‘వైఎస్సార్‌ చేయూత’తో రూ.75వేలు

YS Jagan says We Will going to do Zero interest revolutions  - Sakshi

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలకూ, కుటుంబాలకు 

45 ఏళ్లు నిండిన అక్కచెల్లెమ్మలందరికీ నాలుగు దఫాల్లో చెల్లిస్తాం 

ఈ మొత్తాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ  కార్పొరేషన్లతో ఇస్తాం 

పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఎన్నికల నాటికి ఉండే అప్పునంతా నాలుగు దఫాల్లో చేతికే ఇస్తాం 

సున్నా వడ్డీ విప్లవాన్ని తెస్తాం 

రాష్ట్రంలో 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మళ్లకు ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం కింద రూ.75,000 ఉచితంగా ఇస్తామని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ఈ మొత్తాన్ని నాలుగు దఫాల్లో ఆయా కార్పొరేషన్ల ద్వారా పూర్తి పారదర్శకంగా అందచేస్తామని ఆయన వివరించారు. అధ్వాన స్థితిలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ. మైనార్టీ కార్పొరేషన్లను ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల నాటికి పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల అప్పునంతా నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతికే ఇస్తామని ప్రకటించారు. మళ్లీ సున్నా వడ్డీ విప్లవాన్ని తీసుకొచ్చి అక్కచెల్లెమ్మళ్లు వారి కాళ్లపైనే నిలబడేలా చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రతి ఊరిలోనూ గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి అదే గ్రామానికి చెందిన వారికి ఉద్యోగాలు కల్పించి అక్కడే పెన్షన్లు, రేషన్‌ కార్డులు, ఇళ్లు, మరుగుదొడ్లు, ఆరోగ్యశ్రీ తదితర ప్రభుత్వ పథకాలన్నీ మంజూరు చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు. చంద్రబాబు మోసపూరిత వైఖరిని, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నిలబెట్టుకోకపోవడాన్ని వైఎస్‌ జగన్‌ తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. బాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరిన అమాయకులైన ముస్లిం పిల్లలపై దేశద్రోహం కేసులు పెట్టి కొట్టించి ఆ నెపాన్ని వైఎస్సార్‌ సీపీపై తోయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా 253వ రోజు సోమవారం విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని కె.కోటపాడులో అశేష జనవాహినితో జరిగిన బ్రహ్మాండమైన బహిరంగ సభలో ఆయన ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు. ఈ సభలో ఆయన చేసిన ప్రసంగ పూర్తి సారాంశం..      

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మనం ఏం చేస్తామో చెప్పేందుకు నవరత్నాలు ప్రకటించాం. ప్రతి రైతన్న, ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలని నవరత్నాలు ప్రకటించాం. మనందరి ప్రభుత్వం వచ్చాక ప్రతి అక్కచెల్లెమ్మకు ఏం చేస్తామన్నది చెబుతా. ఇళ్లు బాగుండాలంటే అక్కచెల్లెమ్మలు లక్షాధికారులు కావాలని ఆ దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఒక స్వప్నాన్ని చూశారు. బ్యాంకుల్లో పావలా వడ్డీ, సున్నా వడ్డీలకే రుణాలు ఇప్పించారు. కానీ చంద్రబాబు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు రుణాలు మాఫీ చేస్తామని మోసం చేశారు. రుణాలు మాఫీ చేయకపోగా, సున్నా వడ్డీ, పావలా వడ్డీ రుణాలు రావాలంటే బ్యాంకులకు కట్టాల్సిన వడ్డీ డబ్బులు చెల్లించకుండా అన్యాయం చేశాడు. బాబు పుణ్యమా అని బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రాలేదు. వేలం నోటీసులు వస్తున్నాయి. బ్యాంకు అధికారులు ఇళ్లకు తాళాలు వేస్తున్నారు. కోర్టుల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి.

