రైలును తగులబెట్టించింది చంద్రబాబే..

YS Jaganmohan Reddy Fires On Chandrababu At Tuni - Sakshi

తుని సభలో నిప్పులు చెరిగిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ 

కుట్ర పూరితంగా రాజకీయ కోణంలో కేసులు  

75 శాతం మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కేసులు 

మనందరి ప్రభుత్వం రాగానే ఈ కేసులు ఎత్తివేస్తాం

ఆర్థిక మంత్రి ఊళ్లో ఏరులై పారుతున్న అవినీతి 

35 ఏళ్లుగా ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదు 

పోలవరం టెండర్ల అంచనాలు పెంచి వియ్యంకుడికే కట్టబెట్టారు

తన బినామీ స్కూళ్ల కోసం విద్యా వ్యవస్థను బాబు ఖూనీ చేస్తున్నారు 

ఈ పరిస్థితిని పూర్తిగా మారుస్తామని హామీ ఇస్తున్నా

మరో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎలాంటి నాయకుడు కావాలో ఆలోచించమని మీ అందరినీ కోరుతున్నాను. చంద్రబాబు పాలనలో ఈ నాలుగేళ్లలో మనం చూసిందేమిటంటే అబద్ధం, మోసం, అవినీతి, అన్యాయం తప్ప మరొకటి చూడలేదు. ఇలాంటి వ్యక్తి మీకు నాయకుడిగా కావాలా? 
– వైఎస్‌ జగన్‌

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘కాపుల ఉద్యమం ఇక్కడే జరిగింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది. ఆ రోజు చంద్రబాబే కుట్ర పూరితంగా రైలును తగులబెట్టించాడు. దొంగ కేసులన్నీ ఎదుటి వారిపై మోపాడు. ఈ రోజుకూ కేసులు ఎదుర్కొంటున్న వారిలో 75 శాతం మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే. విచక్షణ లేకుండా రాజకీయ కోణంలో ఎస్సీలు, బీసీలు, మహిళలు, చివరకు వికలాంగులపై కూడా కేసులు పెట్టారు’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. మనందరి ప్రభుత్వం రాగానే ఆ ఘటనలో పెట్టిన కేసులన్నీ తొలగిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 234వ రోజు శనివారం తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గ కేంద్రమైన తునిలో భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నాలుగున్నరేళ్లలో చంద్రబాబు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. ఆర్థిక మంత్రి ప్రాంతంలో అవినీతి ఏరులై పారుతోందని మండిపడ్డారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే.. 

ఏరులై పారుతున్న అవినీతి 
‘‘ఈ రోజు పాదయాత్రలో ఇక్కడి ప్రజలు నా వద్దకు వచ్చి తుని నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, దందాల గురించి చెప్పుకున్నారు. రెండు సార్లు ఆర్థిక మంత్రి, మరో రెండు సార్లు శాసనసభ స్పీకర్‌గా పని చేసి.. 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి నియోజకవర్గం సహజంగానే అభివృద్ధిలో పరుగెడుతుందని ఎవరైనా అనుకుంటారు.. కానీ ఇక్కడ పరిస్థితి అభివృద్ధిలో కాదు అవినీతిలో ముందుకు పరుగెడుతోందని నాతో చెప్పారు. తునిలో ఈ రోజుకు కూడా తాగేందుకు మంచినీళ్లు లేవని వాపోయారు. డ్రైనేజీ భూములను కూడా ఇక్కడి పాలకులు ఆక్రమిస్తున్నారు. పక్కనే తాండవ నదిలో ఒక్క స్పూన్‌ కూడా ఇసుక లేకుండా దోచేశారని చెప్పుకొచ్చారు. నిర్మాణాలకు సముద్రపు ఇసుక వాడరు. కానీ రాష్ట్రంలో చంద్రబాబు వద్ద నేర్చుకున్న మోసమేమో గానీ సముద్రం ఇసుకతో తాండవ నది ఇసుక కలిపి అమ్ముతూ మోసం చేస్తున్నారని చెప్పారు.

