మేలు కోరు నాయకా.. మెచ్చుకోలు ఎంపిక

YSRCP Give Tickets To So Many Educated People - Sakshi

అత్యున్నత విద్యావంతులకు వైఎస్సార్‌సీపీ టిక్కెట్లు

 జాబితాలో పలువురు మాజీ సివిల్‌ సర్వెంట్లు

 ప్రజా సేవలో పేరుగాంచిన వైద్యులు 

సాక్షి, అమరావతి : ప్రజా సమస్యలపై సూక్ష్మ స్థాయి అవగాహన ఉండేఅధికారులకు, జనం నాడి పట్టి మంచి పేరు తెచ్చుకున్న వైద్యులకు, సమాజ రక్షణలో కీలకమైన పోలీస్‌ శాఖలో పనిచేసినవారికి ఈసారి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ టిక్కెట్లు దక్కాయి. వీరితోపాటు ఉపాధ్యాయులు, ఇంజినీర్లు,పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు ఇలా పలువురు ఉన్నత విద్యావంతులకు సీట్ల కేటాయింపులో ఆ పార్టీ పెద్దపీట వేసింది.  సమాజ అవసరాలపై పరిశీలన, ఇబ్బందులనుతెలుసుకోగలిగే చొరవ ఉన్న వీరంతా చట్ట సభల ప్రతినిధులుగా ఎన్నికైతే వ్యవస్థకు మరింత ప్రయోజనం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఓ విధంగా ఇది మంచి ప్రయోగమని వారు పేర్కొంటున్నారు. ఈ అభ్యర్థులంతా నిన్నమొన్నటి వరకు నిత్యం ప్రజా సంబంధాల్లో, సేవలో నిమగ్నమైన వారే కావడం మరో విశేషం. వీరందరి నేపథ్యాలను పరిశీలిస్తే అత్యుత్తమ ఎంపికగానూ భావించవచ్చు. ఒక్కొక్కరి గురించి తెలుసుకుంటే...! 

పీడీ రంగయ్య... 
అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్న తలారి రంగయ్య... పీడీ రంగయ్యగా ప్రసిద్ధులు. రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో డీఆర్‌డీఏ పీడీగా పనిచేశారు. తన పనితీరుతో ప్రశంసలు పొందారు. ఆయన హోదానే (పీడీ)... ఆయన ఇంటి పేరుగా మారడం దీనికి నిదర్శనం. ఈసారి ప్రత్యక్ష ప్రజా సేవ చేయాలన్న ఉద్దేశంతో ఉద్యోగాన్ని వదిలేశారు. దీనికి అనంతపురం జిల్లాలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాలనూ బీసీలకే ఇవ్వాలన్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ విధాన నిర్ణయం తోడవడంతో రంగయ్య అనంతపురం లోక్‌సభా స్థానం అభ్యర్థి అయ్యారు. 

ఎస్పీఎఫ్‌ డీఐజీ ఏసురత్నం 
స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఎస్పీఎఫ్‌) వంటి కీలక సంస్థలో డీఐజీగా పని చేశారు చంద్రగిరి ఏసురత్నం. గుంటూరు జిల్లా గుంటూరు పశ్చిమ శాసన సభ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్నారు. వెనుకబడిన వడ్డెర సామాజిక వర్గానికి చెందిన ఏసురత్నం... బడుగు వర్గాలకు సేవ చేయాలన్న కృతనిశ్చయంతో ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ చేశారు.

ఐఆర్‌ఎస్‌ ఎలీజా 
సివిల్‌ సర్వీసుల్లో ఒకటైన భారత రెవెన్యూ సర్వీస్‌ (ఐఆర్‌ఎస్‌)కు ఎంపికై సుదీర్ఘ కాలం పనిచేసి అనుభవం గడించారు ఎలీజా. ఏడాది క్రితం స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఈ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి (ఎస్సీ) అసెంబ్లీ నియోజవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 

ఐఏఎస్, మాజీ ఎంపీ.. ఎమ్మెల్యే బరిలో 
నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న డా.వెలగపల్లి వరప్రసాద్‌ మాజీ ఐఏఎస్‌ అధికారి. బయో కెమెస్ట్రీలో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ కూడా చేశారు. 2014 ఎన్నికల్లో 
వైఎస్సార్‌సీపీ తరఫున తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచారు. పార్లమెంటులో తన గళం వినిపించారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్‌ జగన్‌ పిలుపు మేరకు పదవిని త్యాగం చేశారు.

