చంద్రబాబు కనుసన్నల్లోనే సీఎం రమేష్‌ దీక్ష

YSRCP Leaders Slams Chandrababu Naidu Over Kadapa Steel Plant - Sakshi

ఓట్ల కోసమే టీడీపీ దొంగ దీక్షలు

చంద్రబాబు కనుసన్నల్లోనే సీఎం రమేష్‌ దీక్ష

కడపలో స్టీల్‌ ప్లాంట్‌ బాబుకు ఇష్టం లేదు

వైఎస్సార్‌సీపీ నేతలు

సాక్షి, కడప : విభజన హామీల అమలుకై ప్రతిపక్ష నేతలు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పోరాటం ఉదృతం చేశారు. కడప ఉక్కు పరిశ్రమ, ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్‌ కోసం జిల్లా వ్యాప్తంగా దీక్షలు, నిరసనలు చేపట్టారు. ఉక్కు మహా ధర్నాలు, బంద్‌లు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలోనే గురువారం కూడా తమ పోరాటాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రతిపక్ష పార్టీ నేతలు  ప్రభుత్వం, తెలుగుదేశం నాయకుల మీద విమర్శలు ఎక్కుపెట్టారు.

ఓట్ల కోసమే దొంగ దీక్షలు : ఓట్ల కోసమే జిల్లా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌, టీడీపీ నాయకులు దొంగ దీక్షలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షుడు సురేష్‌ బాబు విమర్శించారు. పార్లమెంట్‌లో ఏరోజు ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడని సీఎం రమేష్‌ దీక్ష చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 10 రోజులుగా దీక్ష చేస్తున్నా ఎంపీ చలాకీగా ఉండటం వెనుక రహస్యాన్ని వెల్లడించాలని, ఆయన ఆరోగ్యంపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేయాలని  డిమాండ్‌ చేశారు. అధికారుల మద్దతుతో దీక్షలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. తమ పార్టీ నేతలు విభజన హామీల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారని, ఎంపీలు పలుసార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని, ఆమరణ దీక్షకు పూనుకున్న విషయాన్ని గుర్తుచేశారు. తుదకు ప్రత్యేక హోదా కోసం తమ పదవులకు రాజీనామా చేశారని చెప్పారు.  

చంద్రబాబు కనుసన్నల్లో సీఎం రమేష్ : చంద్రబాబు కనుసన్నల్లోనే దీక్ష జరుగుతోందని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరిపోయిందని విమర్శించారు. టీడీపీ దీక్షకు అధికారులను, ఉద్యోగులను తరలించడం ఏంటని ప్రశ్నించారు. తెలుగుదేశం నేతలు చేస్తోంది నిరాహార దీక్ష కాదని నయవంచన దీక్ష అంటూ ఎద్దేవా చేశారు. సాధారణ ప్రజలు 10 రోజుల పాటు దీక్షచేయలేరని, అలాంటిది బీపీ, షుగర్‌ ఉన్న సీఎం రమేష్‌ ఎలా చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. సీఎం రమేష్‌ తాగే వాటర్‌ బాటిల్‌ ఖరీదు మూడు వేల రూపాయలు ఉంటుందని ఆరోపించారు. శుక్రవారం ఉక్కు పరిశ్రమ కోసం అఖిల పక్షం ఆధ్వర్యంలో జిల్లా బంద్‌ చేపట్టామని, అందరూ స్వచ్చందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

కడప స్టీల్ ప్లాంట్ బాబుకు ఇష్టం లేదు : జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం సీఎం చంద్రబాబు నాయుడుకు ఏమాత్రం ఇష్టం లేదని కడప ఎమ్మెల్యే అంజాద్‌ బాషా ఆరోపించారు. కడప నగరంలో తెలుగుదేశం పార్టీ హైడ్రామా ఆడిస్తోందని మండిపడ్డారు. సీఎం రమేష్‌ కార్పొరేట్‌ దీక్ష చేస్తున్నారని విమర్శించారు. నాలుగేళ్లుగా సీఎం రమేష్‌, చంద్రబాబు రాయలసీమ ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నాలుగేళ్లుగా అఖిలపక్షంతో కలసి ఉద్యమాలు చేస్తుంటే.. ప్రభుత్వం అడ్డుకుందని మండిపడ్డారు. రాష్ట్రానికి మోదీ చేసిన మోసంలో టీడీపీ, చంద్రబాబులకు కూడా భాగం ఉందని అన్నారు. తాము సమైఖ్య ఉద్యమంలో ఏడవరోజే అలసిపోయామని, కానీ సీఎం రమష్‌ మాత్రం ఎలా ఉన్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీక్ష చేస్తున్న నాయకులను పరామర్శించడానికి సీఎం ఏ రోజు వస్తారో ముందే చెబుతున్నారని, వారి దీక్షలను ఎలా నమ్మాలంటూ నిలదీశారు. ఉక్కు కోసం తాము రాజీనామాలకు సిద్ధమని.. టీడీపీ సిద్ధమా ప్రశ్నించారు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top