‘చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు సిద్ధమా’

YSRCP MLAs Question To CM Chandrababu Ready To Pre Elections - Sakshi

వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి సవాల్‌

సాక్షి, హైదరాబాద్ ‌: తెలంగాణ మాదిరి ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తూ ఎన్నికలకు సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధమా అంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్యెల్యే ఆదిమూలపు సురేశ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీకి ఓ సిద్దాంతం అంటూ లేకుండా చేశారని విమర్శించారు. 1996లో సీపీఐ, సీపీఎంలతో 1999, 2004లో బీజేపీతో, 2009లో మహాకూటమి పేరుతో సీపీఐ, సీపీఎం, టీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేశారని, 2014లో మళ్లీ బీజేపీతో జతకట్టారని గుర్తు చేశారు. స్వలాభం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారని మండిపడ్డారు. 

2009లో తన పరిపాలనపై నమ్మకంతో దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి గెలుపు సాధించారన్నారు. చంద్రబాబుకు తన పరిపాలనపై నమ్మకం ఉంటే ముందస్తు ఎన్నికలకు సిద్దమా అని ప్రశ్నించారు. తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేసిన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు సిద్దమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిసిటీ కోసం పుష్కరాల్లో 30 మందిని పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడు చంద్రబాబని ధ్వజమెత్తారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదని వాళ్లే చెప్పారని, మహిళల గొంతు కోసి ఇప్పుడు అనైతిక పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో టీడీపీ అవినీతికి పాల్పడిందని, అసెంబ్లీలో లేకపోయినా ప్రజల్లో ఉండి పోరాడుతున్నామన్నారు. కాంగ్రెస్‌, బీజీపీతో పొత్తులు పెట్టుకోమని శ్రీకాంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

అనర్హత వేటు వేసే దమ్ముందా: ఆదిమూలపు సురేశ్‌
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే దమ్ముందా అని ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్‌ ప్రశ్నించారు. ఫిరాయింపుదారులకు మంత్రి పదువులు ఇచ్చినందుకు నిరసనగా సభకు వెళ్లడం లేదన్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడే పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకిస్తున్నారని, మీ కోసం వస్తున్నా అంటూ పాదయాత్ర చేసిన్న చంద్రబాబు అలవెన్సులు తీసుకోలేదా అని ప్రశ్నించారు. ధ్వంద వైఖరి అవలంభించడం ఎంత వరకు కరెక్ట్‌ అని, పార్టీ ఫిరాయించిన 22 మంది ఎందుకు అనర్హత వేటు వేయడం లేదని నిలదీశారు. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేసి, మంత్రులను బర్త్‌రఫ్‌ చేసిన ఉదయమే అసెంబ్లీకి వస్తామన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top