టీఆర్‌ఎస్‌తో పొత్తుకు ఎందుకు వెంపర్లాడావు బాబూ? 

YS Jagan Slams Chandrababu In Narasannapeta - Sakshi

నరసన్నపేట సభలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌  

ప్రత్యేక హోదాను వద్దని ఉంటే ఆ పార్టీతో మంతనాలేంటి? 

మీ బావమరిది శవం పక్కనే కేటీఆర్‌తో పొత్తు గురించి మాట్లాడ లేదా? 

టీఆర్‌ఎస్‌ ఆంధ్రాకు వస్తానన్న తర్వాత సిద్ధాంతం మారిందా? 

ఊసరవెల్లి కన్నా వేగంగా రంగులు మార్చింది ఎవరు? 

రాష్ట్ర ప్రజలను కష్టాల్లోకి నెట్టి జాతీయ,అంతర్జాతీయ, అంతరిక్ష రాజకీయాలట 

జన్మభూమి పేరిట ఊరూరా మాఫియా 

మీ పాలనలో అన్నీ ఊస్టింగులే

మనందరి పాలన రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలను ఆదుకుంటాం 

గ్రామ సచివాలయాల ద్వారా మీ ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలు తీసుకొస్తాం

అసెంబ్లీ సాక్షిగా, రాజకీయ వేదికలపైన అధర్మ పోరాట దీక్ష సభలలో చంద్రబాబు అన్న మాటేమిటి? టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాలని ఎంతో ప్రయత్నించాను..తెలుగు ప్రజలందరూ ఎక్కడ ఉన్నా అందరూ కలిసి ఉండాలని ఎంతో అనుకున్నా.. కానీ నరేంద్ర మోదీ అడ్డుపడ్డాడు.. అని చంద్రబాబు పదేపదే చెబుతూ టీఆర్‌ఎస్‌తో పొత్తుకు ఉర్రూతలూగారు. నిజంగా టీఆర్‌ఎస్‌ వాళ్లు ప్రత్యేక హోదాను వ్యతిరేకించి ఉంటే హరికృష్ణ భౌతికకాయం సాక్షిగా ఆ పార్టీతో పొత్తు పెట్టుకుందామని కేటీఆర్‌ను ఎలా అడిగావు చంద్రబాబూ? ఈ దిక్కుమాలిన రాజకీయాలను గమనించండి. 

ఈయన (చంద్రబాబు) బీజేపీతో కలిస్తే బీజేపీ మనిషి.. కాంగ్రెస్‌తో కలిస్తే కాంగ్రెస్‌ మనిషి.ఈ పెద్దమనిషి చంద్రబాబు మురికి కాలువలో దూకి అది గంగానది అని కూడా చెబుతాడు.ఆ స్థాయిలో చంద్రబాబు రాజకీయాలను భ్రష్టు పట్టించాడు. ఆయన ఏం చేస్తే అదే ధర్మం.ఏం మాట్లాడితే అదే న్యాయం. ఈ పెద్దమనిషి ఎవరి మీద కావాలంటే వారి మీద బురద చల్లించగలుగుతాడు. ఆయన ఎల్లో మీడియాతో ఇష్టం వచ్చినట్టుగా అసత్య ప్రచారాలు కూడా చేయిస్తాడు.  

ఇదే కాంగ్రెస్‌ పార్టీ 2018 జూన్‌ 8న చంద్రబాబు అవినీతి, అన్యాయాలపై ఒక పుస్తకాన్ని రిలీజ్‌ చేసింది.చంద్రబాబులాంటి అవినీతిపరుడు, అన్యాయస్తుడు ఎవరూ లేరంటూ రాహుల్‌ గాంధీ ఫొటో పెట్టి మరీ ఆ పుస్తకాన్ని రిలీజ్‌ చేసింది. ఇది జరిగి నాలుగు నెలలైనా తిరగకముందే చంద్రబాబు అవినీతి సొమ్ములో కొంత వాటా ఇచ్చేసరికి అనైతిక పొత్తు పెట్టుకుని చంద్రబాబునాయుడు పక్కన కాంగ్రెస్‌ పార్టీ కనిపించింది.  
 
