కుప్పంను పట్టించుకోని బాబు రాష్ట్రానికి అవసరమా?

YS Vijayamma Comments On Chandrababu In Chittoor - Sakshi

పనుల్లేక కుప్పం ప్రజలే అత్యధికంగా వలస పోతున్నారు

రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు

ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేదు

మహిళల మీద టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు దాడులు చేస్తున్నారు

అలాంటి వారికి అండగా చంద్రబాబు

నవరత్నాలతో మళ్లీ రాజన్న రాజ్యం 

చిత్తూరు జిల్లా పూతలపట్టు, చంద్రగిరి నియోజకవర్గాల్లో వైఎస్‌ విజయమ్మ ఎన్నికల ప్రచారం

చిత్తూరు అర్బన్‌: చంద్రబాబు ఈ ఐదేళ్లలో తన సొంత జిల్లాకు కూడా ఒరగబెట్టిందేమీ లేదని వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ధ్వజమెత్తారు. గిట్టుబాటు ధరల్లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని.. పనుల్లేక కుప్పం ప్రజలు వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా? అని ప్రశ్నించారు. శుక్రవారం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం, చంద్రగిరి నియోజకవర్గం మంగళంలో విజయమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో ఆమె ఏం మాట్లాడారంటే..

ఈ ఐదేళ్లూ చిత్తూరుకు ఏం చేశావ్‌?
‘‘వైఎస్సార్‌ అన్ని ప్రాంతాలను సమానంగా చూసేవారు. అందుకే ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. మరి చంద్రబాబు ఏం చేశాడు? సొంత జిల్లా చిత్తూరుకు కూడా  ఏమీ చేయలేకపోయాడు. ఒక జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి అయితే.. ఆ ప్రాంత ప్రజలు చాలా సంతోషిస్తారు. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. చంద్రబాబు పాలనతో చిత్తూరు జిల్లా ప్రజలు ఇంకా ఎక్కువ బాధపడుతున్నారు. ఇక్కడి చక్కెర రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజశేఖరరెడ్డి హయాంలో ఇక్కడి షుగర్‌ ఫ్యాక్టరీలు లాభాల్లో నడిచేవి. రైతులు చాలా సంతోషంగా ఉండేవారు. చంద్రబాబు రావడంతోనే ఇక్కడి సహకార రంగ సంస్థలు, ఫ్యాక్టరీలు మూతపడేలా చేశాడు. ఉద్యోగుల్ని రోడ్డున పడేశాడు. రైతులు వలస పోయే పరిస్థితి కల్పించాడు. ఈరోజు ఆయన సొంత నియోజకవర్గం కుప్పం నుంచే అత్యధిక మంది వలస పోయారు. చంద్రబాబు దళారీ అవతారమెత్తి మామిడికి కూడా గిట్టుబాటు ధర లేకుండా చేశాడు. దేశంలోనే మంచి పేరున్న విజయా డెయిరీని.. బాబు తన హెరిటేజ్‌ లాభాల కోసం మూయించి వేశాడు.  

బాబు చదువుకున్న బడినీ పట్టించుకోలేదు..
బాబు పుట్టిన ఊరికి, జిల్లాకు ఏమీ చేయలేదు. చివరకు ఆయన చదువుకున్న బడిని కూడా పట్టించుకోలేదు. ఇక రాష్ట్రానికి ఏం చేస్తాడు? రాజశేఖర్‌రెడ్డి తన గురువు పేరుతో విద్యాలయం ఏర్పాటు చేసి వేలాది మంది పేద విద్యార్థుల్ని ఉచితంగా చదివించారు. ఆస్పత్రి పెట్టారు. అవి ఇప్పటికీ సేవలందిస్తున్నాయి. 40 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇది మాకూ, బాబుకు ఉన్న తేడా. 

ఎస్సీ, ఎస్టీలకు ఒక్క ఎకరమైనా ఇచ్చావా?
హంద్రీ–నీవా ప్రాజెక్టును రాజశేఖరరెడ్డిగారు ప్రారంభించి 80 శాతం పనులు పూర్తి చేశారు. ఆ తర్వాతి ప్రభుత్వం కొంత మేర పనులు చేసింది. చంద్రబాబు వచ్చే నాటికి 2 నుంచి 3 శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఐదేళ్లలో వాటిని కూడా చంద్రబాబు పూర్తి చేయలేకపోయాడు. ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదు. గాలేరు–నగరి ప్రాజెక్టు పరిస్థితీ అంతే. రాజశేఖరరెడ్డి ఎస్సీ, ఎస్టీలకు 32 లక్షల ఎకరాలు ఇచ్చారు. చంద్రబాబు ఎస్సీ, ఎస్టీలకు ఒక్క ఎకరమైనా ఇచ్చాడా? రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా ఇవ్వలేదు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? 

