‘పాపం! బాబు పరిస్థితి పగవాడికి కూడా రావొద్దు’

YSRCP MP Vijayasai Reddy Satires On Chandrababu Over Election Campaign - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పూర్తి నిస్పృహలో పడి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. గురువారం ట్విటర్‌ వేదికగా చంద్రబాబు, లోకేశ్‌లపై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘పాపం! చంద్రబాబు పరిస్థితి పగవాడికి కూడా రావొద్దు. పూర్తి నిస్పృహలో పడి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావటం లేదు. తన అభ్యర్థులనే ఊసరవెల్లులని, మోసకారులని తిడుతున్నారు. ఎమ్మెల్యేలకు దోచిపెట్టినట్టు తనే ఒప్పుకుంటున్నారు. అయినా గురువులాగే శిష్యులు తయారవుతారు కదా?’అంటూ ట్వీట్‌ చేశారు.

మరొక ట్వీట్‌లో ‘ఐదేళ్లు కష్టపడి చదువుకున్నాడట చంద్రబాబు. పాస్‌ చేయండని ప్రజలను వేడుకుంటున్నారు. లోకేశ్‌ను ఇలాగే ప్రతీ పరీక్షలో తను పాస్‌ చేయించాడు. చివరికి అమెరికాలో ఫీజు కూడా ఎవరితోనో కట్టించారు. చంద్రబాబు, పరీక్షలు ఇలాగే ఉంటాయి’అంటూ చంద్రబాబు, లోకేశ్‌లకు చురకులు అంటించారు. ‘వేల కోట్ల డబ్బు వెదజల్లి, కుల మీడియా మద్దతుతో గెలవొచ్చని ఆశపడిన చంద్రబాబు ఇప్పుడు గతుక్కుమంటున్నాడు. మనిషికి 2 వేలు ఇస్తామన్నా ఆయన మీటింగులకు జనాలు వెళ్లే పరిస్థితి లేదు. హాజరైన వారి నుంచి స్పందన లేవు. కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ అయింది. ఇక 20 రోజులే చంద్రబాబూ!’అంటూ విజయసాయి రెడ్డి మరొక ట్వీట్‌లో పేర్కొన్నారు.  

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో చంద్రబాబు దుర్మార్గపు ఆరోపణలు చేస్తూ పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నారని విజయసాయి రెడ్డి విమర్శించారు. సిట్‌ బృందంలో తన మనుషులనే నియమించడంతో ఆయన డైరెక్షన్‌ మేరకే దర్యాప్తు సాగిస్తున్నారని మండిపడ్డారు. ఎలక్షన్‌ కోడ్‌ వచ్చినా పోలీసులను రాజకీయ అవసరాలకు బాబు వాడుకుంటున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top