంద్రనాథరెడ్డి టీడీపీ అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డిపై 5,345 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఐదేళ్ల కాలంలో సర్వరాయసాగర్‌కు నీరు నింపాలన్నా పోరాటం చేసి తెప్పించుకోవాల్సిన దుస్థితి చంద్రబాబు పాలనలో ఏర్పడింది. ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి రెండేళ్లుగా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజాపోరాటాలు చేశారు.

జమ్మలమడుగు మండలాలు : జమ్మలమడుగు, పెద్దముడియం, మైలవరం, ముద్దనూరు, కొండాపురం, యర్రగుంట్ల
2014లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డిపై 12,167 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అధికారం కోసం ఎమ్మెల్యే టీడీపీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. మూడు దశాబ్దాలకు పైగా ఫ్యాక్షన్‌ ను పెంచి పోషించిన దేవగుడి, గుండ్లకుంట కుటుంబాలు ఏకమయ్యాయి. ఈమారు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా డాక్టర్‌ ఎం.సుధీర్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డి పోటీలో ఉన్నారు.  దేవగుడి, గుండ్లకుంట కుటుంబాల కారణంగా అనేక మంది ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు. ఈనేపథ్యంలో జమ్మలమడుగు ప్రజానీకం సు«ధీర్‌రెడ్డిని ఆదరిస్తోంది.

ప్రొద్దుటూరు మండలాలు :  ప్రొద్దుటూరు రూరల్, రాజుపాళెం మండలాలతోపాటు ప్రొద్దుటూరు మున్సిపాలిటి   
2014లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డిపై 12,945 ఓట్లతో విజయం సాధించారు. ఈసారికూడా రాచమల్లు పోటీలో ఉండగా, టీడీపీ అభ్యర్థిత్వం ఖరారు చేయలేని దుర్గతిలో ఉంది. నిత్యం ప్రజాపోరాటాల్లో ఉంటున్న రాచమల్లు విజయం ఇక్కడ సునాయసమే.

మైదుకూరు మండలాలు :  మైదుకూరు, చాపాడు, దువ్వూరు, బ్రహ్మంగారిమఠం, ఖాజీపేట
2014లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా రఘురామిరెడ్డి టీడీపీ అభ్యర్థి సుధాకర్‌ యాదవ్‌పై 11,522 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈమారు ఆ ఇద్దరే పోటీలో ఉన్నారు. ఐదేళ్లుగా ప్రజాభిమానం పొందడంలో పుట్టా విఫలమయ్యారు. తన సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి ప్రజల్లో అబాసుపాలయ్యారు. పెద్దాయనగా కీర్తింపబడుతోన్న రఘురామిరెడ్డి రైతు సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుండడం ఆయనకు కలిసొచ్చే అంశంగా మారింది.

కడప లోక్‌సభ మైదుకూరు, బద్వేల్, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కడప, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాలు
1989 నుంచి ఇప్పటికి 9 పర్యాయాలు పార్లమెంటు సభ్యులుగా వైఎస్‌ కుటుంబీకులు ఎన్నికవుతూ వచ్చారు. 1991లో వైఎస్సార్‌ అత్యధికంగా 4,22,790 ఓట్ల మెజారిటీ సాధించగా, ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌ 2011లో 5,45,672 ఓట్ల్ల మెజార్టీని చేజెక్కించుకున్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా వైఎస్‌ అవినాష్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి శ్రీనివాసులరెడ్డిపై 1,90,323 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఏపీకి హోదా కోసం పదవీత్యాగం చేసిన అవినాష్‌రెడ్డి ప్రజాపోరాటాలు చేస్తున్నారు. ఈమారు వైఎస్సార్‌సీపీ తరపున పోటీలో నిలవనుండగా టీడీపీ అభ్యర్థిగా మంత్రి ఆది బరిలో నిలవనున్నారు.

రాజంపేట  లోక్‌సభ నియోజకవర్గాలు : రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె
గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, టీడీపీ–బీజేపీ పొత్తులో భాగంగా పురందేశ్వరి పోటీ చేశారు. మిథున్‌రెడ్డి 1,74,762 ఓట్లతో విజయం సాధించారు. ప్రత్యేక హోదా కోసం పదవీత్యాగం చేయడంలో మిథున్‌రెడ్డి ముందు వరసలో నిలిచారు. ప్రజల మ«ధ్యనే ఉండడం ఆయనకు ఫ్లస్‌ పాయింట్‌ కానుంది. మరోమారు పోటీచేసేందుకు మిథున్‌రెడ్డి సిద్ధమై ప్రచారం కొనసాగిస్తుండగా టీడీపీ ఇప్పటికీ అభ్యర్థి కోసం అన్వేషిస్తుండడం విశేషం.

 అందరూనారాయణులే
శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం 1952లో ఆవిర్భవించిన నాటి నుంచి గెలుపొందిన, పోటీచేసిన అభ్యర్థుల చాలామంది పేర్లలో నారాయణ అనే పదం ఉంది. 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న శ్రీకాకుళం నుంచి కె.నారాయణ మొదటి  సభ్యుడిగా, కె.ఎ.నాయుడు రెండో సభ్యుడిగా ఎన్నికయ్యారు.1955లోసూర్యనారాయణ,1967లో తంగి సత్యనారాయణ, 1972, 78లో చల్లా సత్యనారాయణ, 1983లో తిరిగి తంగి సత్యనారాయణ విజయం సాధించారు. 1985, 89, 94, 99  ఎన్నికల్లో గుండ అప్పల సూర్యనారాయణ గెలుపొందారు. వీరి పేర్ల చివర నారాయణ ఉంది. 1962లో మాత్రం అంధవరపు తవిటయ్య గెలుపొందారు. ఓటమి పొందిన వారి పేర్లలోనూ నారాయణ ఉండడం ఇంకో ప్రత్యేకత. 1952లో ఓ స్థానం మినహా అన్నిసార్లూ ఎన్నికల బరిలో నారాయణ పేరు కలిగిన  వారు ఉండడం యాదృచ్చికమే. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top