బాబు పతనం ఖాయం

YSR Congress Leaders Fires On Chandrababu At Vanchana Pai Garjana - Sakshi

హోదాపై ఆయన మోసాలను ప్రజలు అర్థం చేసుకున్నారు

రాష్ట్రానికి ద్రోహం చేసిన కాంగ్రెస్‌తో పొత్తా?

బాబు దీక్షలు.. అధర్మ పోరాట దీక్షలు

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ప్రజాదరణను ఓర్వలేకే టీడీపీ హత్యాయత్నం

కాకినాడ ‘వంచనపై గర్జన’ సభలో మండిపడ్డ వైఎస్సార్‌సీపీ నేతలు

కాకినాడ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించే విషయంలో అడుగడుగునా ప్రజలను వంచిస్తూ వచ్చిన సీఎం చంద్రబాబు రాజకీయ పతనం ఖాయమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు నిప్పులు చెరిగారు. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు చేసిన మోసాలు, ఆడుతున్న నాటకాలను ప్రజలు అర్థం చేసుకున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆయన్ను గద్దె దించి తీరతారని స్పష్టం చేశారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ బాలాజీ చెరువు సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ‘వంచనపై గర్జన’ సభ జరిగింది. ఇందులో మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణతో సహా పలువురు ముఖ్య నేతలు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, పెద్ద సంఖ్యలో ఆయా జిల్లాల నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంపై నేతలు ధ్వజమెత్తారు. సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ విషయంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలను దారుణంగా వంచించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన జరిగితే తాము తీవ్రంగా నష్టపోతామని రాష్ట్ర ప్రజలు ఎంత మొత్తుకున్నా వినకుండా ఏకపక్షంగా రాష్ట్రాన్ని నిలువునా చీల్చేసిన కాంగ్రెస్‌ పార్టీతో చంద్రబాబు ఎలా జతకడతారని ప్రశ్నించారు. ఇది రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసినట్లు కాదా? అని నిలదీశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచే ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని పట్టుపట్టకుండా తాత్సారం చేశారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా కావాలని ఎలుగెత్తి చాటడం మొదలుపెట్టిన తర్వాతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న భయంతో చంద్రబాబు ‘యూటర్న్‌’ తీసుకుని హోదా కోసం ధర్మపోరాట దీక్షలు చేస్తున్నానంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. హోదాపై చంద్రబాబు ఆడుతున్న నాటకాలతోపాటు ప్రత్యేక హోదా సాధన వల్ల రాష్ట్రానికి జరిగే ప్రయోజనాలను వివరించడమే ‘వంచనపై గర్జన’ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. 

ప్రత్యేక హోదాను సజీవంగా నిలిపింది.. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఒక్కరే
తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాకు పాతరేయాలని చూస్తే.. ప్రత్యేక హోదాను ఎప్పటికప్పుడు సజీవంగా నిలబెట్టి ప్రజల్లో ప్రధాన ఎజెండాగా చేసిన ఒకే ఒక వ్యక్తి.. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ అని ప్రజలకు గుర్తు చేశారు. 2014 ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ అందరూ కలిసి ఒకే వేదికపై నుంచి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని, ఆ తర్వాత అందరూ ప్రజలను వంచించారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా మాటెత్తితేనే జైలుకు పంపుతామని బెదిరించిన చంద్రబాబు ఇప్పుడు తానే ఏదో ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్లు బిల్డప్‌లు ఇస్తూ ధర్మ పోరాట దీక్షలు చేయడం విడ్డూరమన్నారు. అలాగే ఆయనకు భజన చేస్తున్న అనుకూల మీడియా కూడా చరిత్రను కప్పిపుచ్చుతూ చంద్రబాబే హోదా కోసం పోరాటం చేస్తున్నట్లు చిత్రీకరిస్తోందన్నారు. నాలుగున్నరేళ్లు బీజేపీతో అంటకాగిన చంద్రబాబు ఎందుకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదని నిలదీశారు. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుంటున్నానని చెప్పి కేంద్ర నేతలకు సన్మానం చేసిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. 

ఎన్డీయే ప్రభుత్వం నుంచి చంద్రబాబు బయటకొచ్చింది అందుకే..
ఎన్డీయే ప్రభుత్వం నుంచి చంద్రబాబు వైదొలగింది ప్రత్యేక హోదా కోసం కానే కాదని వైఎస్సార్‌సీపీ నేతలు అన్నారు. చంద్రబాబు కోరినట్లుగా అసెంబ్లీ నియోజకవర్గాలను కేంద్రం పెంచకపోవడం, కేంద్రాన్ని అడ్డం పెట్టుకుని జగన్‌ను ఇబ్బందులు పెట్టాలనే వ్యూహం ఫలించకపోవడమే అందుకు కారణమని చెప్పారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి రాష్ట్రం ఏర్పాటుకు తానే సహకరించానని చంద్రబాబు చెప్పడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఆంధ్రులకు అన్యాయం చేసినట్లు కాదా? అని నిలదీశారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీని గెలిపించాలని కోరారు. నాలుగున్నరేళ్లుగా అనేక అంశాలపై చంద్రబాబు ఎలా ‘యూటర్న్‌’లు తీసుకున్నారో.. ఎలా దోపిడీకి పాల్పడ్డారో.. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎలా మభ్య పెట్టారో.. పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ప్రజలు కూడా ఒకరికొకరు చంద్రబాబు మోసాలపై చెప్పాలని కోరారు. 

