వారిపై వేటు వేసేవరకు అసెంబ్లీ బహిష్కరణ

ysr  congress party  Assembly relegation - Sakshi

వైఎస్సార్‌సీఎల్పీ ఏకగ్రీవ నిర్ణయం.. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతకు డిమాండ్‌

నలుగురు మంత్రులను బర్తరఫ్‌ చేయాలి.. అప్పుడే సమావేశాలకు హాజరవుతాం

పాదయాత్ర నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే అసెంబ్లీ: ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌

ఫిరాయింపుదారులను వైఎస్సార్‌సీపీ సభ్యులుగా చూపిస్తారా?: పెద్దిరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలుగా గెలుపొంది టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా చేయాలని, సీఎం చంద్రబాబు తన మంత్రివర్గంలో చేర్చుకున్న నలుగురు ఫిరాయింపు మంత్రులను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ త్వరలో జరుగనున్న ఏపీ శాసనసభా సమావేశాలకు హాజరు కారాదని ప్రధాన ప్రతిపక్షం నిర్ణయించింది. రాష్ట్ర స్థాయి పార్టీ నేతల సమావేశంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా ఈ విషయం ప్రకటించారు. శాసనసభాపక్షం నిర్ణయానికి పార్టీ శ్రేణులందరూ హర్షధ్వానాల తో స్వాగతం పలికారు. అంతకుముందు జగన్‌ అధ్యక్షతన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ శాసనస భాపక్షం సమావేశంలో ఏకగ్రీవంగా ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించారు. పెద్ద సంఖ్యలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్‌ నేతలు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఏపీ శాసనసభను అధికారపక్షం అత్యంత అప్రజాస్వామికంగా నిర్వహిస్తోందని అభిప్రాయపడ్డారు.

ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకే...
ముఖ్యమంత్రి చంద్రబాబు నిస్సిగ్గుగ్గా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైఎస్‌ జగన్‌ విమర్శించారు. ‘‘మన పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను అప్రజాస్వామికంగా చంద్రబాబు తన పార్టీలోకి తీసుకోవడం ఒక తప్పు. ఒకటిన్నర సంవత్సరాలు దాటినా ఇలా ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించక పోవడం రెండోతప్పు. తగుదునమ్మా అని ఫిరాయించిన వారిలో నుంచి నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవడం మరో తప్పు. ఈ పరిణామాల అనంతరం తొలిసారిగా నవంబరు 10 నుంచి శాసనసభా సమావేశాలు జరుగబోతున్నాయి. ఇలాంటి అన్యాయానికి, అప్రజాస్వామిక వైఖరిని అడ్డుకోవాల్సిందేనని పార్టీలో ఎమ్మెల్యేలు, సీనియర్లు అభిప్రాయపడ్డారు. జరుగుతున్నది తప్పని గట్టిగా చెప్పకపోతే అది సర్వసాధారణమయ్యే (రొటీన్‌) ప్రమాదం ఉంది. కనుక ఎక్కడో ఒకచోట పుల్‌స్టాప్‌ పెట్టాలన్నారు. ఆ మేరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కారాదని ఏకగ్రీవంగా నిర్ణయించాం’’ అని పార్టీ శ్రేణులకు వివరించారు. టీడీపీలోకి తీసుకున్న 20 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించి, మంత్రివర్గంలోకి తీసుకున్న నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఉపసంహరిస్తేనే అసెంబ్లీకి హాజరవుతామని స్పష్టం చేశారు. ‘‘చంద్రబాబు ఈ రెండు పనులూ చేసి, శాసనసభను ప్రజాస్వామ్యబద్ధంగా నడపాలి. అపుడే మేం అసెంబ్లీకి వస్తాం.. లేకుంటే మా నిరసనను వ్యక్తం చేస్తూ హాజరు కాబోమని తీర్మానం చేశాం. ఈ తీర్మానాన్ని ఏపీ శాసనసభ స్పీకర్‌కు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, రాష్ట్ర గవర్నర్‌కు, రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి పంపుతాం. జాతీయ మీడియాకు కూడా అందజేస్తాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అసెంబ్లీ వేదికగానే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న తీరును అందరి దృష్టికీ తీసుకెళ్తాం. దీంతో ఏపీలో శాసనసభ ఎంత దారుణంగా పని చేస్తోందో దేశం మొత్తం మీద చర్చనీయాంశం అవుతుంది. ఈ దురన్యాయానికి ఎక్కడో ఒక చోట పుల్‌స్టాప్‌ పడుతుందనే నమ్మకంతోనే మేం ఈ నిర్ణయానికి వచ్చాం’’ అని తెలిపారు.