బాబు మోసంతో పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలు రూ.14,206 కోట్ల నుంచి వడ్డీలతో కలుపుకొని రూ. 21,600 కోట్లకు చేరాయి. 2016 సెప్టెంబర్‌ నుంచి చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వడ్డీ డబ్బులు కట్టడం మానేసింది. దీంతో పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అందుకే వారికి నేను హామీ ఇస్తున్నా.. రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత... ఎన్నికల నాటి వరకు పొదుపు సంఘాలలో ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తం అప్పంతా నాలుగు దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తానని ప్రతి అక్కకు, చెల్లెమ్మకు హామీ ఇస్తున్నా. మళ్లీ సున్నా వడ్డీ విప్లవాన్ని తీసుకువస్తా. వారి కాళ్లమీద వాళ్లు నిలబడేలా చేస్తా. నాన్నగారు కలలు కన్న స్వప్నం ప్రతి అక్కా, చెల్లెమ్మ లక్షాధికారి కావలన్నది. సున్నా, పావలా వడ్డీ రుణాలు తిరిగి వచ్చేలా బ్యాంకులకు కట్టాల్సిన వడ్డీ డబ్బులను కట్టేసి రుణాలు ఇప్పిస్తాం.  అక్కాచెల్లెమ్మలు సంతోషంగా ఉంటేనే ఇల్లు బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుందని చెప్పే వారిలో నేను మొదటి వ్యక్తినని గర్వంగా కూడా చెబుతా. 

పస్తులు ఉండకూడదనే..
నవరత్నాల ద్వారా ప్రతి అక్కచెల్లెమ్మ కోసం చేయబోయే రెండో కార్యక్రమం వైఎస్సార్‌ చేయూత. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన మహిళలు జ్వరాన పడి ఒక్కరోజు పనికి వెళ్లకపోతే ఇంట్లో పస్తులు ఉండే పరిస్థితి. ఆ అక్కల కోసం చెబుతున్నా. ఆ అక్కలకు తోడుగా ఉండాలంటే 45 ఏళ్లకే పెన్షన్‌ ఇవ్వాలని నేను ఆ రోజుల్లో చెబితే 45 ఏళ్లకే పెన్షన్‌ ఏమిటని వెటకారం చేశారు. ఆ సందర్భంగా వచ్చిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని ‘వైఎస్సార్‌ చేయూత’ అని కొత్త పధకానికి నాంది పలుకుతున్నా. ఈ పథకాన్ని వివిధ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా  అమలు చేస్తామని చెబుతున్నా. ఈ రోజు మనమంతా వివిధ కులాలకు కార్పొరేషన్లు కావాలని అడుగుతున్నాం. వాటిని ఎందుకడుగుతామో తెలుసా? కారణం ఏమిటంటే ఆ కార్పొరేషన్ల ద్వారా మనకేమైనా డబ్బులు వస్తాయోమో, వాటి ద్వారా మనకు ఏమైనా మంచి జరుగుతుందేమో అని ఆశ. కానీ ఇవాళ వివిధ కులాలకు సంబంధించిన కార్పొరేషన్ల పరిస్థితి ఎలా ఉందో పరిశీలన చేయమని అడుగుతున్నా.

ఇవాళ కార్పొరేషన్ల పరిస్థితి ఎలా ఉందంటే లంచాలు తీసుకుని నచ్చిన వారికి నచ్చినంత మాత్రమే ఇస్తున్న పరిస్థితి. ఊళ్లో వెయ్యి మంది ఉంటే కనీసం ఐదుగురికి కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి. లంచాలు ఇస్తే, వారికి నచ్చితే మాత్రమే ఇస్తున్నారు. ఆ ఇచ్చేది కూడా ఏమిటో తెలుసా? 20 శాతం లబ్ధిదారుడు కట్టాలట, 30 శాతం సబ్సిడీ అట, 50 శాతం లోనట. వాస్తవ పరిస్థితి ఏమిటంటే ఆ 50 శాతం లోను ఎప్పుడూ రాదు. ప్రభుత్వం తరఫు నుంచి వచ్చే ఆ 30 శాతం కోసం లంచాలు ఇవ్వాల్సిందే. అప్పుడే అది వస్తుంటుంది. అదీ ఎంతమంది కంటే ఊరిలో ఓ వెయ్యి మంది ఉంటే ఐదుగురికి కూడా ఇవ్వని పరిస్థితిలో కార్పొరేషన్లు ఉన్నాయి.

ఇంతటి అధ్వాన్న స్థితిలో ఉన్న ఈ కార్పొరేషన్‌ వ్యవస్థలను పూర్తిగా ప్రక్షాళన చేస్తా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్‌ వ్యవస్థలను పూర్తిగా ప్రక్షాళన చేస్తానని మాట ఇస్తున్నా. ఈ కార్పొరేషన్లలో పారదర్శకంగా ప్రమాణాలు తెచ్చి 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన ప్రతి అక్కలకు, కుటుంబానికీ రూ.75 వేలు ఉచితంగా వచ్చేలా చేస్తానని హామీ ఇస్తున్నా. రెండో ఏడాది నుంచి దశలవారీగా ఆయా కార్పొరేషన్ల ద్వారా పూర్తి పారదర్శకతతో, ఎలాంటి లంచాలకు తావు లేకుండా ప్రతి అక్కకూ, ప్రతి కుటుంబానికి అందేలా చేస్తానని మాట ఇస్తున్నా. చెడిపోయిన ఈ వ్యవస్థను మార్చేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించండి. 