శ్రీనివాసరావును పురికొల్పిన శక్తులేవి?
చంద్రబాబు మోసాలకు గురైన ప్రజలు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ను ఆదరించడాన్ని జీర్ణించుకోలేక చివరకు ఆయనను అంతమొందించేందుకు టీడీపీ కుట్ర చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనివాసరావు అనే సాధారణ యువకుడికి ప్రతిపక్ష నేతను హత్య చేయాలనే ఆలోచన ఎందుకు వస్తుంది? అసలు ఆయనను ఏ శక్తులు పురికొలిపాయి? దర్యాప్తు ఎందుకు ముందుకు సాగడం లేదు? అని సూటిగా ప్రశ్నించారు. జగన్‌ను ప్రజలే కాపాడాలని కోరారు. ఈ విషయం గురించి విద్యావంతులు, మేధావులు, న్యాయవాదులు, వైద్యులు అందరూ ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. 

వంచనపై గర్జన.. గ్రాండ్‌ సక్సెస్‌ 
రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు భారీగా వస్తాయని తద్వారా వ్యాపార, వాణిజ్య లావాదేవీలు కూడా పెరుగుతాయని, ఉపాధి అవకాశాలు కూడా మెండుగా ఉంటాయని అందువల్ల తాము ‘వంచనపై గర్జన’ సభకు మద్దతునిచ్చామని కాకినాడ మార్వాడీ సమాజ్‌ నేత నిర్మల్‌ జైన్‌ తెలిపారు. జైన్‌ ఆధ్వర్యంలో మహేందర్, నిషాన్, భన్వర్‌లాల్‌ జైన్‌తో సహా పెద్ద సంఖ్యలో మార్వాడీలు సంప్రదాయ తలపాగాలు చుట్టుకుని వచ్చి సంఘీభావం ప్రకటించడంపాటు ఎంపీ పదవులకు రాజీనామా చేసిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలకు తమ పాగాలు ధరింపజేసి సన్మానం చేశారు. కాకినాడ హిజ్రాల సంఘం కూడా తమ మద్దతు ప్రకటించింది. సభకు భారీ సంఖ్యలో హిజ్రాలు తరలివచ్చారు. వీరితోపాటు న్యాయవాదులు, టీచర్లు, మీసేవ ఉద్యోగులు భారీ ఎత్తున తరలివచ్చి తమ మద్దతును తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించడం, సర్వమత ప్రార్థనలతో ప్రారంభమైన సభ సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. జిల్లా నలుమూలల నుంచి వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. సభ జరిగినంత సేపూ.. ‘జై జగన్, ప్రత్యేక హోదా–ఆంధ్రుల హక్కు, సాధిస్తాం..సాధిస్తాం.. ప్రత్యేక హోదా సాధిస్తాం’ అనే నినాదాలతో మారుమోగింది. 

చంద్రబాబు నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి
చంద్రబాబు వంచన పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. హోదా కోసం నినదిస్తే జైలులో పెడతానన్న చంద్రబాబు ఇప్పుడు యూటర్న్‌ తీసుకుని అదే నినాదాన్ని అందుకోవడం ఆయన రాజకీయ అవకాశవాదాన్ని తెలియజేస్తోంది. చంద్రబాబు మూడే మూడు కారణాలతో మోదీకి దాసోహమయ్యారు. అవి ఏమిటంటే.. కమీషన్ల కోసం హోదా స్థానంలో ప్యాకేజీకి ఒప్పుకోవడం, అసెంబ్లీ స్థానాలను 175 నుంచి 225కు పెంచుకోవడం, జనాదరణ కలిగిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ను అడ్డు తొలగించుకోవడం. మోదీ గ్రాఫ్‌ తగ్గడంతో ఇప్పుడు రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్‌ పార్టీతో నిస్సిగ్గుగా చేతులు కలిపారు. చంద్రబాబులాంటి అవకాశవాద, నయవంచకుడు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎంతో ప్రమాదకరం. జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై సీబీఐ దర్యాప్తు జరగాలి. అప్పుడే వాస్తవాలు బయటకు వచ్చి చంద్రబాబు హత్యా రాజకీయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అందుకే భయపడి సీబీఐను తన అనుమతి లేనిదే రాష్ట్రంలోకి రావద్దనే స్థాయికి దిగజారారు. 
– మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ ఎంపీ


