‘కొంగ జపం – దొంగదీక్ష’

YS Jaganmohan Reddy fires on CM Chandrababu one day strike - Sakshi

రాజీనామాల అంశాన్ని కప్పిపుచ్చడానికే బాబు ఒక్కరోజు దీక్ష: వైఎస్‌ జగన్‌

ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించకుండా, ఆమరణ దీక్షలో కూర్చోనివ్వకుండా సీఎం చంద్రబాబు ఇప్పుడు దీక్షకు సిద్థం కావటాన్ని ‘‘కొంగ జపం – దొంగదీక్ష’’అని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబుది అంతా ‘వన్‌ డే ఫార్ములా’అని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా సాధన కోసం పార్లమెంట్‌లో వీరోచిత పోరాటం అనంతరం తమ పార్టీ ఎంపీలు పదవులకు రాజీనామా చేసి వస్తే, చంద్రబాబు మాత్రం టీడీపీ ఎంపీలతో రాజీనా మా చేయించకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు ఒక రోజు దీక్ష అంటూ డ్రామా మొదలు పెట్టారని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.  

శోభనాపురం వద్ద యాత్ర శిబిరంలో పార్టీ ఎంపీలు, సీనియర్‌ నేతలతో సమావేశమైన వైఎస్‌ జగన్‌

మిగతా ఎంపీలూ రాజీనామాలు చేస్తే కేంద్రం దిగి వచ్చేది: ప్రత్యేక హోదా డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చనందుకు నిరసనగా రాజీనామా చేసిన వైఎస్సార్‌ సీపీ లోక్‌సభ సభ్యులు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ను బుధవారం సాయంత్రం కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం శోభనాపురం వద్ద బసలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎంపీల రాజీనామాలు, ఏపీ భవన్‌ వేదికగా దీక్ష, రాష్ట్రపతితో భేటీ తదితర పరిణామాలను అధినేతకు వివరించారు. అనంతరం పార్టీ ఎంపీల పోరాటాన్ని అభినందిస్తూ జగన్‌ మాట్లాడారు. వైఎస్సార్‌ సీపీ ఎంపీలు రాజీనామా చేసినప్పుడే రాష్ట్రానికి చెందిన మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామాలు చేసి, ఆమరణ దీక్షకు దిగితే ఏపీకి జరిగిన అన్యాయంపై దేశవ్యాప్తంగా మరింత చర్చ జరిగి ఉండేదన్నారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చి ప్రత్యేక హోదా వచ్చి ఉండేదన్నారు.

బంద్‌లో పాల్గొన్నవారిపై కేసులా? 
ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తాజాగా జరిగిన రాష్ట్రవ్యాప్త బంద్‌లో పాల్గొనవద్దంటూ నోటీసులు జారీచేసి బెదిరింపులకు ఎందుకు పాల్పడ్డారని జగన్‌ ప్రశ్నించారు. బంద్‌లో పాల్గొన్న వారిపై కేసులు ఎందుకు పెట్టారని నిలదీశారు. హోదాపై భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయించేందుకు ఈనెల 22న పార్టీ ఎంపీలు, ప్రాంతీయ బాధ్యులతో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. సమావేశంలో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాదరావు, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితోపాటు శాసనమండలిలో ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, శాసన సభాపక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యన్నారాయణ పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top