అవన్నీ సర్కారీ హత్యలే 

YS Jaganmohan Reddy fires on CM Chandrababu about Boat Accident - Sakshi

నిప్పులు చెరిగిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌  

కళ్లెదుటే లైసెన్స్‌ లేని బోట్లు తిరుగుతున్నా స్పందించరు 

 ప్రభుత్వ నిర్లక్ష్యం, లంచగొండి తనం వల్లే వరుస ఘటనలు 

సీఎం చంద్రబాబుపై హత్యా నేరం కింద కేసు పెట్టాలి 

మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారమివ్వాలి 

తూతూ మంత్రపు విచారణలతో సరిపెడుతున్నారని మండిపాటు 

ఏదైనా ప్రమాదం జరిగిన ప్రతిసారీ చంద్రబాబు బయటకు వస్తారు.. మొసలి కన్నీరు కారుస్తారు.. ఒక డ్రామా.. ఒక సినిమా యాక్షన్‌.  అధికారులను గట్టిగా తిట్టినట్టు.. సహించేది లేదన్నట్టు.. పేపర్లలో, టీవీల్లో వేయిస్తాడు. ఎంక్వయిరీలు వేస్తారు. రిజల్టు మాత్రం రాదు. పుష్కరాల దగ్గర నుంచి ఈ తీరు చూస్తూనే ఉన్నాం. 

ఈ దుర్ఘటనలో బాధితుల్ని ఆదుకోవాలని, సహాయక చర్యల్లో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు పిలుపిచ్చాం. ఘటనకు గల కారణాలు కనుక్కోవాలని చెప్పాం. ఇందుకు మీరు (మీడియా) కూడా సహకరించండి. ప్రభుత్వం తలచుకుంటే రాష్ట్రంలో ఉన్న 70 లేదా వంద బోట్లను సరైనా స్థితిలో పెట్టగలిగి ఉండేది. ఆ పని కూడా చేయలేకపోతే ఇంత మంది అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు? 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో జరిగిన పడవ ప్రమాదాల్లో మృతులందరివీ సర్కారీ హత్యలేనని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, మంత్రులు మొదలు ముఖ్యమంత్రి వరకు అవినీతి, లంచాలు, పర్యవేక్షణ లోపం వల్లే అమాయకులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 163వ రోజు బుధవారం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని రామారావుగూడెం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.  తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నంలో జరిగిన బోటు ప్రమాద దుర్ఘటనకు ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అన్నారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

సీఎం ఇంటిపక్కనే తిరుగుతున్నా పట్టించుకోరా? 
‘‘ఈ పడవ ప్రమాదం చాలా బాధ కలిగించింది. దాదాపు 40 మంది వరకు చనిపోయినట్లు సమాచారం అందుతోంది. వీళ్ల మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. ఒక ప్రమాదమైతే ఏదన్నా పొరబాటు అనుకోవచ్చు. కానీ వరుసగా గత నవంబర్‌ నుంచి ఇప్పటి వరకు మూడు ప్రమాదాలు జరిగాయి. నవంబర్‌లో కృష్ణా జిల్లాలో.. అదీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి కొద్దిదూరంలో ఇదే మాదిరిగా కృష్ణా నదిలో పడవ ప్రమాదం జరిగింది. 22 మంది చనిపోయినా ప్రభుత్వం మేల్కొనలేదు. సీఎం ఉలకరు. ఇది జరిగి ఆరు నెలలు కూడా కాకుండానే ఐదు రోజుల కిందట గోదావరి నదిలో ఒక పడవలో అగ్ని ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ప్రమాదానికి గురైన బోటు ఇసుక మేటలకు దగ్గరగా ఉండడంతో ఒడ్డుకు చేర్చబట్టి సరిపోయింది. లేదంటే 40 మంది సజీవదహనం అయ్యే పరిస్థితి. నిన్న (సోమవారం) జరిగింది మూడో సంఘటన. ఈ ఘటనలో దాదాపు 40 మంది వరకు చనిపోయినట్టు సమాచారం అందుతోంది. అయినప్పటికీ లైసెన్స్‌లు లేకుండా, లైసెన్స్‌లు పునరుద్ధరణ కాని పడవలను తిప్పుతున్నారు. ప్రయాణికుల భద్రత పట్టదు. భద్రతా ప్రమాణాలు పాటించరు. లంచాలు తీసుకుని పర్మిట్లు ఇస్తున్నారు.

