యాక్షన్‌.. కన్నీళ్లు.. కట్‌

YS Jaganmohan Reddy fires on CM Chandrababu - Sakshi

హోదా విషయంలో అద్భుతంగా నటిస్తున్నారు 

పొన్నూరు సభలో నిప్పులు చెరిగిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

నాడు అరుణ్‌ జైట్లీని పొగిడింది వాస్తవం కాదా? 

మీ నటనకు ఆస్కార్‌ అవార్డు ఇవ్వాలి..  

1,500 కిలోమీటర్ల మైలు రాయి దాటిన పాదయాత్ర  

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి :  ‘నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా రాకుండా చేయాల్సిందంతా చేసి, ఏడాదిలో ఎన్నికలొస్తున్నాయని యూటర్న్‌ తీసుకుని.. ప్రజలను మళ్లీ మోసగించడానికి చంద్రబాబు అద్భుత నాటకానికి తెర తీశారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. అసెంబ్లీ వేదికగా యాక్షన్‌.. కన్నీరు.. కట్‌ అనే రీతిలో మొసలి కన్నీరు కారుస్తూ నాటకాన్ని రక్తికట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మోసగించే విషయంలో చంద్రబాబుకు ఆస్కార్‌ అవార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 112వ రోజు బుధవారం గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ములుకుదురు వద్ద జగన్‌ పాదయాత్ర 1500 కిలోమీటర్లు దాటింది. ఆయన పొన్నూరులోని ఐలాండ్‌ సర్కిల్‌లో జరిగిన బహిరంగ సభలో   ప్రసంగించారు. ఇటీవల అరుణ్‌ జైట్లీ స్టేట్‌మెంట్‌ చూసి కేంద్ర మంత్రి పదవుల నుంచి వైదొలగారని, ఇదే పని 2016 సెప్టెంబర్‌ 8న చేసి ఉంటే ప్రత్యేక హోదా వచ్చి ఉండేది కాదా? అని ప్రశ్నించారు. పొన్నూరు సభలో జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే.. 

ఏమి నటిస్తున్నావయ్యా బాబూ.. 
‘‘ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేస్తున్న మాలాంటి వాళ్లను ఎయిర్‌పోర్టులలో అరెస్ట్‌ చేయించావు. ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేస్తున్న ప్రతిపక్ష నాయకుడిని తెల్లవారుజామున పోలీసుల్ని పంపి దీక్ష శిబిరం ఎత్తేయించడం ధర్మమేనా? మోదీ గారు వస్తున్న సందర్భంలో ప్రతిపక్ష నేత ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తున్నాడు.. అని చెప్పి హోదా కోసం ఆరాట పడి తెచ్చుకోవాల్సింది పోయి దీక్షను భగ్నం చేయించావు. బంద్‌లు చేస్తే ఆర్టీసీ బస్సులను పోలీసుల సాయంతో తిప్పించావు. యువభేరీలు నిర్వహిస్తే పిల్లలపై పీడీ యాక్టులు పెట్టి బెదిరించావు. ప్రత్యేక హోదా రాకుండా ఇన్నాళ్లూ అన్ని విధాలా అడ్డుపడ్డావు. ఎట్టకేలకు ప్రజల ఒత్తిడితో దిగొచ్చి, మళ్లీ హోదా కావాలంటూ కన్నీళ్లు పెడుతూ ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారు. ఆస్కార్‌ అవార్డులు ఇచ్చారని మొన్న నేను పేపర్లో చూశా.. ప్రఖ్యాతి గాంచిన సినిమాలకు, నటులకు ఈ అవార్డు ఇస్తారు. ఈ అవార్డులు తీసుకున్న వారి ఫొటోల్లో చంద్రబాబు ఫొటో కనిపిస్తుందేమోనని పేపర్లు తిరిగేసి చూశా.. కనిపించలేదు. ఆ అవార్డులు ఇచ్చేది విదేశీ సంస్థలు కదా.. వారు టీవీలు ఆన్‌ చేసి మన రాష్ట్ర అసెంబ్లీని చూడలేదేమో అనిపించింది. నిన్న అసెంబ్లీ చూస్తే చంద్రబాబు సీను... యాక్షన్‌... కళ్లల్లో నుంచి నీళ్లు కార్చడం.. కట్‌ అన్నట్లు సాగింది.  టాపిక్‌ ఏమిటా అని చూస్తే... ప్రత్యేక హోదా. ఆశ్చర్యమనిపించింది. ఆస్కార్‌ అవార్డులు ఇచ్చే వాళ్లు ఈ సీన్‌ చూడలేదు కాబట్టే చంద్రబాబుకు ఆ అవార్డు ఇవ్వలేకపోయారేమో’’ అని ఆయన అన్నారు.  

బాబూ ఇవి నిజం కాదా? 
- రాష్ట్ర విభజన తర్వాత అప్పటి కేంద్ర ప్రభుత్వం మార్చి 2, 2014న కేంద్ర క్యాబినెట్‌ ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాలని తీర్మానం చేసి ప్లానింగ్‌ కమిషన్‌కు ఆదేశాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా?
- 2014 ఎన్నికల్లో మీ భాగస్వామ్య ఎన్‌డీఏ ప్రభుత్వం కేంద్రంలో వచ్చింది. అక్కడ కేంద్రంలో మీరు, ఇక్కడ వాళ్ల వాళ్లు మంత్రులుగా కొనసాగారు. ముఖ్యమంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం చేశాక కూడా ఏడు నెలల పాటు ప్లానింగ్‌ కమిషన్‌లో ఆ ఫైల్‌ పడి ఉన్నా ఎందుకు పట్టించుకోలేదు? ఆ సమయంలో గాడిదలు కాస్తున్నారా?
- ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చాక 11 నెలల పాటు అంటే 2015 ఏప్రిల్‌ వరకు 13వ ఆర్థిక సంఘం సిఫార్సులే అమలులో ఉన్న విషయం నిజం కాదా?  
- నోరు తెరిస్తే చాలు.. హోదాకు 14వ ఆర్థిక సంఘం అడ్డుచెప్పిందని ఇష్టమొచ్చినట్లు అబద్ధాలాడటం నిజం కాదా?
- ఆ రోజు అరుణ్‌ జైట్లీ ఈ మాటమీద స్టేట్‌ మెంట్‌ ఇస్తే గంగిరెద్దులా ఇలా.. ఇలా.. ఇలా.. తలూపుకుంటూ వచ్చింది నిజం కాదా?  
- ప్రత్యేక హోదాను ఇవ్వొద్దని చెప్పలేదని 14వ ఆర్థిక సంఘం సభ్యులు అభిజిత్‌ సేన్, గోపాల్‌రావులు రాత పూర్వకంగా చెప్పిన మాట వాస్తవం కాదా?
- అరుణ్‌ జైట్లీ ఆ రోజు ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు, మొన్న ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు ఏమైనా తేడా ఉందా?  
- ఆరోజు అర్ధరాత్రి దాకా మేలుకొని ఉండి స్వాగతించి మరుసటి రోజు అసెంబ్లీలో తీర్మానం చేసి జైట్లీని పొగిడింది వాస్తవం కాదా? 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top