చేరికల జోష్‌

YSR Congress Party Is In Full Josh With Many Leaders Joining - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సార్వత్రిక ఎన్నికల ప్రచార భేరీ మోగించడానికి సరిగ్గా ఒక్క రోజు ముందు పార్టీలోకి ప్రముఖులు పోటెత్తారు. పలువురు హేమాహేమీలు జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. జగన్‌ శనివారం పార్టీలోకి ప్రముఖులను ఆహ్వానిస్తూ బిజీబిజీగా గడిపారు. చేరికల కార్యక్రమంతో హైదరాబాద్‌లోని ఆయన నివాసం రాత్రి 9.30 గంటల వరకూ కోలాహలంగా కనిపించింది. టీడీపీకి చెందిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బల్లి దుర్గాప్రసాద్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, వంగా గీత, మాజీ ఎమ్మెల్యేలు ద్రోణంరాజు శ్రీనివాస్, నీరజారెడ్డి, ఎం.మల్లికార్జునరావుతో సహా పలువురు నేతలు పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి ఏలూరు రామచంద్రారెడ్డి కూడా వైఎస్సార్‌సీపీ వైఎస్సార్‌సీపీలో చేరారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తన భర్త నీలకంఠంతో కలిసి పార్టీలోకి పునరాగమనం చేశారు.

టీడీపీ నుంచి సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మాగుంట శ్రీనువాసులురెడ్డి భారీ అనుచరగణంతో వచ్చి జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. ఆయన వెంట చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ ఉన్నారు. నెల్లూరు(రూరల్‌) నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా టిక్కెట్‌ను ప్రకటించిన మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు. విజయవాడ మాజీ మేయర్‌ తాడి శకుంతల, సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే దార సాంబయ్య కుమార్తె పద్మజ కూడా పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ నేత, మంత్రి అఖిలప్రియ మేనమామ ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి కూడా వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. వీరంతా తమ అనుచర గణంతో తరలిరావడంలో జగన్‌ నివాసం జైజగన్‌ నినాదంతో మార్మోగిపోయింది. 

జగన్‌ను సీఎం చేయాలనే: మాగుంట 
తమ కుటుంబానికి వైఎస్‌ కుటుంబంతో మంచి సంబంధాలున్నాయని మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెప్పారు. రాజన్న రాజ్యం రావాలంటే జగన్‌ సీఎం కావాలన్నారు. జగన్‌ అధికారంలోకి వస్తే ప్రకాశం జిల్లా అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. జగన్‌ను సీఎంను చేయాలన్న ధ్యేయంతోనే వైఎస్సార్‌సీపీలోకి వచ్చానని స్పష్టం చేశారు. 

ఇన్నాళ్లూ ఎందుకు చేరలేదా అనిపిస్తోంది: ఆదాల ప్రభాకర్‌రెడ్డి 
వైఎస్సార్‌సీపీలో చేరినందుకు ఆనందంగా ఉందని నెల్లూరు జిల్లాకు చెందిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. జగన్‌తో మాట్లాడి రాష్ట్రాభివృద్ధిపై ఆయన ఆలోచనలు విన్న తర్వాత ఇన్నాళ్లూ పార్టీలోఎందుకు చేరలేదా అనిపిస్తోందని చెప్పారు. నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానన్నారు. 

జగన్‌తో అన్ని వర్గాలకూ మేలు: వంగా గీత 
జగన్‌ నాయకత్వంలోనే అన్ని వర్గాలలూ మేలు జరుగుతుందని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సీనియర్‌ నేత వంగా గీతా పేర్కొన్నారు. జగన్‌ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వివరించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అహర్నిశలూ శ్రమిస్తున్న జగన్‌ బాటలో నడవడం సంతోషంగా ఉందన్నారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అస్తిత్వం లేదు: ద్రోణంరాజు 
రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అస్తిత్వాన్ని కోల్పోయిందని, సంస్థాగతంగా పూర్తిగా దెబ్బతిన్నదని ద్రోణంరాజు శ్రీనివాస్‌ అన్నారు. విజయసాయిరెడ్డి ఆహ్వానం మేరకు తాను వైఎస్సార్‌సీపీలో చేరానన్నారు. జగన్‌ ఆదేశాల మేరకు ఎక్కడ నుంచి పోటీ చేయమంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. జగన్‌ నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. 