రాక్షస పాలన అంతం చేద్దాం 

నాలుగున్నరేళ్లు బీజేపీతో అధికారం పంచుకుని చివరి ఆరు నెలల్లో ప్రత్యేక హోదా అంటూ ధర్మపోరాటం పేరుతో చంద్రబాబు అధర్మ పోరాటం చేస్తున్నారు. ప్రత్యేక హోదాపై ప్రతిపక్షం చేసిన అనేక ఉద్యమాలను అవహేళన చేశారు. హోదాతో ఏమి వస్తుందన్నారు.. ప్యాకేజీ మంచిదన్నారు.. బీజేపీ మంత్రులను తీసుకొచ్చి సన్మానాలు చేశారు. ప్రత్యేక హోదాపై నిరంతరం పోరాడుతూ పార్లమెంట్‌లో మొదటిసారిగా బీజేపీపై అవిశ్వాసం పెట్టాం. 13సార్లు అవిశ్వాసం పెడితే చర్చకు రానీయకుండా బీజేపీ, టీడీపీ అడ్డుకున్నాయి. చివరి రోజున ఎంపీ పదవులకు మేము రాజీనామాలు చేశాం. అందరం రాజీనామా చేద్దామని టీడీపీ వాళ్లను కోరాం. రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని టీడీపీ నిరూపించుకుంది. చేస్తున్న దోపిడీ ఎక్కడ బయటకు వస్తుందోనని భయపడి రాలేదు. మేము ప్రాణాలు లెక్కచేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేశాం. 2016లో హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తున్నామంటే చంద్రబాబు ఎందుకు ఒప్పుకున్నారో ప్రజలకు చెప్పాలి. హోదా వల్ల ఏమొస్తుందన్న వ్యక్తి ఈ రోజు ఏం మొహం పెట్టుకుని హోదా అడుగుతున్నారు? ఎన్నికల్లో లబ్ధి కోసమే యూటర్న్‌ తీసుకున్నారు. అందరూ కలసి మోసం చేశారు. ప్రత్యేక హోదా సాధించే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంది. చంద్రబాబు రాక్షస పాలనను అంతం చేద్దాం. 
– వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ

వ్యక్తిగత ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేసే అవకాశవాది.. చంద్రబాబు
రాష్ట్ర ప్రయోజనాల కంటే తన వ్యక్తిగత, పార్టీ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేసే అవకాశవాది.. చంద్రబాబు. రాజకీయాల్లో 40 ఏళ్ల సీనియర్‌నని చెప్పుకునే చంద్రబాబుకు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు. కేంద్రంలో భాగస్వామిగా ఉండి, మంత్రులు కూడా ఉండి ఏమీ సాధించలేని పెద్ద అసమర్థుడు. చంద్రబాబు వచ్చాక రాష్ట్రంలో 10 లక్షల పింఛన్లు, 10 లక్షల రేషన్‌కార్డులతోపాటు రెండు లక్షల కాంట్రాక్టు ఉద్యోగాలు, 60 ప్రభుత్వ రంగ సంస్థలు రద్దయ్యాయి. జన్మభూమి కమిటీల పేరుతో కింది స్థాయి నుంచి అవినీతిని ప్రోత్సహించారు. దేశంలో అత్యంత ధనవంతుడైన సీఎంగా రికార్డులకు ఎక్కారు. ఇంత సొమ్ము ఎక్కడ నుంచి వచ్చిందో ఆయన సమాధానం చెప్పాలి. రానున్న ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ను గెలిపించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ పూర్వ వైభవానికి ప్రజలు కలిసికట్టుగా పనిచేయాలి. 
– వెలగపల్లి వరప్రసాద్, మాజీ ఎంపీ

ఆది నుంచీ చంద్రబాబు వంచకుడే..
విద్యార్థిగా ఉన్నప్పటి నుంచీ చంద్రబాబుకు వంచించడం అలవాటే. నాయకుడ్ని చేసిన కాంగ్రెస్‌ పార్టీకి, ఆదరించిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబు సొంతం. ఆంధ్రప్రదేశ్‌ విభజనకు అభ్యంతరం లేదని కేంద్రానికి లేఖ ఇచ్చి, ఆంధ్రా ప్రజలను మోసం చేసిన ఘనత బాబుదే. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చి, అన్నీ తాత్కాలికంగా ఏర్పాటు చేసి, నాలుగున్నరేళ్ల పాలన తర్వాత మంత్రివర్గాన్ని కూడా తాత్కాలికంగా ఏర్పాటుచేసుకుని తాత్కాలిక పదానికి పరిమితమైన ముఖ్యమంత్రి చంద్రబాబే. అమరావతిని ఇప్పటివరకూ పోస్టల్‌ పిన్‌కోడ్‌లేని రాజధానిగా రూపుదిద్దాడు. ఇప్పుడు రాహుల్‌గాంధీ కాళ్లదగ్గర మోకరిల్లాడు. ఏ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించాడో ఆ పార్టీ నాయకురాలి పాదాల దగ్గర ఎన్టీఆర్‌ ఫొటోను పెట్టడంతో మహానేత ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుంది. 
–ఆనం రామనారాయణరెడ్డి, మాజీ మంత్రి