ఆర్థర్‌ పేట నుంచి పెరుమాళ్లపురం వరకు ఇసుక ర్యాంపులు వేసి రోజూ వందల లారీల ఇసుక తరలిస్తున్నా అడిగే నాథుడు లేడు. పేరుకేమో ఇసుక ఉచితం అంటున్నారు. ఉచితంగా ఇవ్వాలని అడిగితే తమపై కేసులు పెడుతున్నారని ఇక్కడి ప్రజలు వాపోయారు. తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకునేందుకే ఇసుక ఉచితంగా దొరుకుతోందని చెబుతున్నారు. ఇదే నియోజకవర్గంలో దాదాపు 100 చెరువులు తవ్వేశారు. వల్లూరు, హంసవరం, శంగవక్షం, పైడికొండ గ్రామాల్లో తాడిచెట్టు లోతున చెరువులు తవ్వేశారు. ఒక్కొక్క ట్రాక్టర్‌ మట్టి రూ.1600కు అమ్ముకున్నారని ఇక్కడి ప్రజలు నాతో చెప్పారు. 100 చెరువుల్లో దాదాపు లక్ష ట్రాక్టర్ల మట్టిని అమ్ముకున్నారు. చెరువులు రెండు లేదా మూడు అడుగులు తవ్వితే ఎవరికైనా ఉపయోగం ఉంటుంది. తవ్వినందుకు బిల్లులు చేసుకోవచ్చని, మట్టిని అమ్ముకోవచ్చని ఇంతటి దారుణంగా తాటి చెట్టు లోతున తవ్వేస్తే మా పరిస్థితి ఏంటని ఇక్కడి ప్రజలు అడుగుతున్నారు. 

మరుగు దొడ్లను కూడా వదల్లేదు.. 
మరుగుదొడ్ల బిల్లులు కూడా వదలకుండా దోచేస్తున్న పరిస్థితి. పైడికొండ గ్రామంలో వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తేగానీ మరుగుదొడ్లలో లూటీ అయిన రూ.60 లక్షలు తిరిగి కట్టని పరిస్థితి వచ్చిందని ఇక్కడ ప్రజలు చెప్పారు. మట్టి, ఇసుక, మరుగుదొడ్లు.. చివరికి గుడి భూములు కూడా వదలి పెట్టడంలేదని ఇక్కడి తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి చెప్పుకొచ్చారు. తొండంగి మండలం పి.అగ్రహారంలో ఉత్తరాది మఠానికి చెందిన 425 ఎకరాల భూమిని కాజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో 66 ఎకరాల రికార్డులు ఓ టీడీపీ నాయకుడు తారుమారు చేస్తే, మరో నాయకుడు, అన్నవరం ట్రస్టు బోర్డు మెంబరు 36 ఎకరాల భూముల రికార్డును తారుమారు చేసి బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకుంటున్నా విచారణలు జరగనే జరగవని చెప్పుకొచ్చారు.

ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇక్కడి వారే అయినా కూడా మా ఖర్మ కొద్దీ చివరకు పోలీస్‌స్టేషన్‌ భూములు కూడా వదలి పెట్టడంలేదని నాతో చెప్పారు. తొండంగి మండలం ఒంటిమామిడి పోలీస్‌స్టేషన్‌కు దాతలు ఇచ్చిన భూమికి పక్కనే టీడీపీ నాయకులు భూములు కొనుగోలు చేసి, పోలీస్‌స్టేషన్‌కు చెందిన మిగతా భూమిని కలిపేసి షాపింగ్‌ కాంప్లెక్స్‌ కట్టేసిన పరిస్థితి చూస్తున్నామని చెప్పారు. తుని పోలీస్‌స్టేషన్‌ భూమిని ఆక్రమించడమే కాకుండా దాని పక్కనే ఎకరంనర ఉన్న బాతుల కోనేరును కూడా కప్పిపెట్టి అమ్మేశారు. డ్రైనేజీ స్థలాలను కూడా కలుపుకుని అమ్మేశారు. దీని వల్ల తుని పట్టణంలో 10 వార్డులకు డ్రైనేజీలు లేక మురుగు రోడ్లపై పారుతోంది. 

