33వ రోజు పాదయాత్ర డైరీ

ys jagans 33 day padayatra diary - Sakshi

33వ రోజు
12–12–2017, మంగళవారం
రుద్రంపేట బైపాస్, అనంతపురం జిల్లా.

వైఎస్సార్‌ అభిమానులంటూ పింఛన్‌ రాకుండా చేయడం దుర్మార్గం

ఈ రోజు కురుకుంట కాలనీకి చెందిన పక్కీరప్ప తాత నన్ను కలిశాడు. ఆ తాత వయసు నూటతొమ్మిదేళ్లట. ఆయనది పింఛన్‌ రాని సమస్య. పధ్నాలుగు మంది పిల్లల్ని పెంచి పెద్దచేసిన ఆయనకు ఇప్పుడు కూలి పనులకు వెళ్తున్న బిడ్డలే ఇంత అన్నం పెడుతున్నారు. ‘నాకింత పింఛన్‌ వస్తే బాగుంటుంది కదా బిడ్డా’ అంటూ బాధపడిపోయాడు. సంవత్సరాలుగా ఎంపీడీవో ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా.. ఈ నెల, ఆ నెల, పై నెల.. అంటూ తిప్పుకొంటున్నారు తప్ప పని కాలేదు. వంద సంవత్సరాలు పైబడిన ఆ తాత పట్లే సర్కారు ఇంత నిర్దయగా ఉంటే ఇక మిగతా వారి సంగతేమిటి?

నాకు గుర్తుంది.. ఇంతకు ముందు చంద్రబాబు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక గ్రామంలో ఎవరికైనా కొత్తగా పింఛన్‌ రావాలంటే ఆ ఊరిలో అప్పటికే పింఛన్‌ వస్తున్నవారిలో ఎవరో ఒకరు చనిపోవాలి.. ఇప్పుడు పక్కీరప్ప తాత పరిస్థితి చూస్తే మళ్లీ అవే రోజులు వచ్చాయనిపిస్తోంది. నూటతొమ్మిదేళ్ల వృద్ధుడికే పింఛన్‌ రాకపోతే మరి దానికి కారణం ఏమనుకోవాలి? వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్ల విషయంలో చాలా ఫిర్యాదులున్నాయి. వాటిలో మరీ ముఖ్యమైనది, దుర్మార్గమనిపించేది.. మీరు వైఎస్సార్‌ మనుషులు, టీడీపీ వాళ్లు కాదంటూ అర్హత ఉన్నా పింఛన్లు రాకుండా చెయ్యడం.

ఈ రోజు కురుకుంట వద్ద అంధ మహిళల ఆశ్రమానికి వెళ్లాను. అక్కడ పాతికమంది దాకా అంధ మహిళలు ఉన్నారు. వారికి అన్నీ తానై దగ్గరుండి చూసుకుంటున్నాడు లక్ష్మీనారాయణ. ఆయనకూ కళ్లు కనిపించవు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఆయన దాతల సాయంతో, తన జీతం డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఆ ఆశ్రమాన్ని నడుపుతున్నాడు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం లేదని చెప్పాడు. కొంత చేయూతనందిస్తే మరికొంత మంది అంధుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నది ఆయన ఆశయం. ఆ ఉదాత్త ఆశయానికి చలించిపోయాను. నా వంతు సాయమందిస్తానని చెప్పాను. చూపులేని ఆ మహిళలు జగనన్నా.. అంటూ నాతో చేతులు కలిపి, సంబర పడిపోయిన దృశ్యం నన్ను కదిలించింది.

అక్కంపల్లి క్రాస్‌ దగ్గర నర్సింగ్‌ విద్యార్థినులు కలిశారు. నర్సింగ్‌ స్టూడెంట్లంటేనే చిన్నచూపు చూస్తున్నారని చెప్పి బాధపడ్డారు. ఎంతో సేవాతత్పరత కలిగిన పవిత్రమైన వృత్తిని ఎంచుకున్న వీరికి చేయూతనిస్తే.. ఆ వృత్తికే వన్నె తెస్తారనిపించింది. టెంపరరీ ఉద్యోగాలు కాకుండా తమకు పర్మినెంట్‌ పోస్టులు వచ్చేలా చూడాలని కోరారు. బాగా చదువుకుని, తమ కుటుంబాలను ఆదుకోవాలనుకుంటున్న ఆ ఆడపిల్లలను చూస్తే వీరే రేపటి భవిష్యత్తు అనిపించింది.

చివరిగా ముఖ్యమంత్రి గారికి నాదొక ప్రశ్న.. అర్హులైనా పింఛన్‌ రానివారు వందల సంఖ్యలో నాకే రోజూ తారసపడుతూ ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా వీరు ఇంకెంత మంది ఉన్నారో? అర్హులైన లక్షలాది మందికి పింఛన్లు రావడం లేదంటే మీరిస్తున్న అరాకొరా పింఛన్లలో అధికశాతం అనర్హులకు, మీ పార్టీ వారికే ఇస్తున్నారనడం వాస్తవం కాదా?

- వైఎస్‌ జగన్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top