చంద్రబాబే ప్రధాన కుట్రదారు

YSRCP leaders fires on Chandrababu about Murder Attempt on YS Jagan - Sakshi

ప్రజాదరణను చూసి ఓర్వలేక జగన్‌ను అంతం చేయాలనుకున్నారు.. వైఎస్సార్‌సీపీ నేతల మండిపాటు 

రిమాండ్‌ రిపోర్టుపై ఏం సమాధానం చెబుతావు? 

టీడీపీ–బీజేపీ కలిసున్నప్పుడే శివాజీ ఆపరేషన్‌ గరుడ గురించి చెప్పాడు.. అప్పుడే దానిపై ఎందుకు విచారణ చేయలేదు బాబూ?

జగన్‌కు భద్రత పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాం.. 

హత్యాయత్నం ఘటనపై రాష్ట్రపతికి ఫిర్యాదు

నేడు కేంద్ర హోంమంత్రిని కలవనున్న వైఎస్సార్‌సీపీ నేతలు 

సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రధాన కుట్రదారుడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆరోపించారు. జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ఆయనను ఎలాగైనా అంతం చేసేందుకు చంద్రబాబు పథక రచన సాగించారని మండిపడ్డారు. జగన్‌పై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమేనని రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు స్పష్టం చేశారని చెప్పారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఒక చిన్న ఘటన అంటూ ఇన్ని రోజులూ ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించిన చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని వారు ప్రశ్నించారు.

జగన్‌ హత్యకు పన్నిన కుట్ర భగ్నం కావడంతో రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు ఢిల్లీకి వచ్చి ప్రెస్‌మీట్‌ పెట్టి హడావుడి చేశారని ధ్వజమెత్తారు. జగన్‌పై హత్యాయత్నం జరిగితే కనీసం ఖండించాల్సింది పోయి దుష్ప్రచారం చేయడానికి యత్నించిన చంద్రబాబు మానవత్వం లేని మనిషినని నిరూపించుకున్నారని దుయ్యబట్టారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎంపీ కేసీనేని నాని అనుచిత వ్యాఖ్యలు చేయడం వెనుక చంద్రబాబు ప్రోద్బలం లేదా? అని ప్రశ్నించారు. టీడీపీ–బీజేపీ కలసి ఉన్నప్పుడే సినీ నటుడు శివాజీ ఆపరేషన్‌ గరుడ గురించి చెప్పినప్పుడు చంద్రబాబు దానిపై ఎందుకు విచారణ జరిపించలేదని నిలదీశారు. ఆదివారం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీలు, పార్టీ సీనియర్‌ నేతలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం..
జగన్‌పై హత్యాయత్నం జరిగిన తరువాత చంద్రబాబు, డీజీపీ, టీడీపీ నేతలు మాట్లాడిన తీరును పరిశీలిస్తే.. ఈ కుట్ర వెనుక చంద్రబాబే ప్రధాన కుట్రదారుడు అనే అనుమానాలకు బలం చేకూర్చినట్లయిందని వైఎస్సార్‌సీపీ నేతలు అన్నారు. అసలు దోషులు బయటపడాలంటే కేంద్ర ప్రభుత్వం ఒక థర్డ్‌ పార్టీతో విచారణ జరిపించి, నిజాలను నిగ్గు తేల్చాలన్నారు. ఇదే డిమాండ్‌తో సోమవారం ఉదయం 8.45 గంటలకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలవబోతున్నామని తెలిపారు.  జగన్‌మోహన్‌రెడ్డికి భద్రత పెంచాలని కోరుతామన్నారు. రాష్ట్రపతిని కూడా కలసి జగన్‌పై హత్యాయత్నం ఘటనపై ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.

జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపించాలని, ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుదె నాగరాజు, కూకట్ల వీరబ్రహ్మం ఢిల్లీలో చేపట్టిన నిరసన దీక్షకు వైఎస్సార్‌సీపీ నేతలు సంఘీభావం తెలిపారు. కుట్రలపై తాము పోరాడుతామని అన్నారు. వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.  

చంద్రబాబు ప్రోద్బలంతోనే కుట్ర: వైవీ సుబ్బారెడ్డి  
‘‘వైఎస్‌ జగన్‌పై జరిపిన హత్య కుట్ర భగ్నమవ్వడంతో ఇది ఎక్కడ మెడకు చుట్టకుంటుందో అన్న భయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు దుష్ప్రచారానికి తెరలేపారు. ఆదొక చిన్న ఘటన, విచారణ అవసరం లేదంటూ ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నించారు. విచారణ జరిపితే ఎక్కడ తన బాగోతం బయటపడుతుందో అన్న భయం చంద్రబాబులో ఉంది. జగన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు వైఎస్సార్‌సీపీ కార్యకర్త అంటూ ఫ్లెక్సీలు సృష్టించారు. నిందితుడు శ్రీనివాసరావు కుంటుంబానికి చంద్రబాబు టీడీపీ సభ్యత్వం ఇచ్చి, రెండు ఇళ్లు, రుణాలు మంజూరు చేసి ఆపరేషన్‌ గరుడ పేరుతో జగన్‌ హత్య కుట్ర పన్నారు.