అంచనాలు పెంచి వియ్యంకుడికి కట్టబెట్టారు.. 
ఇక్కడి పాలకులు ఏ స్థాయిలో అవినీతి చేస్తున్నారో రైతన్నలు నా వద్దకు వచ్చి చెప్పుకున్నారు. పక్కనే ఉన్న పోలవరం ఎడమ కాలువ ఐదో ప్యాకేజీ పనులు 18 కిలోమీటర్ల పొడవున తవ్వేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు రూ.180 కోట్లతో పనులు ప్రారంభించారు. అందులో నాన్నగారి హయాంలోనే 70 శాతం కాలువ మట్టి పనులు, 40 శాతం లైనింగ్‌ పనులు పూర్తయ్యాయి. ఇక మిగిలిన రూ.50 కోట్లు, రూ.60 కోట్ల విలువైన చిన్నపాటి పనులు పూర్తి చేయడం కోసం వాటి అంచనాలు ఏకంగా రూ.280 కోట్లకు పెంచి, మంత్రి యనమల.. తన వియ్యంకుడు సుధాకర్‌ యాదవ్‌కు కట్టబెట్టారని రైతులు నాతో చెప్పారు. కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏరువాక చేసి భూములు తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. పెరుమాళ్లపురంలో జరిగిన బహిరంగ సభలో ఆ భూములను రైతులకు అప్పగిస్తానని చంద్రబాబు గట్టిగా చెప్పాడు.

చివరకు ఆ భూములు మాకు అప్పగించకపోగా చంద్రబాబు గారి బినామీ కంపెనీ.. దివీస్‌కు కట్టబెట్టారని, మేము భూములు ఇవ్వలేదని చెప్పి మాపై కేసులు పెడుతున్నారని ఇక్కడి రైతులు వాపోతుంటే నిజంగా బాధేసింది. ఆ రోజు ఇదే పెద్దమనిషి కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో జగన్‌కు భాగముందని చెప్పాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను ఇదే తుని నియోజకవర్గంలో కాకినాడ ఎస్‌ఈజెడ్‌ బాధితులను పరామర్శించాను. ఆ రోజు మీటింగ్‌లో నేను.. ‘అయ్యా.. చంద్రబాబూ.. ఎన్నికలకు ముందు ఎస్‌ఈజెడ్‌ భూములు నావని చెప్పావు కదా.. నేనే చెబుతున్నా.. ఆ భూములు తిరిగి రైతులకు ఇచ్చేయండి’ అని చెప్పాను. కానీ ఈ రోజుకు ఈ పెద్దమనిషి ఆ భూములు రైతులకు ఇవ్వలేదు. 

ఆక్వా జోన్‌లో మందుల కంపెనీ పెడతారట..  
దివీస్‌ ఫార్మాస్యూటికల్‌ కంపెనీకి మాత్రం రైతుల భూముల బలవంతంగా కట్టబెడుతున్నాడు. దివీస్‌ లాంటి కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయని ఎవరైనా కోరుకుంటారు. కానీ అవి రావాల్సిన చోట రావాలి. పక్కనే విశాఖప్నటంలో ఫార్మాసిటీ ఉంది. అక్కడ ఇదే కంపెనీ వచ్చి ఉంటే అందరం ఆనందించి ఉండేవాళ్లం. కానీ చంద్రబాబు ఈ కంపెనీని మన రాష్ట్రంలో అత్యధిక హేచరీలు ఉన్న తుని ప్రాంతంలో పెట్టాలని చూస్తున్నాడు. ఆ ప్రాంతాన్ని కేంద్రం కూడా ఆక్వా జోన్‌గా ప్రకటించింది. ఇలాంటి ప్రాంతంలో రోయ్య పిల్లలు బతకాలంటే సముద్రం నీళ్లు కలుషితం కాకూడదు. కలుషితం అయితే రోయ్య పిల్లలు బతకవు. రైతన్నలు ఇబ్బందులు పడతారు. ఇక్కడ రైతన్నలు ఆ కంపెనీ వద్దంటూ గొడవ చేసిన పరిస్థితి.

ఇదే ఫార్మాస్యూటికల్‌ కంపెనీ ఫార్ములేషన్‌ చేస్తే సంతోషించేవాళ్లం. కానీ వాళ్లు ఏపీఐ చేస్తున్నారు. ఏపీఐ అంటే బల్క్‌ డ్రగ్‌ కంటే ఒక స్థాయి చిన్నది. 65 లక్షల లీటర్ల మంచినీరు తీసుకుని 55 లక్షల లీటర్ల కలుషిత నీరు నేరుగా సముద్రంలోకి వదిలే కార్యక్రమం చేస్తున్నారు. తుని మున్సిపాలిటీలో రోజుకు 45 లక్షల లీటర్ల నీటిని వాడితే ఈ కంపెనీ 55 లక్షల లీటర్ల నీరు కలుషితం చేసి సముద్రంలోకి కలిపే కార్యక్రమం జరుగుతోందని ప్రజలు చెబుతున్నారు.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు ఇక్కడ ట్రామా కేర్‌ యూనిట్‌ను మంజూరు చేశారని, ఇవాళ  దానిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడని, 108 పరిస్థితి దారుణంగా ఉందని చెప్పుకొచ్చారు. 

