చంద్రబాబు అనుభవం..అవినీతికి అంకితం

YSRCP Leaders Fires On Chandrababu In Praja Sankalpa Yatra - Sakshi

గణపవరం సభలో ధ్వజమెత్తిన వైఎస్సార్‌ సీపీ నేతలు

పశ్చిమగోదావరి ,గణపవరం:  ఈ రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన చంద్రబాబు అభివృద్ధి చేస్తారని నమ్మి ప్రజలు ఆయనను గెలిపిస్తే, తన అనుభవాన్ని అభివృద్ధిలో కాకుండా అవినీతిని పెంచి పోషించడంలో ఉపయోగించారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దుయ్యబట్టారు. బుధవారం సాయంత్రం గణపవరం పట్టణంలో జరిగిన భారీ బహిరంగ సభకు హాజరైన అశేష జన సందోహాన్ని ఉద్దేశించి పార్టీ నాయకులు ప్రసంగించారు.

అమరావతిని..భ్రమరావతిగా మార్చారు : కోటగిరి
ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్‌ కోటగిరి శ్రీధర్‌ మాట్లాడుతూ 2014 ఎన్నికలలో విభజనకు గురైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అనుభవం ఉన్న చంద్రబాబు మేలు చేస్తారన్న ఒకే ఒక కారణంతో ఆయనను ముఖ్యమంత్రిని చేస్తే ప్రజలను దారుణంగా మోసగించారని ఆరోపించారు. ఇలాంటి మోసకారి నాయకుడిని ఏ రాష్ట్రంలోనూ చూడమని విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని నాలుగేళ్లుగా చెబుతూనే ఉన్నారని కాని ఒక్క ఇటుక కూడా నేటికీ పడలేదని శ్రీధర్‌ విమర్శించారు. రాజధాని పేరుతో ప్రజలకు నాలుగేళ్లుగా సినిమా చూపిస్తున్నారని దుయ్యబట్టారు. రాజధానిని టోక్యో, సింగపూర్, మలేషియా, షాంగై లా చేస్తానంటూ రోజుకో మాట చెప్పే చంద్రబాబు చివరికి అమరావతిని భ్రమరావతిగా మార్చేశారని ఎద్దేవా చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ప్రజలలో భరోసా నింపిందని, అందుకే ఆయన సభలకు, పాదయాత్రకు జనం ప్రభంజనంలా వెల్లువెత్తుతున్నారని అన్నారు.

రాష్ట్రంలో దొంగల పాలన: కారుమూరివైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో దొంగల ముఠాపాలన సాగుతోందని, ఇసుక, మట్టి, చివరికి బూడిద కూడా మిగల్చకుండా దోచేస్తున్నారని అన్నారు. ఈ ఆలీబాబాలను ఇంటికి సాగనంపక పోతే ప్రజల ఇళ్లలో పడి వారి సంపాదన కూడా దోచుకుంటారని విమర్శించారు.

పూలవాన కురిపించిన ప్రజలు
తొలుత బుధవారం సాయంత్రం 4 గంటలకు గణవపరం శివారున ఉన్న కేవీపీ ఫంక్షన్‌ హాలు వద్ద నుంచి వేలాది మందితో కలసి పాదయాత్రగా గణపవరం వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, పుప్పాల వాసుబాబు తదితర నేతలకు గణపవరం ప్రజలు ఘనస్వాగతం పలికారు. రోడ్డు వెంబడి పూలు చల్లుతూ జగన్‌మోహన్‌రెడ్డికి పూలబాట వేశారు. గణపవరం పట్టణంలో రోడ్లకు ఇరువైపులా ఉన్న భవనాలపైనుంచి జగన్‌పైకి పూలవాన కురిపించారు. నాలుగు మండలాల కన్వీనర్లు దండు రాము, సంకు సత్యకుమార్, మరడ వెంకట మంగారావు, రావిపాటి సత్య శ్రీనివాస్,  స్థానిక పార్టీ నేతలు, నియోజకవర్గం నుంచి వచ్చిన పలువురు నాయకులు జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పర్యటనలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పి.మి«థున్‌రెడ్డి, వరప్రసాద్, పార్టీ జిల్లా కన్వీనర్‌ ఆళ్లనాని, మాజీ ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, గంటా మురళి, పాతపాటి సర్రాజు, పార్టీ జిల్లా నాయకుడు గాదిరాజు సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.   

గోదావరి జిల్లాలనుఎడారి చేశారు : పుప్పాల
పశ్చిమగోదావరి : సభలో వైఎస్సార్‌ సీపీ ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ తన సుదీర్ఘ అనుభవాన్ని ఉపయోగించి చంద్రబాబు రాష్ట్రాన్ని అవినీతిలో దేశంలోనే ప్రథమస్థానంలో నిలిపారని విమర్శించారు. పోలవరం ప్రాజక్టు పేరు చెప్పి వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. పట్టిసీమ పేరుతో భారీ స్కాంతో పాటు, గోదావరి జిల్లాలను ఎడారిగా తయారు చేశారని, రెండో పంటకు నీటికోసం రైతులు ఎంతగా అల్లాడిపోయారో మనమంతా చూశామని అన్నారు. ప్రత్యేక హోదా అవసరం లేదని, ప్యాకేజి ప్రకటించడానికి కారణమైన వెంకయ్య నాయుడు, అరుణ్‌జైట్లీలను సన్మానించిన ముఖ్యమంత్రి ఇప్పు డు సిగ్గుఎగ్గు లేకుండా ప్రత్యేకహోదా రాగం అందుకున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదాకోసం నాలుగేళ్లుగా రాజీలేని పోరాటం చేస్తోన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వల్లనే హోదా సాధ్యమని ప్రజలంతా నమ్ముతున్నారని అన్నారు. నవరత్నాలు పేదల జీవితాలలో వెలుగులు నింపుతాయని, వచ్చే ఎన్నికలలో చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ప్రజల హర్షధ్వానాల మధ్య పుప్పాల వాసుబాబు ధీమా వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top