రాష్ట్రం విడిపోయాక 4లక్షల 43 వేల 854 మంది ఉద్యోగులు ఉన్నారని లెక్క తేల్చారు. 2018 జనవరి నాటికి ఉద్యోగుల సంఖ్య 3 లక్షల 45 వేల 581 మందికి పడిపోయింది. అంటే 98 వేల 273 మంది ఉద్యోగులు రిటైర్‌ అయ్యారు. మరోపక్క రాష్ట్ర విభజన జరిగే నాటికి రాష్ట్రంలో లక్షా 42 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రిటైర్‌ అయిన వారితో కలుపుకుంటే ఆ సంఖ్య రెండున్నర లక్షలు దాటిపోయింది. ఇన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఈ పెద్దమనిషి ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చాడా? 23 వేల టీచర్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటిని 7 వేలకు కుదించి మొన్న ఒక నోటిఫికేషన్‌ ఇచ్చాడు. ఆ తర్వాత సిలబస్‌ మార్చాడు. పరీక్షల షెడ్యూల్‌ పదేపదే మారుస్తున్నాడు. ఈ పెద్ద మనిషి హయాంలో ఎక్కడా పోస్టింగులైతే లేవు కానీ అన్నీ ఊస్టింగులే.  

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘ప్రత్యేక హోదాను టీఆర్‌ఎస్‌ వ్యతిరేకిస్తే ఆ పార్టీతో పొత్తుకు ఎందుకు ఊర్రూతలూగావ్‌? భావమరిది హరికృష్ణ భౌతిక కాయాన్ని పక్కన పెట్టుకుని కేటీఆర్‌తో పొత్తు గురించి ఎందుకు బేరసారాలు ఆడావ్‌? ఊసర వెల్లికన్నా వేగంగా రంగులు మారుస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని విమర్శిస్తావా?’ అని ప్రతిపక్ష నేత, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రజలను గాలికొదిలేసి రాష్ట్రాలు పట్టుకుని తిరుగుతారా.. అంటూ దునుమాడారు. జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు చాలక అంతరిక్ష రాజకీయాలు చేస్తారా.. అంటూ ఎద్దేవా చేశారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 322వ రోజు ఆదివారం ఆయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గ కేంద్రంలో జరిగిన భారీ బహిరంగ సభలో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. బాబు పాలనలో ఊస్టింగులు తప్ప పోస్టింగులు లేవన్నారు. రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని ధ్వజమెత్తారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏమన్నారంటే..  

తెలంగాణలో నీవు చేసిందేమిటి బాబూ?
‘‘రాష్ట్రంలో చంద్రబాబు పాలన అన్యాయమైన స్థితిలో ఉంటే ఆయన మాత్రం రాష్ట్రాన్ని గాలికొదిలేసి ఏమిచేస్తున్నాడో తెలుసా? తమిళనాడులో కరుణానిధి విగ్రహావిష్కరణ జరుగుతుంటే ఈయన గారు అక్కడకు వెళ్లారట. అయ్యా చంద్రబాబూ.. రాష్ట్రానికి మేలు చేయండని, ఆదుకోండని రాష్ట్ర ప్రజలు ఓటేసి నిన్ను గెలిపించుకుంటే దేశ రాజకీయాలు, అంతర్జాతీయ రాజకీయాలంటూ రాష్ట్రాలు పట్టుకుని తిరుగుతున్నావు. చంద్రబాబునాయుడు ఎటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తో, ఎటువంటి పాలన సాగిస్తున్నాడో ఒకసారి మీరంతా ఆలోచించండి. ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఎన్నికలు జరిగాయి.  ఆ ఎన్నికల్లో ఈయన చేసిన జిమ్మిక్కులేమిటో మీరంతా టీవీల్లో చూసే ఉంటారు. ఊసరవెల్లి కన్నా స్పీడుగా రంగులు మార్చాడు ఈ పెద్దమనిషి.

తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు రంగు మార్చినప్పుడల్లా తన రాజకీయ సిద్ధాంతాన్ని కూడా మార్చేస్తుంటాడు. ఇదే పెద్ద మనిషి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఖరారు కాకముందు ఒక మాట, ఆ ఎన్నికల్లో బోర్లా పడ్డ తర్వాత మరో మాట మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్‌తో పొత్తు ఖరారు కాకముందు టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం నానా ప్రయత్నాలు చేశాడు. టీఆర్‌ఎస్‌తో పొత్తు కుదరకుండా ప్రధాని నరేంద్ర మోదీ అడ్డుకుంటున్నాడని చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. ఈ ఏడాది ఆగస్టు 29న హైదరాబాద్‌లో చంద్రబాబు బావమరిది హరికృష్ణ అంత్యక్రియలు జరుగుతుండగా, ఆయన భౌతికకాయం పక్కనుండగానే కేటీఆర్‌తో పొత్తుల కోసం బేరాలాడాడు. దానికి కేటీఆర్‌ ససేమిరా అన్నాక రెండు నెలలు తిరగకుండానే ఢిల్లీకి వెళ్లాడు. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌ పార్టీతో నిస్సిగ్గుగా పొత్తు పెట్టుకున్నాడు. ఆ తర్వాత రాహూల్‌ గాంధీతో కలిసి ఫొటోలు దిగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించాడు. ఎక్కడ చూసినా రాహూల్‌గాంధీతో కలిసి కనబడ్డాడు. 

అన్యాయమైన రాజకీయాలు.. 
తెలంగాణ ప్రజలు తెలుగుదేశం, కాంగ్రెస్‌లకు బుద్ది వచ్చేలా అనైతిక పొత్తుపై తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు ఇచ్చాక ఇదే పెద్దమనిషిని ఉద్ధేశించి టీఆర్‌ఎస్‌ పార్టీ గట్టిగా స్పందించింది. నువ్వు మా రాష్ట్రం(తెలంగాణ) లోకి వచ్చావు. అవినీతి సొమ్ము తెచ్చావు. అక్షరాలా రూ.142 కోట్లు నీ అవినీతి సొమ్ము పట్టుబడింది. ఎన్నికల సంఘం తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు కూడా నమోదు చేసింది. పట్టుబడింది రూ.142 కోట్లు అయితే పట్టుబడకుండా ఇంకా ఎన్ని వందల కోట్లు పంపిణీ చేశావు బాబూ.. అని వాళ్లంతా గట్టిగా అడిగారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పడం కోసం వాళ్లు కూడా ఆంధ్రప్రదేశ్‌కు వస్తాము అని చెప్పారు. ఆ వెంటనే చంద్రబాబు ఊసరవెల్లి కన్నా వేగంగా రంగులు మార్చారు. ప్రత్యేక హోదాను వ్యతిరేకించిన టీఆర్‌ఎస్‌ ఏపీకి రావడమేమిటి? ప్రతిపక్షం వాళ్లతో పొత్తు పెట్టుకోవడమేమిటి?, కలిసి పని చేయడమేమిటి? అని చంద్రబాబు అన్నాడు. కానీ అదే పార్టీతో పొత్తుకు తహతహలాడాడు. ఈ స్థాయిలో చంద్రబాబు అన్యాయమైన రాజకీయాలు నడుస్తున్నాయి. 

