సోనియా గూబ గుయ్యిమనిపించాలన్న బాబుతో పొత్తా?

YSRCP Leader Buggana Rajendranath Reddy Slams AP CM Chandrababu In hyderabad - Sakshi

హైదరాబాద్‌: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌సీపీ నేత, డోన్‌ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు దేశంలోని జాతీయ పార్టీ నాయకులను కలుస్తున్నాడు.. ఏపీలో ధర్మపోరాట దీక్షలు చేస్తానని చెప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ దీక్షలకు అయ్యే ఖర్చు ప్రభుత్వ ఖజానా నుంచి దుబారా చేయడం కాదా అని బుగ్గన ప్రశ్నించారు. ధర్మ పోరాటం అని  చెబుతున్న బాబు..వైఎస్సార్‌సీపీ నాయకులను టీడీపీలోకి  ఎలా చేర్చుకున్నారని సూటిగా అడిగారు.

వైఎస్సార్‌సీపీలో గెలిచి టీడీపీలోకి చేరిన నాయకులకు మంత్రి పదవులు అధర్మంగా ఇవ్వలేదా అని ప్రశ్న లేవనెత్తారు. జన్మభూమి కమిటీలు, నీరు - చెట్టు, రోడ్ల మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి తారాస్థాయిలో ఉందని విమర్శించారు. ఇంత అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు..ధర్మపోరాట దీక్ష గురించి ఎలా మాట్లాడగలుగుతున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  ఇసుక మాఫియా, లిక్కర్‌ మాఫియా, చంద్రన్న కానుకల్లో కల్తీ సరుకులు వస్తున్నాయని, ఇలా ప్రతిదానిలో అవినీతి కనపడుతున్నా ధర్మపోరాటాలంటూ బాబు ప్రజల్ని మభ్యపెడుతున్నారని అన్నారు. శాంతి భద్రతల విషయంలో టీడీపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని దు​య్యబట్టారు.

 ప్రభుత్వ అధికారులపై టీడీపీ నాయకులు దాడులు చేస్తే చర్యలు తీసుకోరు..వైఎస్సార్‌సీపీ నాయకులు ధర్నాలు చేస్తే అరెస్ట్‌లు చేస్తారని మండిపడ్డారు. చివరికి ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌పై దాడి చేస్తే బాబు అవహేళన చేస్తూ మాట్లాడతారని ధ్వజమెత్తారు.  గత ఎన్నికల సమయంలో సోనియా గాంధీని అనకొండ అని..అల్లుడు రాబర్ట్‌ వాద్రాను పిల్ల అనకొండ అని చంద్రబాబు తీవ్రంగా విమర్శించలేదా అని ప్రశ్నించారు. సోనియాను ఇటలీ బొమ్మ, మన్మోహన్‌ సింగ్‌ను రబ్బర్‌ స్టాంప్‌ అని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు. స్వతంత్ర్యం రావాలంటే కాంగ్రెస్‌ను తరిమి కొట్టాలి..సోనియా గూబ గుయ్యిమనిపించాలని, రాహుల్‌ గాంధీ మొద్దబ్బాయి అని బాబు అన్న విషయాలను ప్రస్తావించారు.

 ఇంత దారుణంగా కాంగ్రెస్‌ను, సోనియాను, రాహుల్‌ను తిట్టిన బాబుతో కాంగ్రెస్‌ వారు పొత్తుపెట్టుకోవడం దారుణమన్నారు. బాబు లాంటి అవకాశవాదితో వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమవడం సిగ్గులేని చర్య అని వ్యాఖ్యానించారు. టీడీపీలో ఉన్న రాజకీయ, వ్యాపార నాయకులపై ఐటీ దాడులు జరిగితే బాబు ఇన్ట్సిట్యూషనల్‌ డ్యామేజ్‌ జరిగిందని బాబు గగ్గోలు పెట్టడం విచిత్రంగా ఉందన్నారు. జగన్‌పై హత్యాయత్నం జరిగితే థర్డ్‌ పార్టీతో విచారణ జరిపించడానికి టీడీపీ ఎందుకు భయపడుతుందని తీవ్రంగా విమర్శించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top