ఇచ్చిన పట్టాలు లాక్కుంటున్నారు.. 
ఇదే నియోజకవర్గంలో ఆ దివంగత నేత హయాంలో 11 వేల ఇళ్లు కట్టించారు. ఆ రోజుల్లోనే రూ.40 కోట్లు ఖర్చు చేసి ఉప్పురగూడెంలో 30 ఎకరాలు సేకరించారు. 1,125 మందికి పట్టాలు పంచారు. ఇందులో 400 మంది ఇళ్లు నిర్మించుకున్నారు. మిగతా వారి భూములను తెలుగుదేశం పార్టీ నాయకులు బలవంతంగా లాక్కుంటున్నారని ఇక్కడ ప్రజలు చెబుతున్నారు. రూ.40 వేలు, రూ.50 వేలు లంచాలు తీసుకుని నచ్చిన వారికి ఇస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. తాండవ రిజర్వాయర్‌ నుంచి తుని పట్టణంతోపాటు పలు గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఆ రోజుల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు రూ.26 కోట్లు మంజూరు చేస్తే ఆ పనులు ఇప్పటికీ జరుగుతూనే... ఉన్నాయి. తాండవ నదికి వరదొస్తే తుని, పాయకరావు పేట పట్టణాలు దారుణంగా దెబ్బ తింటాయి.

3.5 కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మిస్తామని టీడీపీ నేతలు హామీ ఇచ్చి నాలుగున్నరేళ్లు దాటినా దాని గురించి పట్టించుకునే నాథుడే లేడని ఇక్కడ ప్రజలు వాపోయారు. తుని పట్టణంలో చెత్త వేసేందుకు కనీసం స్థలం లేదని, శ్మశానంలో చెత్త వేయాల్సిన దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని చెప్పుకొచ్చారు. తాండవ చక్కెర సహకార కర్మాగారం వల్ల తుని, పాయకరావుపేట, నర్సీపట్నం, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో 11 వేల మందికి మేలు జరుగుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రూ.40 కోట్ల నష్టంలోకి ఈ ఫ్యాక్టరీని నెట్టేశారని రైతులు, అక్కడ పని చేస్తున్న ఉద్యోగులు వాపోతున్నా పట్టించుకునే నాథుడు లేడు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు ఈ ఫ్యాక్టరీకి మేలు చేయడం కోసం చెరకు టన్నుకు రూ.300 నుంచి రూ.400 రాయితీ ఇచ్చేవాడని రైతన్నలు చెబుతున్నారు. ఆ రోజులు నాన్నగారితో పాటే పోయాయని రైతులు బాధపడ్డారు.