వంశధార గురించి ఈయన ఏనాడూ ఆలోచించలేదు 
ఇక్కడి ప్రజలు ఆ దివంగత నేత వైఎస్‌తో తమకున్న అనుబంధాన్ని చెబుతూ గత నాలుగున్నరేళ్లలో టీడీపీ చీకటి పాలనను బేరీజు వేస్తున్నారు. వ్యవసాయం మీద బతుకుతున్న ఈ ప్రాంతానికి నీళ్లివ్వడానికి నాన్నగారు చేసిన కృషిని ఇవాళ్టికి కూడా మరిచిపోలేమన్నా అని చెబుతున్నారు ఇక్కడి ప్రజలు. ‘అన్నా.. గతంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పాలించిన చంద్రబాబు ఇదే వంశధార నదిలో పుష్కలంగా నీళ్లున్నా ఏ రోజు కూడా ఇక్కడ ప్రాజెక్టు కట్టాలని, ఇక్కడి ప్రజలకు తోడుగా ఉండాలని ఆలోచించిన పాపాన పోలేదు. ఒడిశాతో ఉన్న వివాదాన్ని పరిష్కరించే విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. ఆ రోజుల్లో చంద్రబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఒడిశాలో నవీన్‌పట్నాయక్‌ సీఎంగా ఉన్నారు. వీరిద్దరూ వాజ్‌పాయ్‌ నాయకత్వంలోని ఎన్డీఏ పాలనలో కలిసే ఉన్నారు. అయితే చంద్రబాబు ఏ రోజూ ఈ ప్రాజెక్టు గురించి ఆలోచించలేదు. కానీ నాన్న గారు ముఖ్యమంత్రి అయ్యాక 55 ఏళ్లుగా వివాదంలో ఉన్న ఈ ప్రాజెక్టుకు 2005 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టారు. వంశధార నదిపై సైడ్‌ వ్యూయర్‌ నిర్మించి హిరమండలంలో రిజర్వాయర్‌ కట్టి నీళ్లను తరలించి మేలు చేశారు. అప్పట్లోనే రూ.930 కోట్లు కేటాయించి రూ.700 కోట్లు ఖర్చుచేసి యుద్ధప్రాతిపదికన పనులు జరిపించారు. ఆ తర్వాతి ప్రభుత్వాలు మరో రూ.175 కోట్లు ఖర్చు చేయడంతో ఈ ప్రాజెక్టులో దాదాపు 95 శాతం పనులు పూర్తి అయ్యాయి. చంద్రబాబు సీఎం అయ్యే నాటికి కేవలం రూ.55 కోట్ల పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే చంద్రబాబు మళ్లీ వచ్చాక.. ఈ రూ.55 కోట్ల ప్రాజెక్టు పనుల అంచనాలను రూ.476 కోట్లకు పెంచారు. తన బినామీ అయిన సీఎం రమేష్‌కు పనులకు అప్పగించారు. ఇవాళ ప్రాజెక్టు మొత్తం అవినీతిమయమైపోయింది. 

