పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ

YS Jagan Special Interview With NTV - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అవినీతిపై కచ్చితంగా విచారణ జరుపుతామని వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని తేల్చి చెప్పారు. ఎన్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 40 సీట్లు కంటే ఎక్కువ స్థానాలు రావని చెప్పారు. ఇంటర్వ్యూలో వైఎస్‌ జగన్‌ చెప్పిన మరిన్ని విశేషాలు..

ఇడుపులపాయ నుంచి మొదలైన పాదయాత్రలో ఇంకా అడుగులు పడుతూనే ఉన్నాయి. షెడ్యూల్‌ దాటి వెళ్లే పరిస్థితి ఎందుకు వచ్చింది?

వైఎస్‌ జగన్‌ : ప్రజలు విపరీతంగా వస్తున్నారు. ఆగి వచ్చిన వాళ్లను పలకరించి తర్వాతే వెళ్లాలి. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా చేయాలని అనుకున్నాం. అనుకున్నాక ఎన్ని కష్టాలు వచ్చినా చేయాల్సిందే. ఎన్నిరోజులు పట్టినా చేయాల్సిందే. ఆరు నెలల్లో అవుతుందని అనుకున్నాం. తాకిడి వల్లే బాగా ఆలస్యం అవుతోంది.

పాదయాత్రలో ఇది కచ్చితంగా ప్రజలు చేసి తీరాలి అని మీరు గుర్తించినది ఏదైనా ఉందా?

వైఎస్‌ జగన్‌ : ప్రభుత్వం ఏదైనా చేయాలనుకుంటే ఎంతో చేయొచ్చు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ మానవ తప్పిదాలే. ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం వల్ల, అమానవీయంగా ప్రవర్తించడం వల్ల సమస్యలు బాగా ఎక్కువ అయ్యాయి. ప్రతి అడుగులోనూ రైతులు గిట్టుబాటు ధరలు లేవని చెబుతున్నారు.

చంద్రబాబు పుణ్యాన మోసం పోయాం. వడ్డీలు కట్టలేకపోతున్నాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చూస్తే పంట సాగుబడి తగ్గిపోతోంది. ప్రతి ఏడాది ఇలానే జరిగింది. చంద్రబాబు నాలుగేళ్ల పురోగతి ఇదే. ప్రతి ఏడాది బ్యాంకులు రైతులకు ఇవ్వాలనుకుంటున్న టార్గెట్‌ మిస్సవుతూనే ఉంది. దాని అర్థం బ్యాంకుల గడపలు ఎక్కలేని పరిస్థితిలో రైతులు ఉన్నారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాడు 86 వేల కోట్ల రూపాయల పైచిలుకు ఉంటే, ఇప్పుడు లక్ష కోట్లను మించిపోయాయి. రుణమాఫీ ఎక్కడ జరిగినట్లు? రైతులకు వడ్డీలు పెనుభారంగా మారాయి. గత ప్రభుత్వాలు రైతులపై వడ్డీల భారాలు పడకుండా బ్యాంకులకు డబ్బులు కట్టేసేవి. ఈయన సీఎం అయిన తర్వాత కట్టడం మానేశారు. ఈ సమస్యలన్నీ మానవ తప్పిదాలే కదా.

రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి చంద్రబాబే హెరిటేజ్‌ షాపుల ద్వారా ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. ఈయనే దళారీలకు నాయకుడు అయినప్పుడు, దళారీ వ్యవస్థను ఎలా రూపుమాపుతారు?

గిట్టుబాటు ధరలు అనే సమస్య వ్యవసాయం పుట్టుక నుంచి ఉంది కదా. ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కల్పించడం సాధ్యం అవుతుందా?

వైఎస్‌ జగన్‌ : వైఎస్సార్‌ హయాంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర సమస్య తలెత్తలేదు. అలాంటి సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించారు. దాని వల్ల రేట్లు మళ్లీ పెరిగాయి. ఆయన విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఉచితంగా రైతులకు కరెంటు ఇచ్చారు. వైఎస్సార్‌ హయాంలో వరి రేటు 550 రూపాయల నుంచి ఐదేళ్లు పూర్తయ్యే సరికి 1030 రూపాయలకు వెళ్లింది. మద్దతు ధరలు కల్పించేందుకు ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి చేసేవారు.