గ్రామ సచివాలయాలతో ఊరి పిల్లలకు ఉద్యోగాలు 
మొదటి ఏడాది ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు మనం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయబోతున్నాం. వీటిల్లో ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామానికి చెందిన పది మంది పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాం. ఇవాళ పెన్షన్లు కావాలన్నా, రేషన్‌ కావాలన్నా, మరుగుదొడ్లు కావాలన్నా, ఇళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, మరేది కావాలన్నా లంచాలు కావాలి. ఈ లంచాలు లేనిదే ఏదీ వచ్చే పరిస్థితి ఈవేళ లేదు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేసి మీ గ్రామంలోనే గ్రామ సచివాలయాన్ని తీసుకువస్తా. మీ ఊరి పిల్లలకే ఉద్యోగాలు ఇస్తాం. పెన్షన్, రేషన్, ఆరోగ్యశ్రీ, వైఎస్సార్‌ చేయూత సహా మీకు ఏది కావాలన్నా ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా, ఏ రాజకీయ నాయకుడు, కలెక్టర్‌ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా దరఖాస్తు పెట్టుకున్న 72 గంటల్లోనే ఉచితంగా వచ్చేటట్టు చేస్తానని హామీ ఇస్తున్నా.  

రూ.3 వేలిస్తామంటే రూ. 5 వేలు కావాలని గుంజండి... 
మీరు పొరపాటున చంద్రబాబును క్షమిస్తే.. రేపొద్దున ఏం జరుగుతుందో తెలుసా? రేపొద్దున ఈ పెద్ద మనిషి మీ వద్దకు వచ్చి మీ చెవులు ఖాళీగా ఉన్నాయా అని చూస్తారు. ఆ తర్వాత మైకు పట్టుకుని మొదట ఎన్నికల ప్రణాళికలో చెప్పిన 98 శాతం హామీలు నెరవేర్చానంటూ మీ చెవుల్లో కాలిఫ్లవర్‌ పెట్టానని అనుకున్నాక, ఇక మీరు చిన్న చిన్న అబద్ధాలు, మోసాలు చెబితే నమ్మరని ఈసారి ఓటు వేస్తే ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటాడు. అదీ నమ్మరని తెలిసి కేజీ బంగారానికి బోనస్‌గా ప్రతి ఇంటికీ బెంజి కారంటాడు. అదీ నమ్మరని తెలుసు కాబట్టి ప్రతి ఇంటికి ఒక మనిషిని పంపిస్తాడు. ప్రతి ఒక్కరి చేతిలో రూ.మూడు వేలు పెడతాడు. రూ.3 వేల డబ్బులిస్తే వద్దనకండి. రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే. మన జేబుల్లో నుంచి దోచుకున్నదే. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనసాక్షి ప్రకారం ఓటు వేయండి. అబద్ధాలు చెప్పేవారు, మోసం చేసే వారిని బంగాళఖాతంలో కలిపేయండి. అప్పుడే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుంది. విశ్వసనీయత, నిజాయితీ అన్నవి రావాలి. ఎవరైనా రాజకీయ నాయకుడు మైకు పట్టుకుని ఫలానాది చేస్తానని చెప్పి చేయకపోతే రాజీనామా చేసి ఇంటికి పోయే పరిస్థితి రావాలి’. 

