గోతికాడ గుంటనక్క చంద్రబాబు

ysrcp leaders fires on cm chandrababu - Sakshi

వైఎస్సార్‌పై చేసిన విధంగానే వైఎస్‌ జగన్‌పైనా దాడి చేస్తున్నారు

నాడు సోనియా.. నేడు మోదీ వద్ద సాగిలపడ్డాడు

2014లో మూడు పార్టీలు కలిసి పోటీచేస్తే... జగన్‌ ఒంటరి పోరాటం చేశాడు

క్రమశిక్షణ.. చిత్తశుద్ధితో పనిచేసే వారికి పార్టీలో సముచిత స్థానం

చిత్తూరు జిల్లా రాజకీయ శిక్షణా తరగతుల్లో వైఎస్సార్‌సీపీ నేతలు

సాక్షి, తిరుపతి : సీఎం చంద్రబాబునాయుడు గోతికాడ గుంటనక్క లాంటి వాడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు విమర్శించారు. కుట్ర రాజకీయాలతో నాడు మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై దాడి చేసిన విధంగానే నేడు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పైనా టీడీపీ నేతలు, ఎల్లో మీడియా వాళ్లు దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. తిరుపతి పీఎల్‌ఆర్‌ కన్వెన్షన్‌లో ఆదివారం చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీïపీ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా రీజనల్‌ కో–ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, తమ్మినేని సీతారాం, చిత్తూరు, కుప్పం, తంబళ్లపల్లి, పలమనేరు నియోజకవర్గాల సమన్వయకర్తలు జంగాలపల్లి శ్రీనివాసులు, చంద్రమౌళి, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తదితరులు ప్రసంగించారు.

విజయసాయిరెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణ, చిత్తశుద్ధితో పనిచేసిన వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని స్పష్టం చేశారు. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి క్రమశిక్షణకు మారుపేరని, ఆయన ఆశయ సాధన కోసం ఏర్పడిన పార్టీ వైఎస్సార్‌సీపీ అన్నారు. జలయజ్ఞం పేరుతో అనేక ప్రాజెక్ట్‌లు పూర్తిచేసి వ్యవసాయాన్ని పండుగచేసిన సీఎంగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయారని కీర్తించారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిందన్నారు. దాని స్ఫూర్తితోనే కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్‌భవ పథకాన్ని రూపొందిస్తోందన్నారు.

నాడు సోనియా... నేడు మోదీ వద్ద చంద్రబాబు సాగిలపడ్డారు..
ఓదార్పుయాత్రలో వైఎస్‌ జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక తనకు ప్రత్యర్థి జగనే అని భావించిన చంద్రబాబు నాడు సోనియా వద్ద సాగిలపడి అక్రమ కేసులు బనాయించారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. నేడు పొత్తు పేరుతో ప్రధానమంత్రి నరేంద్ర మోది పంచన చేరాడన్నారు. నాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై జరిగిన విధంగానే నేడు ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌పై కూడా దాడి జరుగుతోందని వివరించారు. అప్పట్లో మహానేత మరణాన్ని జీర్ణించుకోలేక 675 మంది గుండెలు ఆగిపోయాయన్నారు. అదే చంద్రబాబుపై బాంబు దాడి జరిగితే కనీసం అలిపిరిలోని టీ దుకాణమూ మూతపడలేదని ఎద్దేవా చేశారు.  

మనం ఓడిపోలేదు..
2014లో వైఎస్సార్‌సీపీ ఓడిపోయిందన్న టీడీపీ ఆరోపణల్లో వాస్తవం లేదని కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. మొదటిసారిగా రెండు స్థానాల్లో విజయం సాధిస్తే రెండోసారి ఉప ఎన్నికల్లో 16 స్థానాలు కైవసం చేసుకున్నట్లు గుర్తు చేశారు. మూడవ పర్యాయం జరిగిన సాధారణ ఎన్నికల్లో ఏకంగా 67 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించినట్లు ఉమ్మారెడ్డి వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో 167 స్థానాల్లో విజయం సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. అంతకుముందు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ నేతలు ఓట్లను తొలగించి దొంగఓట్లు చేర్చుకుంటోందని ఆరోపించారు. అధికార మదంతో డబ్బుసంపాదనే ప్రధాన అజెండాగా టీడీపీ పనిచేస్తోందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఇంకా మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ రెడ్డమ్మ, రాకేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top