బాబు లాంటి దుర్మార్గపు అన్న ఎవరికీ వద్దు..
చంద్రబాబు ఇసుక నుంచి మట్టి, బొగ్గు దాకా అన్నీ దోచుకున్నాడు. రాజధాని భూములు, దళితుల భూములు, గుడి భూములు.. ఇలా అన్నీ అమ్ముకుని తింటున్నారు. రూ.12,500 కోట్ల విలువైన ఇసుకను దోచేశారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఈరోజు చంద్రబాబు ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా విధించింది. ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా? గత ఎన్నికలప్పుడు 600కు పైగా హామీలిచ్చాడు. ఒక్కటైనా అమలు చేశాడా? రైతులకు రుణమాఫీ జరిగిందా? చంద్రబాబు వల్ల రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు కూడా రావడం లేదు. రైతులకు పెట్టుబడి కోసం ఏటా రూ.12,500 ఇస్తానని జగన్‌ ప్రకటిస్తే.. ఎన్నికల ముందు చంద్రబాబు అన్నదాత సుఖీభవ అంటున్నాడు. పెద్దన్ననంటున్నాడు.

డ్వాక్రా అక్కచెల్లెమ్మలను అడుగుతున్నా.. మీ రుణాలు మాఫీ అయ్యాయా? మరి ఇలాంటి వ్యక్తి ఈరోజు వచ్చి పసుపు కుంకుమ అంటున్నాడు. ఎన్నికల ముందు ఇచ్చి.. ఎన్నికలు అయిపోయాక ఆగిపోయే పసుపు కుంకుమ కావాలా అని అడుగుతున్నా? రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉందా? టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని మహిళా తహసీల్దార్‌ వనజాక్షిపై దాడి చేశాడు. అయినా కూడా చింతమనేనిని చంద్రబాబు వెనకేసుకొని వచ్చాడు. రిషితేశ్వరి, డాక్టర్‌ సంధ్యా రాణి.. ఇలా ఎంతో మంది విద్యార్థినులు హత్యకు గురైతే చంద్రబాబు ఆయా కేసుల్లోని నిందితులకు కొమ్ము కాస్తున్నాడు. ఇలాంటి దుర్మార్గపు అన్న మీకు అవసరమా? నవరత్నాలతో మీకు మేలు చేస్తానంటున్న జగనన్న కావాలా? ఒక్కసారి ఆలోచించండి.  

వైఎస్సార్‌ చివరి ఆలోచన కూడా ప్రజల గురించే..
ఒక్కసారిరాజశేఖరరెడ్డిగారి పాలనను గుర్తుకు తెచ్చుకోండి. ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు గుర్తు చేసుకోండి. నేడు ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోంది. విలువలకు, విశ్వసనీయతకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. చంద్రబాబుకు ఓటు వేసి మళ్లీ మోసపోవద్దు. మోసపూరిత హామీలను నమ్మొద్దు. రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎంతో మేలు చేశారు. అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చారు. లక్షలాది ఎకరాలకు నీళ్లందించేందుకు శ్రమించారు. 71 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారు. పేదవారికి కూడా కార్పొరేట్‌ వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీ తెచ్చారు. ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదవాలని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేశారు. ముస్లిం, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. ఒక్క పైసా కూడా పన్నులు, చార్జీలు పెంచకుండా సంక్షేమ పథకాలు అమలు చేశారు. ప్రజల ఇబ్బందులు తెలుసుకునేందుకు ‘రచ్చబండ’ కార్యక్రమంలో పాల్గొనేందుకు చిత్తూరు జిల్లాకు వస్తున్నప్పుడే ఆయన ప్రాణాలు కోల్పోయారు. చివరి క్షణం దాకా ప్రజల గురించే ఆలోచించారు.  

నా బిడ్డ మీకు అండగా ఉంటాడు..
రాజశేఖరరెడ్డిగారి మరణంతో కొన్ని వందల మంది గుండెలు ఆగిపోయాయి. వారి కుటుంబాలను పరామర్శించాలని జగన్‌ ఓదార్పు యాత్ర చేపట్టారు. దీంతో కాంగ్రెస్, టీడీపీ కలిసిపోయి  అక్రమ కేసులు బనాయించి జగన్‌ను జైల్లో పెట్టాయి. ఆ సమయంలో మా కుటుంబానికి తోడుగా నిలిచింది ప్రజలే. అందుకే మేము బయటకు వచ్చాం. జగన్‌ కూడా తొమ్మిదిన్నరేళ్లుగా ప్రజల మధ్యే ఉన్నాడు. పాదయాత్ర ద్వారా ప్రజల బాధలు విన్నాడు.. కష్టాలు తెలుసుకున్నాడు. మీకు ఏ కష్టమొచ్చినా.. వెంటనే వచ్చింది జగనే ఒక్కడే అనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. జగన్‌ తన తండ్రిలానే మీ కోసం  ఏమైనా చేస్తాడు. జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే మామిడికి గిట్టుబాటు ధర కల్పిస్తాం. షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపిస్తాం. చెరకు రైతులను ఆదుకుంటాం. హంద్రీ–నీవా, గాలేరు–నగరి పూర్తి చేస్తాం. ప్రతి ఎకరానికీ నీళ్లిస్తాం. విజయ డెయిరీని తెరిపిస్తాం. ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి పూతలపట్టు, చంద్రగిరి నియోజకవర్గాల అభ్యర్థులు ఎం.బాబు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి రెడ్డప్పను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా’’

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top