ఇంటింటికీ నవరత్నాలు

YS Jagan Speech At YSR Congress Party meeting At Visakha - Sakshi

బాబిచ్చే చిల్లర కన్నా నవరత్నాల మేలేమిటో చెప్పండి 

మన పథకాల లబ్ధి ఎంత ఎక్కువో వివరించండి 

బూత్‌ కమిటీలతో సమర్థంగా పని చేయించాలి 

ఓటర్ల జాబితాలో మార్పులు,చేర్పులపై దృష్టి పెట్టండి 

లక్షలాది కుటుంబాలు మనపై ఆధారపడి ఉన్నాయని మరవద్దు 

సోషల్‌ మీడియా ద్వారా ఎల్లో మీడియాను ఎదుర్కొందాం

చంద్రబాబు ఇచ్చే చిల్లర డబ్బుల కన్నా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే అంతకు మించి వంద రెట్ల ప్రయోజనం ఉంటుందని జనం విశ్వసించాలి. అప్పుడే చంద్రబాబు ఇచ్చే డబ్బును కాదని వైఎస్సార్‌సీపీకి ఓటు వేస్తారు. అందుకు నవరత్నాలే మనకు అస్త్రాలు. నవరత్నాలతో ప్రతి కుటుంబానికి ఏడాదికి లక్షల్లో లబ్ధి చేకూరుతుందని ప్రజలకు మనం చెప్పాలి.
– వైఎస్‌ జగన్‌

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో జనవరి నాటికి సర్వం సిద్ధంగా ఉండాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 260వ రోజు మంగళవారం ఆయన విశాఖపట్నంలో పాదయాత్ర కొనసాగిస్తూ.. మార్గం మధ్యలో  పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగించారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి పార్టీ తాజా మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, పార్టీ రీజినల్‌ కో ఆర్డినేటర్లు, పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల కన్వీనర్లు, పార్టీ సీనియర్‌ నేతలకు దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు ప్రలోభాలను ఎదుర్కోవాలంటే వైఎస్సార్‌సీపీ ప్రకటించిన నవరత్నాలను గడపగడప కూ తీసుకెళ్లాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆదేశించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ వర్గాల కథ నం మేరకు జగన్‌ పార్టీ శ్రేణులకు చెప్పిన వివరాలు.. 

నవరత్నాలే మనకు అస్త్రాలు 
ఎన్నికలు జనవరిలో ఉండొచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్‌ కమిటీలు ఇందుకు సన్నద్ధం కావాలి. సమయం తక్కువగా ఉంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కార్యక్షేత్రంలోకి దిగాలి. ఈనెల 17 నుంచే ప్రతి నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ గడపగడపకూ వెళ్లి పార్టీ ప్రకటించిన నవరత్న పథకాలను ప్రజలకు వివరించాలి. రోజుకు కనీసం రెండు చొప్పున మొత్తం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను చుట్టి రావాలి. (ఈ సందర్భంగా తొలి నెల రోజులకు కార్యక్రమాన్ని నిర్దేశించారు.) అదే సమయంలో చంద్రబాబు నాయుడి పాలనలో జరిగిన మోసాలను, చేసిన అన్యాయాలను కూడా ప్రజలకు వివరించాలి. కో ఆర్డినేటర్‌ ఏదైనా బూత్‌కు వెళ్లినప్పుడు ఆ పరిధిలోని అన్ని ఇళ్లు తిరుగుతూ చంద్రబాబు చేస్తున్న మోసాలు, అన్యాయాలను చెప్పడంతో పాటు అక్కడున్న సమస్యలు, వాటికి మనం సూచిస్తున్న పరిష్కారాలను కూడా ప్రజలకు వివరించాలి. బూత్‌ కమిటీలను సమర్థంగా పని చేయించడంతో పాటు ఎప్పటికప్పుడు పని తీరుపై సమీక్షించుకోవాలి. ప్రజలు వైఎస్సార్‌సీపీకి ఎందుకు ఓటు వేయాలనేది ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. నవరత్నాలను జనంలోకి విస్తృతంగా తీసుకువెళ్లినప్పుడే చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కోగలం.  
 
నవరత్నాలతో ప్రతి కుటుంబానికి లక్షల్లో లబ్ధి 
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు విపరీతంగా డబ్బులు వెదజల్లుతాడు. మన వద్ద అంత డబ్బు లేదు. చంద్రబాబు ఇచ్చే చిల్లర డబ్బుల కన్నా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే అంతకు మించి వంద రెట్ల ప్రయోజనం ఉంటుందని జనం విశ్వసించాలి. అప్పుడే చంద్రబాబు ఇచ్చే డబ్బును కాదని వైఎస్సార్‌సీపీకి ఓటు వేస్తారు. అందుకు నవరత్నాలే మనకు అస్త్రాలు. నవరత్నాలతో ప్రతి కుటుంబానికి ఏడాదికి ఎంత మేలు, లబ్ధి చేకూరుతుందో ప్రజలకు మనం చెప్పాలి. నవరత్నాలే మనకు మంత్రాలు. (ఈ సందర్భంగా నవరత్నాలతో చేకూరే లబ్ధి వివరాలున్న పోస్టర్‌ను విడుదల చేశారు). వాటికి పెద్దఎత్తున ప్రచారం కల్పిస్తూ జనంలోకి తీసుకువెళ్లాలి. ప్రజల నోళ్లల్లో నానేలా చూడాలి. 
 