ఈ లంచాలు మంత్రులు మొదలు ముఖ్యమంత్రి వరకు పోతున్నాయి. పుష్కరాల సందర్భంగా ఆయన హీరోగా కనిపించడానికి తీసే షూటింగ్‌ కోసం అప్పటిదాకా జనాన్ని ఆపిపెట్టి, ఆ షూటింగ్‌లో ఇంపాక్ట్‌ కోసం గేట్లన్నీ ఒకేసారి తెరిచే సరికి జనం ఒకేసారి రావడంతో తొక్కిసలాట జరిగి 29 మంది చనిపోయారు. ఆ ఎంక్వయిరీలో చంద్రబాబు నాయుడే దోషి అని తేలుతుందని.. దాన్ని టీవీ సీరియల్‌ మాదిరి కొనసా..గిస్తూనే ఉంటారు. కృష్ణా నదిలో పడవ మునిగి 22 మంది చనిపోయినప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఎంక్వయిరీ అంటారు.. వాటిల్లో ఎవరి పేర్లు వస్తాయో తెలుసు కదా? మంత్రులు, ముఖ్యమంత్రి, ఆయన కుమారుడి పేర్లు వస్తాయి. మరి వారిపై చర్యలు తీసుకుంటారా? తీసుకోరు గనుక ఆ విచారణలు సా..గుతూనే ఉంటాయి.

ఎవర్ని మోసం చేయడానికి.. ఎవర్ని మభ్యపెట్టడానికీ విచారణలు? ఏదన్నా ఒక్క ఎంక్వయిరీలో అయినా రిజల్ట్‌ వస్తోందా? బాధ ఎక్కడ కలుగుతుందంటే చంద్రబాబు నాయుడనే వ్యక్తి మంత్రులతో కుమ్మక్కై భద్రతా ప్రమాణాలు పాటించకపోయినా, లైసెన్సులు లేకున్నా, వాటిని పునరుద్ధరించుకోకున్నా లంచాల కోసం ఆ పడవలను దగ్గరుండి తిప్పడం. ఈ మరణాలకు.. ఈ హత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. బాధితులకు ఎంత నష్టపరిహారం ఇచ్చినా తక్కువే. ఒక్కో కుటుంబానికి కనీసం రూ.25 లక్షలు ఇవ్వాలి.  ముఖ్యమంత్రి మీద హత్యా నేరం కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరిపించాలి’’ అని జగన్‌ డిమాండ్‌ చేశారు. 

‘చింతమనేని’ అకృత్యాలు అన్నీ ఇన్నీ కాదన్నా.. 
‘టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అకృత్యాలకు అంతులేకుండా పోతోంది. అడుగడుగునా అడ్డు, అదుపు లేకుండా దందాలు. టీడీపీ వాళ్లకే ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అభిమానులపై నిత్యం వేధింపులే’ అని దెందులూరు నియోజకవర్గ ప్రజలు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. పది గ్రామాలకు మంచినీరు అందించే సీతంపేటలో సుమారు 10 ఎకరాల్లోని రెండు మంచినీటి చెరువులను టీడీపీ నాయకులు ఆక్రమించుకోవడంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని ఆ గ్రామానికి చెందిన వర్రే సత్తిబాబు వివరించాడు. రామారావుగూడెంలో 25 మంది రైతులకు చెందిన 30 ఎకరాల సాగు భూమిలో చెరువులు తవ్వాలని టీడీపీ నేతలు తీవ్రంగా వేధిస్తున్నారని కాలి లోకరాజు అనే వ్యక్తి వాపోయాడు. వైఎస్‌ జయంతి రోజున ఆయన విగ్రహానికి పూలమాల వేసి స్వీట్లు పంచినందుకు తన ఇల్లు కూల్చేశారని, ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి తన కుటుంబాన్ని వేధిస్తున్నారని భోగాపురానికి చెందిన పామర్తి రామచంద్రరావు వాపోయాడు.

ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు అన్యాయంగా తన పొలంలోని బోరును పీకేశారని కె.నెహ్రు అనే వ్యక్తి కన్నీటి పర్యంతమయ్యాడు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసిన ఎంపీటీసీకి మద్దతు ఇచ్చాననే నెపంతో కక్ష గట్టి ఎమ్మెల్యే చింతమనేని ప్రోద్బలంతో ఆర్‌డబ్ల్యూఎస్‌లోని వాటర్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లో కెమిస్ట్‌(అవుట్‌సోర్సింగ్‌)గా పని చేస్తున్న తనను ఉద్యోగం నుంచి తొలగించారని జోగన్నపాలెంకు చెందిన గొల్లపల్లి వెంకట అప్పారావు వాపోయాడు. తన మరిది వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీటీసీ సభ్యునిగా పోటీ చేయడంతో ఎలక్ట్రికల్‌ సబ్‌స్టేషన్‌లో కాంట్రాక్టు పద్దతిలో షిఫ్ట్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్న తన భర్త తనగాల వెంకట్రావు ఉద్యోగం తొలగించారని రత్నకుమారి ఆవేదన వ్యక్తం చేసింది.  ఇలా దారిపొడవునా పలువురు.. ఎమ్మెల్యే, ఆయన అనుచరుల తీరుపై ఫిర్యాదు చేశారు. సగర(ఉప్పర)సంఘం, ముస్లిం సంఘాల ప్రతినిధులు జగన్‌కు వారి సమస్యలు వివరించారు. కాగా, జగన్‌ను చూడటానికి దారిపొడవునా పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. ఆయనతో మాట్లాడటానికి, కరచాలనం చేయడానికి పోటీపడ్డారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top