అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ : వైఎస్‌ జగన్‌

YS Jagan Slams CM Chandrababu Naidu In Srikakulam Public Meeting - Sakshi

రెండులక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం

ఏడు రోడ్ల బహిరంగ సభలో నిరుద్యోగులకు వైఎస్‌ జగన్‌ భరోసా

పింఛన్‌ కావాలంటే లంచం.. రేషన్‌ కావాలంటే లంచం

చంద్రబాబు పాలనపై ధ్వజమెత్తిన ప్రతిపక్షనేత

జనసంద్రంగా మారిన ఏడు రోడ్ల కూడలి

సాక్షి, శ్రీకాకుళం: అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ వేస్తామని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. సుమారు రెండు లక్షల ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్‌ ఇస్తామని, ప్రతి ఏడాది ఉద్యోగ క్యాలెండర్‌ విడుదల చేస్తామని నిరుద్యోగులకు భరోసా ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 316వ రోజు శనివారం శ్రీకాకుళం పట్టణం ఏడు రోడ్ల కూడలిలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

అధికారంలోకి రాగానే.. ప్రతి ఊరులో గ్రామ సచివాలయం నెలకొల్పి, అదేగ్రామానికి చెందిన 10 మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఈ గ్రామ సచివాలయాలతో లక్షా 50 వేల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్‌ను నియమించి, వారికి నెలకు రూ. 5వేలు ఇస్తామన్నారు. పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనే చట్టాన్ని తీసుకొస్తామన్నారు. గత ఎన్నికల్లో దారుణంగా మోసం చేసిన టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌, జనసేనాలను నమ్మొద్దన్నారు. వచ్చే ఎన్నికల్లో  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ను గెలిపించాలని, ప్రత్యేక హోదా సాధనకు కృషి చేద్దామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సభలో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

అభివృద్ధిలో శ్రీకాకుళం లాస్ట్‌..
‘సీట్లు తీసుకోవడంలో టీడీపీకి శ్రీకాకుళం నెం.1, కానీ అభివృద్ధిలో మాత్రం చివరిస్థానంలో ఉంటుంది. 2004లో తమ నిర్ణయాన్ని మార్చుకున్న ఇక్కడి ప్రజలు ఆ దివంగత నేత వైఎస్‌రాజశేఖర్‌ రెడ్డిని గెలిపించారు. అప్పుడు జరిగిన అభివృద్ధిని చూసి మళ్లీ అదే నేతపై నమ్మకంతో 2009లో 10 స్థానాలకు 9 స్థానాలను గెలిపించారు. ఆయన కొడుకుగా పుట్టడం నేను పూర్వ జన్మలో చేసుకున్న సుకృతమని గర్వంగా చెప్తాను. 2014లో చంద్రబాబు నాయుడు గెలిచారు. 10 స్థానాల్లో ఏడుగురిని ఇక్కడి ప్రజలు గెలిపించారు. ఇవి సరిపోవని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారు.

పెండింగ్‌ పనులను పూర్తి చేస్తాం..
గత 55 ఏళ్లుగా వంశధార ప్రాజెక్టుపై ఒడిశాతో సమస్య ఉంది. ఏనాడు చంద్రబాబు ఈ సమస్యను తీర్చడానికి ప్రయత్నించలేదు. కానీ దివంగత నేత వైఎస్సార్‌ సీఎం అయిన తరువాత న్యాయపరమైన చిక్కులను తొలగించి వంశధార ప్రాజెక్ట్‌ చేపట్టారు. రూ.930 కోట్లు కేటాయించి దాదాపు రూ.700 కోట్లు ఖర్చు చేసి వంశధార ప్రాజెక్ట్‌ను యుద్దప్రాతిపదికన పూర్తి చేసే ప్రయత్నం చేశారు. కానీ తప్పుడు అంచనాలతో ప్రాజెక్ట్‌ వ్యయాన్ని మరో రూ.470 కోట్లకు పెంచేసిన చంద్రబాబు తన బినామీ సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్‌ కంపెనీకి పనులు అప్పగించారు. నాలుగేళ్లలో పనులు అంగుళం కూడా ముందుకు సాగలేదు. అధికారంలోకి రాగానే పెండింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నాను.

