హస్తినలో హోదాగ్ని

YSRCP No confidence Motion for Special status for Andhra Pradesh - Sakshi

అవిశ్వాస తీర్మానంతో ఢిల్లీని వేడెక్కించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ

తీర్మానం నోటీసుతో ఏపీకి ప్రత్యేకహోదాపై సర్వత్రా చర్చ

వైఎస్సార్‌సీపీ పోరుకు అండగా నిలిచిన పలు పార్టీలు

తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్డీఏని వీడిన టీడీపీ

అవిశ్వాసంపై విడిగా స్పీకర్‌కు నోటీసులు

లోక్‌సభలో గందరగోళం వల్లే నోటీసులు

తీసుకోలేదన్న స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌

అవిశ్వాస తీర్మానానికి మళ్లీ వైఎస్సార్‌సీపీ నోటీసు

సోమవారంనాటి బిజినెస్‌ లిస్ట్‌లో చేర్చాలని వినతి

పార్లమెంటు ఆవరణలో వైఎస్సార్‌సీపీ ధర్నా

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా సెగ దేశ రాజధాని ఢిల్లీని తాకింది. హోదా కోసం నాలుగేళ్లుగా ఒంటరిగా పోరాడిన వైఎస్సార్‌సీపీ కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం దేశ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. అవిశ్వాస తీర్మానాన్ని మార్చి 21న పెట్టాలనుకున్నా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనూహ్యంగా దానిని ఐదు రోజులు ముందుకు జరపాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్‌సీపీ పోరుకు దేశవ్యాప్తంగా పలు పార్టీలు అండగా నిలిచాయి. అవిశ్వాసానికి నోటీసు ఇవ్వడం, మద్దతివ్వాల్సిందిగా అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాయడం, ఆయా పార్టీల నాయకులను వైఎస్సార్‌సీపీ ఎంపీలు కలుసుకుని మద్దతు కోరడం గురువారంనాడు సంచలనం సృష్టించింది. వైఎస్సార్‌సీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్, ఎన్సీపీ, సమాజ్‌వాదీ, ఎంఐఎం తదితర పార్టీలు మద్దతుగా ముందుకొచ్చాయి. కాగా గురువారం నుంచి చోటుచేసుకుంటున్న పరిణామాలు తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టించాయి. అది దిగిరాక తప్పని స్థితి కల్పించాయి. గత్యంతరం లేక అధికార ఎన్డీఏ కూటమి నుంచి వైదొలుగుతున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. 

గురువారం నాడు వైఎస్సార్‌ సీపీఅవిశ్వాసానికి మద్దతిస్తామని ప్రకటించినా శుక్రవారం నాటికి మాటమార్చి తామే సొంతంగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్టు ప్రకటించింది. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు వీలుగా శుక్రవారం నాటి బిజినెస్‌లో తీర్మానాన్ని చేర్చాలని ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత తోట నరసింహం ఉదయం నోటీసులు ఇచ్చారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ సభ్యుడు తోట నరసింహం ఇచ్చిన నోటీసులు అందాయని చెప్పిన లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌.. సభ సజావుగా లేనందున తీర్మానాన్ని తీసుకోవడం లేదని ప్రకటించారు. అవిశ్వాసానికి అనుకూలంగా ఇప్పటికే పలు పార్టీల మద్దతును వైఎస్సార్‌సీపీ కూడగట్టడంతో సభలో విపక్షాలన్నీ బాసటగా నిలిచాయి. దాదాపు 100 మంది సభ్యులు నిలుచున్నప్పటికీ గందరగోళ పరిస్థితుల్లో లెక్కించలేనని సభాపతి ప్రకటించారు. కాగా, అవిశ్వాస తీర్మానానికి గురువారం వైఎస్సార్‌ సీపీ నోటీసు ఇచ్చినప్పటి నుంచి జాతీయ మీడియాలో కూడా ఈ అంశంపై చర్చ మొదలైంది. శుక్రవారం రోజంతా జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేశాయి. వివిధ జాతీయ పార్టీల నేతలతో చర్చా కార్యక్రమాలు నిర్వహించాయి. గడిచిన నాలుగేళ్లుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న పోరాటం తీరును ప్రధానంగా ప్రస్తావించాయి. 

మళ్లీ నోటీసులు ఇచ్చిన వైఎస్సార్సీపీ
సభ సజావుగా లేకపోవడంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సభ్యుల బలాన్ని లెక్కించలేకపోతున్నానని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రకటించడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం మధ్యాహ్నం మరో నోటీసును లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ స్నేహలతా శ్రీవాస్తవకు అందజేశారు. ‘‘లోక్‌సభ కార్యకలాపాల నియమావళిలోని చాప్టర్‌ 17లోని 198(బి) నిబంధన కింద నేను ఈ కింది తీర్మానాన్ని 19 మార్చి 2018న ప్రవేశపెట్టేందుకు నోటీసు ఇస్తున్నాను. ఈ తీర్మానాన్ని 19 మార్చి 2018 నాటి సభా కార్యకలాపాల జాబితాలో చేర్చాలని అభ్యర్థిస్తున్నాను. తీర్మానం: ‘మంత్రి మండలిపై ఈ సభ అవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తోంది’ అని నోటీసులో పేర్కొన్నారు. ఇదే రీతిలో టీడీపీ ఎంపీ తోట నరసింహం కూడా నోటీసును అందజేశారు. సోమవారం నాటి జాబితాలో చేర్చాలని కోరారు.