ఓటర్ల జాబితాలలో మార్పులు, చేర్పులపై అప్రమత్తంగా ఉండాలి.. 
ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తీసివేతలపై అప్రమత్తంగా ఉండాలి. వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉండే వాళ్లు ఎక్కడ ఉన్నారో చూసి చంద్రబాబు.. వాళ్లను దుర్మార్గంగా తొలగించే పని మొదలు పెట్టాడు. బూత్‌ కమిటీలను ఏర్పాటు చేసి ఆ కమిటీ సభ్యులు ఇంటింటికీ వెళ్లి పరిశీలన చేసేలా చూడాలి. వాళ్లు బాధ్యత తీసుకునేలా చూడాలి. ఫారం 6, 7, 8కి సంబంధించి పూర్తిగా అవగాహన కల్పించండి. ఇది చాలా ముఖ్యమైన విషయంగా పరిగణించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వైఎస్సార్‌సీపీ ఓటర్లను, సానుభూతిపరులను గుర్తించి దుర్మార్గంగా అదే పనిగా తీసివేయిస్తున్నట్టు చాలా ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిపై మనం అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవడం ఒక్కటే మార్గం. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు వైఎస్సార్‌సీపీ వ్యతిరేక, టీడీపీకి అనుకూల పోలీసు అధికారులను పోలింగ్‌ కేంద్రాల వద్ద నియమించుకుని పబ్బం గడుపుకోవాలని చూస్తాడు. అటువంటి వారిని గుర్తించి.. ఆ అధికారులను పోలింగ్‌ బందోబస్తుకు నియమించవద్దని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు, కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేయాలి. వైఎస్సార్‌సీపీని ఇబ్బంది పెట్టేవారు ఎవరో, టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే వారెవరో ముందుగా గుర్తించి వారిని ఓ కంట కనిపెట్టి ఉండాలి. ఎల్లో మీడియాను ఎదుర్కోనేందుకు సామాజిక మాధ్యమాన్ని (సోషల్‌ మీడియా) వినియోగించుకోవాలి. 
 
బూత్‌ స్థాయిలో లోపాలను వెంటనే అధిగమించాలి 
మొదటి విడతలో జరిగే బూత్‌ల సందర్శనలో ఏవైనా లోపాలు ఉంటే గుర్తించిన వెంటనే సరిదిద్దాలి. 30 నుంచి 35 కుటుంబాలకు ఒక బూత్‌ కమిటీ సభ్యుడిని నియమించుకుని కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి. గతంలో జరిగిన తప్పులు మరోసారి జరగడానికి వీల్లేదు. అన్యమనస్కంగా పని చేయొద్దు. మన మీద ఆధారపడి కొన్ని లక్షల కుటుంబాలు పని చేస్తున్నాయి. ప్రతి గ్రామంలోనూ ఇవాళ పెన్షన్‌ కావాలన్నా, రేషన్‌ కావాలన్నా.. ఇంకోటి.. ఇంకోటి కావాలన్నా అడుగుతున్న మొట్టమొదటి ప్రశ్న.. మీరు ఏ పార్టీ వాళ్లు అని. ఇటువంటి పరిస్థితుల్లో మనం తాత్సారం చేశామంటే మనల్ని నమ్ముకున్న వాళ్లు ఇబ్బందులు పడతారు. అందుకే పార్టీ నాయకులు, శ్రేణులు అందరూ బాధ్యతగా వ్యవహరించాలి. లేకుంటే చేజేతులా మనమే భవిష్యత్‌ తరాలను నాశనం చేసినట్టవుతుంది. చిత్తశుద్ధితో, నిజాయితీతో పార్టీ సూచించిన కార్యక్రమాలను అమలు చేయాలి. వచ్చే నాలుగు నెలల కాలం చాలా ముఖ్యమైనది. పార్టీ అనుబంధ సంఘాల బాధ్యత కూడా కీలకం. వీటిని త్వరలో మరింత పటిష్టం చేస్తాం. వీటి సేవలనూ పూర్తిగా వినియోగించుకోవాలి. 

3 వేల కిలోమీటర్లు.. నియోజకవర్గాల్లో 3 రోజుల పాదయాత్రలు... 
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌ 3,000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయ్యే సందర్భంలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మూడు రోజులు పాదయాత్ర చేయాలని ఈ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. గత ఏడాది నవంబర్‌ 6న వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి ఇప్పటికి 260 రోజులు పూర్తయింది. సుమారు 2,935 కిలోమీటర్ల మేర నడిచారు. విజయనగరం జిల్లాలో జగన్‌ తన చారిత్రాత్మక 3,000 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించే అవకాశం ఉంది. 

