తప్పు చేశావు కాబట్టే భయపడుతున్నావ్‌

YSRCP MPs challenge to the CM Chandrababu - Sakshi

     నిజాయతీపరుడివైతే విచారణ జరిపించుకో.. 

     సీఎం చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ ఎంపీల సవాల్‌ 

     విచారణ భయంతో మళ్లీ ఎన్డీయే వైపు బాబు మొగ్గు: మేకపాటి

     బాబుపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తాం: విజయసాయిరెడ్డి 

సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో భారీగా అవినీతికి పాల్పడి తప్పు చేశారు కాబట్టే భయపడుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి పట్టిసీమ ఎత్తిపోతల వరకూ రూ.వందల కోట్ల అవినీతికి పాల్పడినట్టు బీజేపీ నేతలు సైతం చెబుతుండ టంతో కేంద్రం నుంచి ప్రమాదం పొంచి ఉందని మళ్లీ ఎన్డీయేకు దగ్గరయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్లు వస్తుండటంతో ఆయనలో భయం పట్టుకుందని, ఇది ఆయన హావభావాలను చూస్తే స్పష్టంగా అర్థమవుతోందని చెప్పారు. విచారణ భయంతోనే మళ్లీ ఎన్డీయేకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో టీడీపీ ఎంపీ సుజనా చౌదరి మంతనాలు జరిపారని చెప్పారు. శుక్రవారం లోక్‌సభ వాయిదా పడిన అనంతరం వైఎస్సార్‌సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, వరప్రసాదరావు మీడియాతో మాట్లాడారు. 

విచారణకు సిద్ధపడొచ్చు కదా? 
రాష్ట్రాన్ని అవినీతిమయం చేసి భ్రష్టుపట్టించి, నీతి మాటలు మాట్లాడుతూ గొప్పలు చెప్పుకోవడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమని మేకపాటి ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎలాంటి తప్పు చేయకపోతే కేంద్రానికి సవాల్‌ విసిరి విచారణకు సిద్ధపడొచ్చు కదా? అని అన్నారు. చంద్రబాబు నిజాయతీపరుడైతే విచారణ జరిపించుకోవాలన్నారు. కేంద్రంపై తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అవిశ్వాసంపై చర్చ జరపకుండా ప్రజాస్వామ్య విలువలను కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఎంపీ వరప్రసాదరావు చెప్పారు.

సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు 
ఒక రాజ్యసభ సభ్యుడిగా తాను ప్రధానిని కలవడంపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని విజయసాయిరెడ్డి తప్పుపట్టారు. దీనిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. చంద్రబాబు అనినీతిపై విచారణ జరిపిస్తే భూమి కంపించిపోదని, ప్రజలు వచ్చి ఆయనకు అండగా నిలుస్తారని తాను అనుకోవడం లేదని చెప్పారు.  

బీజేపీతో మళ్లీ పెళ్లికి సిద్ధమైన బాబు
చంద్రబాబు అవినీతి తారస్థాయికి చేరుకోవడంతో కేంద్రం ఎక్కడ విచారణకు ఆదేశిస్తుందోనన్న భయంతో ఆయన మళ్లీ బీజేపీతో పెళ్లికి సిద్ధమయ్యారని ఎంపీ విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. సీబీఐ విచారణ భయంతో టీడీపీ ఎంపీ సుజనా చౌదరిని పంపి కేంద్ర ఆర్థిక మంత్రితో మంతనాలు జరిపించారని చెప్పారు. చంద్రబాబు యూటర్న్‌ అంకుల్‌ అని మళ్లీ వంద శాతం నిరూపించుకున్నారని పేర్కొన్నారు. తాను ఎవరికీ ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదని అసెంబ్లీ, శాసనమండలి సాక్షిగా చెప్పి చంద్రబాబు నిజం అంగీకరించారని అన్నారు. గత 9 ఏళ్ల పాలనలో, ఇప్పుడు 4 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదన్న నిజాన్ని చంద్రబాబు తనంతట తానే అంగీకరించారని విజయసాయిరెడ్డి చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top