అది చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య: వైఎస్‌ విజయమ్మ

YS Vijayamma Reached To New Delhi - Sakshi

న్యూఢిల్లీ, సాక్షి : ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం తమ పదవులను త్యాగం చేసి, అమరణ నిరాహారదీక్ష చేస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలను పరామర్శించడానికి ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ఆదివారం ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్‌ సీపీ అని అన్నారు. వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మొదటి నుంచి ప్రత్యేక హోదాకై అలుపెరుగని పోరాటం చేస్తున్నారని, హోదా ముగిసిపోయిన అధ్యాయం కాదని, ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు అని అన్నారు. ఇందుకోసం నాలుగేళ్లుగా వైఎస్‌ జగన్‌ యువభేరీలు, ఆమరణ దీక్షలు, సభలు నిర్వహించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకున్నారని ఆమె విమర్శించారు.

గతంలో ప్రతిపక్ష నేత మాట్లాడకుండా మైక్‌ కట్‌ చేశారని, ఇప్పుడు పార్లమెంట్‌లో కూడా అదే జరిగిందని వైఎస్‌ విజయమ్మ మండిపడ్డారు. 12 సార్లు అవిశ్వాసం పెడితే, చర్చకు రాకుండా చేసిన కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. అయినా ప్రత్యేక హోదా  కోసం వైఎస్సార్‌ సీపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రపంచంలో సాధ్యం కానిది ఏదీ లేదని, పోరాడితే కచ్ఛితంగా ప్రభుత్వాలు దిగొస్తాయన్నారు. ప్రత్యేక హోదా కోసం ఏపార్టీ నాయకుడు చేయని పని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేశారని, ఎంపీలతో రాజీనామాలు చేయించి ఆమరణ దీక్షకు కూర్చోపెట్టారని పేర్కొన్నారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే నాయకులు ఇప్పటి వరకూ ఏం చేశారంటూ ఆమె ప్రశ్నించారు. ఆగమేఘాల మీద రాష్ట్రాన్ని విభజన చేశారని, కానీ విభజన హామీల అమలు మాత్రం మరచిపోయారని అన్నారు. ప్రస్తుతం రాజకీయ విలువలు పడిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు కోసం ఆమరణ దీక్షకు కూర్చున్న వారితో చర్చించడానికి కూడా ప్రభుత్వాలు రాలేదని వైఎస్‌ విజయమ్మ విమర్శించారు. దీక్షలో ఆరోగ్యం క్షీణించిన మేకపాటి రాజమోహన్‌ రెడ్డిని పరామర్శించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. హోదా వచ్చే వరకూ ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. వెనుక ఒకటి.. ముందు ఒకటి మాట్లాడటం, వెన్నుపోటు పొడవటం చంద్రబాబుకు అలవాటు అంటూ విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌కు అలాంటి అలవాటు లేదని చంద్రబాబుకు చురకలంటించారు. పాదయాత్రలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రజల సమస్యలను దగ్గర నుంచి చూశారని, ఎక్కడెక్కడ, ఎవరెవరికి ఏం కావాలో స్పష్టంగా తెలుసుకున్నారని, ఇప్పడు తండ్రి లాగే రాజన్న బిడ్డ సైతం ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్నారని ఆమె తెలిపారు. వైఎస్‌ఆర్‌ కంటే వైఎస్‌ జగన్‌ మెరుగైన పరిపాలన అందించగలరని వైఎస్‌ విజయమ్మ ఆశాభావం వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top