చంద్రబాబు నాయుడు గారు గత నాలుగేళ్లుగా ఒక్కటంటే ఒక్కసారి కూడా మద్దతు ధరల పెంపు గురించి కేంద్రప్రభుత్వానికి లేఖను రాయలేదు. బీజేపీతో తెగదెంపులు అయ్యే వరకూ ఇదే జరిగింది.

వ్యవసాయ సమస్యను పరిష్కరించకపోవడం వెనుక చంద్రబాబుకు ఉన్న ధైర్యం ఏంటని మీరు అనుకుంటున్నారు? ఆయన రైతు ఓటు బ్యాంకు తనకు వద్దని అనుకుంటున్నారా?

వైఎస్‌ జగన్‌ : చిన్న ఉదాహరణ చెబుతాను. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో రెండున్నర లక్షల ఎకరాల్లో మామిడి పంటను పండిస్తారు. తోతాపూరి రకాన్ని లక్షా డెబ్భై వేల ఎకరాల్లో పండిస్తారు. పంట చేతికి వచ్చేసరికి ఈ మామిడి ధర పూర్తిగా పడిపోయింది. గతేడాది పంట పూర్తిగా రైతుల నుంచి వెళ్లిపోయిన తర్వాత 23 వేల రూపాయలకు వెళ్లింది. అది పంట చేతికి వచ్చేసరికే కేవలం 4 వేల రూపాయలకు పడింది. దీంతో పంటను రోడ్డు మీద పడేసిన పరిస్థితిని మనం చూశాం.

తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన గల్లా ఫుడ్స్‌, చిత్తూరు జిల్లా టీడీపీ నేతకు చెందిన శ్రీని ఫుడ్స్‌, హెరిటేజ్‌లు పంటను కొనుగోలు చేశారు. వీళ్లు ఇలా చేస్తుంటే సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబు ఏం చేస్తున్నారు?. ఆయన కోసం, ఆయన బినామీల కోసం రైతుల పంట ధరలను దగ్గురుండి పడేస్తున్నారు. నాలుగేళ్లలో నేను గమనించినవన్నీ మనిషికి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఏర్పడిన లోపాలే. దానికి ఈ ఉదాహరణ ఓ నిదర్శనం.

పాదయాత్రలో ఇంకో అంశం నా దగ్గరకు వచ్చింది. ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన పుస్తకాలు, యూనిఫాంలు ఇంకా ఇవ్వలేదు. అంటే దగ్గరుండే ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల్ని చదవనివ్వకుండా, ప్రైవేటు స్కూళ్ల బాట పట్టించడం దీని వెనుక ఉన్న వ్యూహం. జూన్‌లో స్కూల్స్‌ తెరిస్తే జులై నెల సగం పూర్తయినా పుస్తకాలు అందలేదంటే ఏంటి అర్థం?. ప్రైవేటు స్కూళ్లు మళ్లీ చంద్రబాబు బినామీలకు చెందినవే. మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు ఇచ్చేది తక్కువ. ఆయాలకు వెయ్యి రూపాయలు గౌరవ పారితోషకం.

వాళ్లు సొంత డబ్బుతో కొని, బిల్లులను ప్రభుత్వానికి పెట్టి డబ్బు తీసుకోవాలి. ఆ బిల్లులు ఆరు నెలలకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. పిల్లలు ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లకుండా చేయడానికి ఇదంతా జరుగుతోంది. నారాయణ, చైతన్య స్కూళ్ల బాట పట్టాలనే ప్రభుత్వం ఇలా ప్రవర్తిస్తోంది. ఇంత దారుణమైన మానవ తప్పిదం కనిపిస్తోంది.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై పన్నును మీరు తగ్గిస్తారా?

వైఎస్‌ జగన్‌ : కచ్చితంగా. దేశంలోనే అత్యధిక పెట్రోల్‌ డీజిల్‌ ధరలను ఆంధ్రప్రదేశ్‌లో వసూలు చేస్తున్నారు. వీటిని ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఆరు నుంచి ఏడు రూపాయలకు తక్కువగా వస్తున్నాయి. లారీ ఓనర్స్‌ వచ్చారు. సమ్మె చేయబోతున్నారు. ఇదే కారణం. నాలుగేళ్లుగా చంద్రబాబు గవర్నమెంటు అన్ని రకాలుగా ఫెయిల్‌ అయింది. రుణమాఫీ చేయకుండా, చేసేశానని అబద్దాలు బహిరంగంగా చెప్పే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయారు.