పోలవరాన్ని పూర్తి చేస్తాం.. రైవాడ నీళ్లు ఆ ప్రాంత రైతులకే 
ఈ ప్రాంత రైతన్నల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రైవాడ రిజర్వాయర్‌ నీటిని దశాబ్దాలుగా విశాఖకు తరలిస్తున్నారు. ఈ నీటిని పూర్తిగా రైతులకే అందించగలిగితే ఈ ప్రాంతం అభివృద్ధి చెంది రైతన్నల జీవితాలు బాగుపడతాయి. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయగలిగి ఉంటే రైవాడ నీరు పూర్తిగా ఈ ప్రాంత రైతులకే దక్కేది. కానీ చంద్రబాబు హయాంలో పోలవరం పూర్తవుతుందన్న నమ్మకం ఏ కోశానా లేదు. పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు రప్పించే పని చేయడు గానీ ప్రాజెక్టును అవినీతిమయం చేశాడు. కాంట్రాక్టర్లకు ధరలు పెంచుతాడు. పెంచిన రేట్లకు తన బినామీలకు నామినేషన్‌ పద్ధతిన కాంట్రాక్టులు అప్పగిస్తాడు. సాక్షాత్తు తన క్యాబినేట్‌లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడికి పోలవరం ప్రాజెక్టు సబ్‌ కాంట్రాక్ట్‌ను రెట్టింపు రేట్లకు కట్టబెట్టాడు ఈ చంద్రబాబు. ఎంతసేపూ ఎంతగా దోచుకు తిందామా? అనే ఆలోచన తప్ప మరో ధ్యాస లేదు. పనులు చేయడు.. ప్రాజెక్టు పూర్తి కాదు. ఎవరి హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనేది పైన దేవుడు రాసి ఉంచాడు. పోలవరాన్ని పూర్తి చేస్తాం. రైవాడ నీళ్లు పూర్తిగా ఇక్కడికే ఇస్తామని చెబుతున్నా.
 
చంద్రబాబు వచ్చినప్పుడల్లా చక్కెర ఫ్యాక్టరీలు మూతే 
నేను ఈ నియోజకవర్గంలో నడక సాగిస్తున్నప్పుడు ఈ ప్రాంత ప్రజలు, రైతులు నా దగ్గరికొచ్చి అన్నా.. చంద్రబాబు సీఎం అయిన ప్రతిసారీ సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీలు, డెయిరీలు మూతపడాల్సిందేనన్నా. 2003 వరకూ ఆయన సీఎంగా ఉన్న కాలంలో చోడవరం చక్కెర ఫ్యాక్టరీని రూ.45 కోట్ల నష్టాల్లోకి నెటేసి.. ఆ తర్వాత శనక్కాయలకు, బిస్కెట్లకు ఇచ్చినట్టుగా తన బంధువు మూర్తికి అమ్మే కార్యక్రమం చేశాడు. కోర్టుకు వెళ్తే తప్ప దాన్ని ఆపలేకపోయామన్నా.. అని చెప్పారు. వైఎస్‌ సీఎం అయ్యాక ఫ్యాక్టరీని ఆధునికీకరించారన్నా. ప్రతీ రైతుకూ టన్నుకు రూ.400 బోనస్‌ ఇచ్చారు. నష్టాన్ని పూడ్చి రూ.45 కోట్ల లాభాల్లోకి తెచ్చారని చెప్పారు. మళ్లీ ఈ నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో ఫ్యాక్టరీ ఏకంగా రూ.100 కోట్ల నష్టాల్లోకి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో చక్కెర క్వింటా రూ.3 వేలు పలుకుతుంటే ఈ ఫ్యాక్టరీలో చక్కెర తడిసిందనే సాకుతో చంద్రబాబు బినామీ సుజనాచౌదరి బంధువులకు క్వింటా రూ.1,100 చొప్పున కట్టబెట్టారన్నా.. అని ఇక్కడి రైతులు చెబుతున్నారు. టన్ను మోలాసిస్‌ బయటి మార్కెట్‌లో రూ.6 వేలుంటే, రూ.2,700 చొప్పున అమ్ముతున్నారు. ఇలా సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీలను దగ్గరుండి నీరుగార్చుతున్నాడు చంద్రబాబు. అసలు ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హుడేనా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.  

ఇదీ చంద్రబాబు పాలన  
ఇక్కడికి వచ్చేటప్పుడు రోడ్ల గురించి చెప్పారు చాలామంది. చోడవరం నుంచి దేవరాపల్లి, దేవరాపల్లి నుంచి కొత్తవలస, చోడవరం నుంచి కోటపాడు వయా గవరవరం రోడ్లు అత్యంత దారుణంగా ఉన్నాయన్నా.. ఇసుకను అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారన్నా.. ఇసుకను రవాణా చేసీ చేసీ.. రోడ్లకు గుంతలు పడితే పట్టించుకునే నాథుడే లేడన్నా.. అని చెబుతున్నారు. ఈ చంద్రబాబు మాటకు విలువేలేదన్నా.. సీఎం పదవిలో ఉండి ఎవరైనా మాట ఇస్తే జరిగిపోతుందని నమ్ముతామన్నా.. కానీ చిన్న చిన్న పనులకు కూడా దిక్కులేకుండా పోయిందన్నా అని చెబుతూ.. మాడుగులలో డిగ్రీ కళాశాలకు భవనాలు కట్టిస్తామని చెప్పి నాలుగేళ్లయినా ఇంతవరకూ కట్టలేదన్నారు. పేరుకు మాత్రం మంజూరు చేస్తారు. కట్టడానికి డబ్బులు ఇవ్వడు. ఇదీ చంద్రబాబు పరిపాలన. 

