‘జ్వరాలతో జనాలు మరణించినా చంద్రబాబు చలించలేదు’

YS Jagan Slams Chandrababu Naidu In Saluru Public Meeting - Sakshi

సాలూరు బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌

సాక్షి, విజయనగరం : జిల్లా వ్యాప్తంగా జ్వరాలతో 86 మంది చనిపోయినా సీఎం చంద్రబాబు నాయుడు చలించలేదని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. ఒక్క సాలూరులోనే జ్వరాలతో 21 మంది చనిపోయారని, కలసా గ్రామంలో నెలరోజుల్లో 11 మంది చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 291వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన చంద్రబాబు పాలన తీరును చీల్చి చెండాడారు. ఈ సభలో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

108కు ఫోన్‌ చేస్తే..
‘సాలూరు గిరిజన ప్రాంతం, గిరిజన నేపథ్యం.. ప్రాతినిథ్యం వహిస్తున్నది గిరిజన ఎమ్మెల్యే రాజన్న దొర. ఆయనకున్న వ్యక్తిత్వం పక్కనే ఉన్న బొబ్బిలికి రాజాకు కూడా లేదు. బొబ్బిలి ఎమ్మెల్యేను సంతలో పశువులా కొన్నారు. అలానే రాజన్నదొరను కూడా కొనాలని ప్రయత్నించినా అమ్ముడుపోనని చెప్పిన గొప్ప వ్యక్తి ఆయన. అత్యవసర పరిస్థితుల్లో 108కు ఫోన్‌ చేస్తే సకాలంలో వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లేవి. కానీ ఇప్పుడు ఫోన్‌ చేస్తే కండీషన్‌లో లేవు అని సమాధానం వస్తోంది. అంబులెన్స్‌లు పొరపాటున వచ్చినా అస్పత్రికి తీసుకెళ్తుందో.. లేదో తెలియని పరిస్థితి. 8 మంది డాక్టర్లు ఉండాల్సిన సాలూరు ఆసుపత్రిలో నలుగురు మాత్రమే ఉన్నారు.

ఇక్కడి సాగునీటి ప్రాజెక్టులకు దివంగత నేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి తోడుగా ఉన్నారు. ఆయన హయాంలో పెదగడ్డ రిజర్వాయర్‌ పూర్తైంది. దీంతో 12వేల ఎకరాలకు సాగు అందుతోంది. పెదగడ్డ ఎడమ కాల్వ నిర్మిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి గాలికొదిలేశారు. మెంటాడ మండలంలో ఆంధ్రా హైలెవల్‌ పనులు పూర్తి  చేస్తామని తెలుగు దేశం నాయకులు చెప్పారు. నాలుగున్నరేళ్ల పాలన తర్వాత అడుగుతున్నా హైలెవల్‌ కెనాల్‌ పూర్తయిందా?.. 5500 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన కోపుకి రెగ్యులేటర్‌ ప్రాజెక్టు కుప్పకూలిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రాజెక్ట్‌లను రిపేర్‌ చేయాల్సిన పరిస్థితి కూడా కనిపించడంలేదు.

ముఖ్యమంత్రే దళారైతే..
సాలూరు కూరగాయల పంటలకు ప్రసిద్ధి. ఇక్కడి రైతులు ఎక్కువగా కూరగాయలు పండిస్తారు. కానీ  రైతుల నుంచి తక్కువ ధరకు కొన్న కూరగాయలను హెరిటేజ్‌లో రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. ఇక్కడి రైతుల నుంచి కేజీ వంకాయలను రూ.13కు కొంటారు. ఇవే కేజీ వంకాయలను హెరిటేజ్‌ షాప్‌లో మాత్రం రూ.40కు అమ్ముతున్నారు. బీరకాయలు కేజీ రూ.15కు కొని హెరిటేజ్‌లో కేజీ రూ.38కు అమ్ముతున్నారు. కాకరకాయలు కేజీకి రూ. 15 కొని రూ.54కు అమ్ముతున్నారు. హెరిటేజ్‌ లాభాల కోసం రైతులకు అన్యాయం చేస్తున్నారు. దళారీలను కట్టడి చేసి రైతులకు మేలు చేయాల్సిన ముఖ్యమంత్రే దళారీగా తయారయ్యాడు.