నిందితుడికి ఎయిర్‌పోర్టులో టీడీపీ నేత హర్షవర్దన్‌ క్యాంటీన్‌లో ఉద్యోగంలో చేర్పించారు. చంద్రబాబు, డీజీపీల ప్రోద్బలంతోనే ఈ కుట్ర జరిగింది. ఘటన జరిగిన తరువాత వారు స్పందించిన తీరే దీనికి నిదర్శనం. ఏయిర్‌పోర్టులో సీఐఎస్‌ఎఫ్‌ భద్రతా సిబ్బంది ఉన్నా శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి. ఘటన జరిగిన తరువాత నిందితుడిని ఏపీ పోలీసులే అదుపులోకి తీసుకున్న దృశ్యాలు అన్ని ఛానళ్లలో ప్రసారం అయ్యాయి. జగన్‌పై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమే అని రిమాండ్‌ రిపోర్టులో స్పష్టం చేయడంతో కనీసం అర్ధసత్యమైనా బయటపడింది. దీనిపై చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు? ఈ కుట్ర వెనుక ఉన్న అసలు దోషులు బయటకు రావాలి. చంద్రబాబు ప్రభుత్వం జరిపించే విచారణలో అది తేలదు. కేంద్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా ఒక థర్డ్‌ పార్టీతో విచారణ జరిపించాలి. అప్పుడే నిజాలు బయటకు వస్తాయి’’ అని తాజా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. 

చంద్రబాబు మొహాన ప్రజలు ఉమ్మేస్తున్నారు: మేకపాటి 
‘‘పాదయాత్రలో వైఎస్‌ జగన్‌కు లభిస్తున్న ఆదరణను చూసి భయపడే ఆయన హత్యకు కుట్ర చేశారు. జగన్‌ను ఆంతం చేస్తే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవొచ్చని చంద్రబాబు ఇంత నీచమైన స్థాయికి దిగజారారు. ఘటన జరిగిన తరువాత డీజీపీ కూడా బాధ్యత మరిచి పబ్లిసిటీ కోసమే ఈ కుట్ర చేశారని చెప్పడం సిగ్గుచేటు. నిందితుడు వైఎస్సార్‌సీపీ కార్యకర్త అంటూ చంద్రబాబు, టీడీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారం చూసి ప్రజలు వారి మొహాన ఉమ్మేస్తున్నారు. ఈ కుట్ర వెనుక చంద్రబాబే ఏ1 నిందితుడని, డీజీపీ సహకారంతోనే కుట్ర చేశారని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఇదంతా కేంద్రం కుట్ర అంటూ చంద్రబాబు ప్రజలను నమ్మించాలని చూశారు. పరిటాల రవి హత్య కేసులో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించారు. బొత్స సత్యనారాయణపై ఆరోపణలు వస్తే అప్పుడు కూడా సీబీఐ విచారణకు ఆదేశించారు. ఇప్పుడు చంద్రబాబుకు దమ్ము ధైర్యం ఉంటే జగన్‌పై హత్యాయత్నం కుట్రపై కేంద్ర సంస్థలతో విచారణకు ఆదేశించాలి. ఆయన కుట్ర లేదని తెలిస్తే మేమందరం సెల్యూట్‌ చేస్తాం. జగన్‌పై హత్యాయత్నం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలతోనే విచారణ జరపాలి. లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయించైనా కేంద్ర సంస్థలతో విచారణ జరిగేలా చూస్తాం’’ అని తాజా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తేల్చిచెప్పారు. 

‘చిన్న ఘటన’ అనడంలో కుట్ర ఏంటి: వరప్రసాదరావు 
‘‘జగన్‌పై జరిగిన హత్యాయత్నం చాలా చిన్న ఘటన అని ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ చెప్పడం వెనుక ఉన్న కుట్ర ఏంటి? ఈ ఘటనను ఖండించాల్సింది పోయి దుష్ప్రచారానికి తెరలేపారు. చంద్రబాబు సాగిస్తున్న దుష్ప్రచారం అనేక అనుమానాలకు తావిస్తోంది. చంద్రబాబుకు ఎలాంటి దురుద్దేశాలు లేకుంటే ఘటన జరిగిన వెంటనే ఖండించేవారు. జగన్‌పై హత్యాయత్నం వెనుక ఉన్న అన్ని కుట్రలు బయటకు రావాలంటే కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపించాలి’’ అని తాజా మాజీ ఎంపీ వరప్రసాదరావు డిమాండ్‌ చేశారు.  

