కార్యాచరణపై వైఎస్‌ఆర్‌ సీపీ ప్రకటన

YSRCP To Hold Dharnas At Jantar Mantar and State Collectorates - Sakshi

సాక్షి, పెద్దకొండూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు : ‘ప్రత్యేక హోదా మన హక్కు-ప్యాకేజితో మోసపోవద్దు’ అనే నినాదంతో మార్చి 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు సోమవారం రాత్రి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. అంతకుముందు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను నిరాకరించడం, అందుకు వంత పాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తందానా అనడంపై పార్టీ నేతలతో వైఎస్‌ జగన్‌ రెండు గంటల పాటు చర్చించారు.

సమావేశం అనంతరం వైఎస్‌ఆర్‌ సీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘పార్టీ నాయకులతో కీలక సమావేశం జరిగింది. ముఖ్య నిర్ణయంగా వచ్చే నెల 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట ప్రత్యేక హోదా మన హక్కు-ప్యాకేజితో మోసపోవద్దు అనే నినాదంతో ధర్నాలు చేయాలని నిర్ణయించాం. మార్చి 5వ తేదీన ‘ప్రత్యేక హోదా మన హక్కు- ప్యాకేజి మాకొద్దు’ అన్న నినాదంతో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, నేతలతో కలసి ధర్నా చేస్తాం.

దీనికి సంబంధించి మార్చి 3వ తేదీన పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ జెండా ఊపి నాయకులను ఢిల్లీకి పంపుతారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేంత వరకూ వైఎస్‌ఆర్‌సీపీ ఎట్టిపరిస్థితుల్లోనూ విశ్రమించబోదు. అనేక సార్లు ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ జగన్‌ ఆమరణ దీక్షలు, యువభేరీ సభలు నిర్వహించారు. ఆయన పిలుపు మేరకు వైఎస్‌ఆర్‌సీపీ బంద్‌లు నిర్వహించింది.

ప్రత్యేక హోదా సంజీవని అని, దాని వల్ల రాష్ట్ర ప్రజానీకానికి ఎనలేని ప్రయోజనాలు ఒనగూరుతాయని చెప్పింది ఒక్క వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీనే. ప్రత్యేక హోదాకు సమాధి కట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం చూస్తున్న సమయంలో వైఎస్‌ఆర్‌సీపీ మళ్లీ పోరాటానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వాల మీద తిరగబడటం ప్రతిపక్షాల లక్షణం. దృఢమైన సంకల్పం ఉంది కాబట్టే మేం ప్రత్యేక హోదాను డిమాండ్‌ చేస్తున్నాం.

ఫలితం రానటువంటి పరిస్థితుల్లో ఎంపీలు కచ్చితంగా రాజీనామా చేస్తారు. దీనిపై పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ గతంలోనే స్పష్టమైన ప్రకటన చేశారు. వైఎస్‌ఆర్‌ సీపీ అభాండాలు వేయడానికి, అనునిత్యం మమ్మల్ని దోషులుగా నిలబెట్టేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు చూస్తున్నారు. మనది ప్రజాస్వామ్యం ప్రజలు అన్నీ చూస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోండి. సన్నాయి నొక్కులు నొక్కుతున్నది చంద్రబాబు. బాబు కేంద్ర ప్రభుత్వానికి వంగి, లొంగి ప్రత్యేక హోదాపై రోజుకో మాట చెప్పి తన స్థాయిని దిగజార్చుకున్నారు. ప్రత్యేక ప్యాకేజి ఏ మాత్రం ప్రజలకు మేలు చేయదు. ప్రత్యేక హోదా మాత్రమే ప్రజలకు మంచి చేయగలుగుతుంది.’

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top