అబద్ధం, మోసం, అవినీతి, అన్యాయం.. 
రైతులకు సంబంధించి రూ.87,612 కోట్ల రుణాలను మాఫీ చేస్తానన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని ఊదరగొట్టారు. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. మరి బ్యాంకుల్లో మీరు పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా? (లేదు.. లేదు.. అని ప్రజల నుంచి స్పందన) చివరకు ఆయన రుణ మాఫీ పథకం వడ్డీలకు కూడా సరిపోలేదు. పొదుపు సంఘాలఅక్క చెల్లెమ్మల రుణం ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. ఇవాళ వీళ్లందరి రుణాలు మాఫీ చేయక పోయినా చేసేశానని అబద్ధం చెబుతున్నాడు. ఇంటింటికీ ఉద్యోగం ఇవ్వకపోతే ఉపాధి అన్నాడు. అదీ లేకపోతే ప్రతి నెలా రూ.2 వేలు భృతి ఇస్తానన్నాడు. చంద్రబాబు ఇప్పటికి ముఖ్యమంత్రి అయి 50 నెలలైంది. ఈ లెక్కన ఇంటింటికీ రూ.లక్ష బకాయిపడ్డారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని కేవలం పది లక్షల మందికి రూ.1,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాడట. రాష్ట్రంలో 1.75 కోట్ల ఇళ్లుంటే కేవలం పది లక్షల మందికి ఇస్తాడట. ఎన్నికల ముందు కేవలం నాలుగు నెలల ముందు భృతి ఇవ్వ జూపడం మోసం కాదా?’’  అని వైఎస్‌ జగన్‌ అన్నారు.   
జగన్‌ అనే నేను.. హామీ ఇస్తున్నాను.. 
మన పిల్లలను బాగా ఇంగ్లీషు చదువుకోవాలని చెప్పి ప్రైవేటు స్కూళ్లకు పంపుతాం. ఇవాళ ప్రైవేటు స్కూళ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే.. చంద్రబాబు స్వయంగా నారాయణ, చైతన్యల పేరుతో తానే బినామీ స్కూళ్లను నడుపుతున్నారు. ఒక పేదవాడు, మధ్య తరగతి వాడు తన పిల్లలను స్కూలుకు పంపించాలంటే.. ఏటా రూ.40 వేలు ఖర్చవుతోంది. చివరకు కళాశాలలకు పంపించాలంటే ఒక విద్యార్థికి రూ.65 వేలు నుంచి రూ.70 వేలు ఖర్చు అవుతోంది. అదే నారాయణ కళాశాలకు ఒక విద్యార్థిని పంపాలంటే ఏడాదికి రూ 1.60 లక్షలు గుంజుతున్నారు. (అవును.. అవును.. అంటూ జనం నుంచి భారీ స్పందన) పేద, మధ్య తరగతి కుటుంబం నుంచి ఇద్దరు పిల్లలను చదివించగలిగే పరిస్థితి ఉందా? అందుకే.. దేవుడు ఆశీర్వదించి, మీ అందరి దీవెనలతో రేపు మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్కూలు, కాలేజీ ఫీజులను తగ్గిస్తానని జగన్‌ అనే నేను.. మీ అందరికీ హామీ ఇస్తున్నాను. (హర్షధ్వానాలు) పేదవాడికి తోడుగా ఉండాల్సిన ప్రభుత్వ స్కూళ్లను చంద్రబాబు దగ్గరుండి రేషనలైజేషన్‌ పేరుతో నిర్వీర్యం చేస్తున్నాడు. ప్రభుత్వ స్కూళ్లలో ఏప్రిల్‌ నెలలోనే పుస్తకాలు ఇవ్వాల్సి ఉండగా ఆగస్టు నడుస్తున్నా ఇవ్వని పరిస్థితి. యూనిఫాంలు కూడా నాసిరకం.

ఇవాళ ప్రభుత్వ స్కూళ్లలో 20 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. ఇక స్కూళ్లల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఆయాలకు ముష్టి వేసినట్లు చాలా తక్కువగా ఇస్తున్నారు. ఐదు నెలల నుంచి సరుకులకు సంబంధించిన బకాయిలను ఇవ్వలేదు. చంద్రబాబు  ప్రభుత్వ స్కూళ్లను దగ్గరుండి నిర్వీర్యం చేస్తూ అందులో చదువుకునే విద్యార్థులందరినీ ప్రైవేటు స్కూళ్లకు వెళ్లేట్లుగా   చేస్తున్నాడు. ఇలా చేస్తే ఆ కమీషన్‌ చంద్రబాబుకు వస్తుంది కనుక ఇంత దారుణంగా విద్యావ్యవస్థను ఖూనీ చేస్తున్నాడు. రేపు మనందరి ప్రభుత్వం రాగానే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తున్నాను. ఎక్కడెక్కడైతే స్కూళ్ల అవసరం ఉందో వాటిని మళ్లీ అక్కడ తెరిపిస్తానని కూడా హామీ ఇస్తున్నాను.

మీ పిల్లలు ఎంత వరకు చదువుతారో అంతదాకా ఎంత ఖర్చు అయినా భరించి చదివిస్తాను. హాస్టల్‌ ఖర్చులకు ఏటా రూ.20 వేలు ఇస్తాను. చిన్న పిల్లలను బడికి పంపే తల్లులకు ఏటా రూ.15 వేలు ఇచ్చి అండగా ఉంటాను. చంద్రబాబును మీరు క్షమిస్తే.. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల్లో 98 శాతం పూర్తి చేశానని మీ అందరి చెవుల్లో క్యాలీఫ్లవర్‌లు పెడతాడు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బోనస్‌గా బెంజి కారు ఇస్తానని మళ్లీ హామీ ఇస్తాడు. మీరు నమ్మరని.. ప్రతి ఇంటికీ మహిళా సాధికార మిత్రలను పంపి, ప్రతి చేతిలో రూ.3 వేలు పెట్టిస్తాడు. ఆ డబ్బు వద్దు అనొద్దు. రూ.5 వేలు కావాలని అడిగి తీసుకోండి. ఆ డబ్బంతా మన జేబుల్లో నుంచి దోచుకున్నదే. మీ మనస్సాక్షి ప్రకారం ఓట్లేయండి. ఈ వ్యవస్థలో విశ్వసనీయత కోసం మీ ముందుకు వచ్చిన మీ బిడ్డను ఆశీర్వదించండి.    