ఈ జిల్లాకు బాబు ఏం చేశారు? 
ఇదే నరసన్నపేట నియోజకవర్గంలోని జులుమూరు, లుకలాం, మగదాం, పొలాకి, నిగడగడ్డగామ్, పైడి ఈ మొత్తం ఆరు ఓపెన్‌హెడ్‌ కాలువలు ఉంటే వీటిని వంశధార ప్రాజెక్టుతో అనుసంధానం చేసింది డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి. వాటి ఆధునికీకరణ కోసం 2007–08లో రూ.33 కోట్లు మంజూరు చేసి తమకు తోడుగా ఉన్నారని ఇక్కడి ప్రజలు చెప్పారు. అదే దివంగత నేత జులుమూరు, పొలాకి, నరసన్నపేట మండలాల్లో కరకట్టల నిర్మాణం కోసం రూ.56 కోట్లు మంజూరు చేస్తే ఇందులో 20 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. ఇంతటి దారుణంగా చంద్రబాబు పాలన సాగుతోంది. రేపు మనందరి ప్రభుత్వం రాగానే వంశధార ప్రాజెక్టు పెండింగ్‌ పనులను, నేరేడు బ్యారేజీని వెంటనే పూర్తి చేస్తాం. నరసన్నపేట నియోజకవర్గంలో ఎత్తులో ఉన్న పొంట పొలాలకు నీరివ్వడానికి అప్పట్లో నాన్నగారు వంశధార ఎడమ కాలువపై ఎనిమిది లిఫ్ట్‌లు పెట్టి రైతన్నలకు తోడుగా నిలిస్తే ఇవాళ వాటిని నడపలేని దుస్థితి అని స్థానికులు చెబుతున్నారు. సారవకోట మండలం తొగిరి వద్ద మోటార్లు కాలిపోయి, పైపులు పగిలిపోయి మూలనపడిన పరిస్థితి. ఇదే మండలంలో బద్రి వద్ద ఏర్పాటు చేసిన లిఫ్టు కూడా పూర్తి స్థాయిలో పని చేయడం లేదు. జలుమూరు లిఫ్ట్‌ ప్రాజెక్టులోనూ ఇదే పరిస్థితి. దీంతో 6 వేల ఎకరాలకు సాగు నీరందక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ జిల్లాలో మెజార్టీ సీట్లిచ్చి చంద్రబాబును గద్దెనెక్కిస్తే ఈ జిల్లాకు, ఈ నియోజకవర్గానికి ఏమి చేశాడన్నా.. అని ఇక్కడి ప్రజలు అడుగుతున్నారు. నాన్నగారు ఈ నియోజకవర్గంలో 38 వేల ఇళ్లు కట్టిస్తే ఈ నాలుగున్నరేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ఊరికి రెండు, మూడు ఇళ్లు కూడా కట్టించలేదన్నా అని చెప్పుకొచ్చారు.  

ఈ హామీల్లో ఏ ఒక్కటైనా అమలైందా? 
- నరసన్నపేట పట్టణంలో రాజాలచెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేశారా? 
- జగన్నాథఫురంలో ఐదు వీధుల్లో మంచినీటి సమస్య తీరిందా? 
- నరసన్నపేట చుట్టూ రింగురోడ్డు వేశారా?  
- సారవకోట మండలం రంగ సాగరం ఎత్తిపోతలకు రూపాయి అయినా ఇచ్చారా?  
- సారవకోటలో గిరిజన ప్రాంతాల్లో పీహెచ్‌సీలు ఏర్పాటయ్యాయా? 
-  జలుమూరు మండలం తిలారు జంక్షన్‌ వద్ద రైల్వే వంతెన నిర్మించారా? 

‘అన్నా.. ఇవేవీ అమలు కాలేదు కానీ, ఈ నియోజకవర్గంలో వనతి, మడపాం, బుచ్చిపేట, దుబ్బాక, అచ్యుతాపురం తదితర ర్యాంపుల్లోంచి వందల లారీల్లో ఇసుక మాత్రం నిత్యం విశాఖకు తరలిస్తూ దోచేస్తున్నారన్నా.. లారీ ఇసుక రూ.40 వేలకు అమ్ముకుంటున్నారన్నా.. ఆ డబ్బు ఎమ్మెల్యే మొదలు మంత్రులు, చినబాబు, పెదబాబు దాకా వెళ్తుందన్నా..’ అని ప్రజలు చెప్పుకొచ్చారు. ఈ చంద్రబాబు మైకు పట్టుకుని మనకు ఇసుక ఉచితంగా ఇస్తున్నామని చెబుతాడు. నిజంగా మీకు ఇసుక ఉచితంగా దొరుకుతోందా? రైతులకు ఇవ్వాల్సిన మినుముల మద్ధతు ధరను మంత్రి అచ్చెన్నాయుడు మింగేశాడన్నా.. అని ఇక్కడి ప్రజలు చెప్పుకొస్తున్నారు. ఇదే మంత్రి, ఎమ్మెల్యేలు దళారుల ద్వారా రైతుల నుంచి క్వింటాల్‌ రూ.2,500 నుంచి రూ.3,000 మధ్య కొనుగోలు చేస్తున్నారు. తర్వాత ఇదే దళారుల దగ్గర నుంచి క్వింటాల్‌ రూ.5,500తో మార్క్‌ఫెడ్‌తో కొనుగోలు చేయిస్తారు. రైతులంతా ఆందోళనలు, ధర్నాలు చేస్తే ఈ బాగోతం బయటకు వచ్చింది. అయినా ఒక్క కేసు నమోదు కాలేదు. ఇదే నియోజకవర్గంలో చంద్రబాబు 36 స్కూళ్లను మూసేయించాడు. జలుమూరు మండలంలో 19, పొలాకి మండలంలో ఆరు, నరసన్నపేటలో ఐదు, సారవ కోట మండలంలో ఆరు స్కూళ్లు మూతపడ్డాయి. సారవకోట మండలం గుడితిలో ఒకటి, నరసన్నపేట మండలంలో రెండు హాస్టల్స్‌ను మూసేయించాడు. సర్కారీ విద్యను దగ్గరుండి నాశనం చేస్తున్నాడు. 

