మీరు తాట తీస్తే.. మేము తోలు వలుస్తాం 

YSRCP Leader Konda Rajeev Gandhi Comments On Pawan Kalyan - Sakshi

పవన్‌ కల్యాణ్‌కు రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌గాంధీ హెచ్చరిక

విశాఖలో లాంగ్‌మార్చ్‌ కాదు ఈవినింగ్‌ వాక్‌ అని విమర్శ

సాక్షి, విశాఖపట్నం: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖలో చేసింది లాంగ్‌మార్చ్‌లా లేదని, ఈవినింగ్‌వాక్‌లా ఉందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర  అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌గాంధీ విమర్శించారు. మంగళవారం మద్దిలపాలెం పార్టీ నగర కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మీకు తాట తీయడం తెలిస్తే..మాకు తోలు తీయడం తెలుసంటూ పవన్‌ని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో చిత్తూరులో ఆరుగురు భవననిర్మాణ కార్మికులను అతి క్రూరంగా లారీలతో తొక్కించి చంపినప్పుడు పవన్‌కళ్యాణ్‌ ఏమయ్యారని ప్రశ్నించారు. 

రాజకీయ, వ్యక్తిగత జీవితాలకు తేడాతెలియదా? 
సోనియాగాందీ, చంద్రబాబులు కలిసి కుట్ర పూరితంగా మా నాయకుడిపై అక్రమంగా కేసులు పెడితే...దానికోసం ప్రతి శుక్రవారం కోర్టుకి వెళుతున్నారని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై, విజయసాయిరెడ్డిపై విమర్శిస్తున్న పవన్‌కళ్యాణ్‌...తన మొదటి భార్య కోసం విశాఖ కోర్టు మెట్లు ఎన్నిసార్లు ఎక్కారో గుర్తుతెచ్చుకోవాలన్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె పెళ్లికి పవన్‌ పిలిస్తే..దాన్ని కూడా సభలో చెప్పుకుంటారా.... రాజకీయాలకు వ్యక్తిగత జీవితాలకు తేడా తెలియకుండా పోయిందని విమర్శించారు. రాజకీయాల్లో ఉన్నంత మాత్రన శుభకార్యాలకు పిలవకూడదా అని ప్రశ్నించారు.  

సిగ్గుగా లేదా.. 
నిన్నటివరకు నీ అన్న చిరంజీవిని విమర్శించిన అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడుల పక్కన కూర్చొవడానికి సిగ్గుగా అనిపించలేదా అని ప్రశ్నించారు. కురసాల కన్నబాబుకి ప్రజారాజ్యంలో తాము టికెట్‌ ఇవ్వకపోతే రాజకీయ భవిష్యత్తు ఉండదని చెప్పుకునే పవన్‌కళ్యాణ్‌...ఉమ్మడి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ప్రజారాజ్యం పోటీ చేస్తే అందులో గెలిచిన 18 ఎమ్మెల్యేలలో కన్నబాబు ఉన్నట్లు మరిచిపోయారా...అని విమర్శించారు. ఆయన రాజకీయాలకు అర్హుడు కాబట్టే గెలిచాడు...జనసేన పార్టీ నుంచి రెండు చోట్ల పోటీచేసినా రాజకీయాలకు అనర్హుడవనే ప్రజలు ఓడించారని గుర్తుచేశారు.
 
చంద్రబాబు జపం మాను 
రాజకీయంలో విమర్శలు సద్విమర్శలు సర్వసాధారణమని, అలా కాదని మానాయకుడు సీఎం వైఎస్‌ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులపై వ్యక్తిగతంగా విమర్శిస్తే..అంతకంత రెట్టింపుతో విమర్శించవలసి ఉంటుందని హెచ్చరించారు.  ఇప్పటికైనా చంద్రబాబు జపం మాని ...భవన నిర్మాణ కార్మికుల క్షేమం కోసం ఆలోచిస్తే  ప్రభుత్వానికి తగిన సూచనలివ్వాలన్నారు. అంతేగానీ ఇష్టారాజ్యంగా మాట్లాడితే...తోలు తీసి డొక్క విరుస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సనపల చంద్రమౌళి, నగర, పార్లమెంట్‌ అనుబంధసంఘాల అధ్యక్షులు ప్రేమ్‌బాబు, యువశ్రీ ,రామన్నపాత్రుడు,  కాళిదాసురెడ్డి, ఎండీ షరీఫ్, రాధ భర్కత్‌అలీ, శశికళ పాల్గొన్నారు. 

ఇసుక దోపిడీ అరికట్టేందుకే కొత్త పాలసీ 
పవన్‌ మానసిక పరిస్థితి బాలేదని,  ఆయన దగ్గర డబ్బులేకపోతే తానే విశాఖ మెంటల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తానని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. భవన కార్మికులకు కేటాయించిన  రూ.1300 కోట్లలో గత ప్రభుత్వం కేవలం రూ. 400 కోట్లు మాత్రమే వాడి మిగతావి వాళ్లకిష్టమైన వాటికి ఖర్చుచేసినప్పుడు ఎందుకు అడగలేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఇసుక దోపిడీని అరికట్టడానికే సీఎం వైఎస్‌ జగన్‌ కొత్త ఇసుక పాలసీని ఏర్పాటు చేశారన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top