వైఎస్సార్‌ సీపీకి జిల్లా కంచుకోట

YSRCP Party Leaders Meeting In PSR Nellore - Sakshi

నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి

గూడూరు: నెల్లూరు జిల్లా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోట అని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. గూడూరు రూరల్‌ మండలం మంగళపూరు గ్రామంలో ఆదివారం రాత్రి వైఎస్సార్‌సీపీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే గూడూరు నియోజకవర్గానికి గౌరవప్రదమైన స్థానం ఉందన్నారు. అలాగే గూడూరులో పార్టీకి విధేయుడైన మేరిగ మురళీధర్‌ను సమన్వయకర్తగా ఏర్పాటు చేశామన్నారు. బాబు పాలనకు చరమగీతం పాడే రోజులొచ్చాయని, అన్ని సామాజికవర్గాల ప్రజలు బాబు పాలనను వ్యతిరేకిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 పార్లమెంట్‌ స్థానాల్లో పార్టీ విజయదుంధుబి మోగిస్తుందన్నారు. దీంతో ఢీల్లీలో కూడా వైఎస్సార్‌సీపీ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. అనంతరం తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి వల్లే సాధ్యమన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా జన్మభూమి కమిటీలను తెచ్చి కలెక్టరేట్లకు కూడా విలువ లేకుండా చేశారని దుయ్యబట్టారు. పార్టీ జిల్లా ఇన్‌చార్జ్‌ సజ్జల రామక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ ఓపిక, నిబద్ధత, క్రమశిక్షణ, విశ్వసనీయత వైఎస్సార్‌సీపీ వైపు ఉన్నాయని, కానీ టీడీపీ మాత్రం అవసానదశలో కొట్టుమిట్టాడుతోందని అన్నారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం తధ్యమని, ఆ గెలుపు ఏకపక్షంగా ఉండేందుకు మీరంతా సైనికుల్లా కృషి చేయాలని కోరారు. ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి వెళ్లిన వారికి రాజకీయ భవిష్యత్‌ లేకుండా చేయాలని, ఇంకెవరైనా ఆ విధంగా పార్టీ మారాలంటే భయపడేలా తీర్పు ఇవ్వాలని అన్నారు. అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ పేరుతో గెలిచిన వ్యక్తి నట్టేటముంచి నమ్మకద్రోహం చేశారన్నారు. ఇలాంటి వారిని కచ్చితంగా ఇంటికి పంపే వరకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్‌ పాలనను.. అబద్ధాల కోరు బాబు పాలనను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారన్నారు.

వైఎస్‌ హయాంలో పేద, బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో భరోసా ఏర్పడిందని అన్నారు. ప్రజలను మోసం చేసిన వారిని విడిచిపెట్టకూడదన్నారు. అనంతరం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్‌ మాట్లాడుతూ రాష్ట్రానికి హోదా తెచ్చే నాయకుడు ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని తెలిపారు. ఇలాంటి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజలంతా కలిసేలా చేసిన ఎద్దల నరేంద్రరెడ్డి అభినందనీయులన్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దువ్వూరు బాలచంద్రారెడ్డి, గూడూరు మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ కోడూరు కల్పలత తదితరులు మాట్లాడారు. ఈ సమావేశంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు, టీడీపీ నాయకుడు, పారిశ్రామిక వేత్త కొడవలూరు ధనంజయరెడ్డి ఎంపీల సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. కార్యక్రమంలో గూడూరు రూరల్, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల పార్టీ అధ్యక్షులు మల్లు విజయకుమార్‌రెడ్డి, పరంధామరెడ్డి, సంపత్‌కుమార్‌రెడ్డి, ఉదయశేఖరరెడ్డి, శ్రీనివాసులురెడ్డి, కోడూరు మీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top