ఓ వైపు మట్టిని తవ్వుకుంటున్నారు.. మరోవైపు బిల్లులూ చేసుకుంటున్నారు  
నీరు–చెట్టు కింద ముసిడిపల్లి, నాగరాయ చెరువు, ఏ కొత్తపల్లి, రెడ్డివానిపెద్ద చెరువు, కొత్తచెరువుతో పాటు కె.కోటపాడు మండలంలోని అనేక చెరువుల్లో ఏకంగా పొక్లెయిన్లను పెట్టి తాటిచెట్టంత లోతుకు మట్టిని తవ్వి అమ్ముకుంటున్నారని.. ఇక్కడి ప్రజలు నాతో చెప్పారు. మరోవైపు చెరువులు తవ్వినందుకూ బిల్లులూ లాగేసుకుంటున్నారని తెలిపారు. అన్నా.. నాన్నగారి హయాంలో ఈ ఒక్క నియోజకవర్గంలోనే 42 వేల ఇళ్లు కట్టిస్తే.. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో ఊరికి నాలుగైదు ఇళ్లు కూడా కట్టలేని అధ్వాన పాలన చూస్తున్నామన్నారు. మాడుగుల మండలంలోని బొడ్డేరు మీద ఉన్న పెద కళ్యాణపు ఆయకట్టు ఐదారు వందల మంది రైతులకు మేలు చేస్తుంది. సుమారు 12 వందల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేది. హుద్‌హుద్‌ తుపాను వచ్చినప్పుడు ఈ ఆనకట్ట తెగిపోయింది.

ఇంతవరకూ దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని ఇక్కడి రైతులు చెబుతున్నారు. కింతలిలో మూడేళ్ల కిందట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్టు రిబ్బన్లు కట్‌ చేస్తారన్నా.. కానీ అక్కడ కనీసం ఒక్క బెడ్‌ గానీ, మౌలిక వసతులుగానీ లేవన్నా.. అని ఇక్కడి ప్రజలు చెబుతుంటే నిజంగా బాధేస్తోంది. డీజిల్‌ లేక సకాలంలో 108 రాక ఇటీవలే ఈ నియోజకవర్గంలోని బుల్లిమల్లికి చెందిన ఒక యువకుడు మరణించిన సంగతిని ఈ ప్రాంత ప్రజలు చెప్పుకొచ్చారు. ఇదే ఉత్తరాంధ్రలో ఈ మధ్యనే దాదాపుగా జ్వరాలు వచ్చి 200 మంది చనిపోయారన్నా అని చెబుతూ.. ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఆస్పత్రులకు గానీ.. ఆరోగ్యశ్రీకి గానీ ఉంటుందా? అని అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.   

చంద్రబాబూ.. నీది నోరా.. అబద్ధాల ఫ్యాక్టరీనా? 
ఒకవైపున చంద్రబాబు అన్యాయమైన పాలన చూస్తున్నాం. మరోవైపున చంద్రబాబు పాలనలో అబద్ధాలు, మోసాలు, అన్యాయం, అవినీతి కనిపిస్తాయి. ఇదే ఆయన నైజం. తప్పుడు పనులన్నీ చేస్తారు.. నెపాన్ని వేరే వారి మీదకు నెట్టేయడానికి పదే పదే అబద్ధాలు చెబుతారు. ఈ పెద్ద మనిషికి తోడు మరో నలుగురు మంత్రులు టీవీల వద్దకు వచ్చి అబద్ధాలు చెబుతారు. వీరితో పాటు ఆయనకు సంబంధించిన ఎల్లో మీడియా కూడా అదే చంద్రబాబు అబద్ధాన్ని రోజంతా ఊదరగొడుతూ అదే నిజమని నమ్మించడానికి ప్రయత్నిస్తుంది. ఇదీ చంద్రబాబు పాలన.  