ఉద్యమవాణిని వినిపించిన వైఎస్సార్‌సీపీ
ప్రత్యేక హోదా ఉద్యమ గళాలను దేశవ్యాప్తంగా వినిపించడంలో, వివిధ పార్టీల మద్దతు కూడగట్టడానికి వైఎస్సార్‌ సీపీ ఎంపీలు నిరంతరం కృషి చేశారు. అన్ని పార్టీలతో చర్చించి సమయానికి మద్దతు కూడగట్టగలిగారు. పార్టీ గుర్తుపై గెలిచిన నలుగురు ఎంపీలు పార్టీ నుంచి ఫిరాయించినా.. మిగిలిన ఐదుగురు సభ్యులు ఉద్యమవాణిని పార్లమెంటులో గట్టిగా వినిపించారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలుకానిపక్షంలో ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా అన్ని పార్టీలకు లేఖ రాశారు. 

మాపై ప్రజలకు నమ్మకం ఉంది
శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘చంద్రబాబుకు విశ్వసనీయత లేదు. మేం లాలూచీ పడ్డామని అంటారు. ఆయన 16 కేసుల్లో స్టే తెచ్చుకున్నారు. ఇక్కడ ఎవ్వరికీ రాజకీయ పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదు. అవిశ్వాసానికి మేం అన్ని పార్టీల నుంచి మద్దతు కోరాం. వామపక్షాలు ఇప్పటికే మద్దతు తెలిపాయి. వారికి ధన్యవాదాలు చెబుతున్నాం. ఏపీకి అన్యాయం జరిగిందని భావించినవారు మాకు మద్దతు తెలుపుతారని ఆశిస్తున్నాం ’ అని పేర్కొన్నారు. 

వైఎస్సార్‌ సీపీపై నమ్మకం లేకే తాము అవిశ్వాస తీర్మానం పెడుతున్నామంటూ టీడీపీ చేసిన ప్రకటనపై ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. నమ్మకం ఉండాల్సింది టీడీపీ వాళ్లకు కాదని, ప్రజలకు ఉండాలని చెప్పారు. చిత్తశుద్ధితో నాలుగేళ్లుగా పోరాడుతున్నది ఎవరో ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలు తమను నమ్ముతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని, అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని గురువారం నాడు టీడీపీని అభ్యర్థించామని, అప్పుడు మద్దతిస్తామని చెప్పారని, శుక్రవారం నాడు మాట మార్చి వాళ్లే అవిశ్వాసం పెడతామన్నారని చెప్పారు. అసలు మంత్రులు రాజీనామా చేసినప్పుడే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి అవిశ్వాసం పెట్టి ఉండవచ్చు కదా అని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమితో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని భావించి, రాష్ట్రంలో టీడీపీపై ఉన్న ప్రజావ్యతిరేకతను బీజేపీ వైపు నెట్టే కార్యక్రమంలో భాగంగా ఈ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఇంతచేసినా కేంద్రం దిగిరాకపోతే పార్లమెంటు సమావేశాల చివరి రోజు రాజీనామా చేస్తామని పునరుద్ఘాటించారు. ఎంపీ వరప్రసాదరావు మాట్లాడుతూ.. గడిచిన నాలుగేళ్లుగా తాము చేసిన పోరాటాలతో ప్రజల్లో చైతన్యం పెరిగిందని, అది గ్రహించి ఇప్పుడు ప్రజాగ్రహాన్ని తప్పించుకునేందుకు చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని విమర్శించారు. 

ప్యాకేజీకి టీడీపీ ఎందుకు అంగీకరించినట్లో..: బీజేపీ
ఎన్డీఏ నుంచి తాము వైదొలుగుతున్నట్టు టీడీపీ ప్రకటించగానే బీజేపీ ఆ పార్టీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. 2016లో ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి ఇప్పుడు టీడీపీ యూటర్న్‌ తీసుకుందని ఆపార్టీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు విమర్శించారు. ఎన్నికల్లో లబ్ధి కోసం నాటకాలు ఆడుతోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత ఖర్గే మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తాము మొదటి నుంచీ చెబుతున్నామని, తమ నాయకురాలు సోనియాగాంధీ ఈమేరకు ప్రధానికి లేఖ రాశారని చెప్పారు. సభ పూర్తిగా సజావుగా లేని సందర్భంలో ఆర్థిక బిల్లును ఆమోదించుకున్న ప్రభుత్వం.. కేవలం రెండు పార్టీలు వెల్‌లో ఉన్నప్పుడు సభ సజావుగా లేదంటూ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనలేకపోయిందని కాంగ్రెస్‌ ఎంపీలు వీరప్పమొయిలీ, శశిథరూర్‌ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ‘ప్రభుత్వం ఎందుకు భయపడిందో అర్థం కావడం లేదు. సంఖ్యాబలం ఉన్నా అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనలేకపోయింది. ప్రత్యేక హోదా అంశాన్ని చర్చకు కూడా రానివ్వడానికి భయపడింది’ అని వారు వ్యాఖ్యానించారు.  ప్రత్యేక హోదా డిమాండ్‌కు మద్దతుగా, అవిశ్వాస తీర్మానాన్ని బలపరుస్తూ పలు పార్టీల నేతలు సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top