బీజేపీని వీడాకే బాబుకు హోదా గుర్తొచ్చింది
మోదీ, చంద్రబాబు ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు. బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాకే చంద్రబాబుకు ప్రత్యేక హోదా గుర్తుకొచ్చింది. ఇటువంటి మోసపూరిత పాలన అందిస్తున్న చంద్రబాబును సముద్రంలో కలిపే రోజులు దగ్గరపడ్డాయి.
–మోపిదేవి వెంకటరమణ, మాజీ మంత్రి  

ధనిక సీఎంగా ఎలా ఎదిగారో చెప్పాలి
రెండు ఎకరాల భూమి నుంచి రూ.లక్షల కోట్లకు చంద్రబాబు ఎదిగారు. దేశంలోనే ధనిక సీఎంగా ఎలా ఎదిగారో ఆయన సమాధానం చెప్పాలి. ఇసుక, మట్టి, భూదందాలు చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు దోచుకుంటున్నారు. వీరందరికీ చంద్రబాబే అండగా ఉంటున్నారు. హైదరాబాద్‌ వెళ్లి ఎయిర్‌పోర్టు, ఓఆర్‌ఆర్‌ నిర్మించానంటూ సిగ్గు, లజ్జ లేకుండా మాట్లాడుతున్నారు. ధర్మపోరాట దీక్షలంటూ మొదలుపెట్టిన చంద్రబాబు ముందు దోమలపై పోరాటం మొదలుపెట్టి వాటిపై కూడా గెలవలేకపోయాడు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనకు, చంద్రబాబు పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని ఇప్పటికే ప్రజలు గ్రహించారు.
– కొలుసు పార్థసారథి, మాజీ మంత్రి

ప్రజలకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారు
ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన చంద్రబాబు ప్యాకేజీ కోసం తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టాడు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక హోదా ఉద్యమంపై యూటర్న్‌ తీసుకున్నాడు. తన అవినీతి కుంభకోణాలు బయటకు వస్తాయన్న భయంతో సీబీఐ, ఈడీ, ఐటీ వంటి విచారణ సంస్థలు రాష్ట్రంలో రానీయకుండా నిషేధాజ్ఞలు జారీ చేస్తున్నాడు. 1000 అబద్ధాలు ఆడైనా మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు. 
–ఆదిమూలం సురేశ్, ఎమ్మెల్యే

అలీబాబా 40 దొంగలు
చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అలీబాబా 40 దొంగల్లా తయారయ్యారు. రాష్ట్రాన్ని నిలువునా దోచుకుంటున్నారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పార్టీ జెండా ఏమిటో చెప్పగలరా? కాంగ్రెస్‌ వ్యతిరేకతతో పుట్టిన టీడీపీ ఇప్పుడు కాంగ్రెస్‌ జెండాను నిస్సిగ్గుగా కప్పుకున్న వ్యవహారంపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? 
– చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే

ప్రత్యేక హోదాపై పోరాడింది జగన్‌ ఒక్కరే
ప్రత్యేక హోదాపై పోరాడింది వైఎస్‌ జగన్‌ ఒక్కరే. ఇప్పుడు సీఎం చంద్రబాబు యూటర్న్‌ తీసుకుని తీసుకుని సిగ్గు లేకుండా ధర్మపోరాట దీక్ష చేస్తున్నారు. మోదీకు నోట్లు రద్దు చేయమని నేనే చెప్పానన్న చంద్రబాబు ఇప్పుడు నోట్ల రద్దుతో వ్యవస్థ చెడిపోయిందని పేర్కొనడం హాస్యాస్పదం. 
– దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యే

హోదా కోసం పోరాడింది జగన్‌ ఒక్కరే
ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన మొట్టమొదటి నాయకుడు.. వైఎస్‌ జగన్‌ ఒక్కరే. జగన్‌ ముఖ్యమంత్రి అయితే ఎక్కడ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదిస్తాడోనని ఆయనను ముఖ్యమంత్రి కాకుండా అన్ని పార్టీలు అడ్డుకుంటున్నాయి. చిరంజీవి తమ్ముడిగా సినీ రంగంలో ప్రవేశించిన పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు ఆయన పేరు కూడా ప్రస్తావించడం లేదు. చిరంజీవి లేకపోతే పవన్‌కు ఇన్ని పేరు ప్రఖ్యాతులు వచ్చేవా? 
– అనిల్‌ కుమార్‌ యాదవ్, ఎమ్మెల్యే  

చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం
చంద్రబాబు నిజస్వరూపం ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. ప్రతి ఎన్నికలకు ముందు ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న ఆయన ఇప్పుడు కూడా అదే వైఖరితో ముందుకు వచ్చారు. తిరుపతి దర్శనానికి సిఫార్సు లేఖలు ఇవ్వడానికి కూడా రూ.500లు తీసుకునే నీచ స్థితికి జన్మభూమి కమిటీలు దిగజారాయి. రూ.16 వేల కోట్లతో పూర్తికావాల్సిన పోలవరం ప్రాజెక్టును ముడుపుల కోసం రూ.58 వేల కోట్లకు పెంచిన ఘనత చంద్రబాబుదే. ఆయన పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. 
– వెన్నపూస గోపాలరెడ్డి, ఎమ్మెల్సీ 

ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారు
నమ్మక ద్రోహం చేసే తెలుగుదేశం వంటి పార్టీని తెలుగు ప్రజలు ఏ మాత్రం క్షమించరు. పోలవరం ప్రాజెక్టు ద్వారా వచ్చే కమీషన్లు, ఇతర స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాను చంద్రబాబు కేంద్రం వద్ద తాకట్టు పెట్టారు. కేంద్ర బడ్జెట్‌లో రక్షణ శాఖ కేటాయింపులు మినహా మిగిలిన నిధుల్లో 30 శాతం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు నిధుల రూపంలో వచ్చే అవకాశం ఉన్నా వద్దని.. ప్యాకేజీ బెటర్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా పొందే అన్ని అవకాశాలు ఉన్నా బీజేపీ సర్కార్‌కు సలాం చెప్పి రాష్ట్ర ప్రయోజనాలను మంటగలిపారు. చంద్రబాబు తీరుతో ఈ రోజు రాష్ట్ర పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి మరోసారి కొత్త డ్రామాలకు తెరతీస్తూ ప్రజల ముందుకు వస్తున్న చంద్రబాబును ప్రజలే తరిమికొట్టాలి. ఎన్నికల్లో 600లకుపైగా హామీలిచ్చి ఏ ఒక్కటీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న ఇలాంటి దగా కోరు విధానాలను సామాన్యులతోపాటు, విద్యావేత్తలు, మేధావులు ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్య మనుగడ ప్రమాదంలో పడుతుంది. 
 – పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్సీ

చంద్రబాబును పదవి నుంచి దించడం ఖాయం
చంద్రబాబును ప్రజలు పదవి నుంచి దించడం ఖాయం. ప్రజాసంక్షేమాన్ని విస్మరించి, రూ.కోట్ల ఆస్తులను స్వాహా చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాటం చేస్తుంటే చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుని రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం లొసుగులతో మన రాష్ట్రం కేంద్రం దృష్టిలో చులకనైంది. సోనియా గాంధీని గాడ్సేతో పోల్చిన చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవడం దుర్మార్గం. తన రాజకీయ స్వలాభం కోసం ఏ పార్టీతోనైనా జతకట్టే స్వభావం ఉన్న వ్యక్తి చంద్రబాబు ఒక్కరే.
–కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీ 

బాబు, పవన్‌లను ప్రజలు క్షమించరు
లాలూచీ రాజకీయాలతో ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లను ప్రజలు ఏ మాత్రం క్షమించరు. ప్యాకేజీలు అందుకున్న మరుక్షణం స్వరం మార్చి ప్రతిపక్షాన్ని విమర్శిస్తున్న పవన్‌ తీరు చూసి ప్రజలు విస్తుపోతున్నారు. 
–ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే

వంచన పాలనకు త్వరలోనే చరమగీతం
చంద్రబాబుకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఆయన వంచన పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉంది. చంద్రబాబు కొంగజపాన్ని నమ్మి ప్రజలు ఆయనకు అధికారం అప్పగిస్తే ప్రజలను నిలువునా వంచించారు. ఆంధ్రప్రదేశ్‌కు తీరని ద్రోహం చేసిన కాంగ్రెస్‌ పార్టీతో కూడా చేతులు కలిపేంత నీచ స్థితికి దిగజారారు. అధికారం కోసం ఎంతకైనా దిగజారే తెలుగుదేశం వంటి పార్టీలు ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని నష్టం చేస్తాయి. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడవడం నుంచి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనేంత స్థాయి వరకు చంద్రబాబు దేనికైనా దిగజారే వ్యక్తి. 
– కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే

హోదా కోసం వైఎస్‌ జగన్‌ ఎంపీలతో రాజీనామా చేయించారు
పదవుల కంటే జాతి ప్రయోజనాలే ముఖ్యమని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ నిరూపించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం తమ ఎంపీలతో రాజీనామా చేయించారు. అయితే చంద్రబాబు వ్యవహారశైలి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. విలువలపైనా, రాజ్యాంగంపైనా చంద్రబాబుకు ఎలాంటి నమ్మకాలు లేవు. మట్టి, ఇసుక, మద్యం సహా అన్నింటా దోపిడీ పర్వం సాగుతోంది. చంద్రబాబు నక్కజిత్తులను ప్రజలు నమ్మరు.
–  రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎమ్మెల్యే

ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు?
బాబు వస్తే జాబు ఇస్తాడని ప్రచారం చేసుకున్న చంద్రబాబు ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాడు? నిరుద్యోగ భృతి రూ. 2 వేలు ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి వెయ్యిరూపాయలు ఇచ్చారు. డ్వాక్రా రుణమాఫీ పేరుతో 2 కోట్ల మంది మహిళలను, రైతు రుణాల మాఫీ, బంగారం రుణాల మాఫీ అని చెప్పి రైతులను నట్టేట ముంచారు. అన్ని వర్గాలు, కులాలు, పేద,బడుగు, బలహీన వర్గాలకు 650 వాగ్దానాలు ఇచ్చి మోసం చేసిన నయవంచకుడు చంద్రబాబు. 
– పినిపె విశ్వరూప్, మాజీ మంత్రి

బాబు రాష్ట్ర ప్రజలను మోసం చేశారు
చంద్రబాబు రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేశాడు. ‘ఎవరైనా దళితుల్లో పుట్టాలని అనుకుంటారా?’ అని ఎస్సీలను అవహేళన చేశారు. ఎస్టీలకు మంత్రి పదవులు లేవు. బీసీలకైతే పారలు, ఇస్త్రీ పెట్టెలు ఇచ్చి సరిపెట్టారు. రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరగడానికి ముఖ్య కారకుడు చంద్రబాబే. 
– గొల్ల బాబూరావు, మాజీ ఎమ్మెల్యే       

ప్రజలు అప్రమత్తం ఉండాలి
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్‌తో కలుస్తున్నానంటూ చంద్రబాబు మరో మోసానికి తెర తీస్తున్నారు. ఈ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. చంద్రబాబు మోసపూరిత విధానాలను తరిమికొట్టాలి. పోలవరం, పట్టిసీమలను కాసుల కోసం చేపట్టి ప్రజాప్రయోజనాలను గాలికొదిలారు. ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న ఏకైక వ్యక్తి జగన్‌ మాత్రమే.
 – మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్సీ

ముస్లింలకు రిజర్వేషన్లు వైఎస్‌ చలవే..
ముస్లింలకు రిజర్వేషన్లు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వల్లే వచ్చాయి. చంద్రబాబు ఏపీలో దోచుకున్న సొమ్మును తెలంగాణలో పంచి పెడుతున్నారు. తిత్లీ తుపానులో వేలాది కుటుంబాలు నష్టపోతే వారిని పట్టించుకున్న పాపానపోలేదు. 
–రెహ్మాన్, మాజీ ఎమ్మెల్సీ

ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేదు
చంద్రబాబు 600 హామీలిచ్చి దేన్నీ పూర్తిగా అమలు చేయలేదు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేం, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానంటే బీజేపీ నేతలకు చంద్రబాబు సన్మానాలు చేశాడు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో చుట్టుపక్కల రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో ఖర్చుపెడుతున్నాడు. తన అవినీతి బయటపడుతుందని కాగ్, సీబీఐని వద్దంటున్నాడు. 
– సత్యనారాయణరాజు, మాజీ ఎమెల్సీ

వంచనకు మారుపేరు చంద్రబాబు
వంచనకు మారుపేరు.. చంద్రబాబు. గత ఎన్నికల్లో రైతు, డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో ప్రజలను మోసం చేసి ఏ ఒక్కరికీ పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయారు. జాబు కావాలంటే బాబు రావాలంటూ ప్రచారం చేసి, ప్రతి ఇంటికీ ఉద్యోగం ఇస్తానని యువతను మోసం చేశారు. 
–జక్కంపూడి రాజా, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు

వైఎస్‌ లేకపోతే ఎస్సీ సబ్‌ ప్లాన్‌ లేదు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి లేకపోతే ఎస్సీ సబ్‌ ప్లానే లేదు. దీని వల్లే ఎస్సీ కాలనీలు బాగుపడ్డాయి. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చడానికి వైఎస్సార్‌ పార్లమెంటుకు పంపిన బిల్లుపై చంద్రబాబు ఏనాడూ పోరాటం చేయలేదు. 
–మేరుగ నాగార్జున, ఎస్‌సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు

నాలుగున్నరేళ్లలో చీకటి తప్ప మరేమీ లేదు
పార్లమెంట్‌ తలుపులు మూసివేసి, రాష్ట్రాన్ని విభజిస్తూ కంటి తుడుపు చర్యగా ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. అప్పటి ప్రధాని ఐదేళ్లు అంటే పదేళ్లు అని బీజేపీ అన్నది. ఆ హామీ అమలు చేస్తామని, తెస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి వంచన చేసిన బీజేపీ, టీడీపీ ప్రభుత్వాల తీరును నిరసిస్తున్నాం. వైఎస్సార్‌ హయాంలో దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా ఎదిగే సమయంలో ఆయన్ను కోల్పోయాం. అలాంటి రాష్ట్రాన్ని కేంద్రంలో అధికార, ప్రతిపక్షాలు, ఇక్కడ టీడీపీ కుమ్మక్కై రెండు ముక్కలు చేశాయి. 2019లో వైఎస్‌ జగన్‌ గెలవబోతున్నాడన్న భయం అప్పుడే చంద్రబాబుకు పట్టుకుంది. ఆయన పార్టనర్‌ పవన్‌ కల్యాణ్‌ ఇటీవల ఇదే విషయం చెప్పారు. బీజేపీ, జనసేనలతో కలసి లెక్కనేనన్ని అలవిగాని హామీలు ఇచ్చి సీఎం కుర్చీలో కూర్చున్నారు. నాలుగున్నరేళ్లలో ఏం జరిగిందని వెనక్కి తిరిగి చూస్తే చీకటి తప్ప మరేమీ కనిపించడంలేదు. ఆ రోజు వైఎస్‌ జగన్‌ సీఎం అయి ఉంటే పోలవరం పూర్తయ్యేది. వైఎస్సార్‌ తర్వాత ఆగిపోయిన ప్రాజెక్టు, ఇతర అభివృద్ధి పనులు పూర్తయ్యేవి. హైదరాబాద్‌ నుంచి పాలన చేస్తూ అభివృద్ధి చేసుకునేవాళ్లం. నాలుగేళ్ల క్రితం రూ.90 వేల కోట్లు ఉన్న మన రాష్ట్ర అప్పు ఇప్పుడు రూ.2.40 లక్షల కోట్లకు చేరింది.

నాలుగున్నరేళ్లు కేంద్రంలో భాగస్వామిగా ఉండి విచారణలు లేకుండా చేసుకున్నారు. విభజనతో ఒక దెబ్బ తగిలితే ఈ నాలుగున్నరేళ్లలో దోపిడీతో రెండో దెబ్బ తగిలింది. బ్యాంకులను కొల్లగొట్టిన విషయం తెలిసీ సుజనా చౌదరికి మంత్రి పదవి ఇచ్చారు. రాష్ట్రం మనగలగాలంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యం. ప్రధాని మోదీని ఎంపీలతో వెళ్లి కలసిన మొదటిసారే ప్రత్యేక హోదా తక్షణమే అమలు చేయాలని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడిగారు. విభజన బాధకు ఉపశమనం కల్పించాలని కోరారు. వైఎస్‌ జగన్‌ నిర్వహించిన యువభేరి, ఇతర సభలతో ప్రత్యేక హోదా అంశంపై ప్రజలకు అవగాహన వచ్చింది. పార్లమెంట్‌లో అవిశ్వాసం పెట్టి, ఆపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామా చేశారు. తన తెప్ప మునుగుతుందని గ్రహించిన చంద్రబాబు అప్పటి వరకు ప్రత్యేక హోదాను హేళన చేసి, ఒక్కసారిగా యూ టర్న్‌ తీసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశాన్ని రక్షిస్తున్నానంటూ, ప్రజాస్వామ్య పరిరక్షణకంటూ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నారు. తాను బట్టలు వేసుకోకున్నా కూడా సూటు బూటు ఉన్నట్లు అనుకూల మీడియా చూపుతుందనే చంద్రబాబు బరితెగించారు. వచ్చే ఎన్నికలు చాలా విలువైనవి. రాష్ట్రం ముందుకు వెళ్లాలా? అంధకారంలోకి వెళ్లాలా? అనేది ఆలోచించుకుని ప్రజలు ఓట్లు వేయాలి. 25 ఎంపీ సీట్లు, 140 ఎమ్మెల్యే సీట్లు గెలిపించుకోవాలి. కేంద్రంలో ఎవరు వచ్చినా మెడలు వంచి ప్రత్యేక హోదా తెచ్చుకుందామన్న వైఎస్‌ జగన్‌ మాటలను మళ్లీ మేము చెబుతున్నాం. 
– సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 

వైఎస్‌ పథకాల్ని నిర్వీర్యం చేసిన చంద్రబాబు
కులమతాలకు, పార్టీలకు అతీతంగా మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అమలు చేసిన ఉచిత విద్య, ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో రాష్ట్ర ఖ్యాతి దేశ, విదేశాల్లో వ్యాపించింది. అటువంటి పథకాలన్నీ చంద్రబాబు కుటిల రాజకీయాలతో నిర్వీర్యమయ్యాయి. బాబు వస్తే జాబ్‌ వస్తుందని ఎంతమందిని నమ్మించారు? లోకేష్‌ బాబుకు తప్ప ఏ బాబుకూ ఉద్యోగం ఇవ్వకుండా చంద్రబాబు మోసం చేశారు, డ్వాక్రా మహిళలకు, రైతులకు రుణమాఫీ చేస్తానన్న హామీలు ఎంత వరకు నెరవేరాయో తెలియచేయాలి. ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అన్న నోటితో ఇప్పుడు ధర్మపోరాట దీక్షలు చేయడానికి చంద్రబాబుకు సిగ్గులేదా?  
–జక్కంపూడి విజయలక్ష్మి, పీఏసీ సభ్యురాలు

