టీడీపీ దుకాణం బంద్‌

YSRCP Leader Botsa Satyanarayana Comments On TDP - Sakshi

సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీ శకం అంతమై త్వరలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమ ప్రభుత్వం ఏర్పడబోతోందని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు టీడీపీ నేతలకు టెలీకాన్ఫరెన్స్‌లో చెప్పారంట..మళ్లీ నేను అధికారంలోకి రాబోతున్నాను. మీతో పరిచయాలు ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులతో సంబంధాలు కొనసాగించండని సూచించారంట. అంటే ఆయన ఉద్దేశం ఏమిటి? ఇలా కుట్రలు, కుతంత్రాలు చేస్తే ప్రజలు చంద్రబాబును రాళ్లతో కొట్టి రాష్ట్రం నుంచి తరిమికొడతారు. మీ మాటలు బయటపెట్టమంటారా? ప్రజలంటే తమాషాగా ఉందా. ప్రజాస్వామ్యం అంటే అంత చులకనగా ఉందా?’ అని బాబుపై ధ్వజమెత్తారు.

18 రహస్య జీవోలు..
‘‘ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయ్యాక కూడా రహస్యంగా 18 జీఓలు ఇచ్చారు. ఇవన్నీ బయటకు వస్తాయి. దాంతోపాటు చంద్రబాబు చరిత్ర అంతా బయటకు వస్తుంది. జూన్‌ 8 వతేదీ వరకు తనకు సీఎంగా కొనసాగే హక్కు ఉందని చంద్రబాబు చెబుతున్నారు. అందుకు మేము కాదనడం లేదు. కాని ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో అధికారులతో సమీక్షలు చేస్తున్నారు. తాగునీటి కొరతపై సమీక్షలు చేస్తే మంచిగా భావించేవాళ్లం. కానీ చంద్రబాబు చేస్తున్న సమీక్షలు అవినీతి బిల్లుల కమీషన్‌ కోసమే.  ముఖ్యమంత్రిగా ప్రజల విశ్వాసం కోల్పోయినా కూడా పదవిలో కొనసాగుతాను అంటే అంతకంటే దిగజారుడుతనం ఉండదు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రజావిశ్వాసాన్ని కోల్పోయారు.

డేటా చోరీపై అప్పుడే అనుమానం వచ్చింది...
రాష్ట్రంలో ఉన్న ప్రజల వ్యక్తిగత డేటా మొత్తం చోరీకి గురైందని మొదట్లోనే గుర్తించాం. మేం విజయనగరంలో టీడీపీ సర్వే టీంల వద్ద ట్యాబ్‌లన్నింటినీ అప్పట్లో డీజీపీకి అప్పగించాం. దీంట్లో ఏదో నిగూఢమైన కుట్ర దాగి ఉందని చెబితే అప్పట్లో బుకాయించారు. తర్వాత అవన్నీ నిజం అని తేలింది. మా మద్దతుదారుల సమాచారం అంతా కూడా సేకరించారనే విషయం ఐటీగ్రిడ్స్‌ ద్వారా బయటపడింది. ఏడాదిగా నా ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారు. ఇంత అభద్రతతో రాష్ట్ర ప్రజలు, నేతలు బతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.’ అన్నారు.

పోలీసు వ్యవస్థను నాశనం చేశారు
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పటిష్టమైంది. అయితే చంద్రబాబు దానిని నాశనం చేశారు. వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఎన్నికల కమిషన్‌ పని చేసిందనే ఆరోపణల్లో నిజం లేదు. నిజంగానే తమకు సహకరించి ఉంటే మొదట డీజీపీని బదిలీ చేయాలి కదా. చంద్రబాబు చాలా కేసుల్లో కోర్టు స్టే తెచ్చుకొని సీఎంగా కొనసాగుతున్నారు. ఈవీఎంలను చంద్రబాబు తప్పుపడుతున్నారు. అదేమంటే బీజేపీతో కలిసి ఈసీ  కుట్ర చేస్తోందంటున్నారు. అలాంటప్పుడు... 2014లో ఎన్డీయేతో కలిసే టీడీపీ ఎన్నికలకు వెళ్లింది. అప్పుడు టీడీపీ అదే విధంగా గెలిచిందా? జగన్‌ను ఒంటరిని చేసి కుతంత్రాలు చేసి అలా గెలిచారా? ఈవీఎంలలో అప్పుడు తప్పులు జరగనప్పుడు ఇప్పుడు ఎందుకు ఆరోపిస్తున్నారు?’’ అని బొత్స ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేతలు సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, కావటి మనోహర్‌నాయుడు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top