తాగునీటి సదుపాయం..
సాలూరుకు తాగునీటిని కూడా సరఫరా చేయలేకపోతున్నారు. పెదగడ్డ ప్రాజెక్టు నుంచి సాలూరు పట్టణానికి మంచి నీటి కోసం అప్పటి కేంద్ర ప్రభుత్వం రూ. 50 కోట్లు మంజూరు చేసింది. కానీ చంద్రబాబు ఆ పనిని కూడా పూర్తి చేయలేదు. వైస్సార్‌ హయాంలో వెంగళరాయసాగర్‌ నుంచి తాగునీటి సదుపాయం కల్పించారు. ఇప్పుడు ఈ పథకాన్ని నడపలేని పరిస్థితి వచ్చింది. సాలూరులో జాతీయ రహదారి-26 వెళ్తోంది. బైపాస్‌ వెయ్యాలన్న కనీస జ్ఞానం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. వైఎస్సార్‌ హయాంలోనే ఆటోనగర్‌ కోసం స్థలాలు కేటాయించారు. కానీ చంద్రబాబు సీఎం కాగానే ఆటోనగర్‌ పనులు అక్కడికక్కడే ఆగిపోయాయి. సాలూరు టీడీపీ ఇంచార్జ్‌ అవినీతికి అంతే లేదు. 35 ఎకరాలను అక్రమంగా ఆక్రమించి చేపల చెరువులను తవ్వించారు. పెదగడ్డ రిజర్వాయర్‌ నుంచి రైతులకు రావాల్సిన నీళ్లను చేపల చెరువుకు తీసుకెళ్తున్నారు. అయినా అడిగేవారే లేరన్నా అని ఇక్కడ రైతులు నాతో చెబుతున్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను ఎలా కొట్టేయాలని చూస్తున్నారు.. తప్పా వారికి న్యాయం చేయాలనే ఆలోచ మాత్రం చంద్రబాబుకు లేదు.

చంద్రబాబు.. లక్షా 10వేలు బాకీ
అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు అయినా బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రాలేదు. వేలం వేస్తున్న నోటీసులు మాత్రం ఇంటికి వస్తున్నాయి. రైతులకు వడ్డీల్లో నాలుగో వంతు కూడా మాఫీ చేయలేదు. రైతుల తరఫున కట్టాల్సిన వడ్డీలను కట్టకుండా చంద్రబాబు ఎగనామం పెట్టారు. అక్కా చెల్లెమ్మలను రుణమాఫీ అంటూ మోసం చేశారు. ఎన్నికల్లో గెలవడం కోసం విద్యార్థులను కూడా విడిచి పెట్టలేదు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే.. రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెబతున్నారు. 40 లక్షల ఉద్యోగాలు దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. ఎన్ని రోజులు ఉద్యోగాలు ఉంటాయో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. నెలకు రూ. 2వేల చొప్పున ప్రతి ఇంటికి చంద్రబాబు రూ. లక్షా 10వేలు బాకీ పడ్డారు.

నాలుగున్నరేళ్లుగా పోలవరం ప్రాజెక్ట్‌ ముందుకు కదలని పరిస్థితి. పోలవరంను పూర్తిగా అవినీతిమయం చేశారు. పోలవరం సబ్‌ కాంట్రాక్టర్‌ మంత్రి యనమల వియ్యంకుడు. తన బినామీలను తీసుకు వచ్చి ప్రాజెక్ట్‌ పనులను చేయిస్తున్నారు. ప్రత్యేక హోదా వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. ఎన్నికలకు ముందు హోదా సంజీవిని.. అని చెప్పి అనంతరం హోదా విషయంలో ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. రాష్ట్రంలో లంచం లేనిదే ఏ పని జరగడం లేదు. కరెంట్‌ చార్జీలు, పెట్రోల్‌ రేట్లు, ఇంటి పన్నులు, స్కూల్‌ ఫీజులు బాదుడే బాదుడు.

అధికారంలోకి రాగానే ఆదుకుంటా..
శ్రీకాకుళం, విజయనరం జిల్లాల్లో తిత్లీ తుపాను వచ్చింది. పబ్లిసిటీ చేయడంలో చంద్రబాబు దిట్ట. తుపాను బాధిత ప్రాంతాల్లో సరైన ముందస్తు చర్యలు చేపట్టలేదు. అక్కడ కనీసం తాగునీటిని కూడా సరఫరా చేయలేదు. తాగునీటి కోసం బాధితులు చంద్రబాబును నిలదీశారు. బుల్‌డోజర్లు పంపిస్తా అంటు బాధితులను బెదిరించారు. ప్రకృతిని హ్యాండిల్‌ చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారు. హుద్‌హుద్‌ తుపాన్‌ను జయించానని ప్రచారం చేసుకున్నారు. అనంతపురంలో కరువు వస్తే రెయిన్‌గన్లతో కరువును పారద్రోలానని ప్రచారం చేశారు. తిత్లీ తుపాను బాధిత ప్రాంతాలకు ఏదో చేసినట్లు ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తున్నారు. బాధితుల తరపున వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలు నిబడితే.. ప్రతిపక్షం సహాయ కార్యక్రమాలు అడ్డుకుంటుందని బురద వేస్తున్నారు. ప్రతిపక్షం ఎందుకు రాలేదని చంద్రబాబు అంటున్నారు.. మరో వారం రోజుల్లో తుపాను ప్రాంతాలకు వెళ్తున్నా. 50 రోజుల పాటు తిత్లీ బాధిత ప్రాంతంలోనే ఉంటా. నష్ట పరిహారం రూ.343.5 కోట్లు  వచ్చిందని అంటున్నారు. చంద్రబాబు ఈ నష్టాన్ని భర్తీ చేయకుంటే అధికారంలోకి రాగానే బాధితులను ఆదుకుంటా’ అని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top