మీరు అన్నిట్లో ఫెయిల్‌ అయ్యారని అంటున్నారు. చంద్రబాబు 1500 రోజుల పండుగ చేస్తున్నానని ప్రకటించారు.

వైఎస్‌ జగన్‌ : జరిగేది ప్రజలకు కనిపిస్తుంది కాబట్టి వాళ్ల ఆక్రోశాన్ని కచ్చితంగా ఎదుర్కొంటారు.
 

మీరు పాదయాత్రకు ముందే నవరత్నాలు ప్రకటించారు. పాదయాత్రలో అనుభవాలను బట్టి మార్పులు ఏమైనా చేస్తున్నారా?

వైఎస్‌ జగన్‌ : మార్పులు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాం. మ్యానిఫెస్టోను త్వరలో నాలుగే నాలుగు పేజీల్లో విడుదల చేస్తాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నెల్లూరులో ఒక అబ్బాయి ఇంజనీరింగ్‌ ఫీజులు తల్లిదండ్రులు కట్టలేకపోవడం చూసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ అబ్బాయి తండ్రి పడిన బాధ ఇప్పటికి నాకు కళ్ల ముందు కనిపిస్తోంది.

పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంటు చేయాల్సిన అవసరం చాలా వుంది. ఆరోగ్య శ్రీ దేశంలోని అత్యుత్తమ పథకాల్లో ఒకటి. దాన్ని దగ్గరుండి నాశనం చేస్తున్నారు. హైదరాబాద్‌కు పోతే ఆరోగ్య శ్రీ కట్‌ అట. మంచి ఆసుపత్రులు అన్నీ అక్కడే ఉన్నాయి. క్యాన్సర్‌కు కిమోథెరపీని రెండుసార్లు మాత్రమే చేస్తారు. ఆ తర్వాత ఆరోగ్య శ్రీ వర్తించదట. ప్రతి ఒక్కటీ మీడియా హైప్‌ మాత్రమే.

వైఎస్సార్‌ హయాంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలను బలవంతంగా తీసుకుంటున్నారు. పాదయాత్రలో ఇవన్నీ చూసి, విని చివరకు దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించి, సీఎం స్థానంలో కూర్చొబెడితే అతను ఏం చేయాలి?. దేవుడు ఇచ్చిన అవకాశం అని రేపు లేదు అన్నట్లుగా జీవితాలను మార్చగలగాలి. చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో బతకాలి. అదే ముఖ్యమంత్రి పదవి.

టీడీపీకి మళ్లీ ఓటేయడం చారిత్రకం అవుతుంది. వేరొకరి వేస్తే వృథా అవుతుందని ప్రజలను చంద్రబాబు హెచ్చరిస్తున్నారు కదా?

వైఎస్‌ జగన్‌ : ఏపీలో ఏం జరుగుతుందో ప్రజలు అందరికీ తెలుసు. ఎవరికీ ఏం తెలియదు అనుకుంటే అది చంద్రబాబు మూర్ఖత్వం. మీడియాతో దాన్ని కవర్‌ చేయొచ్చు అనుకుంటే అది ఆయన ఇంకా మూర్ఖత్వం అవుతుంది. ఎన్నికలు జరిగితే చంద్రబాబును తెలుగుదేశం పార్టీకి 40 సీట్లు కూడా రావు.

ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ ఒంటరిగా పోటీ చేస్తుందా? లేదా పొత్తు పెట్టుకుంటుందా?

వైఎస్‌ జగన్‌ : ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. ఎవరితోనూ పొత్తు పెట్టుకోం. ఉన్న పార్టీలను గమనిస్తే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టింది. ఇదే పార్టీ ఆ రోజు చేయగలిగిన స్థానంలో ఉండి మంచి చేయలేదు. పునర్విభజన చట్టంలో వాళ్లు పెట్టిన కడప స్టీల్‌ ఫ్యాక్టరీ నుంచి రిఫైనరీ దాకా ఇవ్వొచ్చు అని రాశారు గాని, కచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అని ఎక్కడా రాయలేదు.