3 వేల కిలోమీటర్లు.. నియోజకవర్గాల్లో 3 రోజుల పాదయాత్రలు... 
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌ 3,000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయ్యే సందర్భంలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మూడు రోజులు పాదయాత్ర చేయాలని ఈ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. గత ఏడాది నవంబర్‌ 6న వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి ఇప్పటికి 260 రోజులు పూర్తయింది. సుమారు 2,935 కిలోమీటర్ల మేర నడిచారు. విజయనగరం జిల్లాలో జగన్‌ తన చారిత్రాత్మక 3,000 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించే అవకాశం ఉంది. 

కౌలు భూములు లాక్కొని నేటికీ పరిహారం ఇవ్వలేదు 
మాది పెదవాల్తేరు. పెదవాల్తేరు/చినవాల్తేరు పరిధిలోని సర్వే నెం 19 నుంచి 23 వరకు 71.01 ఎకరాలు జగన్నాథస్వామి ఆలయానికి చెందిన భూములు ఉన్నాయి. తరతరాలుగా మా పూర్వీకుల నుండి ఈ భూములలో 32 పేద కుటుంబాలు కౌలు వ్యవసాయం చేసుకొని వచ్చే ఆదాయంతో కుటుంబాలకు పోషించుకునే పరిస్థితి ఉండేది. దేవస్థానానికి విధిగా శిస్తు చెల్లిస్తూ వస్తున్నాము. రశీదులు కూడా మా వద్ద ఉన్నాయి. కానీ 1976లో భూ అదిగ్రహణ చట్టం ద్వారా వుడా సంస్థ మాకు తగిన పరిహారం ఇస్తామని భూములను తీసుకుంది. ఒక్కో కుటుంబానికి 0.1500 చదరపు మీటర్ల స్థలం ఇస్తామని ఒప్పంద పత్రాలు కూడా రాసి ఇచ్చారు. నేటికీ ఏ విధమైన పరిహారం చెల్లించలేదు. ప్రస్తుతం అద్దె ఇళ్లలో ఉంటున్నాము. మా సమస్యను అనేకసార్లు జిల్లా కలెక్టర్, రాష్ట్ర స్థాయి దేవస్థాన అధికారుల దృష్టికి తీసుకెళ్లినా న్యాయం చేయలేదు. ఇప్పుడు పాదయాత్రలో జగన్‌ గారికి వివరించాము. ఆయన ముఖ్యమంత్రి అయితేనే మా సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నాం.  
– ఉమ్మిడి రామిరెడ్డి 

వైఎస్‌ ఉన్నప్పుడే సెలూన్లకు ఉచిత విద్యుత్‌ ఇస్తామన్నారు   
వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెలూన్లకు ఉచితంగా 200 యూనిట్లు విద్యుత్‌ ఇవ్వడానికి సర్వే చేశారు. ఆ తర్వాత దురదృష్టవశాత్తు ఆయన మన మధ్య నుంచి దూరంగా వెళ్లారు. ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌.. సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ ఇస్తామన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నాయీ బ్రాహ్మణులు ఆయన వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు.     
– గోవాడ సురేష్‌ కుమార్,రాష్ట్ర సహాయ కార్యదర్శి, నాయీబ్రాహ్మణుల సంఘం

వైఎస్సార్‌సీపీలో నాయీ బ్రాహ్మణ నేతల చేరిక 
విశాఖనగరంలో మంగళవారం నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీలో చేరారు. నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.యానాదయ్య ఆధ్వర్యంలో పలువురు నేతలు చినవాల్తేరు వద్ద ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌ను కలిశారు. వారి ఆకాంక్ష మేరకు జగన్‌.. వారందరికీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర మాజీ గౌరవ అధ్యక్షుడు ఆరిపాక పెంటారావు, రాష్ట్ర యువజన అధ్యక్షుడు వెంపడాపు నూకరాజు, విశాఖ నగర అధ్యక్షుడు చల్లపల్లి అప్పలరాజు, నగర యూత్‌ అధ్యక్షుడు కోడూరు గణపతిరావు, నగర ప్రధాన కార్యదర్శి గండ్రెడ్డి సన్యాసిరావు, కోశాధికారి ఆతవ సుబ్బారావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి గోవాడ సురేష్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి కుదిరిళ్ల  వెంకటరావు, ఆనందపురం అధ్యక్షుడు ఇనపకుర్తి కనకరాజు, నగర అదనపు ప్రధాన కార్యదర్శి టి.వి.వి.సూర్యనారాయణ, పి.వి.సత్యనారాయణ ఉన్నారు. ఈ సందర్భంగా యానాదయ్య మాట్లాడుతూ.. జగన్‌ హామీల పట్ల తమకు మేలు జరుగుతుందని భావించి పార్టీలో చేరామన్నారు.  నగరగంలోని వేలాది మంది నాయీ బ్రాహ్మణులు పార్టీలో చేరుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top