తుని ఏరియా ఆస్పత్రిలో 18 మంది డాక్టర్లకు గాను ఉన్నది నలుగురే.ఆర్థిక మంత్రి ఈ నియోజకవర్గం వారే అయినా కనీసం డాక్టర్లను కూడా పెట్టని పరిస్థితి. ఆస్పత్రిలో ఏ ఆపరేషన్‌ జరగాలన్నా.. గర్భిణులకు సిజేరియన్‌ చేయాలన్నా రూ.5 వేలు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని ఇక్కడ ప్రజలు నా వద్దకు వచ్చి చెప్పుకున్నారు. 

తుని.. జన సునామీ 
ఎటు చూసినా జనమే.. ఆ వైపు, ఈ వైపు, అటు, ఇటు.. నలుదిక్కులా ఇసుకేస్తే రాలనంతగా జనం.. తుని జనసంద్రమై.. కనుచూపు మేర జన కెరటం ఎగిసిపడింది. తమ అభిమాన నేత పాదయాత్రగా వస్తున్నారని తెలిసి నియోజకవర్గం యావత్తూ పులకించిపోయింది. తుని చరిత్రలో నభూతో అన్న రీతిలో కోలాహలం అంబరాన్నంటింది. జై జగన్‌ అంటూ యువకులు, అభిమానుల నినాదాలతో పట్టణం హోరెత్తిపోయింది. జననేతకు స్వాగతం పలికేందుకు పిల్లా పాపలు మొదలు.. వయో వృద్ధుల వరకు రోడ్డుపైకి తరలి రావడంతో పురవీధులు కిక్కిరిశాయి. మిద్దెలు, మేడలు, చెట్లు, షెడ్లు.. జనంతో నిండిపోయాయి. పట్టణంలో అడుగు పెట్టింది మొదలు.. బహిరంగ సభా స్థలి గొల్ల అప్పారావు సెంటర్‌కు వచ్చే వరకు అభిమాన జనం పూలవర్షం కురిపించారు.

పాలక పార్టీ నేతలు ఆంక్షలు పెట్టినా, విద్యుత్తు నిలిపివేసి అసౌకర్యానికి గురిచేసినా, పరోక్షంగా బెదిరింపులకు దిగినా ప్రజలెవ్వరూ వెరవకుండా బహిరంగ సభకు తరలి రావడం చర్చనీయాంశమైంది. ఉదయం ప్రత్తిపాడు నియోజకవర్గంలోని డీజెపురం నుంచి పాదయాత్ర ప్రారంభమై.. తుని నియోజకవర్గంలోకి ప్రవేశించింది మొదలు.. భారీ సంఖ్యలో అన్ని వర్గాల ప్రజలు జననేత అడుగులో అడుగు వేశారు.  మహిళలు దారిపొడవునా వందలాది చీరలు పరిచి.. హారతులిచ్చి నుదుట తిలకం దిద్ది బ్రహ్మరథం పట్టారు. జననేత తన పాదయాత్రలో ఇక్కడే 2700 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించారు. గతంలో ఇక్కడ ఏ నేతకూ దక్కని గౌరవం జగన్‌కు దక్కిందని, పాలక పార్టీ నియంతృత్వ పోకడకు చరమగీతం పాడటానికి తుని ‘నాంది’ పలికిందని జనం చర్చించుకున్నారు. ఎల్లో మీడియా తప్పుడు రాతలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిని బ్యాన్‌ చేయాలంటూ నినదించారు. తమ రిజర్వేషన్ల విషయంలో జననేత వాస్తవాన్ని ధైర్యంగా చెప్పారని కాపులు కొనియాడారు. 
– సాక్షి ప్రతినిధి, కాకినాడ  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top