ప్రత్యేక హోదా అన్నది కూడా చట్టంలో పెట్టివుంటే కోర్టుకు వెళ్లైనా గెలిచేవాళ్లం. బీజేపీ ఇవాళ చేసే పరిస్థితిలో ఉండి కూడా చేయడం లేదు. చేస్తానని గతంలో చెప్పి ఇప్పుడు చేయడం లేదు. మరి వీళ్లతో కూడా ఎందుకు పొత్తు పెట్టుకోవాలి?. టీడీపీ వాళ్లు నాలుగేళ్లు బీజేపీతో కలసి వున్నారు. కలసి ఉన్నప్పుడు రాష్ట్రానికి రావాల్సినవి ఏమీ ఈ పార్టీకి గుర్తుకు రాలేదు.

పైగా జనవరి 27, 2017న ఒక ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ పెట్టి బీజేపీ మన రాష్ట్రానికి చేసినంత, మరే ఇతర రాష్ట్రానికైనా చేసిందా? అని చంద్రబాబు పొగిడారు. ప్యాకేజి ప్రకటిస్తే అసెంబ్లీలో స్వాగతించారు. ప్రత్యేక హోదా కోసం సుప్రీంను ఆశ్రయిస్తే, కేంద్ర ప్రభుత్వం ప్రతిగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో సీఎం ప్రకటనను ఫైల్‌ చేశారు. ఏపీ ప్రభుత్వం ప్యాకేజికి ఒప్పుకుందని కేంద్రం వాదించింది.

ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి తనకు వ్యతిరేకత రాకుండా ఉండేందుకు ఎదుటి వ్యక్తులపై చంద్రబాబు అభాండాలు వేస్తున్నారు. జనసేన గతంలో టీడీపీకి మద్దతు ఇచ్చింది. ఈ రోజు బీజేపీ, జనసేనలు టీడీపీకి మద్దతు ఇవ్వడం లేదు. రాజధానిలో నాలుగేళ్లుగా శాశ్వతం అనే పేరుతో ఒక్క ఇటుక కూడా లేదు. ఇప్పుడు అక్కడకు వెళ్లి చూస్తే టీడీపీ ఎమ్మెల్యే గేదెలు గడ్డి మేస్తూ కనిపిస్తాయి రాజధాని భూములు. ఎవరి సాయం లేకుండానే దేవుడి దయ, ప్రజల దీవెనలతోనే ఎన్నికల్లో పోటీ చేస్తాం.

పార్టీలో కొందరు జనసేనతో పొత్తు పెట్టుకోవాలనే భావనను మీ వద్దకు తెచ్చారట కదా..

వైఎస్‌ జగన్‌ : వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుంది. గత ఎన్నికల్లో పవన్‌ మద్దతు వల్ల చంద్రబాబుకు కొందరు ఓటేశారు. ఈ రోజున పవన్‌ టీడీపీ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు గతంలో చంద్రబాబు పడిన ఓట్లు మళ్లీ పడవు కదా. ఆ ఓట్లలో కొన్ని పవన్‌కు, కొన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి వస్తాయి.

గతంలో ఉన్న మా ఓటు షేర్‌ మాకు ఎలాను ఉంటుంది. ఈ సారి ఇంకా పెరుగుతుంది. పవన్‌ కల్యాణ్‌ కూడా బీజేపీ, చంద్రబాబు చేసిన మోసంలో భాగస్వామ్యులే కదా. తప్పు అయిపోయింది అని చాలా సులభంగా చెప్పారు. ఒక మనిషిని ముగ్గురు వ్యక్తులు కలసి పొడిచేసిన తర్వాత అందులో ఒకరు నాది తప్పైంది అంటాడు. రెండు వ్యక్తి ఏమో నేను మోసపోయాను అంటాడు. ఇక మిగిలిన మూడో వ్యక్తి ఎవరు?. నాలుగేళ్లు సైలెంట్‌గా ఉండి, ఎన్నికలకు ఆరు నెలల ముందు బయటకు వచ్చి నేను తప్పు చేశాను అని చెప్తే ఎలా?.

గత ఎన్నికల్లో ఓటమికి మీ వైపు నుంచి ఏవైనా సమీక్షలు చేసుకున్నారా?