సీఈవో బాబూరావు 
విశాఖపట్టణం జిల్లా పాయకరావుపేట అభ్యర్థి గొల్ల బాబూరావు రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులకు చెందిన నాన్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి.  రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతకుముందు జడ్పీ సీఈవోగా పనిచేశారు. గ్రామీణాభివృద్ధి, పాలనపై మంచి పట్టున్నవారు. 

చంద్రబాబుపై ఐఏఎస్, బాలకృష్ణపై ఐపీఎస్‌ 
హిందూపురం అసెంబ్లీ అభ్యర్థి మొహమ్మద్‌ ఇక్బాల్‌ ఖాన్‌ రిటైర్డు పోలీసు అధికారి. ఐజీ హోదాలో పదవీ విరమణ చేశారు. సమాజ పరిస్థితులు బాగా తెలిసిన వ్యక్తి కావడంతో జగన్‌ ఆయనకు ఈ సీటు కేటాయించారు. ఇక్బాల్‌... నందమూరి బాలకృష్ణపై పోటీ చేస్తున్నారు. ఇక కుప్పం నుంచి మాజీ ఐఏఎస్‌ అధికారి కె.చంద్రమౌళి... ముఖ్యమంత్రి చంద్రబాబుపె మరోసారి పోటీకి నిలిచారు. 

‘నో సిజేరియన్‌ డాక్టర్‌’ ఆమె... 
అనకాపల్లి లోక్‌సభా నియోజకవర్గ అభ్యర్థి డా.కాండ్రేగుల వెంకట సత్యవతి పేరుగాంచిన గైనకాలజిస్ట్‌.  సహజ ప్రసవాలకే ప్రాధాన్యం ఇస్తారు. బీసీ గవర వర్గానికి చెందినవారు. పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ను కలిసిన ఆమె అసెంబ్లీ టికెట్‌  కోరారు. జగన్‌ లోక్‌సభ అభ్యర్థిగా ఖరారు చేశారు. 

వైద్యుల కుటుంబం నుంచి 
కర్నూలు లోక్‌సభ అభ్యర్థి డా.సింగరి సంజీవకుమార్‌ మంచి వైద్య నిపుణుడు. చేనేత వర్గానికి చెందినవారు. ఉచిత వైద్య శిబిరాలతో పాటు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజలకు సుపరిచితుడైన ఈయనకుటుంబంలో 21 మంది డాక్టర్లున్నారు.  