మంగళగిరి టిక్కెట లోకేశ్‌కు ఎలా ఇస్తారు?: దుర్గాప్రసాద్‌ 
మంగళగిరి టిక్కెట్‌ను నారా లోకేశ్‌కు ఎలా ఇస్తారని మాజీ మంత్రి బల్లి దుర్గాప్రసాద్‌ ప్రశ్నించారు. అభ్యర్థుల ఎంపికలో టీడీపీ ఇష్టానుసారంగా వ్యవహరించిందన్నారు. ప్రజలు టీడీపీ బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మంగళగిరి రైతులు టీడీపీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 

దారుణంగా మోసపోయా: బుట్టా రేణుక 
బీసీ మహిళనైనా తనని టీడీపీ దారుణంగా మోసం చేసిందని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక వాపోయారు. టీడీపీ విలువలు లేని పార్టీ, అక్కడ బీసీలకు గౌరవం లేదని విమర్శించారు. వైఎస్సార్‌సీపీలోకి తిరిగి రావడం సొంతింటికి వచ్చినంత సంతోషంగా ఉందన్నారు. ఈ పార్టీని టీడీపీలో చేరి మాటల్లో చెప్పలేనంత తప్పు చేశానని వ్యాఖ్యానించారు. టీడీపీలో ఎన్నో అనుమానాలు భరించానని పేర్కొన్నారు. తనకు ఎక్కడ గౌరవం ఉందో అక్కడే పని చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తాను తప్పు చేశానని, ఆ తప్పునకు ఫలితం అనుభవించానని వెల్లడించారు. టీడీపీ బీసీ పార్టీ అని చంద్రబాబు గొప్పలు చెబుతుంటారని, కానీ, బీసీల సీటును అగ్రకులాలకు ఇచ్చారని బుట్టా రేణుక మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ విజయం కోసం శక్తివంచన లేకుండా పని చేస్తానని చెప్పారు. 

బాబు మోసాలను ప్రజలు గ్రహించారు: రామచంద్రారెడ్డి
ప్రకాశం, వైఎస్సార్‌ జిల్లా రైతులను ఆదుకొనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తికావడం వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమని ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు మోసాలు ప్రజలు గ్రహించారని తెలిపారు. ఎన్నికల్లో ఓటు ద్వారా బాబుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. 

పార్టీ విజయానికి కృషి చేస్తా: ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి 
ఆళ్లగడ్డలో వైఎస్సార్‌సీపీ విజయానికి కృషి చేస్తానని మంత్రి అఖిలప్రియ మేనమామ ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. చాలాకాలంగా కలవని వాళ్లమంతా ఈ ఎన్నికల్లో ఒక్కటయ్యామని తెలిపారు.  

వైఎస్సార్‌సీపీలోకి జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీనుబాబు
హెల్త్‌ మేగ్‌జైన్‌ల ప్రచురణ, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సదస్సుల నిర్వహణ చేపట్టే పల్సస్‌ కంపెనీ అధినేత డాక్టర్‌ శ్రీనుబాబు పేరును జనసేన విశాఖ లోక్‌సభ అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించారు. కానీ ఆయన జనసేన కార్యక్రమాల్లో పాల్గొనకుండా దూరంగా ఉండిపోయారు. కనీసం ఆ పార్టీ కండువా కూడా కప్పుకోలేదు. కాగా, శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో జగన్‌ను కలిసి వైఎస్సార్‌సీపీలో చేరారు.

నవ్యాంధ్రకు ఉజ్వల భవిష్యత్తు జగన్‌తోనే సాధ్యం
నవ్యాంధ్రకు ఉజ్వల భవిష్యత్తు జగన్‌తోనే సాధ్యమని శ్రీనుబాబు చెప్పారు. రాష్ట్ర ప్రజల ప్రగతి కోసం అహర్నిశలూ కష్టపడుతున్న వైఎస్‌ జగన్‌కు మద్దతివ్వాలన్న ఉద్దేశంతోనే వైఎస్సార్‌సీపీలో చేరానని పేర్కొన్నారు.   

జగన్‌తో కొణతాల రామకృష్ణ భేటీ  
ఉత్తరాంధ్ర చర్చ వేదిక నాయకులు, సీనియర్‌ నేత కొణతాల రామకృష్ణ శనివారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఉత్తరాంధ్ర సమస్యలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి నీళ్లు, నిధులు, నియామకాలు కల్పించాలని జగన్‌ను కోరానన్నారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని జగన్‌తో మాట్లాడానని చెప్పారు. మత్స్యకారులు, దళితులు, గిరిజనులకు ఉపాధి అవకాశాలు మెరుగు పరచాలని చర్చించామన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటామని జగన్‌ హామీ ఇచ్చారని కొణతాల తెలిపారు. వైఎస్సార్‌సీపీలో చేరే విషయం గురించి తన అభిమానులతో చర్చించాల్సి ఉందన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top