వైఎస్‌ జగన్‌ : మా వైపు నుంచి కూడా తప్పులు జరిగేవుంటాయి. ఏ మనిషైనా తప్పు చేయకుండా ఉంటాడు అని నేను అనుకోను. నా నిర్ణయాల వల్ల కూడా తప్పులు జరిగి ఉండొచ్చు. అవన్నీ రిపేర్‌ చేసుకుంటూ అడుగులు ముందుకు వేస్తాం. పొత్తు పెట్టుకోకపోవడం వల్లే ఓడిపోయాం అంటే దాంతో నేను ఏకీభవించను.

మరి అంత పెద్ద పాదయాత్ర చేసిన తర్వాత కూడా వైఎస్సార్‌ 2004 ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నారు కదా?

వైఎస్‌ జగన్‌ : అప్పుడు ఆయన కాంగ్రెస్‌లో ఉన్నారు. ఆయనకు వ్యక్తిగతంగా ఇష్టం ఉన్నా లేకపోయినా పైన హై కమాండ్‌ చెప్పినట్లు వినాల్సిందే. వాళ్లు పొత్తు పెట్టుకోమంటే పెట్టుకోవాలి. ఎవరికైనా టికెట్‌ ఇవ్వమంటే ఇవ్వాలి. కాంగ్రెస్‌లో స్వయంగా నిర్ణయాలను తీసుకోలేరు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దకు వచ్చేసరికి మెత్తగా వ్యవహరిస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి..

వైఎస్‌ జగన్‌ : ఎక్కడ మెత్తగా విమర్శిస్తున్నాను. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఎవ్వరినీ వదల్లేదు. అసెంబ్లీలో నా స్పీచ్‌లను చూడండి. కీలక సమస్యలపై నా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లను చూడండి. కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా ఏకిపారేశానో తెలుస్తుంది. చంద్రబాబు చెవిలో క్యాలీఫ్లవర్లు పెట్టుకున్నారు. ఆయన పెట్టుకున్నదో గాక ప్రజలకు పెడుతున్నారని అన్నాను.

ప్యాకేజిని అసెంబ్లీలో స్వాగతిస్తే, దాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీని తప్పిదం చేస్తుందంటూ, ప్రత్యేక హోదా వస్తే ఏం జరుగుతుందన్న విషయంపై చంద్రబాబుకు ట్యూషన్‌ చెప్పా. మళ్లీ ఆయన నీకేం తెలుసు అని నన్ను ప్రశ్నించారు. ఇదే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టి, నిరసన తెలుపుతూ మా పార్టీ ఎంపీలు రాజీనామాలు చేశారు.

ప్రజాస్వామ్యంలో మేం యుద్ధం చేశాం. ఈ రోజు దేశంలో ప్రత్యేక హోదా అనే అంశం ఎందుకు ఉంది అంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేయడం వల్లే. అదే రాజీనామాలు టీడీపీ ఎంపీలు కూడా చేసినట్లయితే ఇంకా పెద్దగా ప్రభావం ఉండేది.

పాదయాత్ర తర్వాత వైఎస్సార్‌ కోపం అనే నరం తెగిపోయిందని అన్నారు. మీకు అలాంటి మార్పు ఏమైనా వచ్చిందా?

వైఎస్‌ జగన్‌ : నాకు సహజంగానే కోపం కొంచెం తక్కువ. కాబట్టి కోపం అనే నరం పెద్దగా తెగేంత దూరం వరకూ నేను ఎప్పుడూ వెళ్లే పరిస్థితి రాలేదు. దేవుడి దయ వల్ల అలాంటి పరిస్థితి రాకూడదనే ఆశిస్తున్నాను. పాదయాత్ర అనేది ఒక వ్యక్తిలోని మానవత్వాన్ని పెంచుతుంది.

మోదీకి ఎన్ని మార్కులు వేస్తారు?

వైఎస్‌ జగన్‌ : ఆంధ్రప్రదేశ్ విషయంలో అయితే సున్నా మార్కులు వేస్తాను. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఇవ్వలేదు. బీజేపీ మ్యానిఫెస్టోలో కూడా పెట్టారు.

ప్రత్యేక హోదా ఇస్తే ఎవ్వరికైనా మద్దతు ఇస్తారా? కాంగ్రెస్‌ కూడా ఇస్తారా?