స్మార్ట్‌ సీటీ అన్నారు.. ఎక్కడైనా కనిపించిందా?
వైఎస్‌ఆర్‌ హయాంలోనే సిక్కోలులో రిమ్స్‌ మెడికల్‌ కాలేజీ వచ్చింది. ప్రస్తుతం రిమ్స్‌లో కనీస సౌకర్యాలు లేవు.. సిటీ స్కానర్‌ రిపేర్‌లోఉంది. ఎంసీఐ అనుమతి నిరాకరించే పరిస్థితిలో రిమ్స్‌ ఉంది. అసెంబ్లీ సాక్షిగా శ్రీకాకుళంకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదు. శ్రీకాకుళాన్ని స్మార్ట్‌ సిటీ చేస్తామన్నారు.. ఏమైంది? అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, రింగ్‌ రోడ్‌, ఎయిర్‌పోర్ట్‌, ఫుడ్‌ పార్క్‌, స్కూల్‌ఆఫ్‌ ప్లానింగ్‌, ఆర్కిటెక్చర్‌ బిల్డింగ్‌ల నిర్మాణం, కోడి రామ్మూర్తి స్టేడియం పునఃనిర్మాణం అని అనేక హామీలు ఇచ్చారు. మరి నెరవేర్చారా అని అడుగుతున్నా? వైఎస్‌ఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీ తీసుకొస్తే.. చంద్రబాబు నాశనం చేశారు. పోస్టులు భర్తీ చేయరు.. స్కాలర్‌షిప్పులు ఇవ్వరు. వైఎస్‌ఆర్‌ శ్రీకాకుళం జిల్లాకు ట్రిపుల్‌ ఐటీ మంజూరు చేశారు. చంద్రబాబు ఇప్పటి వరకు ట్రిపుల్‌ ఐటీ భవనానికి ఒక్క ఇటుక వేయలేదు. జిల్లాలో 271 ప్రభుత్వ స్కూళ్లతో పాటు ఎస్సీ,ఎస్టీ, బీసీ హాస్టళ్లను మూయించేశారు. 

ఆ ప్లాట్‌లు ఇస్తే తీసుకొండి..
వైఎస్సార్‌ హయాంలో అక్షరాల 11వేల ఇళ్లు కట్టించారు. చంద్రబాబు మాత్రం ఫ్లాట్‌లు ఇస్తామని అపార్ట్‌మెంట్స్‌ కడుతున్నారు. అవి ప్రభుత్వ భూములు.. సిమెంట్‌కు సబ్సిడీ ఇస్తున్నారు. లిఫ్ట్‌ ఉండదు. ఇలాంటి వాటికి అడుగుకు వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది. చంద్రబాబు మాత్రం రూ.3లక్షలు ఖర్చే అయ్యే ఫ్లాట్‌ను రూ.7 లక్షల 80వేలకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో లక్షన్నర కేంద్ర ప్రభుత్వం, లక్షన్నర రాష్ట్రప్రభుత్వం ఇస్తుందంటా.. మిగతా నాలుగు లక్షల 80వేలను నెలనెలా 20 ఏళ్లు కడుతూ ఉండాలంట. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి.. ఆ ఫ్లాట్‌లు ఎవరికైన ఇస్తే బంగారంలా తీసుకొండి. ఆ తర్వాత ఆ దేవుడి దీవెనెలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. జగన్‌ అనే నేను.. ఆ ఫ్లాట్‌ల బకాయి నాలుగు లక్షల 80 వేల రూపాయలను మాఫీ చేస్తానని హామీ ఇస్తున్నాను.

పింఛన్‌ కావాలంటే లంచం.. రేషన్‌ కావాలంటే లంచం
119 మంది మత్స్యకారులు చనిపోతే ఎవరికి పరిహారం అందలేదు. తిత్లీ తుపాను వల్ల రూ.3,435 కోట్ల నష్టం వచ్చిందని కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు.. రూ. 520 కోట్లే మంజూరు చేశారు. వీటిలో కనీసం సగం కూడా ఖర్చు చేయలేదు. చంద్రబాబు ప్రభుత్వ రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. బినామీలకు అబ్ధి చేకురేలా పనిచేస్తున్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారు. ఆయన హయాంలో రేషన్‌ షాప్‌కు పోతే బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదు. తన హెరిటేజ్‌ కోసం రాష్ట్రంలోని సహకార డెయిరీలను మూయించారు. 23 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉంటే.. 7,900 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. సిలబస్‌, షెడ్యూల్‌ మారుస్తు గందరగోళానికి గురిచేస్తున్నారు.

మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నారు. బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏడు ప్రధాన దేవాలయాల్లో పారిశుద్ధ్య పనుల కాంట్రాక్ట్‌ను చంద్రబాబు తన బినామీ భాస్కర్‌నాయుడుకు అప్పగించారు. నాలుగు రెట్లు అదనంగా పెంచి కమీషన్లు దండుకుంటున్నారు. పింఛన్‌ కావాలంటే లంచం.. రేషన్‌ కావాలంటే లంచం.. మరుగుదొడ్లు కావాలన్నా జన్మభూమి కమిటీకి లంచం ఇవ్వాల్సిందే.’ అని వైఎస్‌ జగన్‌ చంద్రబాబు పాలనపై ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే నవరత్నాలతో అన్నివర్గాల ప్రజలను ఆదుకుంటామని స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top