పలాస నుంచి అనంతపురం వరకు 

  • శ్రీకాకుళం జిల్లా పలాస అభ్యర్థి డా.సీదిరి అప్పలరాజు మంచి ఫిజీషియన్‌. మానవతా దృక్పథంతో సేవలందిస్తారని ప్రతీతి. మత్స్యకార వర్గానికి చెందినవారు.
  • తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అభ్యర్థి డా.సూర్యనారాయణరెడ్డిది విశిష్ట శైలి. ఈయనకు ప్రజల వైద్యుడిగా పేరుంది. 
  • ప్రకాశం జిల్లా కొండెపి అభ్యర్థి డా.మాదాసి వెంకయ్యది లక్షకు పైగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేసిన చరిత్ర. ఇందుకుగాను రాష్ట్రపతి అవార్డు సైతం అందుకున్నారు. ఇదే జిల్లాలో డా.దగ్గుబాటి వెంకటేశ్వరావు పర్చూరు నుంచి బరిలో ఉన్నారు. దివంగత ఎన్టీ రామారావుకు పెద్దల్లుడు. వైద్య వృత్తిలో ఎక్కువ కాలం లేకున్నా ప్రజా సేవలో జనం నాడి బాగా తెలిసిన వ్యక్తి. 
  • వైఎస్సార్‌ జిల్లాలో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఎంవీ సుధీర్‌రెడ్డి ప్రభుత్వ డాక్టర్‌గా పనిచేశారు. 
  • బద్వేలు నుంచి పోటీ చేస్తున్న డా.జి.వెంకట సుబ్బయ్య రెండు దశాబ్దాలుగా కడపలో ఎముకల వైద్య నిపుణుడిగా పనిచేస్తున్నారు. వందలకొద్దీ వైద్య శిబిరాలు నిర్వహించారు.
  • పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు అభ్యర్థి డా.బాబ్జీకి పేదల వైద్యుడనే పేరుంది. తక్కువ ఫీజుతో చికిత్స చేస్తుంటారు. 40 ఏళ్లకుపైగా వైద్య వృత్తిలో ఉన్నారు.
  • కృష్ణా జిల్లా నందిగామ అభ్యర్థి డా.మొండితోక జగన్‌ మోహన్‌రావు వైద్యుడు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ఎం.అరుణ్‌ కుమార్‌కు స్వయానా పెద్దన్న. 
  • గుంటూరు జిల్లా తాడికొండ అభ్యర్థి డా.ఉండవల్లి శ్రీదేవి నిపుణురాలైన గైనకాలజిస్ట్‌. మహిళల సమస్యల పట్ల మంచి అవగాహన ఉన్న డాక్టర్‌గా పేరుంది. 
  • నరసరావుపేట అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేరు తెలియనివారు ఆ ప్రాంతంలో అరుదు. మంచి ఆర్థోపెడీషియన్‌. తక్కువ వ్యయంతో శస్త్రచికిత్సలు చేస్తారు.
  • అనంతపురం జిల్లా కదిరి అభ్యర్థి డా.సిద్ధారెడ్డి, మడకశిర బరిలో ఉన్న డా.ఎం.తిప్పేస్వామి ఇద్దరూ ఉద్దండులైన వైద్యులే. సిద్ధారెడ్డి సతీమణితో కలిసి కదిరిలో ఆస్పత్రి నిర్వహించారు.  తిప్పేస్వామి ఫిజీషియన్‌. గతంలో ప్రభుత్వ డాక్టర్‌గా ఉన్నారు.
  • నెల్లూరు సిటీ అభ్యర్థి డా.అనిల్‌కుమార్‌ యాదవ్‌ చెన్నైలో విద్యనభ్యసించి నేరుగా రాజకీయ రంగప్రవేశం చేశారు. గత ఎన్నికల్లో మంచి ఆధిక్యంతో గెలుపొంది ఎమ్మెల్యే అయ్యారు. 
  • కర్నూలు జిల్లా కోడుమూరు అభ్యర్థి జరదొడ్డి సుధాకర్‌ మంచి దంత వైద్య నిపుణుడు. పలు వైద్య శిబిరాలు నిర్వహించారు.
  • వీరంతా చదువరులే! 
  • తూర్పుగోదావరి జిల్లా రాజోలు (ఎస్సీ) అభ్యర్ధి బొంతు రాజేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వంలోని ఇంజినీరింగ్‌ శాఖలో ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌గా పదవీ విరమణ చేశారు.  
  • గుంటూరు జిల్లా వేమూరు (ఎస్సీ)లో పోటీ చేస్తున్న మేరుగ నాగార్జున పీహెచ్‌డీ చేశారు. ప్రొఫెసర్‌గా పనిచేశారు.  
  • ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం అభ్యర్థి ఆదిమూలపు సురేష్‌ ఇంజినీరింగ్‌ పట్టభద్రుడు. పీహెచ్‌డీ కూడా చేశారు.  
  • చిత్తూరు జిల్లా చంద్రగిరి అభ్యర్థి డా.చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి న్యాయ శాస్త్ర పట్టభద్రుడు. పీహెచ్‌డీ చేశారు. 
  • కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మహ్మద్‌ అబ్దుల్‌ హఫీజ్‌ ఖాన్‌ అమెరికాలోని డెట్రాయిట్‌లో సివిల్‌ ఇంజినీరింగ్‌ చేశారు. 
  • నందికొట్కూర్‌ అభ్యర్ధి తోగూర్‌ ఆర్థర్‌ శాసన సభ ప్రధాన భద్రతాధికారిగా వ్యవహరించారు. స్పెషల్‌ కమాండెంట్‌గా పని చేసి రిటైరయ్యారు.
  • ఆళ్లగడ్డ బరిలో ఉన్న గంగుల బ్రిజేంద్రారెడ్డి ఎంబీఏ చదివారు. 

- ఆర్‌.ఎం. బాషా, వడ్డాది శ్రీనివాస్

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top