సభా ప్రాంగణానికి మహాత్మా జ్యోతిరావు పూలే పేరు

YSRCP Helds BC Garjana In Eluru On February 17 - Sakshi

ఏలూరు సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తాం

బీసీలలోని 107 కులాలకు న్యాయం చేయాలనే బీసీ గర్జన

బీసీలను వాడుకోవడం బాబుకు అలవాటే

నవరత్నాలను బాబు కాపీ కొట్టారు

సాక్షి, పశ్చిమగోదావరి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఏలూరులో నిర్వహిస్తున్న బీసీ గర్జన సభా ప్రాంగణానికి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రాంగణంగా నామకరణం చేసినట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. బుధవారమిక్కడ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌ సీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, జంగా కృష్ణమూర్తి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఈ నెల 17న జరిగే బీసీ గర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏలూరు సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తామని వెల్లడించారు. వైఎస్సార్ హయాంలో బీసీలకు పెద్దపీట వేశారని.. ఆయన బాటలో వైఎస్‌ జగన్‌ కూడా బీసీలకు న్యాయం చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. బీసీలలోని 107 కులాలకు న్యాయం చేయాలనే బీసీ గర్జన నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలకు, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు పూర్తి స్థాయి ఫీజు రీఎంబర్స్‌మెంట్ చెల్లించాలని వైఎస్ జగన్‌ను‌ కోరబోతున్నట్లు పేర్కొన్నారు.

బాబుకు బీసీలు గుర్తుకువచ్చేది అప్పుడే!
బీసీలను వాడుకుని వదిలేయటం చంద్రబాబుకు అలవాటేనని వైఎస్సార్‌ సీపీ నేతలు మండిపడ్డారు. ఎన్నికల‌కు ముందు మాత్రమే ఆయనకు బీసీలు గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు. నాలుగన్నరేళ్లుగా ఒక్కరోజైనా బీసీ వర్గాల కార్పొరేషన్ల ఏర్పాటుపై మాట్లాడని చంద్రబాబు.. వైఎస్ జగన్ నవరత్నాలు, బీసీ కులాలకు కార్పోరేషన్ల ప్రకటన తర్వాతే బడ్జెట్‌లో కార్పోరేషన్ల గురించి ప్రస్తావించారన్నారు. ఒకే సామాజిక వర్గానికి పోస్టులలో అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై ఉద్యోగ సంఘాలు కూడా ఆలోచన చేయాలని విఙ్ఞప్తి చేశారు. బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి సరైన కేటాయింపులు జరగలేదని విమర్శించారు. స్వాతంత్ర్యం వచ్చి 72 ఏళ్లు దాటినా జనాభాలో 50 శాతం దాటిన వెనుక బడిన వర్గాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదన్నారు. బీసీ వర్గాలకు వెన్నుదన్నుగా నిలిచిన ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ పథకానికి చంద్రబాబు పూర్తి కేటాయింపులు చేయలేదని విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు మరోసారి బీసీలను వంచించడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top