బాబు తీరు శవాలపై చిల్లర ఏరుకున్నట్లుంది.. 
తిత్లీ తుపాను వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వం ముందుకు వచ్చి ఆదుకుంటుందని ఎంతో ఎదురు చూశామన్నా.. అని స్థానికులు చెప్పారు. నరసన్నపేటలోని జులుమూరు, సారవకోట, పొలాకి మండలాల్లో 38 వేల ఎకరాల్లో పంట నష్టపోతే, 16 వేల ఎకరాలకు తగ్గించారన్నా.. అని ఇక్కడి రైతులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎన్యూమరేషన్‌ కూడా జరగలేదన్నా అని చెప్పారు. తిత్లీ తుపానుతో ఈ జిల్లాలో రూ.3,435 కోట్లు నష్టం వచ్చిందని ఇదే పెద్దమనిషి కేంద్ర హోం శాఖకు లేఖ రాశాడు. ఈయన మాత్రం అందులో 15 శాతం రూ.500 కోట్లు కూడా పంపిణీ చేయలేదు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు బాధితులంతా నిలదీస్తే అనరాని మాటలు అన్నారు. వారు నిరసన తెలుపుతున్నప్పుడు వెనుక నుంచి ఫొటోలు తీసి, జైకొడుతున్నారని.. విజయవాడ, విశాఖపట్నంలో ఫ్లెక్సీలు పెట్టాడు. అంతటితో ఆగకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులపై ఫ్లెక్సీలు వేసి.. శ్రీకాకుళం జిల్లా తిత్లీ బాధితులను ఆదుకున్న సీఎం అని ఊదరగొడతాడు. ఈ పెద్దమనిషి పబ్లిసిటీ తీరు చూస్తుంటే శవాలపై చిల్లర ఏరుకున్నట్టుగా ఉంది. తిత్లీ తుపాను వచ్చి పోయి రెండు నెలలైనా వ్యవసాయ పంపుసెట్లకు కరెంటు పునరుద్ధరించ లేదంటే ఈయన పాలన ఏ స్థాయిలో ఉన్నదనే దానికి నరసన్నపేట నియోజకవర్గమే ఒక ఉదాహరణ. 