ముస్లిం యువకులపై తప్పుడు కేసులు.. 
చంద్రబాబు ఈ మధ్యకాలంలో అబద్ధాలు ఎంతటి స్థాయిలో చెప్పారంటే.. ఓ చిన్న ఉదాహరణ ఇస్తా. ఇటీవల గుంటూరులో చంద్రబాబు మీటింగ్‌ పెట్టాడు. ఆ మీటింగ్‌లో అల్లర్లు సృష్టించి, అమాయకులైన ముస్లిం యువకులను వైఎస్సార్‌సీపీ ఇరికించిందని ఈ పెద్దమనిషి నిన్ననో, మొన్ననో చెప్పాడు. వైఎస్సార్‌సీపీ నేర ప్రవృత్తికి ఇది నిదర్శనమట. ఎంతసిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నాడో ఈ పెద్దమనిషి. ఇదే తాజా అబద్ధం మీద చంద్రబాబును నేను ఒక్కటే అడగదలచుకున్నా.. అయ్యా చంద్రబాబూ.. గుంటూరులో రాష్ట్రవ్యాప్త  ముస్లిం మైనారిటీల మీటింగ్‌ పెట్టి వారిని రమ్మన్నది ఎవరయ్యా? అని అడుగుతున్నా. చంద్రబాబు పిలుపునందుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఆ మీటింగ్‌కు వెళ్లారు. వెళ్లిన తర్వాత ఆ మీటింగ్‌లో కొంతమంది చంద్రబాబు చేసే మోసాలు, అబద్ధాలు వినలేక, చూడలేక సీఎంను నిలదీస్తూ ప్లకార్డులు పట్టుకున్నారు.

ఆ ప్లకార్డులలో వారు అండిగింది ఏమిటో తెలుసా? హామీలు నిలబెట్టుకోవాలని. స్వాతంత్య్రం వచ్చాక ముస్లింలకు గానీ, ఎస్టీలకు గానీ కేబినెట్‌లో మంత్రి పదవులు ఇవ్వని ప్రభుత్వం ఏదైనా ఉందీ అంటే అది మీ ప్రభుత్వమేనని, ముస్లింలను గుర్తించని ప్రభుత్వం మీది అని ప్లకార్డులు ప్రదర్శిస్తే.. చంద్రబాబు అన్యాయాల మీద, హామీల మీద ప్రశ్నిస్తే.. వారిని చంద్రబాబు ఏం చేశారో తెలుసా? ఏకంగా 30 గంటల పాటు ఎక్కడ ఉంచారో కూడా తెలియకుండా పోలీసులు నిర్బంధించారు. స్టేషన్ల నుంచి స్టేషన్లను తిప్పుతూ వారికి కొట్టి, హింసించారు. అంతటితో ఊరుకోకుండా దేశాన్ని విభజించాలని ఆ పిల్లలు అడిగినట్లుగా తప్పుడు కేసులు పెట్టించి, జైలుకు పంపించిన ఈ చంద్రబాబు అసలు మనిషేనా? ఈ పెద్ద మనిషి చేసిన మోసం, అన్యాయాన్ని ప్రశ్నించిన పిల్లలు అరెస్ట్‌ అయ్యారని టీవీలలో చూసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు పోలీసు స్టేషన్‌కు వెళ్లి వారిని పరామర్శిస్తే..వారినీ చంద్రబాబు అరెస్టు చేయించారు. అదేరోజు సాయంత్రం అక్కడి డీఎస్పీ శ్రీనివాసరావు టీవీ చానళ్లతో మాట్లాడుతూ.. అరెస్టు అయిన పిల్లలు ఏ పార్టీకీ చెందిన వారు కాదని చెబితే.. ఆ మరుసటి రోజు వారు వైఎస్సార్‌సీపీ మనుషులని.. దేశాన్ని విభజించాలని కోరారని తప్పుడు కేసులు పెట్టించడం ధర్మమేనా? చంద్రబాబు అని అడుగుతున్నా. ఈ పెద్దమనిషి ఇప్పుడేమో.. ముస్లిం యువకులను ఇరికించింది వైఎస్సార్‌సీపీ అంటున్నాడు, అందుకే నేనడుగుతున్నా.. చంద్రబాబూ నీది నోరా.. అబద్ధాల ఫ్యాక్టరీనా? 