దృష్టి మళ్లించేందుకే...
తన పాదయాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు  అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని జగన్‌ విమర్శించారు. ‘‘సాధారణంగా అయితే అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు లేదా సెప్టెంబర్‌ నెలలో నిర్వహించాలి. కానీ చంద్రబాబు అందుకు సాహసించలేదు. తాను ప్రజలకు చేసిన మోసాలు, అన్యాయాలు మితిమీరి పోయిన నేపథ్యంలో శాసనసభను ఎదుర్కొనే పరిస్థితుల్లో లేరు. మనం పాదయాత్ర తేదీలను ఖరారు చేసుకుని ప్రకటించిన తరువాత, ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే అదే సమయంలో అసెంబ్లీ తేదీలను ఖరారు చేశారు’’ అని జగన్‌ వివరించారు.

ఫిరాయింపుదారులను వైఎస్సార్‌సీపీ సభ్యులుగా చూపిస్తారా?
ప్రజాస్వామ్య విలువలను కాలరాసి 20 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడమే కాక వారందరినీ వైఎస్సార్‌సీపీ సభ్యులుగా చూపిస్తూ అసెంబ్లీ బులిటెన్‌ను విడుదల చేయడం దారుణమని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం ఉప నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభాపక్షం సమావేశానంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... బులిటెన్‌లో 66 మందిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సభ్యులుగా చూపారని, దేశంలో ఎక్కడా ఇలా జరిగి ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. మేమేమైనా టీడీపీతో పొత్తు పెట్టుకున్నామా? లేదంటే ప్రభుత్వంలో మా ఎమ్మెల్యేలు చేరారా? అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాము శాసనసభా సమావేశాలకు వెళితే తమ పార్టీలో గెలుపొంది అధికారపక్షంలో మంత్రులుగా ఉన్న వారికే తాము ప్రశ్నలు వేసి సమాధానం చెప్పించుకునే పరిస్థితి వస్తుందన్నారు. ఇలా ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తుంటే తలొంచుకుని వెళ్లే పరిస్థితి ఉండరాదనే అసెంబ్లీకి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు చెప్పారు. గతంలో రాష్ట్రంలో ఎన్టీఆర్, తమిళనాడు జయలలిత శాసనసభ సమావేశాలకు పూర్తిగా వెళ్లలేదని గుర్తుచేశారు. తాముకూడా అదే మార్గంలో చంద్రబాబు అప్రజాస్వామిక తీరుకు నిరసనగా ఇకపై అసెంబ్లీ సమావేశాలకు వెళ్లబోమని తెలిపారు.

చంద్రబాబు గత మూడున్నరేళ్లలో మొక్కుబడిగా కేవలం 80 రోజులు మాత్రమే పది శాసనసభా సమావేశాలు (సెషన్స్‌) జరిపారని దుయ్యబట్టారు. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 2004–2009 వరకూ 256 రోజుల పాటు మొత్తం 16 సెషన్లు జరిగాయని గుర్తుచేశారు. చంద్రబాబు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులను, జగన్‌ను, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, ప్రజా సమస్యలపై ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదని విమర్శించారు. 20 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులును చేసి, నలుగురు మంత్రులను తొలగిస్తే శాసనసభకు హాజరయ్యేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. సాధారణంగా ఎవరికైనా అన్యాయం జరిగినపుడు, కష్టాలు వచ్చినపుడు వాటినుంచి గట్టెక్కించాలని దేవుడిని వేడుకుంటామని, ఇపుడు అసెంబ్లీలో తమకు న్యాయం జరగడం లేదు కనుక ప్రజల దగ్గరికే వెళ్లి వారికి మొరపెట్టుకుంటామని, అందుకు అనుగుణంగా పార్టీ కార్యక్రమాన్ని సిద్ధం చేసిందని పెద్దిరెడ్డి తెలిపారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top