టీడీపీ రీచార్జ్‌ కార్డులా పవన్‌కల్యాణ్‌
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై వ్యాఖ్యలు చేసేందుకు చంద్రబాబు.. పవన్‌కల్యాణ్‌ను రీచార్జ్‌ కార్డులా వాడుకున్నారు. జనసేన పార్టీ ఎంత లీజుకు టీడీపీతో ఉందో అర్థం కావడం లేదు. 
–గుడివాడ అమర్‌నాథ్, అనకాపల్లి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు 

సీఎం కుర్చీ కోసం చంద్రబాబు నీచ రాజకీయాలు 
సీఎం కుర్చీ కోసం ఎంతటి నీచ రాజకీయాలకైనా దిగజారే వ్యక్తి.. చంద్రబాబు. అంతా సిద్ధంగా ఉన్నా బందరు పోర్టును ప్రారంభించకుండా పదివేల ఎకరాలు కావాలంటూ అక్కడి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. బాబు పాలనలో పనిచేసిన నలుగురు చీఫ్‌ సెక్రటరీలు ఆయన విధానాలను తప్పుపట్టారంటే చంద్రబాబు పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 
– సామినేని ఉదయభాను, విజయవాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు

చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి
హోదా విషయంలో కేంద్రం దగా చేసిందంటూ చంద్రబాబు చేస్తున్న విమర్శలు విడ్డూరంగా ఉన్నాయి. నాలుగేళ్లు కేంద్రంతో కలిసి ఉండి ఇప్పుడు మొసలికన్నీరు కారిస్తే ప్రజలు నమ్మేస్థితిలో లేరు. రాష్ట్రానికి చేసిన అన్యాయానికి ముందుగా ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. 
– మార్గాని భరత్, రాజమహేంద్రవరం పార్లమెంట్‌ కోఆర్డినేటర్‌

ఊసరవెల్లి సిగ్గుపడేలా చంద్రబాబు తీరు
చంద్రబాబు తీరును చూసి క్షణానికో రంగు మార్చే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది. కాంగ్రెస్‌ వ్యతిరేకంగా పుట్టి తెలంగాణలో ఆ పార్టీని అక్కున చేర్చుకున్న తీరును చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. స్వార్థం కోసం చంద్రబాబు ఎంతటికైనా దిగజారతాడనేదానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి.
– సాకే ప్రసన్నకుమార్, జెడ్పీ ప్రతిపక్ష నేత

 ప్రత్యేక ఆకర్షణగా రోబో
వంచనపై గర్జనలో మానవ రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గుంటూరు జిల్లా పెదనందిపాడుకి చెందిన డి.డానియేల్‌ మానవ రోబో వేషధారణలో గర్జన సభలో సందడి చేశాడు. వైఎస్సార్‌సీపీ లోగోలతో తయారుచేసిన దుస్తులు ధరించి బ్యాటరీ సహకారంతో మిరుమిట్లు కొలిపే దీపాలతో హల్‌చల్‌ చేశాడు. ఈ సందర్భంగా డానియేల్‌ మాట్లాడుతూ తాను జగన్‌ వీరాభిమానినన్నారు. జగన్‌ సీఎం కావాలని ఆశిస్తున్నానన్నారు. 

హిజ్రాల మద్దతు
వంచనపై గర్జన సభకు కాకినాడకు చెందిన 20 మంది హిజ్రాలు హాజరై వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలిపారు. జగన్‌ సీఎం కావాలని నినాదాలు చేశారు.

జైన్‌ల మద్దతు
వంచనపై గర్జన సభకు కాకినాడకు చెందిన జైన్‌లు పెద్ద ఎత్తున హాజరై వైఎస్సార్‌సీపీకి మద్దతు పలికారు. రానున్న ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

ప్రత్యేక ప్రార్థనలతో ప్రారంభం
వంచనపై గర్జన సభను ముందుగా వందేమాతరంతో ప్రారంభించారు. తదుపరి క్రైస్తవ, ముస్లిం, హిందూ మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావాలని, జగన్‌ ముఖ్యమంత్రి కావాలని ఆశీస్సులు అందజేశారు.

బ్రోచర్‌ విడుదల 
2015, మార్చి నుంచి 2018, ఆగస్టు తొమ్మిది వరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా కోరుతూ చేసిన ఉద్యమాల వివరాలతో  ‘ప్రత్యేక హోదా–జగన్‌ పోరాటం’ పేరుతో రూపొందించిన బ్రోచర్‌ను ఈ సభలో ఆవిష్కరించారు. ఈ బ్రోచర్‌లో ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ జగన్‌ ఢిల్లీలో చేసిన ధర్నాలు, కేంద్రానికి రాసిన లేఖలు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చేసిన ధర్నాలు, ఉద్యమాల వివరాలను పొందుపరిచారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top