- కాపుల ఉద్యమం సందర్భంగా తునిలో చంద్రబాబు దగ్గరుండి తానే రైలును తగలబెట్టిస్తాడు. ఆ నెపాన్ని ప్రతిపక్షమైన వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీపై నెట్టేస్తాడు. అనేక మంది అమాయకులపైనా, ఆడవాళ్లపైనా, ఎస్సీలపైనా కేసులు పెట్టించారు. తుని ఘటన కాపు రిజర్వేషన్లకు సంబంధించినదైతే ఈ పెద్దమనిషి మాత్రం అమయాకులపైన, ఎస్సీలపైనా తప్పుడు కేసులు పెట్టించారు. ఇప్పటికి 32 నెలలు గడుస్తున్నా ఒక్క ఆరోపణా రుజువు చేయలేకపోయారు. కానీ ఇప్పుడేమో వైఎస్సార్‌సీపీ ఆ ట్రైన్‌ను  తగులబెట్టించిందని మళ్లీ మళ్లీ సిగ్గులేకుండా చెబుతున్నాడు ఈ చంద్రబాబునాయుడు. అందుకే అడుగుతున్నా ఆయన్ను.. నీది నోరా, అబద్ధాల ఫ్యాక్టరీయా? అని 
ఎన్నికలప్పుడు రైతులకు రూ.87,612 కోట్ల రుణాలను భేషరతుగా మాఫీ చేస్తామని చెప్పావు. ఈ నాలుగున్నరేళ్ల పాలనలో కనీసం రైతుల వడ్డీలో నాలుగో వంతు కూడా మాఫీ చేయలేదు. అయినా ఆయన రైతుల రుణాలన్నీ మాఫీ చేశానంటాడు. అందుకే అడుగుతున్నా.. చంద్రబాబూ.. నీది నోరా.. అబద్ధాల ఫ్యాక్టరీనా? 
పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రూ.14,206 కోట్ల రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి.. ఒక్క రూపాయీ మాఫీ చేయకుండా మోసం చేశావు. ఇప్పుడేమో మాఫీ చేశానని శాలువాలు కప్పించుకుంటున్నావు. ఇంతపచ్చిగా అబద్ధాలు చెబుతున్న చంద్రబాబూ.. నీది నోరా.. అబద్ధాల ఫ్యాక్టరీనా?  
ఊరికి పది ఇళ్లు కూడా కట్టించలేదు. నాలుగున్నరేళ్ల కాలం అయిపోయింది. మరో ఆరు నెలల్లో ఎన్నికలొస్తున్నాయి. ఈ ఆరు నెలల్లో మరో 19 లక్షల ఇళ్లు కడుతారట. అందుకే అయ్యా చంద్రబాబు నీది నోరా.. అబద్ధాల ఫ్యాక్టరీనా?  
ఎన్నికలకు ముందు బెల్టుషాపులు ఎత్తేస్తానన్నాడు. సీఎం కాగానే తొలి సంతకం అంటూ డ్రామా ఆడాడు. కానీ ఈ వేళ మన ఇళ్ల ముందే, గుడి, బడి పక్కనే ప్రతి ఊర్లో రెండు, మూడు బెల్టుషాపులు పెట్టారు. కానీ, ఈ పెద్ద మనిషి బెల్టు షాపులు ఎత్తేశాను అని నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతాడు. అందుకే చంద్రబాబూ.. నీది నోరా.. అబద్ధాల ఫ్యాక్టరీనా?  
విశాఖలో లారీ ఇసుక రూ.30, 40 వేలు పలుకుతోంది. ఇక్కకడైతే యూనిట్‌ ఇసుక రూ.8 వేలలకు రూ.16 వేలకు అమ్ముతున్నారు. కానీ చంద్రబాబు ఇసుకను ఉచితంగా ఇస్తున్నానంటున్నాడు. అందుకే అడుగుతున్నా చంద్రబాబూ.. నీది నోరా..అబద్ధాల ఫ్యాక్టరీనా? 
ఎన్నికల ప్రణాళిక అని తీసుకొచ్చారు. అది పవిత్ర పుస్తకం లాంటిది. ఏది రాస్తామో, చెబుతామో.. ప్రతిదీ చేయాల్సిన ధర్మం ఆ రాజకీయ నాయకుడిపై ఉంటుంది. చంద్రబాబు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండానే 99 శాతం నెరవేర్చానని చెబుతున్నారు. మీ అందరి తరఫున అడుగుతున్నా.. అయ్యా చంద్రబాబు నీది నోరా..అబద్ధాల ఫ్యాక్టరీనా? 
చంద్రబాబు హయాంలో అక్షరాల 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. టెట్‌–1, టెట్‌–2, టెట్‌–3 అంటూ ఫీజులు గుంజుతున్నారు. కానీ డీఎస్సీ మాత్రం పెట్టడు. విశాఖలో పారిశ్రామిక సమ్మిట్లు పెట్టి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని పచ్చి అబద్ధాలు చెబుతాడు. అందుకే మీ అందరి తరఫున అడుగుతున్నా.. చంద్రబాబు నీది నోరా.. అబద్ధాల ఫ్యాక్టరీనా? 
- రాష్ట్రంలో కోటీ 70 లక్షల ఇళ్లున్నాయి. ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికీ ఉద్యోగం, ఉపాధి.. లేదా ప్రతి ఇంటికీ నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు ఊదరగొట్టాడు. ఈ లెక్కన ఇప్పటికి 51 నెలలు అయింది. ఈ కాలానికి ఒక్కో ఇంటికి 1.02 లక్షల రూపాయలు బాకీ పడ్డాడు. కానీ ఈ పెద్దమనిషి ఏమంటాడో తెలుసా? ఎన్నికలకు 6 నెలల ముందు.. కేవలం 10 లక్షల మందికి అది కూడా నాలుగు నెలల కోసం.. నెలకు రూ.1000 ఇస్తారట. ఈ మాట చెప్పి 3 నెలలు దాటినా ఇంతవరకు ఇవ్వలేదు. చంద్రబాబు నీది నోరా.. అబద్ధాల ఫ్యాక్టరీనా? 
ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రం బాగుపడుతుందని చంద్రబాబుకూ తెలుసూ. ఎన్నికలకు ముందు చంద్రబాబే ప్రత్యేక హోదా సంజీవని అన్నారు. 5, 10 కాదు ఏకంగా 15 ఏళ్లు తెస్తానని ఊదరగొట్టాడు. కానీ, ప్రత్యేక హోదాను తన లంచాలు, కేసుల కోసం కేంద్రానికి తాకట్టు పెట్టాడు. హోదా కన్నా ప్యాకేజీ బెటర్‌ అని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఏ రాష్ట్రానికి  ఇవ్వనన్ని నిధులు మన రాష్ట్రానికి వచ్చాయని చెప్పాడు. నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసి ఇప్పుడు విడాకులు ఇచ్చి.. మొదటి భార్య చెడ్డదని చెబుతున్నారు. కేంద్రంపై పోరాటమంటూ.. అధర్మ పోరాటం చేస్తున్నాడు. అందుకే మీ అందరి తరఫున అడుగుతున్నా.

