దుర్మార్గపు సర్కారుపై కలసికట్టుగా పోరాడదాం

YS Jaganmohan Reddy fires on chandrababu govt at Nellore - Sakshi

     ప్రజలకు పిలుపునిచ్చిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌  

     ఒక్క హామీ నెరవేర్చకుండా చంద్రబాబు అందరినీ మోసం చేశారు.. 

     మనందరి ప్రభుత్వం రాగానే అన్ని వర్గాల వారినీ ఆదుకుంటామని హామీ 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర ప్రజలను అన్ని విధాలా మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు అందరం కలసికట్టుగా పోరాడదామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. అధికారం కోసం ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క హామీ నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను దారుణంగా వంచించారని మండిపడ్డారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 87వ రోజు బుధవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ఆయన తన పాదయాత్రను కొనసాగించారు. కలిగిరి శివారు నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. కృష్ణారెడ్డిపాళెం, కుడుముల దిన్నెపాడు, చిన్న అన్నలూరు, తూర్పు జంగాలపల్లి గ్రామాల మీదుగా సాగింది. నరసారెడ్డి పాలెం, చిన్న అన్నలూరు గ్రామాల్లో ఆయన మహిళలు, రైతులను ఉద్దేశించి మాట్లాడారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి కుర్చీలోకి వచ్చాక రైతులు, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీకి రుణాలు లభించడం లేదన్నారు. బ్యాంకులకు ప్రభుత్వం వడ్డీ డబ్బులు చెల్లించక పోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆశీస్సులు, దేవుడి దయ వల్ల మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులు, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తామన్నారు. బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలకు వడ్డీ డబ్బులను ప్రభుత్వమే ఎప్పటికప్పుడు సకాలంలో చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. ‘ఈ పెద్దమనిషి రైతుల వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామన్నారు. ఇపుడు రుణమాఫీ సొమ్మంటూ ఆయన ఇస్తున్నది వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. రేప్పొద్దున ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు మరిన్ని అబద్ధాలు చెబుతాడు. చంద్రబాబు మాటలను మీరు నమ్ముతారా? (నమ్మం, నమ్మం అని జనం నుంచి ప్రతిస్పందన)  ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చడం నా ఒక్కడి వల్ల కాదు. మీ అందరి సహాయ సహకారాలు, ఆశీస్సులు కావాలి’ అని జగన్‌ కోరారు. మనందరి ప్రభుత్వం రాగానే అమలు చేయబోయే నవరత్నాల గురించి అందరికీ విస్తృతంగా తెలియజెప్పాలన్నారు.  

దామోదరం సంజీవయ్యకు ఘన నివాళి 
దళిత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా బుధవారం పాదయాత్ర ప్రారంభానికి ముందు ఆయన చిత్రపటం వద్ద ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top