ఇలాంటి నాయకుడు అవసరమా? 
ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్‌ అంటున్నారు. ఆ తర్వాత రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలన ఎంత అన్యాయంగా సాగిందో చూశారు. ఇలాంటి నాయకుడు అవసరమా? గుండెపై చేతులు వేసుకుని ఆలోచించండి. రైతులు, డ్వాకా సంఘాల అక్కచెల్లెమ్మలకు రుణమాఫీ జరగలేదు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రాకపోగా వేలం నోటీసులు మాత్రం వస్తున్నాయి. సున్నా వడ్డీ, పావలా వడ్డీ రుణాలు లేవు. 11 జిల్లాలు కరవుతో బాధపడుతున్నాయి. ఖరీఫ్‌ పంటకు సంబంధించి రూ.2 వేల కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చిన పాపానపోలేదు. ముఖ్యమంత్రే తన హెరిటేజ్‌ దుకాణాల కోసం దళారీగా మారడంతో పంటలకు మద్దతు ధర లేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 30 వేల మంది ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవిందా.. గృహ నిర్మాణ శాఖలో వర్కు ఇన్‌స్పెక్టర్‌లు, కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌ల ఉద్యోగాలు 3,500 గోవిందా.. 1,000 మంది గోపాలమిత్రుల ఉద్యోగాలు గోవిందా.. 4,500 ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు గోవిందా.. ఆయుష్, మధ్యాహ్న భోజన నిర్వాహకుల (85 వేలు) ఉద్యోగాలు గోవిందా.. 30 వేల మంది సాక్షర భారత్‌ ఉద్యోగాలు గోవిందా.. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాల్లేవు.. నిరుద్యోగ భృతీ లేదు. ఇప్పుడు ఎన్నికలొస్తున్నాయని రూ.2 వేల భృతిని రూ.వెయ్యికి కుదించి కోటీ 72 లక్షల ఇళ్లకు గాను కేవలం 3 లక్షల మందికి మాత్రమే ఇస్తారట.

ఈయన అవినీతి కారణంగా పోలవరం ప్రాజెక్టు పునాది గోడలు కూడా దాటలేదు. ఈయన తీరు చూస్తుంటే ఇంటికి పునాదులు వేసి గృహప్రవేశం చేసినట్లుంది. రాష్ట్ర రాజధాని సినిమాలో రోజుకొక గ్రాఫిక్స్‌ చూపిస్తాడు. అదిగో బాహుబలి.. ఇదిగో రాజధాని అంటాడు. పర్మినెంట్‌ పేరుతో ఒక్క ఇటుక కూడా పడలేదు. అన్నీ తాత్కాలికమే. ఈ బిల్డింగ్‌లు ఏ స్థాయిలో ఉన్నాయంటే బయట మూడు అంగుళాల వర్షం పడితే లోపల ఆరు అంగుళాల్లో నీరు కనిపిస్తుంది. బాబు పాలనలో కరెంటు చార్జీలు,  పెట్రోలు, డీజిల్‌ ధరలు, ఆర్టీసీ చార్జీలు, ఇంటి పన్నులు, స్కూళ్లు, కాలేజీల ఫీజులు బాదుడే బాదుడు. నాలుగు కత్తెర్లు, నాలుగు ఇస్త్రీ పెట్టెలు ఇచ్చి అదే బీసీలపై ప్రేమ అంటాడు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలకు పాతరేశాడు. 108 నంబర్‌కు ఫోన్‌ చేస్తే అంబులెన్స్‌ వస్తుందో రాదో అర్థంకాని పరిస్థితి. రేషన్‌షాపుల్లో బియ్యం తప్ప మరేమీ ఇవ్వడం లేదు. గ్రామ గ్రామాన జన్మభూమి కమిటీలు మాఫియాగా తయారయ్యాయి. ఏది కావాలన్నా లంచమే. బాత్రూమ్‌ కావాలంటే రూ.1,800, ఇల్లు కావాలంటే రూ.15 వేలు, చంద్రన్న బీమా కావాలంటే రూ.20 వేలు, పెన్షన్‌ కావాలంటే రూ. వెయ్యి, నెలనెలా ఇచ్చే వాటిలో రూ.100, రేషన్‌ కార్డుకు రూ.500 లంచం ఇవ్వాల్సిందే. గ్రామాల్లో వీధి వీధినా బెల్ట్‌ షాపులే. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మహిళలకు వైఎస్సార్‌ చేయూత  
ప్రతి కులం వాళ్లూ కార్పొరేషన్‌ కావాలని అడుగుతున్నారు. ఆ కార్పొరేషన్‌ వస్తే ప్రభుత్వం నుంచి తమకు ఏదైనా అంతో ఇంతో డబ్బులు వస్తాయని, లోన్లు వస్తాయనే ఆశ. ఇదే శ్రీకాకుళం జిల్లాలో బీసీలుగా ఉన్న తూర్పుకాపులు, కళింగ, యాదవ, కొప్పుల వెలమలు, యాదవులు, రెడ్డిక, మత్స్యకారులు, కళింగ వైశ్యులు.. ఇలా ఎన్నో బీసీ కులాలు ఉన్నాయి. నేను ఈ జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు వీరందరికీ కార్పొరేషన్‌లు కావాలని అడిగారు. ఇవాళ కార్పొరేషన్ల పనితీరు ఎలా ఉందంటే.. ఊరిలో వెయ్యి మంది ఉంటే ఐదుగురికి కూడా రుణాలు వచ్చే పరిస్థితి లేదు. ఆ ఐదుగురు కూడా లంచాలు ఇవ్వందే రుణాలు మంజూరు కాని దుస్థితి. మన ప్రభుత్వం రాగానే ఈ పరిస్థితిని పూర్తిగా మారుస్తాం. ప్రతి కులానికి ఓ కార్పొరేషన్‌ పెడతానని ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కకు మాట ఇస్తున్నా. కార్పొరేషన్‌ పెట్టడమే కాకుండా ఆ వ్యవస్థలోకి పారదర్శకత తీసుకువస్తా. 45 ఏళ్లు నిండిన ఏ అక్క అయినా సరే ఏ ఇంటిలో ఉన్నా సరే వైఎస్సార్‌ చేయూత పథకం అందేలా చేస్తా.