చంద్రబాబు నీది నోరా.. అబద్ధాల ఫ్యాక్టరీనా? 
2014కు ముందు జగన్‌కు ఓటు వేస్తే రాష్ట్రాన్ని విభజించిన రాహుల్‌గాంధీకి ఓటు వేసినట్లేనన్నాడు. అప్పుడేమో ఆయన (చంద్రబాబు) బీజేపీతో జత కట్టారు. ఇప్పుడేమో జగన్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే అంటున్నాడు. ఆయన బీజేపీతో ఉంటే బీజేపీ మంచిది. కాంగ్రెస్‌తో ఉంటే కాంగ్రెస్‌ మంచిది. రెండో భార్యతో కాపురం చేస్తే.. మొదటి భార్య చెడ్డది, రెండో భార్య మంచిదంటాడు. మీ అందరి తరఫున అడుగుతున్నా.. చంద్రబాబు నీది నోరా.. అబద్ధాల ఫ్యాక్టరీనా? 
జీవితంలో ఒక్క అబద్ధం కూడా ఆడని వ్యక్తిని సత్యహరిశ్చంద్రుడు అంటారు. జీవితంలో ఒక్క నిజం కూడా చెప్పని వ్యక్తిని నారా చంద్రబాబు అంటారు. చంద్రబాబు పాలనలో ఇంతటి దారుణాలు చూస్తున్నాం. అన్యాయాలు, మోసం, అవినీతి, అరాచకాలు, అహంకారం చూశాం. ఇలాంటి వ్యక్తిని పొరపాటున కూడా క్షమించవద్దని కోరుతున్నా. ఈ వ్యవస్థ మారాలి. విశ్వసనీయత, నిజాయితీ రావాలి. ఎన్నికల ప్రణాళికలో చెప్పిన ప్రతి మాటను కూడా ఆ పార్టీ నిలబెట్టుకోవాలి. అలా నిలబెట్టుకోకపోతే ఆ నాయకుడు పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలి. అప్పుడే ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top