గరుడ పురాణంపై విచారణ జరపలేదేం: ఉమ్మారెడ్డి 
‘‘జగన్‌పై జరిగింది హత్యాయత్నమేనని రిమాండ్‌ రిపోర్టులో తేలడంపై చంద్రబాబు, డీజీపీ ఎందుకు స్పందించడం లేదు? రిమాండ్‌ రిపోర్టుపై కూడా దుష్ప్రచారం చేసేందుకు మళ్లీ వ్యూహాలు రచించుకుంటున్నారు. టీడీపీ–బీజేపీ కలసి ఉన్నప్పుడే నటుడు శివాజీ ఆపరేషన్‌ గరుడ గురించి చెప్పినప్పుడు చంద్రబాబు దానిపై ఎందుకు విచారణ జరిపించలేదు? దేని ఆధారంగా శివాజీ ఈ విషయాలు చెబుతున్నారన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విచారణ జరిపించలేదు? అప్పుడే దీనిపై ఒక కమిషన్‌ ఏర్పాటు చేసిన విచారణ జరిపించాలని కేంద్రాన్ని ఎందుకు కోరలేదు? రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదంటే శివాజీ స్క్రిప్ట్‌ వెనుక ఉన్నది చంద్రబాబా? లేక కేంద్రమా? ఈ స్క్రిప్ట్‌ వెనుక ఉన్నది చంద్రాబాబు కాబట్టే ఆయన పట్టించుకోలేదు.

అదే కేంద్ర ప్రభుత్వ ఉంటే అప్పుడే చంద్రబాబు నిలదీసేవాడు. ఏయిర్‌పోర్టులో లాంజ్‌లో సీసీ కెమెరాలు కూడా లేని చోట పక్కాగా ఈ ప్లాన్‌ చేశారు. ఏయిర్‌పోర్టు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి తమకు సంబంధం లేదంటున్న చంద్రబాబు గతంలో విశాఖలో ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్‌ జగన్‌ను ఏయిర్‌ పోర్టులోనే ఎలా నిర్భందించగలిగారు? అప్పుడు ఏయిర్‌పోర్టు భద్రతతో ఏం సంబంధం ఉందని అడ్డుకున్నారు? ఈ కుట్రలను ఎన్నో రోజులు దాచలేరు. ఏదో ఒకరోజు బయటపడక తప్పదు’’ అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.  

చంద్రబాబుకు సంస్కారం లేదు: వేమిరెడ్డి 
‘‘2014లో రుణమాఫీ హామీ ఇచ్చి ఉంటే అప్పుడే జగన్‌ సీఎం అయ్యేవారు. చంద్రబాబు ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేవారు కాదు. అమలు చేయలేని హామీలు ఇచ్చి డ్రామాలు ఆడడం జగన్‌కు చేతకాదు. అలాంటిది ఇప్పుడు జగన్‌పై దాడి జరిగితే అదంతా డ్రామా అని చంద్రబాబు అనడం సిగ్గుచేటు. ఈ రకమైన డ్రామాలు ఆడే అలవాటు ఉంటే జగన్‌ ఎప్పుడో సీఎం అయ్యేవారు. చంద్రబాబుపై దాడి జరిగితే అప్పటి ప్రతిపక్ష నేత రాజశేఖరరెడ్డి ఆయనను పరామర్శించి మౌన దీక్ష చేశారు. అలాంటిది జగన్‌పై దాడి జరిగితే కనీసం పరామర్శించాలన్న సంస్కారం, వ్యక్తిత్వం లేని మనిషి చంద్రబాబు. చంద్రబాబు లాంటి కుట్రపూరిత మనిషి ఎన్నడూ పుట్టకూడదు. జగన్‌పై జరిగిన దాడిని డ్రామాగా చంద్రబాబు చిత్రీకరించడం దురదృష్టకరం’’ అని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 

కుట్రలకు భయపడం: బొత్స  
‘‘జగన్‌పై హత్యాయత్నం వెనుక ఎవరు ఉన్నారు? ఎందుకు చేశారు అన్న విషయాలపై విచారణ జరపాల్సిందిపోయి అదొక చిన్న ఘటన అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ హేళన చేయడం సిగ్గుచేటు. ఈ కుట్రలో ఎవరు ఉన్నారన్నది రాష్ట్ర ప్రభుత్వం జరిపే విచారణలో బయటపడే అవకాశం లేదు కాబట్టే ఈరోజు మేము ఢిల్లీకి రావాల్సి వచ్చింది. ఈ కుట్రలో ఎవరెవరు ఉన్నారో తేల్చేందుకు విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాం. ఇలాంటివి ఎన్ని కుట్రలకు పాల్పడిన వైఎస్‌ జగన్, వైఎస్సార్‌సీపీ భయపడే ప్రసక్తే లేదు’’ అని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top