వైఎస్‌ జగన్‌ : ఏ పార్టీకైనా మద్దతు ఇస్తాను. ప్రత్యేక హోదాపై ఇవాళ సంతకం చేయండి. వెంటనే మద్దతు ప్రకటిస్తాను. ఏపీ భవిష్యత్తు అనే విషయం దగ్గరికి వస్తే ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను.

మీరు దేవుడిని నమ్ముతారా? దేవుళ్లను నమ్ముతారా?

వైఎస్‌ జగన్‌ : మనిషి అనే వాడికి దేవుడు మనస్సాక్షిని ఇస్తాడు. తప్పు చేస్తున్నప్పుడు మనస్సాక్షి మనతో మాట్లాడుతుంది. తప్పు చేస్తున్నావు చేయొద్దు అని హెచ్చరిస్తుంది. ఆ మాట వింటే మనిషి దేవుడికి దగ్గర అవుతాడు. అలా వినకుండా తాను చేస్తున్న తప్పే సరైందని భావించడం మొదలైతే మనిషి దేవుడికి దూరం అవుతాడు. దేవుడితో దగ్గర కావడం కోసం ప్రతి మనిషి నాలుగు గోడల మధ్య ప్రయత్నిస్తాడు. ఏ దేవుడి కొలిచినా ఫరవాలేదు ఏదో ఒక దేవుడిని మాత్రం కచ్చితంగా కొలవాలి.

చంద్రబాబు రాష్ట్రంలో అరచకాలు సృష్టిస్తున్నారని అంటున్నారు కదా. మీరు అధికారంలోకి వస్తే ఆయనపై ప్రతీకారం తీర్చుకుంటారా?

వైఎస్‌ జగన్‌ : దేవుడి దయ వల్ల నాలో ఒక మనిషిపై ప్రతీకారం తీర్చుకోవాలనే గుణం లేదు. ఏదైనా తప్పు జరిగితే దానిపై విచారణ జరగాలా? తప్పులను సరిదిద్దేందుకు ప్రతి ప్రయత్నం చేస్తాం. కచ్చితంగా విచారణ జరుగుతుంది.

చంద్రబాబు అసెంబ్లీ వైఎస్సార్‌ నాపై 23 కేసులు పెట్టారు. నన్నే చేయగలిగారు అని ప్రశ్నించారు. నేను కడిగిన ముత్యాన్ని అని అన్నారు?. మీరు పెట్టే కేసులు కూడా అలానే అవుతాయా?

వైఎస్‌ జగన్‌ : ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన ఏ వ్యవస్థను అయినా మేనేజ్ చేయగలరు. ఈ విషయం రాష్ట్ర ప్రజానీకానికి కూడా తెలుసు. ప్రతి అంశంలోనూ తనకు అనుకూలంగా స్టేలు తెచ్చుకోవడం, ఆయనకు అనుకూలంగా మార్చుకోవడం జరగుతోంది. దీనికి అర్థం ఆయన తప్పు చేయలేదని కాదు. శిశుపాలుడిని కూడా దేవుడు వంద తప్పులు చేసేవరకూ క్షమించాడు. అదే రీతిలో ఎప్పుడో ఒకసారి దేవుడు కచ్చితంగా ఆయన్ను శిక్షిస్తారు.

వైస్సార్‌ కాంగ్రెస్‌ అంటే వన్‌ మ్యాన్‌ షో అంటారు దేనికి?

వైఎస్‌ జగన్‌ : ఏ ప్రాంతీయ పార్టీయైనా నాయకుడి విశ్వసనీయతపైనే బతుకుతుంది. ఎనిమిదేళ్ల నా రాజకీయ కెరీర్‌లో రోడ్డుపైనే(ఓదార్పు, పాదయాత్రలను ఉద్దేశించి) ఎక్కువగా ఉన్నాను. కాబట్టి, సహజంగానే ప్రజలు జగనే పార్టీ అని భావించే అవకాశం ఉంటుంది. పార్టీ నిర్ణయాల్లో కచ్చితంగా మిగిలిన వారి సలహాలను, సూచనలను తీసుకుంటాను. వాటిని పాటించాను కూడా.

వైఎస్‌ జగన్‌ అనే నేను అని ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు?

వైఎస్‌ జగన్‌ : దేవుడు, ప్రజల ఆశీర్వాదం ఉంటే అది కచ్చితంగా జరుగుతుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top