ఆడపడుచులకు న్యాయం : ఆళ్ల నాని

ysrcp leader alla nani padayatra in eluru - Sakshi

ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో గత ఎన్నికల్లో చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలు విని మోసపోయి రుణాలు మాఫీకాక అవమానాలు ఎదుర్కొన్న మహిళలందరూ వచ్చే ఏడాదిలో లక్షాధికారులు కాబోతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏలూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి స్థానిక 38వ డివిజన్‌లోని లంకపేటలో నిర్వహించిన రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత మహానేత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా అప్పట్లో ఎంతోమంది ఇంజినీర్లు, డాక్టర్లు అయ్యారని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పథకంలో కోత విధించడంతో ఎంతోమంది పేద విద్యార్థులు చదువులకు దూరమయ్యారని పేర్కొన్నారు. వచ్చే ఏడాది తరువాత మరింత మంది పేదల పిల్లలు ఇంజినీర్లు, డాక్టర్లు కాబోతున్నారని నాని  చెప్పారు.

38వ డివిజన్‌లో పేదలు పడుతున్న కష్టాలు తీర్చడం కోసం తమ్మిలేరు ఏటిగట్టు నిర్మించామని, మంచినీళ్ల ట్యాంక్‌ కట్టించానని నాని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రాంత ప్రజల సమస్యలు పట్టించుకునే నాథుడే కరువయ్యాడని, రచ్చబండ ద్వారా ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలన్నీ జగన్‌తో చర్చించి పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు.  మూడున్నరేళ్లుగా టీడీపీ పాలనలో ఒక్క పేదవాడికీ ఇల్లుగానీ, ఇళ్ల స్థలంగానీ ఇచ్చిన పాపాన పోలేదని, ప్రస్తుతం చంద్రబాబు నిర్లక్ష్యం చేసిన రంగాలన్నింటికీ రాబోయే కాలంలో మహర్దశ పట్టబోతుందన్నారు.

ఈ సందర్భంగా పార్టీ ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ కన్వీనర్‌ కోటగిరి శ్రీధర్‌ మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన తమ పార్టీ రాష్ట్ర ప్లీనరీ సందర్భంగా తమ అధినేత జగన్‌ ప్రకటించిన నవరత్నాలు ప్రజలకు ఇచ్చిన కానుక అన్నారు. జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టును జగన్‌ అన్న పాలనలోనే పూర్తి చేసుకుంటామని స్పష్టం చేశారు.  కార్యక్రమానికి పార్టీ నగర అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్‌ అధ్యక్షత వహించగా, పార్టీ నాయకులు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, గుడిదేశి శ్రీనివాసరావు, మంచెం మైబాబు, మున్నుల జాన్‌ గురునాథ్, నెరుసు చిరంజీవులు,బండారు కిరణ్, వేగి లక్ష్మి, నూకపెయ్యి సుధీర్,  మాగంటి హేమ సుందర్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ నాయకులు స్థానికులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top