చంద్రబాబూ.. పల్నాడుపై ఎందుకింత కక్ష? 

YSR Congress Party MLAs Comments On Chandrababu - Sakshi

కోడెల, యరపతినేని దోపిడీని మర్చిపోయారా? 

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ధ్వజం

గుంటూరు వెస్ట్‌: ‘చంద్రబాబూ.. మీ హయాంలో పల్నాడు ప్రాంతంలో రాక్షస పాలన సాగిన సంగతి మర్చిపోయారా. మాజీ స్పీకర్‌ కోడెల కుటుంబం కే. ట్యాక్స్‌ పేరుతో, యరపతినేని మైనింగ్‌ పేరుతో పల్నాడును దోచుకోలేదా. అక్కడి ప్రజలు అన్యాయాలకు గురైనప్పుడు, ఊళ్లొదిలి వెళ్లినప్పుడు మీ నోరు మూగబోయిందా’ అని ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. గుంటూరు ఆర్‌అండ్‌ బీ అతిథి గృహంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మూడు నెలలుగా పల్నాడు ప్రజలు ఎంతో సంతోషంగా ఉంటే.. అక్కడ ఏదో జరిగిపోతున్నట్టు నాలుగు రోజుల నుంచి చంద్రబాబు తెగ బాధపడిపోతున్నారని ధ్వజమెత్తారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో కుల, మత, ప్రాంత, లింగ వివక్ష లేని పాలన సాగుతోందని చెప్పారు. టీడీపీ సానుభూతిపరులు, కార్యకర్తలు గతంలో అన్యాయానికి గురయ్యామని గ్రహించి ఆ పార్టీకి దూరంగా వెళ్లిపోతున్నారని.. దీంతో ఏం చేయాలో తోచని చంద్రబాబు తమపై అభాండాలు వేస్తున్నారన్నారు. దుర్గి మండలం జంగమేశ్వరపురంలో వైఎస్సార్‌సీపీ  కార్యకర్తను హత్య చేయించింది మీరు కాదా అని ప్రశ్నించారు. తాము ఎప్పుడూ కక్ష రాజకీయాలకు పూనుకోలేదని కృష్ణారెడ్డి పేర్కొన్నారు. 

బహిరంగ చర్చకు రండి 
ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్‌ రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, విడదల రజని, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. పల్నాడును రావణ కాష్టంలా మార్చిన కోడెల కుటుంబం, యరపతినేని ఎక్కడ దాక్కున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబుకు విజ్ఞత ఉంటే.. ఆయన హయాంలో సృష్టించిన మారణహోమం, దుర్మార్గాలపైన, ప్రస్తుత పాలనా తీరుపైన చర్చకు రావాలని సవా ల్‌ విసిరారు. మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మరి కొందరు టీడీపీ నేతలు ఇంకా వారి నైజాన్ని మార్చుకోలేదన్నారు.  

కోడెల, యరపతినేని వంటి వారు తమ మాట విననందుకు ఎందరినో గ్రామ బహిష్కరణ చేయించారని, చివరకు ఎన్నికల్లో ఓట్లు కూడా వేయనివ్వలేదని వివరించారు. రానున్న రోజుల్లో పల్నాడు ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని, ఇందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఇప్పటికైనా చంద్రబాబు అండ్‌ కంపెనీ మోసపూరిత ప్రకటనలకు స్వస్తి పలకాలని హితవు పలికారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top