ఈ పథకం కింద 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ప్రతి అక్కకు కార్పొరేషన్‌ ద్వారా రూ.75 వేలు చేతిలో పెడతాం. అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి నాలుగు దఫాలుగా ఏడాదికి రూ.19 వేల వంతున ఫలానా తేదీన ఇస్తామని ముందే చెబుతాం. ఇది లోనుగా కాదు. పూర్తి ఉచితంగా ఇస్తాం. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటుచేసి ఆ ఊరికి చెందిన 10 మందికి ఉద్యోగాలు ఇస్తాం. ఆ 10 మంది గ్రామ సెక్రటేరియట్‌లో విధులు నిర్వహిస్తారు. మీకు రేషన్, పెన్షన్, వైఎస్సార్‌ చేయూత, ఇల్లు, ఆరోగ్య బీమా వంటి ఏ ప్రభుత్వ పథకమైనా కూడా దరఖాస్తు చేసిన 72 గంటల్లో ఈ సచివాలయం అందజేస్తుంది. ఇందుకోసం ఎవరికీ మీరు లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు. గ్రామ సెక్రటేరియట్‌ బాగా పనిచేసేలా చూసేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమిస్తాం. చదువుకుని, సేవా దృక్పథం ఉన్న వాళ్లను వాలంటీర్లుగా నియమించి రూ.5 వేలు ఇస్తాం. వారు ఆ 50 ఇళ్లకు బాధ్యత వహించి ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలు హోం డెలివరీ చేసేలా చూస్తారు.

ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ బాగుపడాలి. విశ్వసనీయత, విలువలు అనే పదాలకు అర్థం రావాలంటే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి. ఎవరైనా రాజకీయ నాయకుడు మైకు పట్టుకుని నేను ఫలానాది చేస్తానని చెప్పి ఎన్నికల ప్రణాళికలో పెట్టి ఓట్లు అడిగి అధికారంలోకి వచ్చిన తరువాత అది చేయకపోతే తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో నిజాయితీ, విలువలు, విశ్వసనీయత అనేపదాలకు అర్థం ఉంటుంది. ఈ చెడిపోయిన  రాజకీయ వ్యవస్థను మార్చడమనేది జగన్‌ ఒక్కడి వల్లే సాధ్యం కాదు. జగన్‌కు మీ అందరి తోడు, దీవెనలు, ఆశీస్సులు కావాలి’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top